శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 34)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ముప్పది నాలుగవ సర్గ

సీత పలికిన పలుకులు అన్నీ శ్రద్ధగా విన్నాడు హనుమంతుడు. సీతతో ఇలా అన్నాడు.
“ఓ వైదేహీ! నేను రాముడు పంపగా దూతగా నీ వద్దకు వచ్చాను. రాముడు క్షేమంగా ఉన్నాడు. నీ క్షేమ సమాచారములు తెలుసుకొని రమ్మని రాముడు నన్ను నీ వద్దకు పంపాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయన పక్కనే ఉన్నాడు. లక్ష్మణుడు కూడా నీకు తన అభివాదములు తెలుపమన్నాడు." అని అన్నాడు హనుమంతుడు.

రామలక్ష్మణుల క్షేమవార్తలు విన్న సీత ఆనందంతో పొంగి పోయింది. “మానవుడు బతికి ఉంటే నూరు సంవత్సరములకైనా క్షేమకరమైన వార్తలు వింటాడు అని లోకోక్తి. నేను ఇన్నిరోజుల నుండి రాముని క్షేమ వార్తల కోసరము ఎదురు చూస్తున్నాను. నీ వలన రామలక్ష్మణుల క్షేమము గురించి తెలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది." అని పలికింది సీత.

హనుమంతుడు ఆమె దగ్గరగా వెళ్లాడు. హనుమంతుడు దగ్గర దగ్గరగా రావడం చూచి మరలా సీత మనసులో అనుమానం పొడసూపింది. వీడు మారువేషములో ఉన్న రావణుడు కాదు కదా!
అని అనుమానించింది.

"అయ్యో! నేనెంత మందమతిని. నా విషయాలన్నీ అనవసరంగా ఇతనికి చెప్పాను. ఇతడు మాయ వేషంలో వచ్చిన రావణుడు. సందేహం లేదు. లేకపోతే నా దగ్గరగా ఎందుకు వస్తాడు. నేను ఇతనికి దూరంగా ఉండాలి." అనీ సీత దూర దూరంగా జరిగి కూర్చుంది.

హనుమంతునికి ఏమీ తోచలేదు. సీతమ్మ తనను అనుమానిస్తూ ఉంది. ఆ అనుమానం తీర్చడం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు. రెండు చేతులు ఎత్తి సీతమ్మకు నమస్కారం పెట్టాడు అంతకన్నా ఏమీ చెయ్యలేక. కాని సీత భయంతో వణికి పోతూ ఉంది. కాని తనకు నమస్కరించుచున్న హనుమను చూచి సీత భయం కొద్దిగా తగ్గింది. రావణుడు అయితే నమస్కరించడు కదా! అని అనుకొంది. అందుకని హనుమతో ఇలాఅంది.

"అయ్యా! నీవు ఎవరవో నాకు తెలియదు. నీవు కనుక మాయావేషంలో వచ్చిన రావణుడివే అయితే వెంటనే వెళ్లిపో. నా నిర్ణయం నీకు ముందే చెప్పాను. మరలా మరలా వచ్చి నాబాధను పెంచకు. నీకు మంచిది కాదు. నువ్వు ఎవ్వరవో నాకు బాగా తెలుసు. నేను ఆశ్రమంలో ఉండగా పవిత్రమైన సన్యాసి రూపంలో వచ్చావు. నన్ను అపహరించావు. ఇప్పుడు ఈ వానర రూపంలో వచ్చావు. నువ్వు ఆ రావణుడివే. సందేహము లేదు. ఇలా మాటి మాటికీ వచ్చి నన్ను ఎందుకు బాధ పెడతావు. నీ వంటి వాడికి ఒక స్త్రీ కోసరం ఇలా చెయ్యడం మంచిది కాదు. శోభనివ్వదు." అని దూరంగా జరిగింది. కాని అంతలోనే మరొక ఆలోచన సీతమ్మ మదిలో మెదిలింది. తనలో తాను అనుకుంటున్నట్టు బయటకు అనుకుంది.

“కాని, ఎందుకో, నా మనస్సులో, నువ్వు రావణుడివి కాదు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొదట నిన్ను చూడగానే నా మనసులో అనుకోకుండా నాకు ఆనందం కలిగింది. రావణుని చూస్తే నాకు అసహ్యము తప్ప ఆనందం కలుగదు. నీవు చెప్పినట్టు నీవు రాముని దూతగా వచ్చినట్టయితే చాలా సంతోషము. నీవు గానం చేసిన రామ కథ నాకు చాలా ఇష్టము. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు.

ఓ బాల వానరమా! నాకు ఇంకా రాముని గురించి చెప్పవా! విని సంతోషిస్తాను. నాకు ఇదంతా ఒక స్వప్నము వలె తోస్తూ ఉంది. ఎంతో కాలము కింద రావణునిచేత అపహరింపబడిన నాకు
దు:ఖభారంతో నిద్రపట్టడంలేదు. స్వప్నములు కూడా రావడంలేదు. కనీసం స్వప్నములో అయినా రాముడు నాకు కనపడితే ఆ ఆనందంతో నేను రాముని కొరకు ఎంత కాలము అయినా వేచి ఉంటాను. నాకు ఆ భాగ్యము లేదు. కానీ ఇప్పుడు రామదూతగా నువ్వు కనపడు తున్నావు. ఇది స్వప్నము అయినా నిజము అయినా నాకు సంతోషమే!" అని పలికింది.

అంతలో మరలా తనలో తాను ఇలా అనుకొంది. 

“నాకేమైనా పిచ్చి పట్టిందా! వీడితో ఇలా మాట్లాడుతున్నాను. లేక ఉన్మాదంతో ఇలా పలికానా! కాదు కాదు. నాకు ఏమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. నేను నేనే. నా ఎదుట ఈ వానరము నిలబడి ఉంది. నేను మంచి స్పృహలోనే ఉన్నాను. ఎలాంటి ఉన్మాదస్థితిలో లేను. నా ఎదుట ఉన్నది నిజంగా వానరమే.” అని పరి పరి విధాలా ఆలోచించింది.

కానీ ఆమె మనసుకు ఎందుకో హనుమంతుని నమ్మ బుద్ధికావడంలేదు. “సందేహం లేదు. వీడు వానరరూపంలో వచ్చిన రావణుడే." అని నిర్ధారించుకుంది సీత. వీడు రావణుడు అయినప్పుడు వీడితో మాట్లాడటం అనవసరము అని హనుమతో మాట్లాడకుండా ఉంది. 

సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు సీత మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టాడు. సీత తనను నమ్మడం లేదు అని నిర్ధారించు కున్నాడు. ఇప్పుడు రాముని గురించి చెప్పడం, రాముని స్తుతించడం తప్ప వేరు మార్గం లేదు అని అనుకొన్నాడు. సీత వినేట్టు ఇలా అంటున్నాడు.

“రాముడు ఎంత తేజోవంతుడు. ఆయన తేజస్సు సూర్యుని తేజస్సుతో సమానమైనది. అంతే కాదు రాముడు చంద్రుని వలె చల్లని వెన్నెల వంటి తన చూపులతో లోకాలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. రాముడు కుబేరుని వలె గొప్ప ఐశ్వర్యవంతుడు. విష్ణువు వలె గొప్ప కీర్తి కలవాడు. రాముడు ఎల్లప్పుడూ సత్యములే పలుకుతాడు. బృహస్పతి వలె బుద్ధిమంతుడు. మంచి రూపవంతుడు. మన్మధునికి రూపం వస్తే ఎలా ఉంటాడో అలా ఉంటాడు రాముడు. రామునికి సాధారణంగా కోపం రాదు. సంహరించవలసిన వారిని సంహరించవలసినపుడు, కోపం తెచ్చుకుంటాడు. ఆ కార్యం అయిపోగానే మరలా కోపాన్ని విడిచిపెడతాడు. రాముడు గొప్ప ధనుర్ధారి. మహారథుడు.

ఓ సీతమ్మ తల్లీ! ఈ తుచ్ఛుడైన రావణుడు మాయా మృగమును ప్రయోగించి నీ రాముని దూరంగా పంపి, నిన్ను అపహరించాడు కదా! ఈ రావణునికి ఎట్టి దుర్గతి పట్టబోతూ ఉందో కళ్లారా చూస్తావు. 

ఓ సీతమ్మ తల్లీ! ఏ రాముడైతే అతి త్వరలో లంకకు వచ్చి తన బాణములతో రావణుని చంపి నిన్ను రక్షిస్తాడో ఆ రాముడే నన్ను నీ వద్దకు పంపాడు. నన్ను నమ్ము. రాముడు నిన్ను తలచుకుంటూ నీ వియోగముతో చాలా బాధపడుతున్నాడు. నీ క్షేమము గురించి తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు.

రాముడు వానరరాజు అయిన సుగ్రీవునితో స్నేహము చేసాడు. ఆ సుగ్రీవుడు కూడా నీ క్షేమము అడగమన్నాడు. మా అందరి అదృష్టము కొద్దీ నీవు రాక్షసుల చెరలో ఉన్ననూ జీవించి ఉన్నావు. రామ, లక్ష్మణ, సుగ్రీవులు అనుక్షణం నిన్ను తలచుకుంటూ నీ గురించి ఆందోళనపడుతున్నారు. నీకు ఈ చెర ఎంతో కాలము ఉండదు. కోట్లాది వానర వీరులతో రామలక్ష్మణులు, సుగ్రీవుడు లంకకు వచ్చి, రావణుని చంపగలరు.

నేను వానర రాజు సుగ్రీవుని మంత్రిని. నా పేరు హనుమంతుడు. ఇది నా నిజస్వరూపము కాదు. హ్రస్వ స్వరూపము. నేను నూరుయోజనముల దూరం ఉన్న సముద్రమును దాటి ఈ లంకలో ప్రవేశించాను. నిన్ను చూడటానికి ఇక్కడకు వచ్చాను. రావణుడు ఇక్కడకు రాక ముందు నుంచే ఈ చెట్టు మీద ఉన్నాను. రావణుడు పలికిన పలుకులు, ఈ రాక్షసస్త్రీల బెదిరింపులు అన్నీ
విన్నాను.

ఓ సీతాదేవీ! ఇప్పటికైనా నన్ను నమ్ము. నేను రావణుడను కాను. వానరుడను. నీ సందేహమును విడిచి పెట్టు." అని పలికాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము మప్పది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)