శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 20)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఇరువదవ సర్గ

విభీషణుడు తన వద్దనుండి వెళ్లగానే రావణుడికి అనుమానం కలిగింది. శార్దూలుడు అనే రాక్షసుని పంపించాడు. శార్దూలుడు మారువేషంలో వానర సైన్యం వద్దకు వచ్చాడు. వానర సైన్యము పన్నిన వ్యూహములు అన్నీ గమనించాడు. వెంటనే లంకకు చేరుకున్నాడు. రావణునికి వానర సైన్యము గురించి వివరంగా చెప్పాడు.

“మహారాజా! వానర సైన్యము అపారంగా ఉంది. ఇంత అని చెప్పవీలు లేదు. వారందరూ సముద్రము ఆవల ఒడ్డున నిలిచి ఉన్నారు. వారికి రామలక్ష్మణులు నాయకత్వము వహిస్తున్నారు. వానర సైన్యము సముద్రము ఒడ్డున పదియోజనముల దూరము విస్తరించి ఉంది. నేను పైపైన చూచి వచ్చాను. తమరు మరి కొంత మంది గూఢచారులను పంపిన వారు సమగ్రమైన సమాచారమును సేకరించగలరు. ప్రస్తుతము ఆ వానర సేనతో యుద్ధయు కన్నా సామో పాయము, దానో పాయము, భేదోపాయము ప్రయోగించడం ఉచితము." అని అన్నాడు శార్దూలుడు.

శార్దూలుని మాటలు విన్న రావణుడు కొంచెం కంగారు పడ్డాడు. ఏదో వానరులు కదా, రామలక్ష్మణులు నరులు కదా అని ఉపేక్ష చేసాడు. కానీ ప్రస్తుత పరిస్తితి చూస్తుంటే వానరులతో యుద్ధము అంత సులభం కాదనిపించింది. వెంటనే రావణుడు శుకుడు అనే రాక్షసుని పిలిపించాడు. “నీవు నా పంపున సుగ్రీవుని వద్దకు దూతగా వెళ్లు. నేను చెప్పు మాటలను సౌమ్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పు. “సుగ్రీవా! నీవు ఉత్తమ కుల సంజాతుడవు. ఋక్షస్సు కుమారు డవు. నీకూ నాకు ఎలాంటి వైరము లేదు. నీవు నాకు సోదరుని వంటి వాడవు. ఈ యుద్ధము వలన నీకు ఎలాంటి ప్రయోజనము లేదు. నేను రాముని భార్యను తీసుకొని వచ్చాను. అది నాకూ రామునికి సంబంధించిన విషయము. ఇందులో నీకు ఎలాంటి సంబంధము లేదు. కాబట్టి నీవు నీ సేనలతో కిష్కింధకు తిరిగి పొమ్ము. పైగా నీ వానర సైన్యము సాగరమును దాటి లంకలో ప్రవేశించడం కష్టం. అందరూ సముద్రములలో మునిగి పోతారు. ఎందుకంటే ఈ సాగరమును దాటడం దేవతలకు, దానవులకు, గంధర్వులకు కూడా వశం కాదు. ఇంక ఈ నరులు, వానరులు ఎలా దాటుతారు? కాబట్టి ఈ యుద్ధమును విరమించి కిష్కింధకు తిరిగి వెళ్లు." అని నామాటలుగా సుగ్రీవునికి చెప్పు." అని పలికాడు రావణుడు.

రావణుని సందేశమును తీసుకొని శుకుడు రివ్వున ఆకాశం లోకి ఎగిరాడు. సముద్రమునకు ఆవల నిలిచి ఉన్న వానర సేన వద్దకు చేరుకున్నాడు. ఆకాశంలోనే నిలబడి సుగ్రీవునితో ఇలా అన్నాడు.
“సుగ్రీవా! నేను లంకేశ్వరుడు రావణుని వద్దనుండి వచ్చాను. రావణుడు నీకు చెప్పమన్న మాటలను యధాతథంగా చెబుతున్నాను. సావధానంగా విను" అంటూ రావణుడు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. శుకుడు రావణుడు చెప్పమన్న మాటలు చెబుతూ
ఉండగానే కొంత మంది వానరులు ఆకాశంలోకి ఎగిరారు. శుకుడిని పట్టుకున్నారు. వాడిని కొట్టుకుంటూ తన్నుకుంటూ కిందికి తీసుకొని వచ్చారు. అప్పుడు శుకుడు పెద్దగా అరుస్తున్నాడు.

"ఓ రామా! నేను రావణుని దూతను. దూతను చంపకూడదని నియమం ఉంది కదా! నన్ను రక్షించు. ఈ వానరులను వెనక్కురమ్మని చెప్పు. నన్ను కొట్టవద్దని చెప్పు నేను రావణుని చెప్పని మాటను ఒక్కటి కూడా అధికంగా చెప్పలేదు. రావణుడు చెప్పమన్న మాటలనే చెప్పాను. రావణుడు చెప్పమన్న దానికన్నా నేను అధికప్రసంగం చేసి ఉంటే నన్ను దండించడం, చంపడం యుక్తము. కాని నేను అలా చేయలేదు. నేను దూత నియమములను తప్పలేదు. నన్ను రక్షించు." అని పెద్దగా అరిచాడు.

శుకుని మాటలను ఆలకించిన రాముడు "అతనిని విడిచి పెట్టండి. చంపకండి" అని ఆదేశించాడు. 

తనకు ప్రాణభయం లేదని తెలుసుకున్న శుకుడు మరలా ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలో నిలిచి ఇలా అన్నాడు. “ఓ సుగ్రీవా! రావణుని సందేశమును విన్నావు కదా! నీవు రావణునికి ఏమి సందేశము ఇస్తావు. రావణునికి నన్ను ఏమని చెప్పమంటావు?" అని అడిగాడు. అప్పుడు సుగ్రీవుడు శుకునితో ఇలా అన్నాడు.

“ఓ రావణా! నీవు నాకు మిత్రుడవు కావు. బంధువు కావు. నీకూ నాకూ మిత్రుత్వము కానీ సంబంధము కానీ లేదు. ఇదివరలో నీవు నాకు ఎలాంటి ఉపకారము చేసి ఉండలేదు. కాబట్టి నీ మాటలు పాటించవలసిన అవసరము నాకు లేదు. నీవు అకారణంగా రాముని భార్య సీతను అపహ రించావు. రామునితో విరోధము కొనితెచ్చుకున్నావు. పరుల భార్యలను అపహరించిన వాడు దండనార్హుడు. అతనికి మరణదండన విధించవలెను. కాబట్టి నీకు రాముని చేతిలో మరణము తప్పదు. నేను నా వానర సైన్యముతో సముద్రమును దాటి లంకకు వచ్చి, నిన్ను, నీ పుత్రులను, బంధువులను అందరినీ సమూలంగా నాశనం చేస్తాను.

ఓ రావణా! నీవు మూర్ఖుడవు. రామునితో విరోధము పెట్టుకున్నావు. నీవు సూర్యలోకములో గానీ, పాతాళములో కానీ, కడకు ఈశ్వరుని పాదముల వద్ద ఉన్నా గానీ, రాముడు నిన్ను విడిచి పెట్టడు. నిన్ను చంపి తీరుతాడు. నిన్ను రక్షించగల వీరుడు ముల్లోకములలో నాకు కనిపించడం లేదు. నీవు అక్రమంగా సీతను అపహరిస్తున్నావు అని మంచి మాటలు చెప్పిన పక్షిరాజు జటాయువును నిర్దాక్షిణ్యంగా చంపావు.

నీవు నిజంగా వీరుడివి, పరాక్రమవంతుడివి అయితే, నీవు రాముడు ఇంట ఉండగా రాముడికి లక్ష్మణునికి తెలిసేటట్టు సీతను ఎందుకు అపహరించలేదు! రాముడంటే భయమా! రామ బాణము అంటే భయమా! రాముడి గురించి నీకు సరిగా తెలియదు. రాముడు తలుచుకుంటే ఈ
భూమి మీద రాక్షసజాతి అనేది లేకుండా చేయగలడు. జాగ్రత్త!" అని అన్నాడు సుగ్రీవుడు.

వానర రాజు సుగ్రీవుడు చెప్పిన తరువాత యువరాజు అంగదుడు కూడా ఇలా అన్నాడు. “ఓ సుగ్రీవా! ఇతడు దూత కాడు. రాక్షసుల గూఢచారి. పైన నిలబడి మన సేనలను తేరిపార చూస్తున్నాడు. మన సేనల వివరాలు తెలుసుకుంటున్నాడు. ఇతడు తిరిగి లంకకు వెళ్లకూడదు. ఇదీ నా అభిప్రాయము.” అని పలికాడు.

ఎప్పుడెప్పుడా అని ఉన్న సుగ్రీవునికి అంగదుని మాటలు ఊతాన్ని ఇచ్చాయి. వెంటనే శుకుని బంధించమన్నాడు. వానరులు వెంటనే ఆకాశంలోకి ఎగిరి శుకుని బంధించారు. శుకుడు పెద్దగా ఏడుస్తున్నాడు. మరలా “రామా రామా రక్షించు" అని అరుస్తున్నాడు. 

“ఓ రామా! ఈ వానరులు నన్ను బంధించారు. నన్ను కొడుతున్నారు. నా కళ్లు పీకుతున్నారు. ఇప్పుడు నేను వీళ్లచేతిలో చస్తే నా పాపాలన్నీ నీకు చుట్టుకుంటాయి." అని అరుస్తున్నాడు. మరలా రాముడు జోక్యం చేసుకొని శుకుని వానరుల బారి నుండి రక్షించాడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)