శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పంతొమ్మిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 19)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పంతొమ్మిదవ సర్గ
ఆకాశంలో నిలబడి ఉన్న విభీషణుడు, రాముడి ముందు వానర నాయకులు నిలబడి మాట్లాడటం వారిలో వారు వాదించుకోవడం అంతా చూస్తున్నాడు. చివరకు పర్యవసానము ఎలా ఉంటుందో అని భయపడుతున్నాడు. ఎందుకంటే రాముడి వద్దకు వెళదామని రావణునితో విభేదించి వచ్చాడు. రాముడూ కాదంటే ఎక్కడకు వెళ్లాలి అని ఆలోచిస్తున్నాడు.ఇంతలో సుగ్రీవుడు విభీషణుని కిందికి రమ్మని చెయ్యి ఊపాడు. పట్టరాని సంతోషంతో విభీషణుడు తన అనుచరులతో కిందికి దిగాడు. పరుగు పరుగున రాముని వద్దకు వెళ్లాడు. రాముని ముందు సాగిల పడ్డాడు. రాముని పాదములను స్పృశించాడు. రామునితో ఇలా అన్నాడు.
“రామా! నా పేరు విభీషణుడు. రావణుని సోదరుడను. నా అన్న రావణుడు నన్ను అవమానించి రాజ్యము నుండి వెళ్లగొట్టాడు. నీవు శరణాగతరక్షకుడవు అని విని నీ శరణుకోరి వచ్చాను. నేను లంకను, లంకలో ఉన్న నా భార్యాబిడ్డలను, నా బంధుమిత్రులను అందరినీ వదిలి వచ్చాను. నా రాజ్యము, నా జీవితము నీ మీదనే ఆధారపడి ఉన్నాయి.” అని అన్నాడు.
రాముడు విభీషణుని పట్టుకొని లేవనెత్తాడు. విభీషణుని ప్రేమతో చూస్తూ ఇలా అన్నాడు. “నీవు రాక్షసుల బలాబలముల గురించి నాకు వివరంగా చెప్పు" అని అడిగాడు. విభీషణుడు విషయం అర్ధం చేసుకున్నాడు. రావణుని బలము, బలహీనతల గురించి చెప్పనారం భించాడు.
“ఓ రామా! రావణుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరములు పొందాడు. ఆ వర ప్రభావంతో రావణుని దేవ, దానవ, గంధర్వ, నాగ జాతులు చంపజాలవు. రావణునికి నాకూ మధ్యలో కుంభకర్ణుడు అనే సోదరుడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు. దేవేంద్రుడు కూడా యుద్ధములో అతని ముందు నిలువలేడు. రావణునికి ప్రహస్తుడు అనే సేనాపతి ఉన్నాడు. అతడు మణిభద్రుడు అనే యక్షుడిని కైలాస పర్వతము మీద ఓడించాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు. యుద్ధ విద్యలలో ఆరితేరినవాడు. అతడు అదృశ్యరూపంలో యుద్ధంచేయగల నేర్పరి. వారు కాకుండా మహోదరుడు, మహాపార్శ్వుడు, అకంపనుడు అని రావణునికి సేనాధిపతులు ఉన్నారు. లంకలో ఉన్న రాక్షసులు అందరూ కామరూపులు. తమ ఇష్టం వచ్చిన రూపములు ధరించడంలో సమర్ధులు. వారందరూ మాంసాహారులు. రావణుడు లోకపాలకులను, దేవతలను యుద్ధములో ఓడించాడు. వారిని తన వశంలో ఉంచుకున్నాడు.” అని విభీషణుడు లంక రహస్యములను అన్నీ చెబుతూ ఉంటే రాముడు కళ్లు మూసుకొని వింటున్నాడు. అన్నీ మనసుకు పట్టించుకుంటున్నాడు. కళ్ళుతెరిచి విభీషణునితో ఇలా అన్నాడు.
“విభీషణా! నీవు నీ అన్న రావణుని గురించి అతని బలమును, పరాక్రమమును గురించి అతని సేనల గురించి చెప్పావు. నేను వాటిని చక్కగా ఆకళింపుచేసుకున్నాను. ఇప్పుడు నీకు నేను మాట ఇస్తున్నాను. నేను రావణుని, ఇంద్రజిత్తును, ప్రహస్తుని చంపి, నిన్ను లంకకు రాజును చేస్తాను. రావణుడు ముల్లోకములలో ఎక్కడ దాక్కున్నా వెదికి వెదికి చంపుతాను. నేను నా ముగ్గురు సోదరుల మీద ఒట్టుపెట్టుకుంటున్నాను. నేను రావణుని, అతని కొడుకులను, బంధు మిత్రులను చంపకుండా అయోధ్యలో ప్రవేశించను. ఇదే నా ప్రతిజ్ఞ." అని పలికాడు.
ఆ మాటలకు విభీషణుడు ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రామునితో ఇలా అన్నాడు. “ఓ రామా! మీరు లంకను ముట్టడించడంలోనూ, లంకను జయించడంలోనూ, రావణుని చంపడంలోనూ నేను సాయం చేస్తాను. నా శక్త్యానుసారము నేను రాక్షసులతో యుద్ధము చేస్తాను.”అని అన్నాడు విభీషణుడు.
రాముడు వెంటనే సముద్రము నుండి జలమును తెప్పించాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! ఈ సముద్ర జలముతో నీవు విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తుడిని చెయ్యి. అది చూచి నేను సంతోషిస్తాను.” అనిపలికాడు. రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు సమస్తవానరుల సమక్షంలో విభీషణుని లంకా సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేసాడు. అది చూచి వానరులంతా సంతోషంతో కేరింతలుకొట్టారు. ఆడారు పాడారు. ఇప్పుడు హనుమంతుడు, సుగ్రీవుడు కలిసి విభీషణుని సూటిగా ఒక మాట అడిగారు.
"అంతా బాగానే ఉంది. ఇప్పుడు మనమందరము ఈ సముద్రాన్ని దాటి లంకను చేరుకొనేది ఎటుల సాధ్యమో మీరు చెప్పండి." అని అన్నాడు. దానికి విభీషణుడు ఇలా అన్నాడు.
"రాముడు సముద్రమును దారి ఇమ్మని అర్ధించడం మంచిది. ఎందుకంటే సముద్రమును త్రవ్వించిన సగరుడు ఇక్ష్వాకు వంశమునకు చెందిన వాడు. రామునికి పూర్వీకుడు. రాముడు అర్ధిస్తే సాగరము తప్పక సాయం చేస్తుంది. దారి ఇస్తుంది.” అని అన్నాడు విభీషణుడు. అవేమాటలు సుగ్రీవుడు, హనుమంతుడు రామలక్ష్మణులకు చెప్పారు. ఈ ఆలోచన రామునికి కూడా నచ్చింది.
రాముడు లక్ష్మణుని, సుగ్రీవుని చూచి ఇలా అన్నాడు. “సుగ్రీవా! విభీషణుని ఆలోచన నాకు బాగా నచ్చింది. మీరు ఇరువురూ కలిసి సుముహూర్తమును నిర్ణయించి నాకు తెలియజేయండి." అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! విభీషణుని ఆలోచన నాకూ నచ్చింది. కానీ, ఇంత విశాలమైన సాగరము మీద సేతువు కట్టకుండా దాటడం సాధ్యమా! సేతువు కట్టకుండా దేవతలు, దానవులు కూడా ఈ సముద్రమును దాటలేరు కదా! కాబట్టి సేతువు నిర్మాణమునకు సముద్రుని సాయం అడగండి." అని అన్నాడు లక్ష్మణుడు.
వెంటనే రాముడు సముద్ర తీరంలో దర్భలతో ఒక శయ్య ఏర్పాటుచేసుకున్నాడు. దాని మీద పడుకున్నాడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పంతొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment