శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 47)
శ్రీమద్రామాయణము సుందర కాండము నలుబది ఏడవ సర్గ పట్టుదల, కోపము, అహంకారమూ మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కానీ, రాక్షసుడు కానీ యుక్తాయుక్త వివేచన కోల్పోతాడు. రావణుని పరిస్థితి అలాగే ఉంది. వచ్చిన వానరుడు ఒక్కడు. చచ్చిన వాళ్లు వేలకు వేలు. కారణం ఏమిటి? ఆలోచించలేదు. జంబుమాలి చచ్చాడు. ఏడుగురు మంత్రి కుమారులు వధింపబడ్డారు. ఐదుగురు సేనాపతులు పరలోక గతులయ్యారు. కానీ రావణునికి బుద్ధిరాలేదు. అసలు విషయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు. ఐదుగురు సేనాపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చుని ఉన్న తన కుమారుడు అక్ష కుమారుని వంక చూచాడు రావణుడు. తండ్రి అభిప్రాయాన్ని అర్ధం చేసుకున్నాడు అక్ష కుమారుడు. పైకి లేచాడు. అపార సేనావాహినితో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి ఎనిమిది గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆప శక్యం కాదు. ఆ రథము భూమి మీద ఆకాశంలోనూ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షకుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస...