శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 37)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ముప్పది ఏడవ సర్గ
హనుమంతుడు చెప్పిన మాటలు విన్న సీత హనుమతో ఇలా అంది. "హనుమా! రాముడు జీవించి ఉన్నాడు అని చెప్పావు. కానీ రాముడు నా గురించి శోకిస్తున్నాడు అని చెప్పావు. రాముడు జీవించి ఉన్నందుకు సంతోషించాలో, నా గురించి శోకిస్తున్నందుకు దు:ఖించాలో అర్థం కావడం లేదు. మనిషికి ఎక్కువ సుఖము వచ్చినా ఎక్కువ దు:ఖము వచ్చినా తట్టుకోలేడు. అదే దైవ లీల. ఆ దైవ లీలను దాటడం ఎవరికీ శక్యముకాదు.మా ప్రమేయం లేకుండానే నేను, రాముడు, లక్ష్మణుడు ఎటువంటి కష్టములు పడుతున్నామో చూడు! అక్కడ రాముని శోకము ఇక్కడ నా శోకము ఎప్పుడు అంతం అవుతుందో కదా! రాముడు లంకకు వచ్చి రావణుని చంపి నా కష్టములను ఎప్పుడు తీరుస్తాడో కదా! రావణుడు నాకు ఒక సంవత్సరము గడువు ఇచ్చాడు. అందులో పది మాసములు గడిచిపోయినవి, ఇంక రెండు
మాసములు మాత్రమే మిగిలి ఉన్నవి. ఈ రెండు మాసములలో రాముడు వచ్చి నన్ను రక్షించడం సాధ్యమా!
హనుమా! నీవు వెళ్లి రామునితో చెప్పు. నీ సీత కేవలము ఇంక రెండు మాసములు మాత్రమే ప్రాణములతో ఉంటుంది అని చెప్పు. రావణుని తమ్ముడు విభీషణుడు అను వాడు “సీతను రామునికి ఇచ్చివేయి" అని ఎంత చెప్పినా రావణుడు వినడం లేదు. నన్ను రామునికి అప్పగించుటకు రావణుడు ఎంత మాత్రమూ అంగీకరించడం లేదు. రావణునికి మృత్యువు ఆసన్నమయింది. అందుకే ఈ ప్రకారము ప్రవర్తిస్తున్నాడు.
ఓ హనుమా! రావణుని తమ్ముడైన విభీషణుని కుమార్తె నల అనే పేరు కలది, స్వయంగా నా వద్దకు వచ్చి ఈ విషయం చెప్పింది.
హనుమంతుడా! నా ఈ ఆందోళన అర్థ రహితంగా తోస్తూ ఉంది. రాముడు తప్పకుండా వచ్చి నన్ను రక్షిస్తాడు అని నా అంతరాత్మ ఘోషిస్తూ ఉంది. నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిన తరువాత రాముడు క్షణకాలము ఊరుకోడు. రామునిలో ఉత్సాహము, పరాక్రమము, పురుషప్రయత్నము, బలము అన్నీ ఉన్నాయి. రాముడు తప్పకుండా వస్తాడు నన్ను రక్షిస్తాడు.
ఏ రాముడు అయితే జనస్థానములో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపాడో ఆ రాముడికి ఏ రాక్షసుడు భయపడడు? రాముడు ఎన్ని కష్టములు వచ్చినా ఓర్పుతో సహిస్తాడు. రాముడు ఎవరికీ దేనికీ భయపడడు. రాముడి పరాక్రమము గురించీ, మనోధైర్యము గురించీ నాకు బాగా తెలుసు.” అని ఉ ద్వేగంతో పలికింది సీత.
ఆ మాటలు విన్న హనుమంతుడు సీతతో ఇలా అన్నాడు. "అమ్మా సీతా దేవీ! దీనికి ఇంత ఆలోచించాలా! రా అమ్మా! నీ వీపు మీద కూర్చో. నిన్ను క్షణాలలో సముద్రము దాటించి రాముని వద్దకు చేరుస్తాను. నన్ను నమ్ము. అమ్మా సీతా! నిన్నే కాదు. ఈ లంకను రావణునితో సహా పెకలించి తీసుకొని పోగలను. నాకు అంత శక్తి ఉంది. ముందు నిన్ను రాముని వద్దకు చేరుస్తాను. తరువాత రాముడు వచ్చి రావణుని సంహరిస్తాడు. రాముడు నిన్ను ఎప్పుడు చూస్తానా అని తహతహలాడుతున్నాడు. అందుకని నిన్ను ఇప్పుడే రాముని వద్దకు చేరుస్తాను.
రా అమ్మా! వచ్చి నా వీపు మీద కూర్చో మనము రాముని వద్దకు వెళుదాము. ఆకాశమార్గములో ప్రయాణమే చేసి సముద్రమును దాటుదాము. ఈ లంకలో ఉన్న రాక్షసులు ఎవ్వరూ మనలను అనుసరించలేరు ఆ భయం నీకు వద్దు.
ఓ సీతా దేవీ! నిన్ను రావణుడు ఏ ప్రకారంగా ఆకాశమార్గంలో ఇక్కడకు తీసుకొని వచ్చాడో, అదే ప్రకారంగా నేను నిన్ను ఆకాశమార్గంలో కిష్కింధకు తీసుకొని వెళుతాను.” అని అన్నాడు హనుమంతుడు.
హనుమ మాటలు విని సీతకు ఆశ్చర్యము, సంతోషము, సందేహము, ఒక్కసారిగా కలిగాయి. అంత దుఃఖంలో కూడా సీతకు నవ్వు వచ్చింది. హనుమంతునితో ఇలా అంది.
“ఓ వానరుడా! నీవు నన్ను మోసుకొని సముద్రము దాటుతావా! నూరుయోజనముల దూరము నన్ను ఎలా మోసుకొని పోగలవు అని అనుకుంటున్నావు. దీనిని బట్టి నీవు నిజంగా వానరుడవు అని నిరూపణ అయింది." అంటూ సీత చిన్న పిల్లి అంత ఆకారంలో ఉన్న హనుమంతుని తేరిపారచూచి "ఇంత చిన్ని శరీరం గల నీవు నన్ను నూరుయోజనములు మోసుకొని పోయి సముద్రము దాటించగలవా! నన్ను రాముని వద్దకు తీసుకొని పోగలవా! అలా అని నీవు ఎలా అనుకుంటున్నావు? ఇది నీకు సాధ్యమా కాదా అని కూడా నీకు తెలియదా!" అని పక్కున నవ్వింది సీత.
హనుమంతుడు దానిని తీరని అవమానంగా భావించాడు. “ఈమెకు నా బలము, శక్తి, నా మాయారూపము తెలియవు. ఇప్పుడు నేను నా శక్తి ఏమిటో చూపించి ఈమెను నమ్మిస్తాను." అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. వెంటనే లేచి నిలబడ్డాడు. తన నిజస్వరూపమును సీతకు చూపించాడు. నేల మీద నిలబడి అలా అలా ఆకాశంలోకి పెరిగిపోతున్నాడు హనుమంతుడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.
నేల మీద కాళ్లు ఆకాశంలో తల మేరు పర్వతము మాదిరి ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు. తల పైకి ఎత్తి చూస్తున్న సీతతో ఇలా అన్నాడు హనుమంతుడు. “అమ్మా! సీతా! ఇప్పుడు తెలిసిందా! నాకు ఈ లంకనే పెకలించుకొని పోగల శక్తి ఉందని. కాబట్టి నీ మనసులో ఉన్న సందేహమును వదిలి పెట్టి వచ్చి నా వీపు మీద కూర్చో. నేను క్షణంలో రాముని చెంతకు చేరుస్తాను.” అని అన్నాడు హనుమంతుడు.
భూమ్యాకాశాలు ఒకటిగా వెలుగొందుతున్న వాయుపుత్రుడు హనుమంతుని చూచి సీత ఇలా అంది. “ఓ వాయుపుత్రా! హనుమా! నీ బలము, పరాక్రమము, నీ శక్తి, నీ గమనవేగము అన్నీ నాకు పూర్తిగా తెలిసాయి. నీ వంటి వాడికి కాక మరొకడికి ఈ సముద్రమును దాటడం సాధ్యమా! ఏదో స్త్రీ చాపల్యము వలన అలా అన్నానే కానీ, నీవు నన్ను నీ వీపుమీద మోసుకొని పోయి రాముని వద్దకు చేరుస్తావు అని నాకు తెలుసు. కానీ, ఇప్పుడు మనము రామ కార్యము ఎలా నిర్వర్తించాలా. అని ఆలోచించాలి. నేను నీతో రావడం అంత మంచి పని కాదు. నీవు వాయు వేగముతో పోగలవు కానీ, నీ వేగమును తట్టుకొని నీ వీపు నీ మీద కూర్చొనే శక్తి నాకు లేదు కదా! నీవు వాయు వేగంతో పోతుంటే నీ వీపు మీద ఉన్న నేను ఆ వేగమునకు తట్టకోలేక కళ్లు తిరిగి సముద్రములో పడిపోతానేమో అని భయంగా ఉంది. అలా పడిపోయినపుడు నేను సముద్రములో ఉన్న జలచరములకు ఆహారము అవుతాను కదా!
అదీ కాకుండా, నువ్వు నన్ను తీసుకొని పోతుంటే రాక్షసులు నిన్ను వెంబడిస్తారు కదా! రాక్షసులు నిన్ను నన్ను ఆయుధములతో చుట్టుముట్టినపుడు, నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీవు నన్ను కూడా రక్షించవలసి ఉంటుంది. నువ్వు ఆకాశంలో క్రూరులైన రాక్షసులతో యుద్ధం చేయవలసి ఉంటుంది. అప్పుడు నిన్ను నువ్వు రక్షించుకుంటావా? నీ వీపుమీద ఉన్న నన్నుకూడా రక్షిస్తావా? నిన్ను నువ్వు రక్షించుకుంటూ, నన్ను కూడా రక్షిస్తూ సముద్రము మీద ఎలా ప్రయాణము చేస్తావు? కష్టం కదా!
అంతే కాదు! నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తుంటే, నేను నీ వీపు మీది నుండి కింద పడిపోయే అవకాశము ఉంది కదా! ఆ సమయంలో రాక్షసులు తిరిగి నన్ను పట్టుకొని రావణుని వద్దకు చేరుస్తారు. లేదా కసి కొద్దీ దారిలోనే నన్ను చంపేస్తారు. లేదా నన్ను తీసుకొని పోయి మీకు ఎవ్వరికీ తెలియని ప్రదేశములో దాచిపెడతారు. అప్పుడు నేను ఎక్కడున్నదీ మీకు తెలియడం చాలా కష్టం కదా! అదీ కాకుండా, నువ్వు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వే జయించవచ్చు లేక రాక్షసులు జయించవచ్చు. యుద్ధములో జయాపజయాలు దైవాధీనాలు కదా! అట్టి పరిస్థితులలో నన్ను రాముని వద్దకు చేర్చడం అన్న నీ ప్రయత్నం సఫలం కాదు.
నువ్వు లంకలో ఉన్న రాక్షసులను అందరినీ సంహరిస్తావని నాకు తెలుసు. నువ్వే అందరు రాక్షసులను చంపేస్తే, రాముని పరాక్రమమునకు, కీర్తికి ముప్పు వాటిల్లుతుంది కదా! ఇవన్నీ ఆలోచిస్తే, నేను నీతో రావడం అంత మంచి పని కాదు. కాబట్టి రాముడు వచ్చి రావణునితో యుద్ధం చేసి, రావణుని సంహరించి నన్ను తీసుకొని పోవడమే మంచి పద్ధతి. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, వానరులు వీరి జీవితాలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నేను కనుక దారి మద్యలో సముద్రములో పడి చనిపోతే, లేక మరలా రాక్షసుల చేతిలో పడితే, వీరందరూ ప్రాణత్యాగము చేసే అవకాశం ఉంది కదా!
అదీ కాకుండా నేను మొదటి నుండీ పతివ్రతా ధర్మమును అనుసరిస్తున్నాను. అందుకని నేను పరపురుషుని శరీరమును తాకను. నన్ను తీసుకొని వచ్చునపుడు రావణుని శరీర స్పర్శ నాకు తగిలింది కదా అని నీకు సందేహము రావచ్చు. రావణుడు నన్ను బలాత్కారంగా తీసుకొని వస్తున్నప్పుడు నేను అశక్తురాలిని, నిస్సహాయురాలిని. నన్ను నేను రక్షించుకొనే పరిస్థితిలో లేను. నా ప్రమేయం లేకుండా జరిగిన దానికి నేను బాధ్యురాలిని కాను కదా! కాబట్టి రాముడు సైన్య సమేతంగా వచ్చి నన్ను తీసుకొని వెళ్లడమే యుక్తము అని నా అభిప్రాయము. రాముడు తప్పకుండా రావణునితో యుద్ధము చేసి గెలుస్తాడు. రాముని బలపరాక్రమములు నాకు తెలుసు. దేవ, దానవ, గంధర్వ, నాగ, రాక్షసులు ఎవరూ రాముని ఎదిరించి నిలువలేరు. రామలక్ష్మణులు ధనుస్సులు ధరించి యుద్ధరంగంలో నిలబడితే, వారిని ఎదిరించడం సాక్షాత్తు ఆ దేవేంద్రునికే సాధ్యము కాదు. కాబట్టి నీవు పోయి, రామునితో నా ఉనికిని గురించి చెప్పి, వారిని ఇక్కడకు తీసుకొని రా! రాముని మనస్సుకు నా మనస్సుకు సంతోషమును కలిగించు." అని సీత హనుమంతునికి నచ్చచెప్పింది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment