శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 36)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ముప్పది ఆరవ సర్గ

రావణునికి రెండే గుణాలు. అతనికి తెలియదు. ఒకరు చెబితే వినడు. వీళ్లనే మూర్ఖులు అంటారు. ఆ మూర్ఖులలో కెల్లా అగ్రగణ్యుడు రావణుడు. రావణునికి ఎంతో మంది చెప్పారు, తల్లి కైకసి కూడా చెప్పింది. సీతను రామునికి ఇచ్చి యుద్ధము నివారించు అని. కాని వినలేదు. ఇప్పుడు మాల్యవంతుడు చెప్పాడు. రావణుడు వినలేదు. పైగా కోపం వచ్చింది.

మాల్యవంతుడు చెప్పిన మాటలకు రావణుడికి కోపం వచ్చింది. మాల్యవంతునితో ఎంతో కఠినంగా ఇలా అన్నాడు. "మాల్యవంతా! నీ హితబోధలు నాకు అక్కరలేదు. మీరు శత్రుపక్షము వహించి, నాకు హితబోధ చేస్తే అవి నా చెవికి ఎక్కవు. రాముడు కేవలం మానవుడు. రాజ్యము పోగొట్టుకొని అడవులు పట్టి తిరుగుతున్న అభాగ్యుడు. సైన్యము లేక, ఎవరూ దొరక్క, వానరుల సాయం తీసుకున్నాడు. అటువంటి వాడు నన్ను గెలువగలడా! రామునికి అంత సమర్ధత ఉందా! నేను ఎవరు; రాక్షసులకు రాజును. దేవతలను జయించిన వాడను. పరాక్రమ వంతుడను. దిక్పాలకులను నా పాద దాసులుగా చేసుకున్న మేటిని. నన్ను భీరుడుగా, బలహీనుడుగా ఎందుకు అనుకుంటున్నావు.

మాల్యవంతా! నీవూ రాక్షసుడవే. నేను రాక్షసుడనే. ఇరువురమూ ఒకే జాతికి చెందిన వారము. కానీ నీవు మానవుల పక్షము వహించి నన్ను కించపరుస్తున్నావు. ఇది శత్రువుల మీద పక్షపాతమా! లేక నా మీద అసూయనా! లేక మీరు ఏమి అన్నా నేను ఏమీ అనడం లేదనా! నా మంచి తన్నాన్ని నా చేతగానితనంగా అనుకుంటున్నారా! నీవు శాస్త్రములను అధ్యయనము చేసిన వాడవు. రాజుతో ఇలాగేనా మాట్లాడేది. ఇది నీకుగా నువ్వు మాట్లాడుతున్నావా! లేక మన శత్రువులు ఎవరైనా నీ చేత ఇలా పలికిస్తున్నారా! సీతను అంత కష్టపడి జనస్థానము నుండి తీసుకొని వచ్చినది రామునికి భయపడి తిరిగి ఇచ్చివేయడానికా! అలా భయపడితే అసలు సీతను తీసుకొని వచ్చి ఉండేవాడినే కాదు!

మాల్యవంతా! యుద్ధము మొదలైన రోజే వానరులు, రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వానర వీరులు నా చేతిలో హతమవుతారు. ఇది సత్యము. నాలో సహజంగా వీరత్వము రోషము పౌరుషము ఎక్కువ. నేను చావనైనా చస్తాను కానీ ఎవరికీ లొంగను. ఎవరితోనూ సంది చేసుకోను. ఎంతో మంది వానరుల సాయంతో సముద్రము మీద సేతువు నిర్మించి సముద్రమును దాటినంత మాత్రాను రాముడు దేవుడు అయిపోడు. కాబట్టి రాముడికి నేను భయపడవలసిన అవసరము లేదు. సముద్రమును దాటి లంకకు వచ్చిన రాముడు, వానరులు తిరిగి సముద్రాటి వెళ్లరు. ఇదే నా ప్రతిజ్ఞ. " అని అత్యంత పరుషంగా మాట్లాడిన రావణుని మాటలు విన్న మాల్యవంతుడు మౌనంగా ఉండిపోయాడు. వెంటనే రావణునికి జయము పలికి, ఆశీర్వదించి, తన గృహమునకు వెళ్లిపోయాడు.

ఇది చూచిన మిగిలిన మంత్రులు రావణునికి వ్యతిరేకంగా చెప్పడం ఒంటికి మంచిది కాదని రావణుడు చెప్పినట్టు చేయాలని నిశ్చయించుకున్నారు. రావణుడు వారితో లంకా నగరము రక్షణ గురించి తీసుకోవలసిన చర్యలను విపులంగా చర్చించాడు. లంకా నగరానికి పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చెయ్యమని ఆదేశించాడు. ఒక్కొక్క ద్వారము నకు ఒక్కొక్క సేనాధిపతిని నియమించాడు. తూర్పు ద్వారమునకు ప్రహస్తుని, దక్షిణ ద్వారమునకు మహోదరుని, మహా పార్శ్వుడిని, పడమటి ద్వారమునకు తన కుమారుడు ఇంద్రజిత్తును రక్షకులుగా నియమించాడు. ఉత్తర ద్వారమును శుకుడు,సారణుల సాయంతో తానే రక్షిస్తానని చెప్పాడు. విరూపాక్షుడు అనే సైన్యాధ్యక్షుని తన అపారమైన రాక్షస సేనతో మధ్య భాగంలో నిలిపాడు. ఈ విధంగా లంకా నగర రక్షణకు తగిన ఏర్పాట్లు చేసిన రావణుడు, ఆ ఏర్పాట్లతో సంతృప్తి చెంది. తన అంతఃపురమునకు వెళ్లిపోయాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)