శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 21)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

ఇరువది ఒకటవ సర్గ

పంతొమ్మిదవ సర్గలో ముగించినట్టు రాముడు సముద్ర తీరంలో, సముద్రునికి నమస్కారము చేసి, “నేను ఈ సముద్రమును దాటనైనా దాటవలె. లేకపోతే ప్రాయోపవేశము చేసి మరణించవలె. మరొక మార్గము లేదు." అని సంకల్పించి, దర్భలమీద పడుకొని ఉన్నాడు. ఆ ప్రకారంగా మూడు రాత్రులు గడిచాయి. మూడు రోజులూ రాముడు సముద్రుని ఉపాసిస్తున్నాడు. కాని, సముద్రుడు రాముని వద్దకు రాలేదు. రాముడికి కోపం వచ్చింది. కళ్లు ఎర్రబడ్డాయి. పక్కనే ఉన్న లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.

"లక్ష్మణా! ఈ సముద్రునికి ఎంత గర్వము. నేను ఎంత వేడుకున్నను నా వద్దకు రాలేదు. నాలో ఉన్న శాంతి కాముకత, ఓర్పు, మంచి తనము నా చేతగాని తనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. సాధారణంగా ఈ లోకంలో తనను తాను పొగుడుకొనే వాడికి, దుర్మార్గుడికి, అందరిమీద అధికారము చూపేవాడికి, అకారణంగా అటు ఇటు హడావిడిగా పరుగెత్తేవాడికి, అందరి మీదా బలప్రయోగము చేసేవాడికి ప్రజలు భయపడతారు. భక్తితో కొలుస్తారు. ఈ లోకంలో మంచి తనంతో, సౌమ్యతతో పనులు సాధించలేము. యుద్ధములో విజయము దక్కించుకోలేము. నేను నా బాణములచేత ఈ సముద్రమును ఎండింపజేస్తాను. సముద్రజలాలు ఇంకిపోయి సముద్రములో ఉన్న జలచరములు అన్నీ బయటపడేట్టు చేస్తాను. నేను ఓర్పుగా ఉన్నానని, నా ఓర్పును నా అసమర్ధతగా, చేతగాని తనంగా పరిగణిస్తున్నాడు సముద్రుడు. ఇటువంటి వాని విషయంలో ఓర్పుగా ఉండటం మహా తప్పు.

లక్ష్మణా! నా ధనుర్బాణములు తీసుకొని రా! నా బాణముల శక్తి ఏమిటో ఈ సముద్రునికి తెలియజేస్తాను. ఈ సముద్రమును ఎండింపజేస్తాను. అప్పుడు వానరసేనలు హాయిగా సముద్రములో నడిచి లంకకు చేరుకుంటాయి." అని పలికి రాముడు తన ధనుస్సును
సంధించాడు.

రాముడు కోపం తెచ్చుకున్నాడు. రాముని కళ్లు ఎర్రబడ్డాయి. ప్రజ్వరిల్లుతున్న ప్రళయాగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు. సముద్రుని మీద శరవర్షము కురిపిస్తున్నాడు. రామ బాణములు సముద్రములోకి ప్రవేశించాయి. సముద్రములోని నీవు ఆవిరి కాసాగింది. సముద్రములోని జలచరములు ఈ ఉత్పాతానికి తల్లడిల్లిపోతున్నాయి. సముద్రములోనుండి పొగలు చెలరేగుతున్నాయి. సముద్రము అలలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆ అలలతోపాటు మొసళ్లు పాములు జలచరములు పైకి ఎగిసి పడుతున్నాయి. రాముని పక్కన ఉన్న లక్ష్మణుడు కూడా రాముని ఉగ్రస్వరూపమును చూచి భయపడ్డాడు. బాణములు సంధిస్తున్న రాముని చేయి గట్టిగా పట్టుకొని “రామా! వద్దు ఇంక చాలు. ఇంక ఆపు" అని వేడుకున్నాడు.

“రామా! మన కార్యము కొరకు కోట్లకొలదీ జలచరములకు ఆలవాలంగా ఉన్న సముద్రమును ఇంకింపజేస్తావా! మనము, మన వానరసేన సముద్రము దాటడానికి, సముద్రాన్ని ఇంతగా క్షోభింపచెయ్యాలా! మన కార్యము వేరేవిధంగా పూర్తిచేసుకోవచ్చు కదా! కోపము అన్ని అనర్ధములకు మూలము. నీ వంటి ఉత్తములు కోపానికి వశులవడం మంచిది కాదు కదా! నీ పూర్వీకుల ఉత్తమ గుణములను గుర్తుతెచ్చుకో! నీ స్వార్ధము కోసరం సముద్రమును క్షోభింపచేసి అపకీర్తిపాలుగాకు!" అని పలికాడు లక్ష్మణుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరవై ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)