శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 35)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ముప్పది ఐదవ సర్గ

హనుమంతుడు ఎన్ని చెప్పినా సీత మనసులో ఉన్న సందేహము తీరడం లేదు. ఏమో! మరలా తాను మోసపోతున్నానేమో! అని మనసులో మథనపడుతూ ఉంది సీత. అందుకని హనుమంతునితో ఇలా అంది.

“నీవు రాముని వద్దనుండి వచ్చాను అన్నావు కదా! నీవు రాముని ఎప్పుడు కలిసావు. నీకూ రామునికి సంబంధము ఎలా కలిగింది? నీకు లక్ష్మణుడు ఎలా తెలుసు? మీరు వానరులు. రామలక్ష్మణులు నరులు, వారికీ మీకూ స్నేహం ఎలా కుదిరింది? నువ్వు రాముని, లక్ష్మణుని, నిజంగా చూస్తే రాముడు ఎలా ఉంటాడు. లక్ష్మణుడు ఎలా ఉంటాడు. వివరించి చెప్ప. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను." అని అడిగింది సీత.

సీతతో హనుమంతుడు ఇలా చెప్పసాగాడు. “నీకు రాముని గురించి బాగా తెలుసు కాబట్టి రాముని రూపు రేఖల గురించి అడుగుతున్నావు. నేనూ రాముని చూచాను కాబట్టి రాముని గురించి
చెబుతాను విను. రాముని కన్నులు కమలముల వలె ఉంటాయి. రాముడు మనోహరుడు. అందరి మనస్సులనూ తన మంచితనంతో హరించేవాడు. మంచి రూపవంతుడు. మంచి నేర్పుకలవాడు. ఇంకా రాముడు తేజస్సులో సూర్యునితోనూ, బుద్ధిలో బృహస్పతి తోనూ, ఓర్పులో భూదేవితోనూ, కీర్తిలో దేవేంద్రునితోనూ సమానుడు. రాముడు తన పరాక్రమంతో తన వారిని రక్షిస్తాడు. శత్రువులను సంహరిస్తాడు. ఈ లోకంలో ఉన్న నాలుగు వర్ణముల వారిని సమానముగా రక్షిస్తాడు. అన్ని వర్ణముల వారికీ కట్టుబాట్లు ఏర్పరచి జనులందరూ ఆ కట్టుబాట్ల ప్రకారము నడుచుకొనేటట్లు చేస్తాడు. రాముడికి ఏపనికి ఏ ఫలితము వస్తుందో తెలుసు. అందుకని సత్కర్మలనే ఆచరిస్తాడు. రాముడు రాజనీతిజ్ఞుడు. బ్రాహ్మణులను గౌరవిస్తాడు. రాముడు సకల విద్యలు నేర్చినవాడు. మంచి వినయము కలవాడు. రాముడు యజుశ్శాఖాధ్యాయి. వేదములు చదివిన వారిచేత పూజింపబడేవాడు. వేద, వేదాంగములను చదివినవాడు. విశేషించి ధనుర్వేదమును చక్కగా అభ్యాసించాడు.

రాముడు ఆజానుబాహుడు. విశాలమైన భుజములు కలవాడు. రాముడు శ్యామవర్ణములో ఉంటాడు. రాముడు విశాలమైన వక్షస్థలము కలవాడు. దీర్ఘబాహుడు. రామునికి అన్ని అవయవములు సమానంగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. రాముని పొట్టమీద మూడు రేఖలు ఉన్నాయి. సాముద్రిక శాస్త్రములో చెప్పబడిన శుభలక్షణములు అన్నీ రాముని హస్తరేఖలలో పాద ముద్రలలో ఉన్నాయి. రాముడు నడుస్తుంటే సింహము, ఏనుగు, ఎద్దు నడిచినట్టు ఉంటుంది. రాముని శరీర అవయవములు అన్నీ గుండ్రంగా పద్మము ఆకారంలో ప్రకాశిస్తూ ఉంటాయి. రాముని తేజస్సు, కీర్తి, సంపద మూడులోకములలో ప్రసిద్ధిచెందాయి.

రాముని యొక్క మాతృవంశము పితృవంశము పునీతమైనవి. రాముడు పురుషార్థములైన ధర్మ, అర్థ, కామ, మోక్షములను చక్కగా పాటిస్తాడు. రాముడు సత్యము పలకడం లోనూ, ధర్మాచరణంలోనూ ఆసక్తి కలవాడు. రాముడు తన శరణు కోరిన వారిని అనుగ్రహిస్తాడు. రామునికి యుక్తాయుక్త జ్ఞానము ఎక్కువ. రాముడు అందరితోనూ చాలా ప్రియంగా మాట్లాడతాడు. ఇంక లక్షణుడు పరాక్రమ వంతుడు. ఇప్పటి వరకూ ఎవరిచేతిలోనూ ఓడిపోలేదు. రామలక్ష్మణులు నీ కోసం వెదుకుతూ మా దగ్గరకు వచ్చారు. నిన్ను చూడాలని ఆతురత పడుతున్నారు. నేను, మా రాజు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతము మీద ఉంటాము. రాముడు, లక్ష్మణుడు నిన్ను వెతుక్కుంటూ ఋష్యమూక పర్వతము వద్దకు వచ్చారు. మేము వారిని చూచాము. మా మహారాజు సుగ్రీవుడు తన అన్న వాలితో రాజ్యము నుండి తరిమివేయబడ్డాడు. రాజ్యభ్రష్టుడైన సుగ్రీవుని మేము సేవిస్తున్నాము. ఆ సమయంలో నారచీరలు కట్టుకొని ధనుస్సు, బాణములు చేతులలో ధరించి వస్తున్న రామలక్ష్మణులను నేను సుగ్రీవుడు చూచాము. సుగ్రీవుడు వారిని చూచి భయపడి కొండశిఖరము ఎక్కికూర్చున్నాడు. నన్ను రామలక్ష్మణుల వద్దకు పంపాడు. నేను రామలక్ష్మణుల వద్దకు వెళ్లి నమస్కరించాను. సుగ్రీవుని గురించి జరిగింది జరిగినట్టు చెప్పాను. నేను వారిని నా వీపు మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్లాను.

రాముడు సుగ్రీవుడు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఒకరి కష్టసుఖములు మరొకరితో పంచుకున్నారు. ఇద్దరికీ మైత్రి కుదిరింది. ఇద్దరూ ఒకే విధమైన దుఃఖములో ఉన్నారు. రాముని భార్య సీతను రావణుడు అపహరించాడు. సుగ్రీవుని భార్య రుమను అతని అన్న వాలి లాక్కున్నాడు. రామునికి రాజ్యము పోయింది. సుగ్రీవుడు కూడా రాజ్యభ్రష్టుడు అయ్యాడు. ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఓ సీతమ్మ తల్లీ! నిన్ను రావణుడు అపహరించి తీసుకొని పోవునపుడు నీవు నీ ఉత్తరీయమును చించి నీ ఆభరణములను మూటకట్టి కింద జారవిడిచావు. ఆ మూట అదృష్టవశాత్తు మా దగ్గర పడింది. మేము ఆ మూటను రామునికి చూపించాము. ఆ ఆభరణములను చూచి రాముడు మూర్ఛపోయాడు. నిన్ను తలచుకుంటూ పరిపరివిధముల శోకించాడు. ఆ ఆభరణములు అప్పటిదాకా అణచుకొన్న రాముని శోకాగ్నిని మరలా ప్రజ్వరిల్లజేసాయి. మేము రాముని మా శాయశక్తులా ఓదార్చాము. అప్పటినుండి రాముడు నిన్ను తలచుకుంటూ, నీ ఆభరణములను చూస్తూ ఏడుస్తున్నాడు. రాముడు నిద్ర ఆహారములను విడిచి పెట్టి నిన్నే తలచుకుంటున్నాడు. 

ఓ సీతమ్మ తల్లీ! రాముడు వెంటనే వచ్చి రావణుని సంహరించి నిన్ను చేరుకుంటాడు. రాముడు, సుగ్రీవుడు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము రాముడు వాలిని చంపి, సుగ్రీవునికి రాజ్యమును, అతని భార్యను ఇప్పించాలి. దానికి బదులుగా సుగ్రీవుడు నీ కోసం వానరులను పంపి వెతికించి, నీ జాడ తెలుసుకొనాలి. తరువాత రావణుని ఓడించి నిన్ను పొందడంలో రామునికి సాయపడాలి.

ఆ ఒప్పందము ప్రకారము రాముడు వాలిని చంపి, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేసాడు. అతని భార్య రుమను అతనికి అప్పగించాడు. సుగ్రీవుడు తన ఒప్పందము ప్రకారము నిన్ను వెదకడానికి వానర వీరులను నాలుగు దిక్కులకు పంపాడు. నన్ను ఇంకా కొంతమంది వానరులను నిన్ను వెదకడానికి దక్షిణ దిశగా పంపాడు. వాలి కుమారుడు అంగదుడు మాకు నాయకుడు. సుగ్రీవుడు మాకు మాసము రోజులు గడువు ఇచ్చాడు. నిన్ను వెదుకుతూ మేము వింధ్యపర్వత ప్రాంతములో ఒక బిలములో దారి తప్పాము. అక్కడే చాలారోజులు గడిచిపోయాయి. నీ జాడ తెలియలేదు. మాకు సుగ్రీవుడు ఇచ్చిన గడువు దాటిపోయింది. ఒట్టి చేతులతో వెళితే సుగ్రీవుడు మాకు మరణదండన విధిస్తాడు. అందుకని మేము ప్రాయోపవేశము చేయాలని నిర్ణయించుకున్నాము.

ఆ సమయంలో మా దగ్గరకు ఒక పక్షిరాజు వచ్చాడు. ఆయన పేరు సంపాతి. ఆయన జటాయువుకు సోదరుడు. రామలక్ష్మణుల నుండి మేము, నిన్ను రావణుడు అపహరించడం, జటాయువును రావణుడు చంపడం గురించి విని ఉన్నాము. ఆ విషయం మేము సంపాతికి చెప్పాము. సంపాతికి తన సోదరుని చంపిన రావణుని మీద కోపం వచ్చింది. నీవు రావణుని ఆలయము నందు ఉన్నట్టు సంపాతి మాకు చెప్పాడు.

ఆ మాటలు విన్న మేము, అంగదుడు అక్కడి నుండి బయలేదేరాము. సముద్ర తీరము చేరుకున్నాము. కాని విశాలమైన సముద్రమును చూడగానే దానిని ఎలా దాటాలి అని అందరం చింతిస్తున్నాము. నేను మాత్రము నా శక్తి యుక్తులు ఉపయోగించి, నూరుయోజనముల దూరం ఉన్న సముద్రమును లంఘించాను. రాత్రి లంకలో ప్రవేశించాను. లంక అంతా గాలించాను. రావణుని అంత:పురము అంతా వెతికాను. నీవు కనపడలేదు. ఈ అశోక వనమును వెతుకుతుంటే నీవు కనిపించావు. ఇదీ జరిగింది.

నేను వాయుదేవుని కుమారుడను. రాముని దూతను. సుగ్రీవుడు పంపగా ఇక్కడకు వచ్చాను. కానీ మాయావి రావణుని కాను. నన్ను నమ్ము. నీ భర్త రాముడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారు. నేను కూడా కామ రూపుడను. నా ఇష్టం వచ్చిన రూపం ధరించగలవాడను. ఇప్పుడు ఈ చిన్ని వానరరూపంలో ఉన్నాను. నేను వెంటనే వెళ్లి సముద్రము ఆవల ఒడ్డున ఉన్న వానరులకు నీ గురించి చెప్పి వారి దు:ఖమును తొలగించాలి. నీ కోసం లంక అంతా గాలించి నీవు కనపడకపోతే నేను కూడా ప్రాయోపవేశము చేద్దామని నిర్ణయించుకున్నాను. కానీ నేను సముద్రమును లంఘించి లంకకు చేరుకోడానికి పడ్డ శ్రమ వృధా కాలేదు. నిన్ను చూడగలిగాను. నేను చాలా అదృష్టవంతుడను. నాకు చాలా సంతోషంగా ఉంది.

నా తండ్రి పేరు కేసరి. నా తండ్రి దేవతలు, ఋషుల కోరిక మేరకు శంబసాదనుడు అనే రాక్షసుని చంపాడు. నేను నా తండ్రి భార్య అయిన అంజనా దేవికి, వాయుదేవుని వలన జన్మించాను. ఇందుని వజ్రాయుధ దెబ్బకు నా దవడ విరిగిపోవడంతో నాకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఓ సీతాదేవీ! నీకు నమ్మకం కలిగించడానికి నీకు ఇదంతా చెప్పాను. తరువాత నీ ఇష్టము.” అని చెప్పి ఊరుకున్నాడు హనుమంతుడు.

హనుమంతుడు చెప్పిన విషయములను సావధానంగా విన్న సీతకు హనుమంతుని మీద నమ్మకం కుదిరింది. చాలారోజులకు సీత కంటి వెంట ఆనందభాష్పములు రాలాయి. సీత ముఖము ఆనందంతో వెలిగిపోయింది. హనుమంతుడు నిజంగా వానరుడేననీ, మాయారూపంలో ఉన్న రాక్షసుడు కాదనీ నమ్మింది.

సీత ముఖకళవళికలు చూచిన హనుమంతుడు సీత తనను నమ్మినట్టు ధృవపరచుకొన్నాడు. అప్పుడు సీతతో ఇలా అన్నాడు.

“సీతాదేవీ! జరిగినది అంతా నీకు చెప్పాను కదా! నేను నీకు ఇంకా ఏమి చెయ్యాలో చెప్పు. ఇంక నేను రాముని వద్దకు వెళ్లాలి. నీ గురించి రామునికి తెలియజెయ్యాలి." అని అన్నాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందరకాండము ముప్పది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)