శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 35)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది ఐదవ సర్గ
లంకా నగరము బయట వానర సైన్యము యొక్క యుద్ధ సన్నాహాలు, వారి యుద్ధభేరీ శబ్దాలు విన్న రావణుడు తన మంత్రుల వంక చూచాడు. వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు. “ఓ మంత్రులారా! రాముడు వానర సేనతో సముద్రమును దాటిన విషయము, లంకను ముట్టడించిన విషయము మీ ద్వారా విన్నాను. ఎంత సేపటికీ రాముని పొగడడం, రామునితో సంధిచేసుకోమని నాకు సలహా ఇవ్వడం, సీతను తీసుకొని పోయి రామునికి అప్పగించమనడం తప్ప మీరు ఏమీ చేయడం లేదు. చేతకాని వారిలా చేతులు ముడుచుకొని కూర్చున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. మీ పౌరుషము, పరాక్రమము ఏమైనాయి. రామునికి, వానర సేనలకు భయపడుతున్నారా!" అని నిష్టూరంగా కోపంగా అన్నాడు.అప్పుడు మాల్యవంతుడు అనే రాక్షస మంత్రి లేచి ఇలా అన్నాడు. “ఓ రాక్షసేంద్రా! నీతి మార్గమును, ధర్మ మార్గమును అనుసరించు రాజు ఎల్లప్పుడూ విజయమును పొందుతాడు. అటువంటి రాజుకు శత్రువులు కూడా భయపడతారు. యుద్ధము వచ్చినపుడు సమయానుకూలంగా ప్రవర్తించాలి. మన బలము ఎదిరి బలమును గుర్తెరిగి యుద్ధము చేయడమో సంధిచేసుకోవడమో చేయడం ఉత్తమం. అటువంటి రాజు ఎల్లప్పుడూ జయమును పొందుతాడు. రాజు యొక్క బలము శత్రువు యొక్క బలము కన్నా తక్కువగా ఉన్నప్పుడు, లేక శత్రు బలంతో సమంగా ఉన్నప్పుడు, జయము సందేహాస్పదము. కావున సంధిచేసుకొనడం ఉత్తమం. రాజు బలము శత్రుబలము కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా యుద్ధము చేసి శత్రువును జయించవలెను. ఇది రాజధర్మము. యుద్ధనీతి. ప్రస్తుతము ఈ యుద్ధము అనవసరము. రాముని బలము మన బలము కన్నా ఎక్కువగా ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఈ సందర్బంలో సంధి చేసుకొనడం ఉత్తమం.
ఇదంతా రాముని భార్య సీత వలన జరిగింది. నీవు ఆ సీతను అపహరించావు. తన భార్యకోసరం రాముడు వానరసేనతో లంక మీదికి దండెత్తివచ్చాడు. నీవు సీతను రాముని వద్దకు సగౌరవంగా పంపితే యుద్ధము నిలిచిపోతుంది. లంక క్షేమంగా ఉంటుంది. ముల్లోకములలో ఉన్న దేవతలు, దానవులు, గంధర్వులు, ఋషులు అందరూ రామునికే జయము కలగాలని కోరుకుంటున్నారు. నీవు ఒక్కడివి ఒక స్త్రీ కొరకు రామునితో విరోధం సాగించడం అనవసరము. కాబట్టి రామునితో సంధిచేసుకోవడం ఉత్తమం.
ఓ లంకేశ్వరా! బ్రహ్మ దేవతలను, అసురులను సృష్టించాడు. దేవతలు ఎల్లప్పుడూ ధర్మమార్గమునే అనుసరిస్తున్నారు. అసురులు అధర్మమార్గమునే అనుసరిస్తున్నారు. ఆ కారణం చేత దేవతలు అంటే ధర్మ స్వరూపులనీ, అసురులు అధర్మస్వరూపులనీ లోకులు అనుకుంటున్నారు. అధర్మమును ధర్మము ఎప్పుడు అణగదొక్కుతూ ఉంటుందో అప్పుడు కృతయుగము ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ధర్మము క్షీణించి, అధర్మము ధర్మమును అణగతొక్కుతుందో అప్పుడు కలియుగము మొదలవుతుంది.
నీవు అధర్మాన్ని ఆశ్రయించావు. ధర్మాన్ని నాశనం చేసావు. అందరి తోనూ శత్రుత్వమును పెంచుకున్నావు. ధర్మం మన శత్రువుల పక్షాన ఉంది. అందుకే వారు మనకన్నా బలవంతులు అయ్యారు. నీవు సీతను అపహరించుకొని వచ్చి అధర్మానికి పాలుపడ్డావు. ధర్మాన్ని కాలదన్నావు. నీ అధర్మమే మనలనందరినీ నాశనం చేస్తూ ఉంది. దేవతలందరూ ధర్మాత్ములయిన శత్రుపక్షము వహించారు. అందుకే శత్రువులు మనకన్నా బలంగా ఉన్నారు.
ఓ లంకేశ్వరా! నీకు భోగములు అనుభవించడంలో ఉన్న ఆసక్తి ధర్మాచరణములో లేదు. అందుకే అగ్నితో సమానులైన మహాఋషులను బాధించావు. వారి ఆగ్రహానికి పాత్రుడవు అయ్యావు. ఋషులు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతులు. ధర్మాన్ని కాపాడుతుంటారు. వారి ప్రభావము నీకు బాగా తెలియదు. వారి మనస్సులు తపస్సుచేత పునీతమయినవి. వారు యజ్ఞయాగములు చేస్తూ, వేదములను అధ్యయనము చేస్తూ ఉంటే ఆ వేదమంత్రముల ఘోషలో నీ రాక్షసులు తలొక దిక్కుగా పారిపోతారు. వారు వేల్చే అగ్నిహోత్రముల నుండి వెలువడే ధూమము నలుదిక్కులా వ్యాపించి రాక్షసుల తేజస్సును హరించి వేస్తుంది. ఆ ఋషులు ప్రతి దినము తమ తమ ప్రాంతాలలో చేసే తీవ్రమైన తపస్సుకు, నీ రాక్షసులు తల్లడిల్లిపోతారు.
ఓ రాక్షసేంద్రా! నీవు దేవతల వలన, దానవుల వలనా, యక్షుల వలనా చావు లేకుండా వరమును పొంది ఉన్నావు. నరులను, వానరులను మరిచావు. ఇప్పుడు ఆ నరులు, వానరులు, భల్లూకములు నీ మీదికి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఎప్పుడెప్పుడు నిన్ను నీ సైన్యాన్ని కబళిద్దామా అని ఉరకలు వేస్తున్నాయి. అదీ కాకుండా లంకలో అనేక దుశ్శకునములు ఉత్పాతాలు కనపడుతున్నాయి. రాక్షస వినాశము కాబోతోంది అని సంకేతాలు ఇస్తున్నాయి. రక్తవర్షము కురుస్తూ ఉంది. అశ్వశాలలో ఉన్న అశ్వములు, గజశాలలో ఉన్న ఏనుగుల కంటి నుండి కన్నీరు పెల్లుబుకుతూ ఉంది. గజాశ్వములు రోదించడం మనకు క్షేమం కాదు. అడవులలో ఉండవలసిన నక్కలు, తోడేళ్లు క్రూరమృగములు నగరంలోకి ప్రవేశిస్తున్నాయి. వికృతాకారులైన స్త్రీలు వికృతంగా నవ్వుతూ స్వప్నములలో సాక్షాత్కరిస్తున్నారు. దేవతలకు అర్పించిన బలులు కుక్కలు తింటున్నాయి. ఇటువంటి దుశ్శకునములు ఎన్నో కనపడుతున్నాయి. మృత్యుదేవత లంకా నగరంలో తాండవం చేస్తూ ఉంది.
ఓ రావణా! రాముడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు విష్ణుస్వరూపుడు లేకపోతే నూరుయోజనముల దూరము కల సముద్రము మీద సేతువు కట్టడం ఇతరులకు సాధ్యంకాదు. కాబట్టి రామునితో సంధి చేసుకో. లంకను కాపాడు." అని పలికాడు మాల్యవంతుడు.
రావణుని ముఖం వంక చూచాడు. రావణునిలో ఏ మార్పూ లేదు. చేసేది లేక మౌనంగా కూర్చున్నాడు మాల్యవంతుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment