శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - ఇరువది రెండవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 22)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
ఇరువది రెండవ సర్గ
రాముడు తన మాట మీదనే ఉన్నాడు. సముద్రుని చూచి ఇలా అన్నాడు. “ఓ సముద్రమా! నిన్ను ఇప్పుడే ఎండింపచేస్తాను. నేను నా బాణములతో నీ లోని నీటిని ఆవిరిగా మారుస్తాను. జలచరములను అన్నిటినీ చంపుతాను. అప్పుడు వానరులు నీ మీదుగా హాయిగా నడుచుకుంటూ లంకకు చేరుతారు. ఓ సముద్రుడా! నేను ఎన్ని విధముల బతిమాలిననూ, ప్రార్ధించిననూ కనీసము నా ముందుకు వచ్చి నాతో మాట్లాడలేదు. నా పౌరుషాన్ని, నా పరాక్రమాన్ని నువ్వు గుర్తించలేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఈ గతి పట్టింది." అంటూ రాముడు బ్రహ్మాస్త్రమునుసంధించాడు.
అప్పుడు భూమి ఆకాశము బద్దలు అయినట్టు శబ్దము వచ్చింది. పర్వతములు కంపించాయి. లోకమంతా చీకట్లు కమ్మాయి. సరస్సులు, నదులు గతులు తప్పాయి. చంద్రుడు సూర్యుడు తమ తమ గమనమును మార్చుకున్నాయి. ఆకాశం నుండి ఉల్కాపాతము మొదలయింది. మహావేగంతో విపరీతంగా గాలి వీచింది. వృక్షములు కూలిపోతున్నాయి. మేఘాలు చెదిరిపోతున్నాయి. ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉధృతిగా ఉన్నాయి. పిడుగులు పడుతూ విద్యుత్ సంబంధమైన మంటలు మండు తున్నాయి. ఆ పిడుగుపాటుకు సమస్త జీవజాతులు అల్లల్లాడి పోతున్నాయి. సముద్రము అల్లకల్లోలము అయింది. ఆకాశం ఎత్తు అలలు తీరం మీద విరుచుకుపడుతున్నాయి. తీర ప్రాంతాలు మునిగిపోతున్నాయి. రాముడు, వానర సేన ఉన్న ప్రాంతము నుండి సముద్రము ఒక యోజనము వెనక్కు వెళ్లింది.
ఆ సమయంలో సముద్రగర్భము నుండి సముద్రుడు బయటకు వచ్చాడు. సముద్రుడు రత్నహారములు ధరించి ఉన్నాడు. సువర్ణ ఆభరణములు ధరించి ఉన్నాడు. సముద్రునిలో కలిసిన నదులన్నీ సముద్రుని వెనుక నిలబడి ఉన్నాయి. సముద్రుడు రాముని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. రామునితో ఇలా అన్నాడు.
“ఓ రామా! ఈ సృష్టిలో పంచభూతములైన భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని ఇవి అన్నీ తమ తమ స్వభావమును బట్టి ప్రవర్తిస్తుంటాయి. నేను సముద్రుడను. లోతుగా ఉండటం, నీటితో నిండి ఉండటం నా స్వభావము. సముద్రము లోతుగా లేకపోతే అది నా స్వభావమునకే విరుద్ధము. సముద్రంలో జలచరములు, మొసళ్లు విరివిగా ఉంటాయి. వాటికి నేను భయపడి గానీ, నా స్వప్రయోజనమునకు కానీ, లోభము వలన కానీ, నా కోరికలు తీర్చుకోడానికి కానీ, ఆ జలచరములను నేను చంపను. అవి నాతోపాటే ఉంటుంటాయి. నీవు నీ వానర సేన క్షేమముగా సముద్రమును దాటుటకు తగిన ఏర్పాట్లు నేను చేస్తాను. నాలో ఉన్న జలచరములు మీకు ఏ అపకారమూ చెయ్యకుండా నేను చూస్తాను. దయచేసి బ్రహ్మాస్త్రమును ఉపసంహరించు.” అని వేడుకున్నాడు సముద్రుడు.
అప్పుడు రాముడు సముద్రునితో ఇలా అన్నాడు. “ఓ సముద్రమా! నీవు ఎంతకూ రాక పోతే నేను బ్రహ్మాస్త్రమును సంధించాను. దానిని నేను వెనుకకు మరల్చలేను. కాబట్టి ఈ బ్రహ్మాస్త్రమును ఎక్కడ ప్రయోగించాలో చెప్పు." అని అడిగాడు రాముడు.
“ఓ రామా! ఇక్కడకు ఉత్తరముగా ద్రుమకుల్యము అనే పవిత్రమైన స్థలము ఒకటి ఉంది. ఆ స్థలమును కొంత మంది దుర్మార్గులు ఆక్రమించుకొని అన్నిరకాల అక్రమాలు చేస్తున్నారు. వాళ్లు దస్యులు. వాళ్లు నా జలములో స్నానం చేస్తున్నారు. వాళ్ల పాపాలన్నీ నాకు అంటుకుంటున్నాయి. నేను ఆ పాపములను సహించలేకపోతున్నాను. కాబట్టి నీవు ఈ బ్రహ్మాస్త్రమును వారి మీద ప్రయోగించు.” అని అన్నాడు.
సముద్రుని కోరిక ప్రకారము రాముడు తాను సంధించిన బ్రహ్మాస్త్రమును ద్రుమకుల్యములో ఉన్న దస్యులమీద విడిచిపెట్టాడు. రాముడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రము భూమిని చీల్చుకుంటూ పాతాళములోనికి ప్రవేశించింది. పాతాళ గంగ భూమిని చీల్చుకుంటూ ఆకాశంలోకి ఎగిసింది. బ్రహ్మాస్త్రము పడ్డ చోట పెద్ద గొయ్యి ఏర్పడింది. దానికి వ్రణము అనే పేరు వచ్చింది. ఆ వ్రణము నుండి నిరంతరము స్వచ్ఛమైన జలము పైకి ఉబుకుతూ ఉంటుంది. ఆ ప్రదేశమునకు మరుకాంతారము అనే పేరు వచ్చింది. ఆ మరుకాంతారము పెద్ద పెద్ద పచ్చికబయళ్లతో, పశుసంపద, పాడి పంటలు వృద్ధిచెందుటకు అనువుగా ఉండింది. అక్కడ ఫలవృక్షములు, చల్లని నీడ నిచ్చే చెట్లు సమృద్ధిగా పెరిగాయి. అనేక రకములయిన ఓషధులు అక్కడ పెరుగుతున్నాయి. ఆ ప్రకారంగా మరుకాంతారము మంగళకరంగా శోభిల్లింది.
తరువాత సముద్రుడు రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! మీదగ్గర ఉన్న వానరులలో నీలుడు అనేవాడు ఉన్నాడు. అతడు విశ్వకర్మ కుమారుడు. తండ్రి వలన వరములను పొంది ఉన్నాడు. ఆ నీలుడు తన తండ్రి విశ్వకర్మతో సాటిగా నిర్మాణపనులు చేయగలడు. ఆ నీలుడు నా మీద సేతువును నిర్మిస్తాడు. ఆ సేతువును నేను భరిస్తాను.”అని పలికి సముద్రుడు వెళ్లిపోయాడు.
అప్పుడు నీలుడు రాముని చూచి ఇలా అన్నాడు.
“ ఓ రామా! సముద్రుడు చెప్పిన మాట నిజమే. నేను విశ్వకర్మ కుమారుడను. నేను ఈ సముద్రము మీద సేతువును నిర్మించెదను. సముద్రుడు తనలో లోతు లేని ప్రాంతమును మనకు చూపించాడు. అక్కడ నుండి సేతువును నిర్మిస్తాను. ఇంక నా గురించి చెబుతాను. నేను విశ్వకర్మకు ఔరస పుత్రుడను. నా తండ్రితో సమానంగా నిర్మాణ కౌశలము కలవాడిని. మీరు
అడగకుండా నా గుణగణముల గురించి నాకుగా నేను చెబితే బాగా ఉండదని నా సంగతి మీకు చెప్పలేదు. ఇప్పుడు సముద్రుడు చెప్పాడు. కాబట్టి నా గురించి నేను చెప్పుకున్నాను. ఈ సముద్రము మీద నూరు యోజనముల దూరము సేతువు కట్టే సామర్థ్యము నాకు ఉంది. కాబట్టి వానర వీరులందరూ సేతువును కట్టుటకు తగిన ప్రయత్నములను చేయండి." అని పలికాడు.
అడగకుండా నా గుణగణముల గురించి నాకుగా నేను చెబితే బాగా ఉండదని నా సంగతి మీకు చెప్పలేదు. ఇప్పుడు సముద్రుడు చెప్పాడు. కాబట్టి నా గురించి నేను చెప్పుకున్నాను. ఈ సముద్రము మీద నూరు యోజనముల దూరము సేతువు కట్టే సామర్థ్యము నాకు ఉంది. కాబట్టి వానర వీరులందరూ సేతువును కట్టుటకు తగిన ప్రయత్నములను చేయండి." అని పలికాడు.
రాముడు సేతువు నిర్మాణానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే కోట్లకొద్ది వానరులు అరణ్యములలోకి పరుగులు తీసారు. వారంతా ఆ అరణ్యములో ఉన్న మహా వృక్షములను, బండరాళ్లను, పర్వతశిఖరములను మోసుకొచ్చి సముద్రంలో పడవేసారు. నీలుడు వాటిని ఒక క్రమపద్ధతిలో అమరుస్తున్నాడు. వానరులు సాలవృక్షములు, అశ్వకర్ణ, ధన, వెదురు, కుటజ, అర్జున, తాళ, తిలక, తినిశ, మారేడు, కర్ణికార, చూత, అశోక వృక్షములను మోసుకొని వచ్చి సముద్రం ఒడ్డున పడవేసారు. వానరులు ఎక్కువగా తాటి చెట్లను, మామిడి చెట్లను, దానిమ్మ చెట్లను, కొబ్బరి చెట్లను, విభీతక వృక్షములను, వేప చెట్లను పెకలించి తీసుకొని వచ్చి సముద్రము ఒడ్డున పడవేసారు. చెట్లు తెచ్చే వాళ్లు చెట్లను తెస్తుంటే, మరి కొందరు వానరులు పెద్దపెద్ద బండరాళ్లను మోసుకొని వచ్చి సముద్రము ఒడ్డున పడవేస్తున్నారు.
ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకంలో యంత్రములు వాడారు అని రాసారు.
హస్తిమాత్రాన్ మహాకాయా: పాషాణాంశ్చ మహాబలా:
పర్వతాంశ్చ సముత్పాట్య యనైః పరివహన్తి చ.
పర్వతాంశ్చ సముత్పాట్య యనైః పరివహన్తి చ.
పెద్ద పెద్ద శరీరము కల వానరులు, మహాబలవంతులు అయిన వానరులు, ఏనుగు ప్రమాణములో ఉన్న బండ రాళ్లను పర్వత ప్రాంతముల నుండి పెకలించి, యంత్రముల ద్వారా మోసుకుంటూ సముద్రతీరమునకు తీసుకువచ్చారు. (అంటే ఈ నాటి క్రేన్ల మాదిరి యంత్రములు, ఈ నాటి క్రేన్ల రూపంలో కాకపోయినా మరోరూపంలో ఉండి ఉండవచ్చు. ఈ యంత్రములు అనే మాట లంకా నగర వర్ణనలోకూడా వాడారు. పెద్ద పెద్ద బండరాళ్లను కోట బురుజుల మీది నుండి బయట ముట్టడించి ఉన్న శత్రువుల మీదికి విసరడానికి యంత్రములు అమర్చబడి ఉన్నాయి అని
రాసారు కదా!)
రాసారు కదా!)
వానరములు తెచ్చిన పెద్ద పెద్ద బండ రాళ్లను సముద్రంలో పడవేస్తుంటే, సముద్రము నీరు ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిపడుతున్నాయి. ఆ ప్రకారంగా నీలుడు వానరులు తెచ్చిన రాళ్లను చెట్లను పెద్ద పెద్ద వృక్షములను నీటిలో పడవేస్తుంటే కొంత మంది వానరులు దారములు పట్టుకుంటూ ఆ రాళ్లను, వృక్షములను క్రమ పద్ధతిలో పేరుస్తున్నారు. ఆ ప్రకారంగా నూరు యోజనముల దూరం వరకూ కొలతదారములను పట్టుకొని రాళ్లతోనూ వృక్షములతోనూ సేతువును నిర్మిస్తున్నారు. కొందరు వానరులు రాళ్లను తీసుకొని వస్తున్నారు. మరి కొందరు గడ్డి, కర్రలతో సేతువులోని కొన్ని భాగములను నిర్మిస్తున్నారు. మరి కొందరు వానరులు పెద్ద పెద్ద బండరాళ్లను పట్టుకొని అటు ఇటు పరుగెడుతున్నారు. కొంత మంది వాళ్లు తెచ్చిన బండ రాళ్లను ఒక క్రమంలో అమరుస్తున్నారు.
కోట్ల కొద్దీ వానరుల సాయంతో నీలుడు మొదటి రోజున పదునాలుగు యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. రెండవ రోజున ఇరువది యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. మూడవ రోజున ఇరువది యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. నాలుగవ రోజున ఇంకొక ఇరువది యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు. ఐదవ రోజున మరొక ఇరువది మూడు యోజనముల సేతువును నిర్మించి సముద్రము ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. విశ్వకర్మ కుమారుడైన నీలుడు వానరుల సాయంతో అత్యంత నైపుణ్యంతో సముద్రమునకు అడ్డంగా నూరుయోజనముల దూరం గల సేతువును నిర్మించాడు. వానరులు సౌకర్యంగా నడవడానికి ఆ సేతువు మీద చక్కని నున్నటి దారిని ఏర్పరిచారు. ఆ సేతువు ఆకాశంలో కనపడే నక్షత్ర మార్గంలాగా ప్రకాశిస్తూ ఉంది. సముద్రానికి తీసిన పాపిడి లాగా ఉంది. దేవతలు, దానవులు, గంధర్వులు ఆకాశంలో నిలబడి ఈ వింతను తిలకిస్తున్నారు. ఆ సేతువు పది యోజనముల వెడల్పు నూరుయోజనముల పొడవుతో ఉంది.
ఆ సేతువును చూచిన వానరముల సంతోషానికి అంతు లేదు. కొంత మంది వానరులు ఆ సేతువు మీద ఎక్కి దుముకుతున్నారు. ఆడుతున్నారు గెంతుతున్నారు. కొంతమంది వానరులు అప్పుడే ఆవల ఒడ్డుకు చేరుకున్నారు. సుగ్రీవుడు రాముని హనుమంతుని బుజం మీద, లక్ష్మణుని అంగదుని బుజం మీద ఎక్కమన్నాడు. వారు రామలక్ష్మణులను ఆకాశమార్గంలో ఆవల ఒడ్డుకు తీసుకొని వెళ్లారు. వానరులు కొంత మంది సేతువు మధ్యలో నడిచివెళుతున్నారు. మరి కొంత మంది సేతువు పక్కలనుండి వెళుతున్నారు. కొందరు కాసేపు నీటిలో ఈదుతూ మరికొంతసేపు సేతువు మీద నడుస్తున్నారు. మరి కొందరు ఆకాశంలో ఎగురుతూ వస్తున్నారు. సేతువు మీద నడుస్తున్నప్పుడు వానరులు చేసే ధ్వనులు సముద్రఘోషను మించిపోయూయి.
వానర రాజు సుగ్రీవుడు వానర సేనలను సముద్రము ఆవలకు దాటించి అక్కడ ఫలములు, పుష్పములు, తేనె, స్వచ్ఛమైన జలము దొరికే చోటునందు విడిదిచేయించాడు. రాముడు సముద్రమును దాటగానే ఆకాశము నుండి మహర్షులు వారి మీద మంత్రజలమును చల్లి ఆశీర్వదించారు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment