శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 36)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ముప్పది ఆరవ సర్గ
అంతా చెప్పి సీత వంక చూచాడు హనుమంతుడు. సీతకు ఇంకా తన మీద నమ్మకం కలిగినట్టులేదు అని అర్థం అయింది హనుమంతునికి. అప్పుడు హటాత్తుగా రాముడు తనకు ఆనవాలుగా ఇచ్చిన ఉంగరము గుర్తుకు వచ్చింది. వెంటనే తాను భద్రపరచిన రాముని ఉంగరమును బయటకు తీసాడు. సీతతో ఇలా అన్నాడు.“అమ్మా! సీతా! నేను రాముని వద్ద నుండి వచ్చాను, రాముని దూతను అని నిరూపించుకోడానికి నాకు రాముడు ఇచ్చిన ఉంగరమును చూడు. దీనిని నీకు ఆనవాలుగా చూపించమని నాకు రాముడు ఇచ్చాడు.” అంటూ హనుమంతుడు రాముడు తనకు ఇచ్చిన ముద్రికను సీతమ్మకు ఇచ్చాడు.
సీత సంభ్రమంతో ఈ ముద్రికను తీసుకొంది. అది రామునిదే. సందేహము లేదు. సీత ఆ ముద్రికను కళ్లకు అద్దుకొంది. తాను రాముని చేరినట్టు రాముని చెంత ఉన్నట్టు ఆనందపడింది. సీతమ్మ మొహంలో ఆనందం చూచి హనుమంతుడు ఎంతో ఆనందించాడు. సీత మొహంలో నునుసిగ్గులు ఆవరించాయి. హనుమంతుని వంక ప్రశంసా పూర్వకంగా చూచింది.
“ఓ వానరోత్తమా! సందేహము లేదు. నీవు రాముని వద్ద నుండి వచ్చావు. నీవు మహా పరాక్రమ వంతుడివి. లేకపోతే నూరుయోజనముల సముద్రము దాటి ఈ రాక్షస రాజ్యంలోకి ప్రవేశించలేవు. నీకు రావణుని వలన అసలు భయం ఉన్నట్టు లేదు. నీ మొహంలో ధైర్యం ఆత్మవిశ్వాసం కనపడుతున్నాయి. నీవు సామాన్య వానరుడవు కావు. రాముడు నిన్ను నా వద్దకు పంపాడు అంటేనే నీ పరాక్రమము ఏపాటిదో అర్థం అవుతూ ఉంది. నిన్నూ, నీ శక్తిని, నీ పరాక్రమమును, నీ బుద్ధి కుశలతను పరీక్షించకుండా రాముడు నిన్ను పంపి ఉండడు. నేనెంతో అదృష్ట వంతురాలిని. రాముని యొక్క, లక్ష్మణుని యొక్క క్షేమమును తెలుసుకున్నాను. వారు క్షేమముగా ఉన్నారని తెలిసి నా మనసు కుదుటపడింది. రాముడు క్షేమంగా ఉంటే, అతని కోపము ప్రళయాగ్నిరూపంలో ప్రజ్వరిల్లి ఇంకా ఈ లంకను ఎందుకు దహించలేదు? అని అనుమానపడ్డాను. కాని అది సరి కాదు. వారు పరాక్రమవంతులు కాక కాదు. నా కష్టములు తీరు కాలము సమీపించలేదు. అందుకని వారు నన్ను విడిపించుటకు ఇంకా రాలేదు.
హనుమా! రాముడు నా గురించి దుఃఖిస్తున్నాడా! రావణుని మీద దండెత్తడానికి సకల సన్నాహాలు చేసుకుంటున్నాడా! లేక నా మీద దిగులుతో ఏమీ చెయ్యడం లేదా! రాముడు తాను నిర్వర్తించవలసిన కార్యములను ఏ మాత్రమూ దీనత్వమూ భ్రాంతి లేకుండా చేస్తున్నాడా! రాముడు సామ,దాన,బేధ,దండోపాయములను సమర్ధవంతంగా ఉపయోగిస్తున్నాడు. శత్రువులను జయించడానికి మిత్రులతో స్నేహంగా ఉంటున్నాడా! రాముడు మిత్రులందరూ మంచి వారే కదా! వారు రామునికి సాయం చేయువారే కదా! రాముని మిత్రులు రాముని గౌరవ భావంతో చూస్తున్నారు కదా!
రాముడు నిత్యమూ దేవతలను ఆరాధిస్తున్నాడు కదా! పురుష ప్రయత్నానికి దైవయత్నం తోడు చేసుకొని ప్రవర్తిస్తున్నాడా! హనుమా! రాముడు నా గురించి తలచుకుంటున్నాడా. నేను దగ్గరలేను కదా అని నన్ను మరిచిపోయాడా! రాముడు ఇక్కడకు వచ్చి నన్ను ఈ రాక్షసుని చెరనుండి విడిపించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా! లేదా! ఓ హనుమా! రాముడు చిన్నప్పటి నుండి రాజ భోగములకు అలవాటు పడ్డాడు. ఇటువంటి కష్టములు ఉంటాయని కూడా ఆయనకు తెలియదు. అయినా నేను పక్కన ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా పక్కన లేను కదా! మరి రాముడు దు:ఖభారంతో కృంగి పోతున్నాడా! రాముడు నా గురించి శోకిస్తున్నాడా లేక నన్ను ఈ శోకసముద్రము నుండి గట్టెక్కించే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నాడా!
హనుమా! రాముడు కిష్కింధలో ఉన్నప్పుడు అయోధ్య నుండి సుమిత్ర గురించి కానీ కౌసల్య గురించి గానీ వార్తలు ఏమన్నా వస్తున్నాయా! నన్ను రావణుడు అపహరించిన వార్త భరతునికి చేరినదా! నన్ను రావణుని చెరనుండి విడిపించడానికి భరతుడు తన అశేషసైన్యమును పంపుతున్నాడా! సుగ్రీవుడు తన వానర సైన్యముతో లంకమీదికి దండెత్తుతాడు కదా! నన్ను విడిపిస్తాడు కదా! లక్ష్మణుడు తన వాడి అయిన బాణములతో రావణుని, అతని సైన్యమును హతమారుస్తాడు కదా! రావణుడు రణరంగంలో కూలిపోయినపుడు వాడి శరీరమును ఎప్పుడు చూస్తానో కదా!
హనుమా! ఎప్పుడూ పద్మము వలె వికసించి ఉన్న రాముని ముఖం ఇప్పుడు వాడిపోయిందా! హనుమా! రాముడు తన తండ్రి మాట ప్రకారము నన్ను అడవికి తీసుకొని పోయి అడవులలో రాళ్లమీద, ముళ్లమీద నడిపించినప్పుడు కూడా నేను బాధ పడలేదు. అటువంటి రాముడు ఇప్పుడు నా గురించి బాధపడుతున్నాడా! లేక ధైర్యంగా ఉన్నాడా! రాముడు తన జీవితంలో నన్నే అధికంగా ప్రేమించాడు. నా ప్రేమ ముందు తన తల్లి కౌసల్య మీద ఉన్న ప్రేమగానీ, తండ్రి దశరథుని మీద ఉన్న ప్రేమగానీ సాటి రాదు. ఆ కారణం వలననే నేను రాముని కొరకు ప్రాణములు అరచేతిలో పెట్టుకొని ఈ రాక్షసుని చెరలో జీవించుచున్నాను." అని పలికి రాముని తలచుకుంటూ ఉంది సీత.
సీత మాటలు విన్న హనుమంతుడు సీతకు నమస్కరించి ఇలా అన్నాడు. “ఓ సీతా దేవీ! నీవు ఇక్కడ ఉన్నట్టు, నీవు ఇన్ని కష్టములు పడుతున్నట్టు రామునికి తెలియదు. అందుకనే రాముడు ఇక్కడకు రాలేదు. నేను పోయి రామునికి నీ గురించి చెప్పగానే రాముడు వెంటనే వానర సైన్యముతో ఇక్కడకు వస్తాడు. నిన్ను ఈ రాక్షసుని చెరనుండి విడిపిస్తాడు. రాముడు తన బాణములతో సముద్రమును ఎండించి, సముద్రమును దాటి లంకకు రాగలడు. ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా ఆఖరుకు మృత్యువు కానీ, దేవతలు కానీ, అసురులు కానీ, అడ్డు వచ్చినా సరే రాముడు లెక్క చెయ్యడు.
ఓ సీతాదేవీ! నీవు కనపడలేదని రాముడు ఇంతకాలము నిన్ను రోజూ తలచుకుంటూ దు:ఖముతో కుమిలిపోతున్నాడు.
ఓ సీతాదేవీ! నేను ఈ పర్వతముల మీద, సముద్రము మీదా, చెట్లమీద ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను. నేను వెళ్లి నీ గురించి చెప్పి రాముని తీసుకొని వస్తాను. నా మాట నమ్ము. నీవు రాముడిని తొందరలోనే చూస్తావు. రాముడు నీ మీద ఉన్న ప్రేమతో నువ్వు దగ్గర లేవని మద్యమాంసములు ముట్టడం లేదు. కేవలము ఫలములు ఆరగించి కడుపునింపుకుంటున్నాడు.
రాముడు ఎల్లప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్నాడు. నిన్ను తప్ప వేరే ఎవరిగురించీ ఆలోచించడం లేదు. రాముడు చాలావరకూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ఎప్పుడైనా నిద్రపడితే సీతా సీతా అని కలవరిస్తుంటాడు. రామునికి ఏదైనా అందమైన వస్తువు కనపడినప్పుడు నువ్వు దగ్గరలేవని బాధపడు తుంటాడు. రాముడు నిన్ను మరువలేదు. సతతమూ నిన్నే స్మరిస్తున్నాడు." అని రాముడు పడుతున్న వేదన గురించి సీతకు తెలియజేసాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాటలు విని సీత కొంత ఊరట చెందింది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది ఆరవ సర్గము సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment