శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 39)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ముప్పది తొమ్మిదవ సర్గ
సీత తన కొంగున ముడివేసి దాచిపెట్టిన చూడామణిని తీసి హనుమంతునికి ఇచ్చి ఇలా పలికింది.“హనుమా! ఈ చూడామణిని గురించి రామునికి బాగా తెలుసు.ఈ చూడామణిని చూస్తే రామునికి నా తల్లి, తన తండ్రి దశరథుడు, నేనూ గుర్తుకు వస్తాము. కాబట్టి ఈ చూడామణిని రామునికి ఇవ్వు. తరువాత జరగ వలసిన కార్యమును గూర్చి ఆలోచించి ఏది సమంజసమో అది చెయ్యి. కాని నా దుఃఖము మాత్రము త్వరగా పోగొట్టే మార్గము చూడు." అని పలికింది సీత.
హనుమంతుడు తల వంచి సీతకు నమస్కరించి “నీవు చెప్పినట్టే చేస్తాను.” అని అన్నాడు. తరువాత అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధం అయ్యాడు. హనుమ వెళుతుంటే తన ఆప్తుడు తనను విడిచి వెళుతున్నట్టు బాధపడింది సీత.
“ఓ హనుమా! వానరవీరా! రాముని, లక్ష్మణుని, సుగ్రీవుని అడిగినట్టు చెప్పు. రామునితో నన్ను ఈ దుఃఖసాగరమునుండి ఉద్ధరించమని చెప్పు. నా శరీరములో ప్రాణాలు ఉండగానే వచ్చి రక్షించమని రామునితో చెప్పు. కాస్త ఈ మాట సాయం చేసి పుణ్యం కట్టుకో.
హనుమా! నీవు నేను చెప్పిన మాటలు పదే పదే రామునికి చెప్పడం వల్ల రామునికి నన్ను సత్వరమే రక్షించవలెనని కోరిక కలుగుతుంది. రాముడు నా సందేశమును నీ ద్వారా విని, తన పరాక్రమమును ప్రదర్శింపగలడు." అని తన అభ్యర్ధనను మాటి మాటికీ హనుమకు తెలియజేసింది సీత.
సీత మాటలు విన్న హనుమ ఆమెతో ఇలా అన్నాడు. “అమ్మా! నా మాట నమ్ము. రాముడు వానర సేన, భల్లూకసేనలతో వచ్చి, రావణుని సంహరించి నిన్ను రక్షిస్తాడు. రాముని బాణములకు ఎదురు నిలువ గలవాడు ఈ రాక్షసులలో ఎవడూ లేడు. రాముడు యుద్ధరంగములో సాక్షాత్తు సూర్యుని, ఇంద్రుని, యముడిని ఓడించగల సమర్ధుడు. రాముడు నీ కొరకు ఈ భూమి యావత్తు జయించగల సమర్ధుడు." అని సీతకు ధైర్యవచనాలు పలికాడు హనుమంతుడు.
హనుమంతుని మాటలతో ఊరట చెందింది సీత. హనుమంతుడు వెళుతుంటే తన ఆప్తులు వెళుతున్నట్టు బాధపడించి. అప్పుడు సీతకు ఒక ఆలోచన వచ్చింది.
"పాపము ఈ వానరుడు నూరుయోజనముల దూరము గల సముద్రమును దాటి లంకకు వచ్చి, తన కోసం వెతికి వెతికి అలసిపోయాడు." అని అనుకొంది. అందుకని హనుమంతో ఇలా అంది.
“హనుమా! నీకు మంచిది అని అనుకుంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకొని, రేపు ఉదయమే వెళ్లవచ్చు కదా! ఇక్కడ ఇన్నాళ్లు ఒంటరిగా ఈ రాక్షసుల మధ్య బాధలు పడుతున్న నాకు, నీవు ఇక్కడే ఉన్నావనే భావన నా మనసుకు కాస్త ఊరట కలిగిస్తుంది. మరలా నీవు లంకకు ఎప్పుడు వస్తావో! అప్పటికి నేను బతికి ఉంటానో లేదో!
హనుమా! ఇప్పటి దాకా నాకు ఎవ్వరూ లేరు అనే దు:ఖంతో బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్లిపోతున్నావనే బాధ నా మనసును కలిచివేస్తూ ఉంది. ఇలా బాధలు మీద బాధలు నన్ను వెంటాడుతున్నాయి. ఏంచెయ్యను?
హనుమా! నువ్వు ఇన్ని చెప్పినా నాకు ఒక సందేహము పట్టి పీడిస్తూ ఉంది. మీ సైన్యము అంతా వానరములు భల్లూకములు కదా! వారు ఈ మహాసముద్రమును ఎలాదాటగలరు? ఇక్కడకు ఎలా రాగలరు? వాళ్లు సరే. రామలక్ష్మణులకు కూడా ఈ మహా సముద్రమును దాటడం శక్యమా!
నాకు తెలిసినంతవరకూ నువ్వు, గరుడుడు, వాయుదేవుడు మాత్రమే ఈ నూరుయోజనముల దూరము కల సముద్రమును దాటగల సమర్ధులు. మీరు ఈ కార్యము సాధించడం కష్టమనే అనిపిస్తూ ఉంది నాకు. నీకు ఏమైనా ఉపాయం తట్టిందా! నీకు తెలివి తేటలు ఎక్కువ కదా! ఏమి ఆలోచించావు? ఈ కార్యమును నీవు ఒంటరిగరానే సాధించగలవు అని నాకు తెలుసు.
కాని రామలక్ష్మణుల సంగతేమిటి? వారు ఎలా ఇక్కడకు రాగలరు? రామలక్ష్మణులు సముద్రమును దాటి లంకకు వచ్చి రావణుని సంహరించి నన్ను అయోధ్యకు తీసుకొని వెళ్లగలరు అనే నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి రామునికి నీవే తగిన ఉపాయము చెప్పి ఇక్కడకు తీసుకొని రావాలి." అని చెప్పింది సీత.
కాని రామలక్ష్మణుల సంగతేమిటి? వారు ఎలా ఇక్కడకు రాగలరు? రామలక్ష్మణులు సముద్రమును దాటి లంకకు వచ్చి రావణుని సంహరించి నన్ను అయోధ్యకు తీసుకొని వెళ్లగలరు అనే నమ్మకంతోనే ఉన్నాను. కాబట్టి రామునికి నీవే తగిన ఉపాయము చెప్పి ఇక్కడకు తీసుకొని రావాలి." అని చెప్పింది సీత.
“అమ్మా! సీతమ్మ తల్లీ! వానర సేన భల్లూక సేన అపారము. వారు ఇక్కడకు రావలెనని ధృఢంగా విశ్వసించి ఉన్నారు. వారికి ఏదీ అసాధ్యము కాదు. వానరులు ఎక్కడికి అయినా వెళ్లగల సమర్థులు. వానరులు ఆకాశంలోగానీ, నేల మీద గానీ నీటిలో గానీ ప్రయాణం చేయగల సమర్థులు. వారి తేజస్సు అటువంటిది. వారు ఏ పనిచేయడానికైనా వెనుకాడరు. ఈ వానరులలో ఆకాశంలో ఎగురుతూ భూప్రదక్షిణము చేసిన వారు ఎంతోమంది ఉన్నారు.
వానర సేనలో నా కన్నా మేధావులు. పరాక్రమవంతులు ఎంతో మంది ఉన్నారు. నా కన్నా తక్కువవాడు వానర సేనలో ఎవడూ లేడు. నేనే ఎగురుకుంటూ సముద్రమును దాటి వచ్చానంటే ఇంక మిగిలిన వానరుల మాట చెప్పాలా! అమ్మా! నీకు ఒక విషయం తెలుసా! ఇలా వెతకడం లాంటి చిన్న చిన్న పనులకు నా లాంటి చిన్న చిన్న వాళ్లను పంపుతారు కానీ, శ్రేష్టమైన వారిని పంపరు కదా! కాబట్టి నీవు విచారించకు. నీ శోకమును వదిలిపెట్టు. వానర నాయకులు అందరూ ఒకే ఒక్క గంతులో సముద్రమును దాటి లంకలో బిలా బిలా ప్రవేశిస్తారు. రామలక్షణులను నా బుజాల మీద ఎక్కించుకొని లంకకు తీసుకొని వస్తాను. రామలక్ష్మణులు వానరసేన సాయంతో లంకను నాశనం చేసి నిన్ను రక్షిస్తారు. అయోధ్యకు తీసుకొని వెళ్తాడు. కాబట్టి నీవు ఏ మాత్రమూ సందేహపడవద్దు. రామలక్ష్మణుల రాకకై వేచి ఉండు. అతి కొద్ది కాలములోనే రాముని చూడగలవు. రావణుని చావు చూడగలవు.” అని ధైర్యవచనములు పలికాడు హనుమంతుడు.
ఇంక వెళ్లడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆఖరి మాటలుగా సీతతో ఇలా అన్నాడు. “అమ్మా! నీవు అధైర్యపడకు. రామలక్ష్మణులను లంకా నగరంలో త్వరలోనే చూస్తావు. ఈ లంకానగరమంతా వానరసేనలతో నిండిపోవడం నీవు త్వరలో చూస్తావు. ఈ లంకలో ఎక్కడ చూచినా, ఏ పర్వతము మీద చూచినా గుంపులు గుంపులుగా వానరసేనలు సంచరించడం త్వరలోనే చూడగలవు.
ఓ సీతా దేవీ! నీవు రాముని కొరకు ఇక్కడ ఎలా శోకిస్తున్నావో అక్కడ రాముడు కూడా నీ కోసం ఇంతకంటే అధికంగా శోకిస్తున్నాడు. కాబట్టి ఊరడిల్లు. అగ్ని, వాయువు తో సమానులైన
రామలక్ష్మణులు నీకు అండగా ఉండగా నీకేం భయం. ప్రశాంతంగా ఉండు. లంకకు రాక్షసులకు ఋణం తీరిపోయింది. రాక్షసరాజ్యం అంతరించే కాలము ఆసన్నమయింది. నీవు ఇక్కడ ఎంతో కాలము ఉండవు. నేను వెళ్లి నీ గురించి రామునికి చెప్పడమే ఆలస్యం. రాముడు ఇక్కడకు వస్తాడు. నిన్ను చెర నుండి విడిపిస్తాడు. అంతవరకూ ఓపిక పట్టు " అని అనేకవిధములుగా సీతకు ధైర్యం చెప్పాడు హనుమంతుడు.
రామలక్ష్మణులు నీకు అండగా ఉండగా నీకేం భయం. ప్రశాంతంగా ఉండు. లంకకు రాక్షసులకు ఋణం తీరిపోయింది. రాక్షసరాజ్యం అంతరించే కాలము ఆసన్నమయింది. నీవు ఇక్కడ ఎంతో కాలము ఉండవు. నేను వెళ్లి నీ గురించి రామునికి చెప్పడమే ఆలస్యం. రాముడు ఇక్కడకు వస్తాడు. నిన్ను చెర నుండి విడిపిస్తాడు. అంతవరకూ ఓపిక పట్టు " అని అనేకవిధములుగా సీతకు ధైర్యం చెప్పాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment