శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 33)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ముప్పది మూడవ సర్గ

సీత పడుతున్న మనోవేదనను గమనించాడు హనుమంతుడు. ఇలా కాదనుకున్నాడు. చెట్టు దిగాడు. సీత ముందు నిలబడ్డాడు. రెండు చేతులు జోడించి తల మీద పెట్టుకొని వినయంగా నమస్కారం చేసాడు. సీతతో ఇలా అన్నాడు.

“అమ్మా! మీరు ఎవరు? మీ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంది. కాని మాసిన చీర కట్టుకొని ఉన్నారు. ఈ చెట్టు కొమ్మను పట్టుకొని నిలబడి ఉన్నారు. మీరు ఎవరు? మీ రెండు కళ్లనుండి నిరంతరమూ నీళ్లు కారుతున్నాయి. ఎందుకు దు:ఖిస్తున్నారు. నీవు ఏ జాతికి చెందిన స్త్రీవి. దేవకాంతవా! రాక్షస కాంతవా! గంధర్వ కాంతవా! నాగదేవతవా! యక్షిణివా! లేక కిన్నెర కాంతవా! పోనీ రుద్రగణములు, మరుత్ గణములు, వసుగణములు, ఈ గణములకు చెందిన కాంతవా!
నీవు మానవ కాంతవు కావు. దేవతా స్త్రీవి అని అనిపిస్తూ ఉంది. స్వర్గం నుండి భూమికి దిగిన అప్సరసవా! వసిష్టుని భార్య అరుంధతివి కాదు కదా! నీ భర్త మీద కోపంతో ఆయనను వదిలి వచ్చి ఆయన కోసం దు:ఖిస్తున్నావా! లేక పోతే నీ వాళ్లు ఎవరన్నా చనిపోతే వారి కోసరం ఏడుస్తున్నావా! ఆ చనిపోయింది నీ కొడుకా, భర్తా, సోదరుడా లేక నీ తండ్రియా! ఎందుకోసం ఏడుస్తున్నావు?
నీవు ఏడవడం చూస్తుంటే నీవు దేవతా స్త్రీవి కాదని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దేవతలకు ఏడుపురాదు కదా! మరి రాజలక్షణములు కలిగిన మానవ కాంతవా! నీ ముఖ కళవళికలు, నీ శరీర లక్షణాలను బట్టి నీవు క్షత్రియ కాంతవనీ, చక్రవర్తి భార్యవు అనీ నాకు అనిపిస్తూ ఉంది. అవునూ! నువ్వు జనస్థానము నుండి రావణుడు అపహరించి తీసుకొని వచ్చిన సీతవు కావు కదా! నీ ముఖంలో కనపడుతున్న దీనత్వము, శోకము, నీ శరీర సౌందర్యము, నీ పవిత్రత చూస్తుంటే నీవు రాముని భార్య సీత అని నాకు అనిపిస్తూ ఉంది. నీవు రాముని భార్య సీతవే కదా! " అని ఊరుకున్నాడు హనుమంతుడు. సీతకు ఇంక తన గురించి తాను చెప్పుకోక తప్పలేదు. హనుమంతుని చూచి ఇలాఅంది.

"అవును. నువ్వు చెప్పింది నిజమే. నేను దశరథమహారాజు కోడలిని. విదేహ మహారాజు జనకుని కూతురిని. రాముని భార్యను సీతను. నా వివాహము అయిన తరువాత నేను అయోధ్యలో పన్నెండు సంవత్సరములు నా భర్తతో సకల రాజభోగములు అనుభవించాను. పదమూడవ సంవత్సరంలో దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకము చేయ నిశ్చయించాడు. రాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతుంటే, దశరథుని మూడవ భార్య కైక దశరథునితో "రామునికి పట్టాభిషేకము జరిగితే నేను ఆహారము నీరు ముట్టను. బలవంతంగా ప్రాణం తీసుకుంటాను. నీవు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోదలచుకుంటే రాముని పదునాలుగేళ్లు అడవులకు పంపు. " అని శపధం చేసింది.

ఆమాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. మూర్ఛనుండి తేరుకొని, రామునికి వారసత్వంగా సంక్రమించిన రాజ్యాధికారమును తిరిగి తనకు ఇవ్వమని రాముని అడిగాడు దశరథుడు. రాజ్యపట్టాభిషేకము కంటే కూడా తండ్రి మాటకు విలువ ఇచ్చాడు రాముడు. ఒకరికి ఇవ్వడమే కానీ, ఎవ్వరినుండీ ఏదీ తీసుకోని రాముడు, తనకు సంక్రమించిన రాజ్యాధికారమును దశరథునికి ఇచ్చివేసాడు. రాజ్యాధికారమును త్యజించిన రాముడు నార చీరలు ధరించి అడవులకు బయలు దేరాడు. రాముడు లేనిదే నేను బతుకలేనని, నేను కూడా రాముని వెంట అడవులకు బయలుదేరాను. అన్నగారికి రక్షణగా రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అడవులకు వచ్చాడు.

ఆ ప్రకారంగా మేము ముగ్గురము అరణ్యవాసము చేస్తున్నాము. మేము ముగ్గురమూ దండకారణ్యములో ఉండగా, రావణుడు అనే రాక్షసుడు నన్ను అపహరించాడు. ఇప్పుడు రావణుడు నాకు రెండుమాసములు సమయము ఇచ్చాడు. రావణుడు ఇచ్చిన రెండుమాసములు గడువు తరువాత నేను ప్రాణత్యాగము చేస్తాను.” అని తన గురించి క్లుప్తంగా చెప్పింది సీత.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)