శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 33)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది మూడవ సర్గ
ఎప్పుడైతే రావణుడు, రావణుని వెంట విద్యుజ్జిహ్వుడు అక్కడి నుండి వెళ్లిపోయారో, వారి మాయచేత కల్పితమైన రాముని ఖండిత శిరస్సు, రాముని ధనుస్సు, బాణములుకూడా మాయం అయ్యాయి. అది చూచిన సీత నిశ్చేష్టురాలయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న సరమ అనే రాక్షస స్త్రీ సీత దగ్గరకు వచ్చింది. రాక్షసులలో కూడా మంచి వాళ్లు ఉన్నట్టు సరమ రాక్షస స్త్రీ అయినా సీత అంటే ఆమెకు ప్రేమ అభిమానము. సీత కు కూడా సరమ అంటే ప్రీతి, నమ్మకము. సరమ సీతను చూచి ఇలా అంది."సీతా! ఏడవకు. ఊరుకో. ఈ పరిణామాలు చూచి బాధపడకు. రావణుడు ఇక్కడకు వచ్చినప్పటి నుండి అతడు పలికిన పలుకులు, నువ్వు నీ భర్త గురించి పడ్డ ఆవేదన, నువ్వు రావణునితో పలికిన పలుకులు అన్నీ నేను ఆ చెట్టు చాటున ఉండి విన్నాను. నాకు రావణుడు అంటే ఏ మాత్రం భయం లేదు. ఏం చేస్తాడు. చంపుతాడు అంతే కదా. నీకోసం నా ప్రాణాలు కూడా ఇస్తాను. నన్ను నమ్ము. సీతా! నువ్వు ఒక్కటి గమనించావో లేదు. రాముడు చనిపోయాడు అని నిన్ను నమ్మించడానికి రాముని శిరస్సు తీసుకొని వచ్చిన రావణుడు, సేవకుడు వచ్చి ప్రహస్తుడు వచ్చాడు అనగానే వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. నేను కూడా వారిని రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకున్నాను.
నీ రాముడు మరణించలేదు. నీ రాముని ఎవరూ చంపలేదు. రావణుడు చెప్పినట్టు ఏ వానరుడూ చావలేదు. వారంతా రాముని రక్షణలో సుఖంగా ఉన్నారు. రావణుడు అన్నీ అసత్యాలు చెప్పాడు. నీ దగ్గర తన మాయలు ప్రయోగించాడు. అందుకే వాడు వెళ్లిపోగానే వాడు మాయతో సృష్టించిన రాముని శిరస్సు ధనుర్బాణములు కూడా మాయం అయ్యాయి. కాబట్టి రాముడు క్షేమంగా ఉన్నాడు. నీవు దిగులు చెందనవసరం లేదు.
పైగా, రాముడు నూరుయోజనముల సముద్రమును అపారమైన వానర సేనతో దాటి లంకను చుట్టుముట్టాడు. అందుకే రావణుడు తొందర తొందరగా ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ విషయం నిర్ధారణ చేసుకోడానికి నేను నగరం బయటకు వెళ్లి వానర సేనా మధ్యలో ఉన్న రామలక్ష్మణులను నా కళ్లారా చూచాను. ఈ విషయం నిర్ధారించుకోడానికి రావణుడు తన గూఢచారులను పంపాడు. వారు వానరసేన లంకను చుట్టుముట్టినది అన్న వార్త తీసుకొని వచ్చారు. ఈ వార్త విన్న రావణుడు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోయాడు. తన మంత్రులతో సభచేసి వారితో మంత్రాంగము సాగిస్తున్నాడు. " అని సరమ సీతతో చెబుతూ ఉండగానే యుద్ధభేరీలు మోగుతున్నాయి. సైనికుల కోలాహలం వినిపించింది.
“సీతా! విన్నావుగా! అదుగో రణభేరి మోగుతూ ఉంది. ఆశ్వికసేన, గజసేన కదన రంగమునకు కదులుతున్న సవ్వడి వినిపిస్తూ ఉంది. సైనికుల హుంకారాలు వినిపిస్తున్నాయి. రావణుడు రాముడి మీదికి యుద్ధానికి వెళుతున్నాడు. రావణుడు పలకినట్టు రాముడు మరణించి, వానరసైన్యము పారిపోతే ఇప్పుడు ఎవరి మీదికి యుద్ధానికి వెళుతున్నాడు. కాబట్టి రావణుడు పలికిన పలుకులు అన్నీ అబద్ధము అని తెలుసుకో! నీకు త్వరలో మంచిరోజులు వస్తున్నాయి. నీ రాముడు నిన్ను చేరుకుంటాడు. ఈ రాక్షసులకు పొయ్యేకాలం దాపురించింది. రావణుడు యుద్ధంలో మరణించడం, రాముడు నిన్ను పొందడం తథ్యం. నీ దు:ఖములు అన్నీ తొలగి పోతాయి.. నువ్వు నిశ్చింతగా ఉండు. ప్రత్యక్షదైవమైన ఆ సూర్యునికి నమస్కరించు. నీకు అన్నీ శుభాలు కలుగుతాయి.” అని పలికింది సరమ.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పదిమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment