శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునెనిమిదవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 18)

శ్రీమద్రామాయణము

యుద్ధకాండము

పదునెనిమిదవ సర్గ

అందరూ మాట్లాడడం అయిన తరువాత రాముడు తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించాడు.

“వానరవీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినది విన్న తరువాత నా అభిప్రాయం కూడా చెబుతున్నాను. ఎవరైనా నా దగ్గరకు వచ్చి “నేను నీకు మిత్రుడను, శరణాగతుడను" అని చెబితే వారిలో ఎన్ని దోషాలు ఉన్నాకూడా, నేను వారిని విడిచిపెట్టను. అది నా వ్రతము. అన్నీ సుగుణములు ఉన్న వాడిని రక్షించే దానికంటే, దోషములు ఉన్న వాడిని రక్షించడంలోనే మన మంచితనం బయటపడుతుంది." అని ఒక్క వాక్యంలో తన నిర్ణయం తెలిపాడు రాముడు.

ఆ మాట విన్న తరువాత కూడా సుగ్రీవుడు తన పట్టుదల విడువ లేదు. “రామా! వచ్చిన వాడు రాక్షసుడు. వాడు దుష్టుడో కాదో మనకు అనవసరము. ఈ విభీషణుడు తనకు బాగా జరిగినంత కాలము తన అన్న రావణుని వద్ద ఉన్నాడు. ఇప్పుడు రావణునితో విభేదము కలిగేటప్పటికి రావణుని విడిచిపెట్టి నీ దగ్గరకు చేరాడు. స్వంత అన్ననే వదిలిన వాడు, రేపు నిన్ను, నన్ను కూడా విడిచిపెట్టకుండా ఉంటాడా! అటువంటి వాడు తన స్వార్ధం కోసం ఎవరినైనా విడిచిపెడతాడు. ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు. ఇటువంటి స్వార్ధపరుడికి, అవకాశవాదికి, ఆశ్రయం ఇవ్వడం శ్రేయస్కరము కాదు." అని పలికాడు సుగ్రీవుడు.

సుగ్రీవుని మాటలు విన్న రాముడు అతనితో ఏమీ మాట్లాడలేదు. లక్ష్మణుని వంక చూచి ఇలా అన్నాడు. “లక్షణా! సుగ్రీవుడు లౌక్యంగా మాట్లాడుతున్నాడు కానీ, శాస్త్ర పరంగా మాట్లాడటం లేదు. ఇటువంటి మాటలు సామాన్యులు కూడా మాట్లాడరు. ఇక్కడ ఒక ధర్మసూక్ష్మము ఉంది. రావణుడు, విభీషణుడు అన్నదమ్ములు. ఇద్దరూ రాక్షస కులమునకు చెందినవారు. కానీ ఒకరికి ఒకరు శత్రువులు అయ్యారు. రావణుడు లంకకు రాజు. రాజైన వాడు ఒక్కోసారి సాటివారు ధర్మపరులు అయినా వాళ్లను నమ్మరు. పైగా శంకిస్తారు. ఈ విభీషణుడు ధర్మపరుడు కావచ్చును. కానీ రాజధర్మము ప్రకారము రావణుడు అతనిని శంకించి ఉండవచ్చు అంతమాత్రాన మనము ఇతనిని అనుమానించరాదు. మన శత్రువుల వద్దనుండి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదుకదా! మన శత్రువుకు శత్రువైన విభీషణుడు మనకు మిత్రుడు కావచ్చు కదా!

పైగా మనము విభీషణుని కులమునకు చెందిన వారము కాము. వారు రాక్షసులు. మనము క్షత్రియులము. విభీషణునికి మనకూ సహజమైన శత్రుత్వము లేదు. ఈ విభీషణునికి లంకను పాలించవలెనని కోరికగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బుద్ధిహీనత వలన అలా కోరుకుంటున్నాడా అని అనుకున్నాకూడా, రాక్షసులు అందరూ బుద్ధిహీనులు కారు కదా! రాక్షసులలో కూడా విద్వాంసులు, పండితులు, శాస్త్రవేత్తలు, వేద వేదాంగ పారంగతులు ఉన్నారు. కాబట్టి విభీషణుని మనము మిత్రునిగా స్వీకరించడంలో తప్పులేదు. లోకంలో దాయాదులు ఎవరూ మిత్రుల మాదిరి కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలు ఉంటుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. విభీషణుడు కూడా రావణుడికి తమ్ముడు. సీత కారణంగా అన్నదమ్ములకు భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే అన్న తమ్ముడిని తరిమేసాడు.
లక్ష్మణా! సోదరులు అందరూ భరతుని మాదిరి ఉంటారా చెప్పు. అలాగే కుమారులందరూ నా మాదిరి తండ్రి మాటను పాటించేవారు ఉంటారా! సుగ్రీవా! స్నేహితులందరూ నీ వంటి వాళ్లు ఉంటారా!" అని నర్మగర్భంగా అన్నాడు రాముడు.

రాముడి మాటలలో ఉన్న అంతరార్ధము అర్థం చేసుకున్నాడు లక్ష్మణుడు. కాని సుగ్రీవుడు మాత్రము తన పాత మాటకే కట్టుబడి ఉన్నాడు. విభీషణుని మిత్రుడిగా అంగీకరించుటకు అతని మనసు ఒప్పుకోడం లేదు. అందుకని రామునితో ఇలా అన్నాడు.

“ఓ రామా! నా మాట విను. ఈ రాక్షసుడు రావణుని గూఢచారి. అతనిని నమ్మకు. అతనిని చంపడమే యుక్తము. అతనికి శరణాగతి ఇవ్వడం అనర్ధదాయకము. ఈ విభీషణుడు రావణుని ఆదేశము మేరకు నిన్ను, లక్ష్మణుని, నన్ను చంపడానికే ఇక్కడకు వచ్చాడు. ఇందులో సందేహము లేదు. ఇతడు ఆ క్రూరుడైన రావణుని సోదరుడు అని మరిచిపోకూడదు. కాబట్టి ఇతనిని ఇతని మంత్రులతో సహా బంధించి శిక్షించాలి.” అని చెప్పి ఊరుకున్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుని మాటలు విన్న రాముడు తన మనోనిశ్చయాన్ని ఇలా పకటించాడు. “వానరవీరులారా! మన వద్దకు వచ్చిన రాక్షసుడు దుష్టుడు అయినా, కాకపోయినా మనకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇతడు నాకు గానీ మీలో ఎవరికైనా గానీ ఎటువంటి అపకారమూ చేయలేడు. సుగ్రీవా! నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటి చేత్తో చంపగలను. ఈ ఐదుగురు రాక్షసులు ఏ పాటి!

ఇంక శరణాగతి గురించి చెబుతాను. ఇది వరకు ఒక పావురము తన శరణు జొచ్చిన శత్రువునకు తన మాంసమునే ఆహారముగా పెట్టినది అని విన్నాము కదా! తన భార్యను చంపిన శత్రువు తన ఇంటికి వస్తే, అతనికి ఆతిధ్యము ఇచ్చిన పావురము సంగతి మనకందరికీ తెలుసు కదా! ఒక పక్షి అలా చేసినపుడు మన మానవులము దానికి భిన్నంగా ఎలా నడుచుకుంటాము? కణ్వమహర్షి కుమారుడు కండుడు అను వాడు ధర్మము తెలిపే కధలను కొన్ని చెప్పాడు. వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకో!

రెండు చేతులూ జోడించి, దీనంగా తనను శరణు కోరిన శత్రువును క్షత్రియులు చంపకూడదు. అలాగే ఇతరుల చేత చిక్కిన తన శత్రువును, క్షత్రియుడు తన ప్రాణములనైనా పణంగా పెట్టి రక్షించాలి. తన శరణుజొచ్చిన శత్రువును కూడా కాపాడలేక పోయిన క్షత్రియుడు మహాపాపము చేసిన వాడితో సమానమవుతాడు. అలాగే, తన శరణుజొచ్చిన వాడిని తాను కాపాడ లేకపోగా, పైగా, అతడు తన కళ్లముందే మరణిస్తే, ఆ మరణించిన వాడు, తాను శరణుజొచ్చిన వాడి పుణ్యమును అంతా తన వెంట తీసుకొనిపోతాడు.

ఇప్పుడు విభీషణుడు మన శరణు కోరి వచ్చాడు. ఇప్పుడు మనము అతనిని నిరాకరిస్తే, పైన చెప్పిన పాపములు అన్నీ మనకు చుట్టుకుంటాయి. పైగా మనకు అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను కండు మహర్షి చెప్పిన ధర్మములను పాటిస్తాను. నా శరణు కోరి వచ్చిన విభీషణునికి అభయం ఇస్తాను. ఈ విభీషణుడే కాదు, ఎవడైనా సరే నా ముందుకు వచ్చి, నన్ను శరణు కోరితే, నేను వాడికి అభయం ఇస్తాను. ఇదే నేను అవలంబించుచున్న వ్రతనియమము. దీనికి తిరుగు లేదు.

ఓ సుగ్రీవా! ఆ వచ్చినవాడు, రావణుని తమ్ముడు విభీషణుడైనా, లేక సాక్షాత్తు రావణుడు అయినా సరే. అతనిని నా వద్దకు తీసుకొని రమ్ము. నేను అతనికి అభయము ఇచ్చాను అని చెప్పు." అని పలికాడు రాముడు. ఆ మాటలు విన్న సుగ్రీవుడు రాముడి ధర్మపాలనకు ఆశ్చర్యపోయాడు. సామాన్యుడైన తనకు రాముని ధర్మాచరణ సాధ్యం కాదనుకున్నాడు.

రామునికి నమస్కరించి ఇలా అన్నాడు.

"ఓ రామా! నీకు తెలియని ధర్మము లేదు. నీవు మూర్తీభవించిన ధర్మస్వరూపుడవు. మహా బలశాలివి. పరాక్రమవంతుడివి. నీవు ఈ విధంగా మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది. నీమాటలు వింటుంటే నాకు కూడా విభీషణుడు మంచివాడు, అభయము ఇవ్వతగ్గవాడు అనిపిస్తూ ఉంది. అందుకని ఈ విభీషణుని కూడా మన మిత్రునిగా అంగీకరిద్దాము. ఇప్పటినుండి విభీషణుడు కూడా మనకు అందరికీ మిత్రుడు. నేను ఇప్పుడే వెళ్లి విభీషణుని సగౌరవంగా తీసుకొని వస్తాను.” అని అన్నాడు సుగ్రీవుడు.

శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)