శ్రీమద్రామాయణం - యుద్ధకాండము - పదునేడవ సర్గ (Ramayanam - YuddhaKanda - Part 17)
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము
పదునేడవ సర్గ
విభీషణుని అన్న రావణుడు విభీషణునికి శత్రువు అయ్యాడు. రావణుని శత్రువు రాముడు విభీషణునికి మిత్రుడు అయ్యాడు. తన శత్రువుకు శత్రువు తనకు మిత్రుడు అవుతాడు కదా! ఆ రాజనీతి ప్రకారము విభీషణుడు రావణుని శత్రువు రాముడి వద్దకు వెళ్లాడు. సముద్రము దాటి వానర సేన ఉన్న చోటికి వెళ్లాడు.ఆకాశంలో నిలిచి ఉన్న విభీషణుని నేల మీద ఉన్న వానర నాయకులు చూచారు. విభీషణుని పక్కన ఉన్న నలుగురు రాక్షసులను కూడా వారు చూచారు. వెంటనే ఈ విషయము సుగ్రీవునికి చెప్పారు. సుగ్రీవుడు కూడా ఆకాశంలో వెలిగిపోతున్న ఐదుగురు రాక్షస వీరులను చూచాడు. తన వానర నాయకులతో ఇలా ఆలోచించాడు.
"ఆకాశంలో ఉన్న వారు రాక్షసులు. సందేహము లేదు. వారి చేతులలో ఆయుధములు కూడా ఉన్నాయి. వారు కవచములు ధరించి ఉన్నారు. వారు లంక నుండి మనలను చంపడానికి వచ్చి ఉంటారు. కాబట్టి మీరు సర్వసన్నద్ధంగా ఉండండి." అని పలికాడు సుగ్రీవుడు.
వెంటనే వానరులు చేతికి అందిన రాళ్లు, వృక్షములు, కొమ్మలు తీసుకొని వారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నారు. “రాజా! మాకు అనుమతి ఇవ్వండి. మేము వెంటనే ఎగిరి పోయి ఆ నలుగురిని హతమారుస్తాము” అని పలికారు వానరులు.
వానరులు వెళ్లి తమ నాయకుడికి చెప్పడం, ఆ నాయకుడు తన వంక చూడ్డం, తన వారితో మాట్లాడటం, వానరులు తలా ఒక ఆయుధము చేత ధరించడం చూస్తూనే ఉన్నాడు విభీషణుడు. అతనికి విషయం అర్థం అయింది. వెంటనే విభీషణుడు, పెద్ద కంఠంతో, సుగ్రీవునికి వానరులకు వినబడేటట్టు ఇలా అరిచాడు.
"ఓ వానర వీరులారా! రావణుడు లంకకు రాజు. రాక్షసుడు. నేను అతని తమ్ముడను. నా పేరు విభీషణుడు. నా అన్న రావణుడు రాముని భార్య సీతను జనస్థానము నుండి అపహరించి తెచ్చాడు. దారిలో అడ్డుకున్న జటాయువును చంపాడు. సీతను అశోక వనములో ఉంచాడు. ఆమెకు రాక్షస స్త్రీలను కాపలా పెట్టాడు. నా అన్న రావణుడు చేసిన పని నాకు నచ్చలేదు. అది తప్పు అని చెప్పాను. సీతను రామునికి ఇచ్చివేయమన్నాను. కాని రావణుడు నా మాట వినలేదు. నన్ను అవమానించాడు. నన్ను రాజ్యములో నుండి వెళ్లగొట్టాడు. అందుకని నేను భార్యాబిడ్డలను వదిలి రాముని శరణుకోరి వచ్చాను. నా రాక గురించి రామునికి తెలుపండి. " అని గట్టిగా అరిచి చెప్పాడు విభీషణుడు.
ఈ మాటలు విన్న సుగ్రీవుడు కంగారుగా రామలక్ష్మణుల వద్దకు వెళ్లాడు. రామునికి ఈ విషయం చెప్పి, విభీషణుని రాక తెలియజేసాడు. ఇంకా ఇలా అన్నాడు. “ఓ రామా! వీడు మనకు శత్రువు. వీడిని మనము మనలో చేర్చుకుంటే గుడ్లగూబ కాకి పిల్లలను తిన్నట్టు వాడు మనలను తినేస్తాడు. కాబట్టి ఓ రామా! బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నీ నిర్ణయం మీద ఈ వానరవీరుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి. శత్రువులు ప్రయోగించు మంత్రాంగములు, వ్యూహములు, గూఢచర్యము, వీటిని గుర్తించి నిర్ణయం తీసుకో.
వీరు రాక్షసులు. కామరూపులు. కపటోపాయములు తెలిసిన వారు. అక్కడ మాయం అయి ఇక్కడ ప్రత్యక్షం అవుతుంటారు. వారి మాయలు మంత్రాలు తెలిసి ప్రవర్తించాలి మనం. వారిని ఎన్నటికీ నమ్మకూడదు. ఈ వచ్చిన వాడు రావణుని గూఢచారి అయి ఉంటాడు. వీడు మనలో చేరి, మనలో మనకు విభేదాలు కల్పించి మనలను నిర్వీర్యులుగా చెయ్యడానికే వచ్చాడు అని అనుకుంటున్నాను. లేకపోతే వీడు మనలో ఒకడుగా చేరి. మన విశ్వాసమును పొంది, మన ఆనుపానులు, మన సైనిక రహస్యములు తెలుసుకొని, రావణునికి చేరవేయగలడు.
ఓ రామా! ప్రస్తుతము విభీషణుడు అనబడే రావణుని సోదరుడు, తన నలుగురు అనుచరులతో కలిసి నీ శరణుగోరి వచ్చాడు. ఇతడు రాక్షసుడు. రావణునికి సోదరుడు. రావణుని దగ్గర నుండి
వస్తున్నాడు. ఇతనిని ఎలా నమ్మడం? కాబట్టి వీరిని పట్టి బంధించి చంపివేయడమే ఉత్తమమైన మార్గము. తరువాత మీ ఇష్టము." అని పలికి ఊరుకున్నాడు సుగ్రీవుడు.
రాముడు సుగ్రీవుడు చెప్పిన పలుకులు సావధానంగా విన్నాడు. సుగ్రీవుని పక్కనే హనుమంతుడు, మిగిలిన వానర వీరులు నిలబడి ఉన్నారు. వారందరినీ చూచి రాముడు ఇలా అన్నాడు. “మన శరణు కోరి వచ్చిన విభీషణుని గురించి సుగ్రీవుడు చెప్పిన మాటలను మీరంతా విన్నారు కదా! మీరంతా నాకు మిత్రులు, శ్రేయోభిలాషులు. మీ మాటలు నాకు ఎంతో విలువైనవి. కాబట్టి ఈ విషయంలో మీ మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి." అని అడిగాడు రాముడు.
అప్పుడు హనుమంతుడు రాముని చూచి ఇలా అన్నాడు. “రామా! నీకు తెలియని విషయములు లేవు. మేమంతా నీ శ్రేయోభి లాషులము కాబట్టి మా అభిప్రాయాలు అడుగుతున్నావు. అది నీ మంచి తనము. మాకు నీవు ఇస్తున్న మర్యాద. వానర నాయకులు ఒక్కరొక్కరుగా తమ తమ అభిప్రాయాలు నీకు వినిపిస్తారు. ముందుగా యువరాజు అంగదుడు తన అభిప్రాయాన్ని వినిపిస్తాడు.” అని అన్నాడు.
అప్పుడు అంగదుడు లేచి ఇలా అన్నాడు. “రామా! ఇతడు రాక్షసుడు. రాక్షసరాజు రావణుని వద్దనుండి వచ్చాడు. ఇతని రాక సందేహాస్పదంగా ఉంది. ఇతనిని నమ్మడానికి వీలు లేదు. కాబట్టి ఇతనిని తొందర పడి మనలో చేర్చుకొనకూడదు. ఇతనిని అన్నివిధాలా పరీక్షించాలి. ఎందుకంటే మనసులో కుటిలము పెట్టుకొన్న వారు పైకి చాలా సౌమ్యంగా కనిపిస్తారు. సమయం వచ్చినప్పుడు దారుణంగా కోలుకోలేని దెబ్బ తీస్తారు. కాబట్టి మనము ఇతని పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ విభీషణుడు మంచి వాడైతే స్వీకరించవచ్చును. ఏమాత్రం సందేహము కలిగినా ఇతనిని చంపడమే యుక్తము." అని పలికాడు అంగదుడు.
శరభుడు అనే వానరుడు ఇలా అన్నాడు. “రామా! ఇతనిని పరీక్షించడానికి ఒక సూక్ష్మ బుద్ధిగల గూఢచారిని పంపడం ఉత్తమమైన మార్గము. ఆ గూఢచారి అతనిని అన్ని విధములా పరీక్షించిన తరువాత, అతడు ఉత్తముడు అని తేలితే అతనికి శరణాగతి ఇవ్వవచ్చును. అతని ప్రవర్తన సందేహాస్పదంగా ఉంటే అతనిని విడిచిపెట్టడమే మంచిది." అని పలికాడు శరభుడు.
తరువాత జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు. “ఈ వచ్చినవాడు నీ శత్రువు రావణుని తమ్ముడు. ఇతడు శాంతి కాలంలో రాలేదు. మనము రావణునితో యుద్ధము చేయు సమయములో వచ్చాడు. కాబట్టి ఇతనిని నమ్మడానికి వీలు లేదు." అని అన్నాడు.
తరువాత మైందుడు లేచి ఇలా అన్నాడు. “ఓ రామా! ఇతడు రాక్షస రాజు అయిన రావణుని తమ్ముడు. అందుకని ఇతనిని పరుషంగా కాకుండా సరళంగా ప్రశ్నించడం మంచిది. అప్పుడు అతడు మంచివాడో చెడ్డవాడో తెలుసు కొనవచ్చును. తరువాత ఏది యుక్తమో అది చేయ వచ్చును." అని అన్నాడు.
తరువాత హనుమంతుడు లేచి ఇలా అన్నాడు. “ఓ రామా! నీవు బుద్ధిలో బృహస్పతితో సమానుడవు. నీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నీవు నా అభిప్రాయమును చెప్పమన్నావు కాబట్టి చెబుతున్నాను. నాకు ఉచితము యదార్ధము అని తోచిన విషయాలు చెబుతాను. ఇప్పుడు చెప్పిన వారిలో కొంత మంది మంత్రులు విభీషణుని రాక వలన మనకు కలుగు లాభనష్టములను గురించి మాట్లాడారు. కాని అందులో నాకు దోషము కనపడుతూ ఉంది. ఒక మనిషిలోని సామర్థ్యము తెలుసుకోవాలంటే అతనిని మనము ఏదైనా పనిలో నియోగించాలి. అతడు ఆ పనిని ఎంత చాకచక్యంతో చేస్తాడో చూడాలి. అప్పుడు అతని సమర్ధత నిర్ణయించాలి. కేవలం అతనితో మాట్లాడినంత మాత్రాన అతని సామర్థ్యము మనకు తెలియదు కదా!
కొంత మంది విభీషణుని వద్దకు గూఢచారులను పంపవలెనని చెప్పారు. అది కూడా సరికాదు. గూఢచర్యము ఎదుటి మనిషికి తెలియకుండా చెయ్యాలి. మన ఎదురుగా ఉన్న వారి మీద గూఢచర్యము ఎలా చెయ్యగలము. మరి కొందరు ఏమన్నారంటే, విభీషణునికి మనం శత్రువులం. పైగా ఇది యుద్ధసమయం. కాబట్టి దేశంకాని దేశానికి, కాలం కాని కాలంలో వచ్చాడు కాబట్టి విభీషణుని తిరస్కరించాలి అని అన్నారు. అది కూడా సరి కాదు. ఎందుకంటే మనిషిని బట్టి అవసరాన్ని బట్టి దేశ,కాలములు మారుతుంటాయి. ఇతడు రావణుని దుర్మార్గమును, నీతి బాహ్యమైన చర్యలను చూచి విసిగిపోయి మనదగ్గరకు వచ్చాడేమో! అటువంటప్పుడు ఏసమయంలో వచ్చాడు మనము ఎక్కడ ఉండగా వచ్చాడు అన్న ప్రశ్న తలెత్తదు కదా!
మరి కొంత మంది ఇలా అన్నారు. విభీషణునికి తెలియని కొంత మందిని పంపి అతనిని ప్రశ్చించి నేర్పుగా అతని రహస్యములను రాబట్టాలి అని అన్నారు. అది కూడా సరి కాదు. విభీషణుని వద్దకు పోయి అతని గురించి అడిగితే, విభీషణుడు ఆ ప్రశ్నలు అడిగిన వాడి గురించి అనుమాన
పడవచ్చు కదా! విభీషణుడు విముఖుడై వెళ్లిపోతే, మనము ఒక మంచి మిత్రుడిని పోగొట్టుకున్నవాళ్లము అవుతాము కదా!
ఓ రామా! ఎదుటి వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో, ఏ కంఠస్వరంతో మాట్లాడుతున్నారో, మాట్లాడేటప్పుడు ఎటువంటి హావభావాలు ప్రదర్శిస్తున్నారో సునిశితంగా పరిశీలిస్తే తప్ప, ఎదుటి వాళ్ల మనసులోని భావాలను కనిపెట్టలేము. విభీషణుడు తన గురించి చెప్పినప్పుడు నేను అతనిని నిశితంగా పరిశీలించాను. అతని మాటల్లో ఎలాంటి దుష్టభావన నాకు కనపడలేదు. అతనిలో నాకు ఎలాంటి కపటము కనపడలేదు. పైగా మనసులో కపటబుద్ధికలవాడు, అంత ధైర్యంగా మనదగ్గరకు రాడు. కాబట్టి అతనిని గురించి అనుమాన పడవలసిన అవసరము లేదు.
అదీకాకుండా, ఓ రామా! మనసులో భావాలను బయట పడకుండా దాచడం అంత సులభంకాదు. ఎందుకంటే, మనసులో మెదులుతున్న భావనలను శరీరం బలవంతంగానైనా బయటకు ప్రకటిస్తుంది. (ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్న విషయాన్ని వాల్మీకి మహర్షి మనకు త్రేతాయుగంలోనే రామాయణ కావ్యంలో చెప్పాడు.) విభీషణుడు సరి అయిన కాలములోనే మన వద్దకు వచ్చాడు. తన అన్న రావణునితో విభేదించి వచ్చాడు. తన అన్న రావణునికి శత్రువైన నీ వద్దకు వచ్చాడు. నీ గురించి బాగా తెలుసుకొని నీ వల్ల ప్రయోజనం పొందడానికి వచ్చాడు.
నీవు వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు పట్టాభిషిక్తుడిని చేసావు. వాలిని చంపిన నీవు, రావణుని కూడా చంపి తనను లంకకు పట్టాభిషిక్తుని చేస్తావనే ఆలోచనతో, ఆశతో, విభీషణుడు నీ వద్దకు
వచ్చాడు. లంకకు రాజు కావాలనే కాంక్షతోనే విభీషణుడు నీ వద్దకు వచ్చాడు. అతనిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే, మనకు విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ రాక్షసుడు, విభీషణుడు, నమ్మదగినవాడు. ఇతనిలో ఏ దుర్బుద్దీ లేదు. అని నా భావన. తరువాత మీ ఇష్టము."అని యుక్తియుక్తముగా పలికి కూర్చున్నాడు హనుమంతుడు.
వచ్చాడు. లంకకు రాజు కావాలనే కాంక్షతోనే విభీషణుడు నీ వద్దకు వచ్చాడు. అతనిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే, మనకు విజయం చేకూరుతుంది. కాబట్టి ఈ రాక్షసుడు, విభీషణుడు, నమ్మదగినవాడు. ఇతనిలో ఏ దుర్బుద్దీ లేదు. అని నా భావన. తరువాత మీ ఇష్టము."అని యుక్తియుక్తముగా పలికి కూర్చున్నాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
యుద్ధకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment