శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 32)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది రెండవ సర్గ
ప్రశాంతంగా కూర్చుని మనసులో రాముని తలచుకుంటున్న సీతకు ఇదంతా కలగా అనిపించింది. ఎదురుగా పడి ఉన్న రాముని ఖండిత శిరస్సు, ధనుర్బాణములు చూచింది. నాడు హనుమంతుడు వానర సేనానాయకుల గురించి, సుగ్రీవుని గురించి ఏమి చెప్పాడో అవే రావణుడు కూడా చెప్పడం గమనించింది సీత. రాముని శిరస్సు వంక చూచింది. సంవత్సరాల తరబడి పరిచయం ఉన్న ముఖం రామునిది. ఆ కళ్లు, ముఖము, నుదురు, అవన్నీ చూచి ఆ శిరస్సు రామునిదే అని నిర్ధారించుకుంది సీత. సీతకు దుఃఖము ముంచుకొచ్చింది. తట్టకోలేక పోయింది. వలా వలా ఏడిచింది. ఇన్ని ఆపదలకు కారణమైన తన అత్తగారు కైకను నిందించింది.“అమ్మా కైకమ్మతల్లీ! నీ కోరిక తీరిందా! రాముని అయోధ్యలో లేకుండా చేద్దామని అనుకున్నావు. తుదకు ఈ లోకంలోనే లేకుండా పోయాడు. నీవు మమ్ములనే కాదు ఇక్ష్వాకు వంశమునే నాశనం చేసావు. నాకు, రామునికి నార చీరలు ఇచ్చి అడవులకు పంపావు. నేను, నా రాముడు, నీకేమి అపకారం చేసాము. నీవు అరణ్యములకు పంపబట్టికదా నాకు రామునికి ఇన్నికష్టాలు వచ్చి పడ్డాయి." అని దీనంగా విలపించింది.
తన పాచిక పారినందుకు రావణుడు లోలోపల సంతోషి స్తున్నాడు, పైకి మాత్రం గంభీరంగా ఉన్నాడు. సీత ఒక్కసారి రాముని శిరస్సు వంక చూచింది. "ఓ రామా! అజేయుడవైన నీవు ఈనాడు ఈ మాదిరి దిక్కులేని చావు చచ్చి నన్నుకూడా జీవచ్ఛవాన్ని చేసావా? వైధవ్యాన్ని నాకు అంటగట్టావా! భార్యలో ఏదైనా దోషం ఉంటే, భర్త భార్యకంటే ముందు మరణిస్తాడు. నాలో ఏదో లోపం ఉండబట్టే నీవు ముందుగా మరణించి నన్ను విధవరాలిగా చేసావు. నన్ను రక్షించడానికి వచ్చి నువ్వు చంపబడ్డావా రామా! ఎంతో మంది జ్యోతిష్కులు నీకు పూర్ణాయుర్దాయము ఉందని చెప్పారు కానీ నీవు అల్పాయుష్కుడవని తెలుసులేకపోయారు గదా! ఆ జ్యోతిష్కులమాటలు అసత్యములు చేసి వెళ్లిపోయావా రామా! కాలాతీతుడ వైన నిన్ను కూడా కాలం కాటేసిందా రామా!
రామా! నీవు ఎంతో పరాక్రమవంతుడివే! నీకు ఎన్నో ఉపాయములు తెలుసు కదా! మరి ఈ మాదిరి శత్రువులచేతికి చిక్కి ఎలా హతమయ్యావు రామా! మహాభయంకరమైన మృత్యుదేవత నిన్ను నా నుండి బలవంతంగా లాగుకొని పోయిందా రామా! ఎదురుగా ఉన్న నన్ను విడిచి పెట్టి భూదేవిని కౌగలించుకొని శాశ్వతంగా నిద్రిస్తున్నావా రామా!
రామా! నీవు ఎంతో పరాక్రమవంతుడివే! నీకు ఎన్నో ఉపాయములు తెలుసు కదా! మరి ఈ మాదిరి శత్రువులచేతికి చిక్కి ఎలా హతమయ్యావు రామా! మహాభయంకరమైన మృత్యుదేవత నిన్ను నా నుండి బలవంతంగా లాగుకొని పోయిందా రామా! ఎదురుగా ఉన్న నన్ను విడిచి పెట్టి భూదేవిని కౌగలించుకొని శాశ్వతంగా నిద్రిస్తున్నావా రామా!
రామా! ఈ ధనుస్సును నీవు ఎల్లప్పుడూ భక్తితో పూజించేవాడివి. అటువంటి ధనుస్సు కూడా నిన్ను రక్షించలేదా రామా!నీవు ఈ పాటికి నీ తండ్రి గారు దశరథుని కలుసుకొని ఉంటావు కదా రామా! ఓ రామా! మన ఇద్దరికీ బాల్యంలో ఉండగానే వివాహం అయింది. ఇంతకాలము ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము. ఈనాడు నన్ను ఒంటరిగా వదిలివెళ్లి పోయావా రామా! మౌనంగా ఉన్నావు ఎందుకు రామా! మాట్లాడు. నీ సీతకు బదులు చెప్పు. మన వివాహసమయంలో నా చేతిని పట్టుకొని జీవితాంతము నన్ను వదిలిపెట్టనన్నావు. నాతోనే ఉంటానన్నావు. ధర్మాచరణము చేస్తానన్నావు. అవన్నీ మరిచిపోయి ఒంటరిగా వెళ్లి పోయావా! నన్ను కూడా నీతో తీసుకొనివెళ్లు రామా! ఎప్పుడూ మంగళప్రదంగా ఉంటూ సకలాభరణాలతో శోభిల్లే నీ శరీరము ఇప్పుడు యుద్ధభూమిలో మృగములకు ఆహారంగా మారిందా రామా!
రామా! నీవు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసావు. దాన ధర్మాలు చేసావు. కానీ ఈనాడు నీ శరీరం అంతిమసంస్కారానికి కూడా నోచుకోలేదు కదా! అనాధ ప్రేతం లాగా మిగిలిపోయింది కదా రామా! మీ తల్లిగారు కౌసల్యనుండి అనుమతి తీసుకొని అయోధ్యనుండి మనము ముగ్గురము అరణ్యములకు వచ్చాము. కాని ఇప్పుడు లక్ష్మణుడు ఒక్కడే తిరిగి అయోధ్యకు వెళుతున్నాడు. కౌసల్య నీ గురించి అడిగినప్పుడు నిన్ను నీ సైన్యమును శత్రువులు వధించారు అని చెబుతాడు లక్ష్మణుడు. నీవు శత్రువులతో చంపబడ్డట్టు, నేను ఇక్కడ రాక్షసుల మధ్య ఉన్నట్టు తెలిసి కౌసల్య జీవించలేదు. ఓ రామా! నా కోసరము నూరుయోజనముల సముద్రాన్ని దాటిన నీవు, విధివక్రించి కేవలము ఆవు గిట్టంత చిన్న కుంటలో పడి మరణించినట్టు మరణించావు కదా! రామా! నా కొరకు నీవు ఇంతదూరము వచ్చి ఇక్కడ అకాల మృత్యువుకు గురైనావు. నేనే నీ పాలిట మృత్యుదేవతనయ్యాను కదా రామా! ఓ రామా! నేను నీ భార్యనై ఉండి కూడా, నీ తోపాటు ఎన్నో పుణ్యకార్యములు చేసి కూడా, ఈనాడు ఇటువంటి దు:ఖములు అనుభవిస్తున్నాను అంటే నేను ఏ నాడో ఘోరమైన పాపాలు చేసి ఉంటాను. ఆ పాపఫలమును అనుభవిస్తున్నాను." అని పరి పరి విధాలా దుఃఖించింది సీత.
తల ఎత్తి రావణుని చూచి "ఓ రావణా! రాముడు లేని సీత లేదు. రాముడు మరణించగానే సీత కూడా మరణించింది. ఈ శరీరం మాత్రం మిగిలి ఉంది. ఈ శరీరాన్ని ఖండించి నన్ను రామునితో కలుపు. ఓ రావణా! నా రాముని శరీరాన్ని కూడా తెప్పించి నా శిరస్సును రాముని శిరస్సుతోనూ, నా శరీరాన్ని రాముని శరీరంతోనూ కలుపు. నేను స్వర్గంలో నా రాముని కలుస్తాను.” అని ఏడుస్తూ అంది సీత.
ఇదంతా రావణుడు చూస్తున్నాడు. వింటున్నాడు. ఇంతలో ఒక రాక్షస భటుడు రావణుని వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “జయము జయము మహారాజా! సర్వసైన్యాధిపతి ప్రహస్తులవారు వచ్చి ఉన్నారు. తమరి దర్శనము కోరుతున్నారు." అని పలికాడు. వెంటనే రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాజసభ ఏర్పాటు చేసాడు. ప్రహస్తుని వలన యుద్ధరంగము విశేషాలు తెలుసుకున్నాడు. ఏ క్షణంలో అయినా యుద్ధ ప్రారంభం కావచ్చు అని తెలుసుకొన్నాడు. సైన్యాధి పతులందరికీ ఈ విధంగా ఆజ్ఞలు ఇచ్చాడు. "సైన్యాలను సిద్ధం చేయండి. యుద్ధభేరీలు మోగించండి. సైన్యములను తరలించండి. యుద్దము ఎక్కడ ఎవరితో అని ఎవ్వరికి చెప్పవద్దు.” అని పలికాడు. రావణుని సైన్యాధిపతులు రావణుని ఆజ్ఞలను అమలు పరిచారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment