శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 37)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది ఏడవ సర్గ
లంకా నగరంలో రావణుని పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ లంకా నగరము వెలుపల మోహరించి ఉన్న వానర సైనికుల మధ్య ఉన్న రాముడు, లక్ష్మణుడు,సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, శరభుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు, గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు, పనసుడు, ఇంకా తదితరులు కూర్చుని ఆలోచిస్తున్నారు. మనమందరమూ రావణుని చేత పరిపాలింపబడుతున్న లంకా పట్టణమును చేరుకున్నాము. తదుపరి కార్యక్రమమును గురించి ఆలోచించండి అని ఒకరితో ఒకరు అనుకొంటున్నారు.లంకా పట్టణము గురించి బాగా తెలిసిన విభీషణుడు లేచి ఇలా అన్నాడు. “రామా! నా వెంట నా అనుచరులు నలుగురు రాక్షసులు వచ్చారు. నేను ఆ నలుగురిని లంకకు పంపాను. వారు లంకలో జరుగుతున్న విషయాలను జాగ్రత్తగా పరిశీలించి వచ్చారు. వారు పక్షిరూపములలో రాక్షస సేనలలో ప్రవేశించి వారి ప్రయత్నములు అన్నీ తెలుసుకొని వచ్చారు. రావణుడు చేయుచున్న సైనిక ఏర్పాట్లను గురించి వారు నాకు తెలిపిన విషయాలను నేను మీకు తెలియపరుస్తాను.
లంకకు నాలుగు ప్రధాన ద్వారములు కలవు. తూర్పు ద్వారమునకు ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు దక్షిణ ద్వారము వద్ద, ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారము వద్ద, తమ తమ సేనలతో మోహరించి నగరమును రక్షిస్తున్నారు. రావణుడు తానే స్వయంగా ఉత్తర ద్వార పరిరక్షణ గావిస్తున్నాడు. విరూపాక్షుడు తన సైన్యములతో నగర మధ్యమున ఉండి నగర రక్షణ చేస్తున్నాడు.
రావణ సైన్యములో పదివేల మంది గజబలము, పదివేల మంది రథములను అధిష్టించిన యోధులు, రెండు వేల మంది అశ్వదళము, కోటికి పైగా సైనికులు ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్క వీరునికి పది లక్షల మంది రాక్షసులు పరివారముగా ఉన్నారు. ఇదీ వీరు తెచ్చిన సమాచారము.
రామా! పూర్వము రావణుడు కుబేరుని మీదికి యుద్ధమునకు వెళ్లినపుడు అతనితో పాటు 60 లక్షల మంది రాక్షసులు వెళ్లారు. వారందరూ అధికమైన పరాక్రమవంతులే. రామా! నేను శత్రుబలములను గూర్చి ఎక్కువగా చెబుతున్నందుకు కోపించకు. ఇది కేవలము శత్రుబలముల గురించిన సమాచారము మాత్రమే. నీవు దేవ దానవులను గెలువ సమర్ధుడివి. కాబట్టి మనము కూడా వానర సేనను నలుదిక్కులకు నాలుగు వ్యూహములుగా విభజించవలెను. దానికి తగిన వ్యూహములను నిర్ణయించు.” అని అన్నాడు విభీషణుడు.
అప్పుడు రాముడు ఇలా అన్నాడు. “సుగ్రీవా! నీలుడు తన వానర సైన్యముతో తూర్పుదిక్కున ఉన్న ద్వారము దగ్గర ప్రహస్తుని ఎదుర్కొంటాడు. అంగదుడు తన సేనలతో దక్షిణ ద్వారమును రక్షిస్తున్న మహాపార్శ, మహోదరులను ఎదుర్కొంటాడు. హనుమంతుడు తన సేనలతో పడమటి ద్వారమును రక్షిస్తున్న ఇంద్రజిత్తును ఎదుర్కొంటాడు. ఇంక ఉత్తర ద్వారమును రక్షిస్తున్న రావణుని నేనే స్వయంగా ఎదుర్కొంటాను. నాకు సాయంగా లక్ష్మణుడు ఉంటాడు. మేము ఇద్దరమూ రావణుని ఓడించి ఉత్తర ద్వారము గుండా లంకలో ప్రవేశిస్తాము. సర్వసేనాని సుగ్రీవుడు, భల్లూకములకు నాయకుడు జాంబవంతుడు, విభీషణుడు సైన్యమధ్యలో
ఉండి నలుదిక్కులను రక్షిస్తూ ఉంటారు. వానరులు అందరూ కామ రూపులు. అయినా వారందరూ వానర రూపములలోనే ఉండాలి. ఎవరూ మనుష్యరూపము ధరించకూడదు. అదే మన సైన్యమునకు గుర్తు. నేను, లక్ష్మణుడు, మాత్రము మనుష్యరూపములలో ఉంటాము. విభీషణుడు, అతని అనుచరులు నలుగురు రాక్షసులైనను, వారు కూడా మనుష్యరూపములలో మా వెంట ఉంటారు. వీరు తప్ప మిగిలిన వానరులు అందరూ తమ సహజ వానరూపములలోనే ఉండవలెను. అప్పుడే మన సైన్యమును గుర్తు పట్టడానికి వీలు అవుతుంది." అని పలికాడు రాముడు.
తరువాత రాముడు లంకలోని సైన్యమును అంతా పైనుంచి విహంగ వీక్షణము చేయవలెనని అనుకున్నాడు. అందుకని సువేల పర్వతము మీదికి ఎక్కాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment