శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది ఎనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 38)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది ఎనిమిదవ సర్గ
రాముడు లక్షణునితో సహా సువేల పర్వతమును ఎక్కడానికి నిర్ణయించుకొని, సుగ్రీవుడు, విభీషణునితో ఇలా అన్నాడు. "మేము ఇద్దరమ పర్వతమును ఎక్కి అక్కడ ఈ రాత్రికి ఉంటాము. తన చావును చేజేతులా కొనితెచ్చుకున్న రావణుని నివాసమైన లంకా నగరమును నేను లక్షణుడు చూడవలెనని కుతూహలపడుతున్నాము. రావణుని పేరు వింటేనే నాకు ఒళ్లంతా తాపము కలుగుతూ ఉంది. వాడి ఒక్కడి మూలంగా రాక్షసజాతి యావత్తు నాశనం కాబోతోంది. ఒక్కడు చేసిన పాపమునకు రాక్షస కులము నశించడం తప్పదు." అని అన్నాడు రాముడు.తరువాత రాముడు లక్ష్మణునితో కూడి సువేల పర్వతమును ఎక్కడం మొదలెట్టాడు. రామలక్ష్మణుల వెంట సుగ్రీవుడు, అతని మంత్రులు, విభీషణుడు కూడా వెళ్లారు. వారి వెంట హనుమంతుడు, అంగదుడు మొదలగు వానర వీరులు కూడా వెళ్లారు. అందరూ సువేల పర్వతమును ఎక్కి అక్కడి నుండి సుందరమైన కాంచన లంకను చూచారు. లంకా నగరము ప్రాకారముల మీద నల్లని శరీర ఛాయగల కొండల వంటి దేహములు గల రాక్షసులు నిలబడి ఉండటం వలన, నల్లటి రాళ్లతో మరొక ప్రాకారము కట్టారా అన్న భ్రమ కలుగుతూ ఉంది. ఆ రాక్షసులను చూచి వానరులు వింత వింత కిచ కిచ ధ్వనులు చేసారు.
అంతలోనే సూర్యాస్తమయము అయింది. రాత్రి వేళ చంద్రుడు వెన్నెల ప్రసరిస్తున్నాడు. రామలక్ష్మణులు, విభీషణుడు, సుగ్రీవుడు ఇతర వానర ప్రముఖులు ఆ రాత్రి సువేల పర్వతము మీద సుఖంగా గడిపారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment