శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 39)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ముప్పది తొమ్మిదవ సర్గ
వానర సేనలకు అధిపతులు ఆ రాత్రి సువేల పర్వతము మీద ఉండి, అక్కడి నుండి లంకా నగరాన్ని చూచారు. లంకా నగరంలో ఉన్న ఉద్యానవనములను, ఎత్తైన భవనములను, చూచారు. ఇంద్రుని రాజధాని అయిన అమరావతి వలె ప్రకాశించుచున్న లంకా నగర సౌందర్యమునకు వారంతా ఆశ్చర్యపోయారు. కొంత మంది వానరులకు లంకా నగరంలో ప్రవేశించవలెనని కోరిక కలిగింది. వారు సుగ్రీవుని అనుమతి తీసుకొని లంకా నగరం వైపుకు వెళ్లారు. ఆ వానరులు పెద్ద పెద్దగా అరుస్తూ, ఆ పర్వతము మీద ఉన్న మృగములకు ఏనుగులకు భయం కలిగిస్తూ వెళు తున్నారు. వారి అరుపులకు కేకలకు ఆ పర్వత ప్రాంతము అదిరిపోతూ ఉంది. వారి అరుపులకు క్రూరమృగములు నలుదిక్కులకు పారిపోయాయి.సువేల పర్వతము పక్కన ఎత్తైన త్రికూట పర్వత శిఖరము ఉంది. దానిని ఎక్కడానికి ఎవరి తరమూ కాదు. ఆ త్రికూట పర్వత శిఖరము మీద లంకా నగరము నిర్మింపబడి ఉంది. ఆ లంకానగరము ఇరవై యోజనముల పొడవు, పది యోజనముల వెడల్పు కలిగి ఉంది. ఆ లంకా నగరం ఎత్తైన గోపురములు, బంగారముతోనూ వెండితోనూ కట్టబడిన ప్రాకారములతోనూ, పెద్ద పెద్ద భవనములతోనూ, ఎత్తైన ప్రాసాదములతోనూ, విమానములతోనూ, శోభిల్లుతూ ఉంది. ఆ లంకా నగరంలో వెయ్యి స్తంభముల మీద నిర్మింపబడిన చైత్య ప్రాసాదము లంకా నగరానికే అలంకారంగా నిలిచి ఉంది. లంకా నగరము అంతా బంగారుకట్టడములతో నిండి ఉండి, కాంచన లంక అనే పేరును సార్థకం చేసుకుంది.
ఆ శోభాయమానమైన లంకను దూరంనుండి చూచారు ఆ వానరులు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment