శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 40)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

నలుబదవ సర్గ

హనుమంతుడు పలికిన ధైర్యవచనములకు ఎంతో సంతోషించింది సీత. 

"హనుమా! ఇక్కడ ఈ లంకలో, ఈ రాక్షసులు చెరలో, నా చెవికి మంచి మాటలు వినడమే కరువు అయింది. ఇన్నాళ్లకు నీ నోటి నుండి నాలుగు మంచి మాటలు వింటుంటే ఇంకా ఇంకా వినాలని ఉంది. నువ్వు వెళ్లిపోతున్నావు అంటే దిగులుగా ఉంది. నాలో ఉన్న ఉద్వేగముతో మరలా మరలా చెబుతున్నాను. నా గురించి రామునికి చెప్పి రాముని ఇక్కడకు తీసుకొని రా! నేను చెప్పిన కాకి కధను రామునికి నా ఆనవాలుగా చెప్పు. అంతే కాకుండా ఒక సారి నా నుదుటనున్న తిలకము
చెరిగి పోతే రాముడు ఒక శిలను తీసుకొని దానిని అరగదీసి, ఆ గంధమును నా నుదుటికి బదులు గండస్థలము మీద తిలకముగా దిద్దాడు. ఈ విషయం కూడా రామునికి చెప్పు. ఇంకా రామునితో నా మాటగా ఇలా చెప్పు.

“నేను ఇక్కడ ఈ రాక్షసుల మధ్య నానా బాధలు పడుతుంటే, దేవేంద్రునితో సమానమయిన పరాక్రమము కలిగి ఉండీ నా వద్దకు రావడానికి ఎందుకు ఉపేక్షిస్తున్నావు. 

ఓ రామా! నేను ఇంతకాలమూ ఈ చూడామణిని చూస్తూ నువ్వు నా దగ్గర ఉన్నట్టే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ చూడామణిని నా ఆనవాలుగా నీకు పంపుతున్నాను. 

ఓ రామా! నీవు ఏ నాటికైనా రాకపోతావా! ఈ రాక్షసుల చెరనుండి నన్ను విడిపించకపోతావా! అని ఎదురుచూస్తున్నాను. నేను ఇంక ఒక్క మాసము కాలము మాత్రమే నీ కొరకు ఎదురుచూస్తాను. అటుపైన నీవు నన్ను చూడలేవు. ఈ మాసము లోపల నీవు రాకపోతే నేను జీవించ ఉండను. ఈ రావణుడు చాలా క్రూరుడు. గడువు దాటిన తరువాత నన్ను బతుకనీయడు. తరువాత నీ ఇష్టం." అని నా మాటగా రామునికి చెప్పు." అని పలికింది సీత.

సీత దీనంగా మాటి మాటికీ పలుకుతున్న దీనాలాపములు విన్న హనుమకు కూడా దు:ఖము ఆగలేదు. సీతను ఆ దు:ఖము నుండి మళ్లించడానికి ఇలా అన్నాడు.

“అమ్మా! నేను తప్పకుండా రామునికి నీ గురించి చెబుతాను. కానీ, నీ వద్ద ఇంకా ఏమైనా రామునికి గుర్తుగా ఇవ్వదగిన వస్తువు ఉంటే అది ఇవ్వవా! " అని అడిగాడు హనుమంతుడు. సీత తన వద్ద ఇంకా ఏమైనా వస్తువు ఉందా అని వెతికింది. “హనుమా! నా వద్ద ఉన్న చూడామణిని ఇదివరకే ఇచ్చాను కదా. ఇంకా నా వద్ద నేను శిరోభూషణంగా ధరించే ఒక మణి ఉంది. దీనిని కూడా రామునికి చూపించు. దీనిని కూడా రాముడు బాగా గుర్తుపట్టగలడు. నీవు చెప్పిన మాటలను నమ్ముతాడు." అని తాను శిరస్సున ధరించిన మణిని తీసి ఇచ్చింది. హనుమంతుడు ఆ మణిని తీసుకొని భద్రపరచుకున్నాడు.

తరువాత అక్కడి నుండి వెళ్లడానికి సిద్ధము అయ్యాడు. పైకి ఎగరడానికి అనువుగా తన దేహాన్ని పెంచడం మొదలెట్టాడు. అప్పుడు సీత హనుమతో ఇలా అంది. “హనుమా! రాముని, లక్ష్మణుని, సుగ్రీవుని క్షేమము అడిగానని చెప్పు. నన్ను ఈ రాక్షస స్త్రీలు భయపెడుతున్నారని రామునికి స్వయంగా చెప్పు. నీవు సుఖంగా వెళ్లిరా." అని సాదరంగా వీడ్కోలు పలికింది సీత. హనుమంతుడు సీత వద్దనుండి ఉత్తర దిక్కుగా బయలుదేరాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)