శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 32)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ముప్పది రెండవ సర్గ
శింశుపా వృక్షము చెట్ల ఆకుల మాటున, ఆకు పచ్చని శరీర ఛాయతో, తెల్లని వస్త్రమును ధరించి, రామకథను గానం చేసిన హనుమంతుని చూచింది సీత. ఆలోచనలో పడింది. చూడబోతే కోతి. మహాభయంకరంగా ఉన్నాడు. ఆ కోతి ముఖం తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. కానీ రామ కధను గానం చేసాడు. ఏమీ అర్థం కాలేదు సీతకు. ఆమెలో భయం ప్రవేశించింది. “రామా! రామా! ఏంటి నాకీ పరీక్ష ఇతను ఎవరు? ఎందుకొచ్చాడు? నీ చరిత్ర ఎందుకు గానం చేసాడు. కొంపదీసి నేను కలగంటున్నానా! ఇదీ కలా! నిజమా!" అని మనసులోనే మధనపడసాగింది. మరలా తల పైకి ఎత్తి హనుమంతుని వంక చూచింది.(ఒకసారి మాయ లేడి విషయంలో మోసపోయి అంతులేని కష్టాల్లో ఇరుక్కుంది. అందుకే ఎవర్ని నమ్మడం లేదు సీత.)
సీత తన గురించి ఏమి అనుకుంటూ ఉందో అని సీత వంక తదేకంగా చూస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుని చూపులు చూచి సీతకు పైప్రాణాలు పైనే పోయాయి. కాసేపు స్పృహ తప్పినట్టయింది. అంతలోనే తేరుకుంది. సీతకు హనుమంతుడు కనపడటం స్వప్నంలాగా అనిపించింది.
“వికృతమైన వానరము కలలో కనిపిస్తే మంచిది కాదంటారు. నా రామునికి, లక్ష్మణునికి, నా తండ్రి జనకునికి ఏమీ కాకూడదు. భగవంతుడు వారి నందరినీ క్షేమంగా చూడాలి.” అని అనుకొంది. కాని అంతలోనే సీతకు మరో సందేహము వచ్చింది.
“స్పప్నములు నిద్రలో వస్తాయి కదా! నిత్యము కష్టాలు తలచుకుంటూ దు:ఖించే నాకు నిద్రే రానపుడు ఇంక కల రావడం ఏమిటి? కాబట్టి ఇది కలకాదు. నేను సదా రామ నామమును జపిస్తూ ఉంటడం వలన, నాకు ఎవరు ఏమి మాట్లాడినా రామ కధలాగానే వినిపిస్తూ ఉంది. ఇదంతా నా భ్రమ" అని అనుకొంది సీత.
అంతలోనే మరొక సందేహము. “ఇది భ్రమ అయితే మరి ఎదురుగా కనపడుతున్న ఆ వానరము సంగతేమిటి? మనసులో అనుకొన్నది, కలలో కనిపించింది, రూపం ధరించి ఎదురుగా కనపడుతుందా! నాకు ఈ వానరము కనపడుతూ ఉంది కదా! పైగా ఈ వానరుడు మానుష భాషలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఏమనాలి? అతడు ఎవరైనా కానీ, అతడు చెప్పిన మాటలు సత్యం కావాలి. నాకు నా రామునకు శుభం జరగాలి." అని మనసులోనే బ్రహ్మదేవునికి, ఇంద్రునికి, సమస్త దేవతలకు నమస్కరించింది సీత.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment