శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 34)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది నాలుగవ సర్గ
అమృతముతో సమానమైన సరమ మాటలు విన్న సీత పరమానంద భరితురాలైంది. రాముడు బతికి ఉన్నాడు మరణించలేదు అన్న మాటలు ఆమెకు కర్ణపేయములుగా వినిపించాయి. సీత సంతోషమును చూచి సరమ ఇంకా ఇలా అంది. “ఓ సీతా! ఇప్పటికి ఈ విషయాలు మాత్రము సేకరించాను. నేను ఇప్పుడే పోయి మరిన్ని విశేషములను సేకరించి తీసుకొని వస్తాను. నీవు నిశ్చింతగా ఉండు. ఎలాగా అంటే నాకు ఆకాశగమనము తెలుసు. హాయిగా ఆకాశంలో ఎగురుతూ వెళ్లగలను.” అంది సరమ.ఆ మాటలు విన్న సీత సరమతో ఇలా అంది. "సరమా! నీవు అటు ఆకాశములో గానీ, ఇటు పాతాళములో గాని నిర్భయంగా పోగలవని నాకు తెలుసు. రాముడు బతికి ఉన్నాడని చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ సమయంలో రావణుడు ఏంచేస్తున్నాడు. అతని యుద్ధతంత్రము ఏమిటి? అనే విషయములు తెలుసుకొని వచ్చి నాకుచెప్పగలవా! ఆ రావణుడు తన మాయలతో నన్ను మోహింపజేస్తున్నాడు. దానికి తోడు ఈ రాక్షస స్త్రీలను ప్రేరేపించి నన్ను భయపెడుతున్నాడు. కాబట్టి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదు. అందుకని రావణుని మాయల గురించి, అతడి యుద్ధతంత్రముల గురించి నాకు తెలియజేస్తే నేను నిశ్చింతగా ఉంటాను." అని అడిగింది సీత.
సీత మాటలకు సరమ ఇలా అంది. "ఓ సీతా! ఆ విషయం నాకు నువ్వు చెప్పవలెనా! చిటికలో వెళ్లి రావణుని మంతాంగము అంతా తెలుసుకొని వచ్చి నీకు చెపుతాను." అని పలికి సరమ అక్కడి నుండి తొందరగా వెళ్లిపోయింది. రావణుని మందిరమునకు వెళ్లింది. రావణుడు తన మంత్రులతో మాట్లాడే మాటలను రహస్యంగా పొంచి ఉండి విన్నది. వెంటనే అశోకవనమునకు తిరిగి వచ్చింది. తన రాక కోసం ఎదురు చూస్తున్న సీతను చూచి ఇలా అంది.
సీత మాటలకు సరమ ఇలా అంది. "ఓ సీతా! ఆ విషయం నాకు నువ్వు చెప్పవలెనా! చిటికలో వెళ్లి రావణుని మంతాంగము అంతా తెలుసుకొని వచ్చి నీకు చెపుతాను." అని పలికి సరమ అక్కడి నుండి తొందరగా వెళ్లిపోయింది. రావణుని మందిరమునకు వెళ్లింది. రావణుడు తన మంత్రులతో మాట్లాడే మాటలను రహస్యంగా పొంచి ఉండి విన్నది. వెంటనే అశోకవనమునకు తిరిగి వచ్చింది. తన రాక కోసం ఎదురు చూస్తున్న సీతను చూచి ఇలా అంది.
"సీతా! నీవు చెప్పిన ప్రకారము నేను రావణుని ఆంతరంగిక మందిరమునకు వెళ్లాను. అక్కడ రావణుడు మంత్రులతో చర్చలు జరుపుతున్నాడు. రావణుని తల్లి కైకసి కూడా అక్కడే ఉంది. నిన్ను వెంటనే విడిచిపెట్టమని, రాముని వద్దకు పంపమనీ కైకసి తన కుమారుడు రావణుని బతిమాలుతూ ఉంది. ఆమే కాదు, అవిద్ధుడు అనే వృద్ధుడైన మంత్రి కూడా నిన్ను వెంటనే రాముని వద్దకు పంపమని, యుద్ధము నివారించమనీ రావణునికి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
కైకసి, అనిద్ధుడు రావణునితో ఈవిధంగా అంటున్నారు. "జనస్థానములో రాముడు ఒంటరిగా ఎంత మందిని చంపాడో నీకు తెలుసు కదా! అది తెలిసి కూడా ఇప్పుడు రామునితో యుద్ధము చేయడం అవసరమా! వెంటనే సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపించు. యుద్ధము నివారించు. అదీకాకుండా నిన్న కాక మొన్న హనుమంతుడు అనే పేరుగల ఒక వానరము, లంకలో సృష్టించిన భీభత్సము అప్పుడే మరిచిపోయావా! ఆ వానరము నూరుయోజనముల సముద్రమును దాటి, లంకకు వచ్చి, సీతను చూచి, లంకను తగలబెట్టి మరీ పోయింది. ఒక్కడే ఇంత చేస్తే, మిగిలిన వానరములు ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తాయో ఆలోచించు." అని పరి పరి విధాలా రావణునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. కానీ రావణుడు సుతరామూ వారి మాటలు వినలేదు. ఎన్ని చెప్పినా రావణునికి నిన్ను విడవడం ఇష్టం లేదు. యుద్ధములో చావడానికైనా ఇష్టపడుతున్నాడు కానీ, నిన్ను విడవడానికి ఇష్టపడటం లేదు ఆ రావణుడు. సీతా! రావణుడికి పొయ్యేకాలం దాపురించే ఎవ్వరు చెప్పినా వినడం లేదు. వాడు రాముడి చేతిలో చావడం తథ్యం. నువ్వు నీ భర్త రామునితో కలిసి అయోధ్యానగర ప్రవేశం చేయడం ఖాయం.” అని చెబుతూ ఉండగానే భూమి కంపిస్తున్నట్టు యుద్ధభేరీలు మోగడం, వానర సేనల సింహగర్జనలు హుంకారాలు వినిపించాయి. అవి విన్న రాక్షసులు రావణుడు చేసిన అపరాధమునకు మనం అంతా నాశనం కాబోతున్నాము అని ఆందోళన చెందుతున్నారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment