శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 41)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది ఒకటవ సర్గ
హనుమంతుడు సీత వద్ద నుండి బయలు దేరి కొంత దూరము వెళ్లాడు. అక్కడ నిలబడి ఆలోచించాడు. "లంకకు వచ్చాను, సీతను చూచాను. వచ్చిన పని అయిపోయింది. ఇంకా ఏదో మిగిలిపోయింది అని అనుమానంగా ఉంది. ఊరికే పోవడం ఏం బాగుంటుంది. నా పరాక్రమం కూడా కొంచెం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా! ఈ రాక్షసుల విషయంలో సామ, దాన, భేదో పాయములు పనికిరావు. దండోపాయమే యుక్తము. కాబట్టి ప్రస్తుతము నా పరాక్రమమును వీళ్లకు రుచి చూపించడమే మంచిది.ఒక పని చెయ్యాలంటే ఒకే ఉపాయము పనికిరాదు. అనేక ఉపాయములను ఆలోచించాలి. తొందరలో రాక్షసులతో యుద్ధము జరుగబోతోంది. అలాంటప్పుడు, రాక్షసుల బలం ఎంతో, వీరిలో వీరులు ఎవరెవరుఉన్నారో, వీళ్లలో రావణునికి అండగా నిలిచేవాళ్లు ఎవరో, రావణునితో విభేధించే వాళ్లు ఎవరో తెలుసుకొని సుగ్రీవునికి చెప్పడం మంచిది. అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర కలహం పెట్టుకోవాలి! రావణుని, అతని మంత్రులను, సేనాధిపతులను సైనికులను నాతో యుద్ధానికి వచ్చేట్టు చెయ్యాలి! రాక్షసుల యుద్ధరీతులు ఎలా ఉంటాయో గమనించాలి. ఇదంతా మంచిదే! కానీ, వీరితో కలహం ఎలా పెట్టుకోవాలి? ఏం చేస్తే రాక్షసులకు కోపం వస్తుంది?" అని ఆలోచించి చుట్టూ చూచాడు.
ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఉద్యానవనము కనపడింది.
"అమ్మయ్య. దొరికింది. ఈ ఉద్యానవనమును నాశనం చేస్తే రావణునికి కోపం వస్తుంది. అప్పుడు రావణుడు తన సైన్యములను పిలిపించి నాతో యుద్ధం చెయ్యమంటాడు. అప్పుడు పెద్దయుద్ధం జరుగుతుంది. నేను కూడా రాక్షసులతో యుద్ధము చేసి, వారిని చంపి, కిష్కింధకు తిరిగి వెళతాను.” అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు.
పక్షుల కిలా కిలారావములతో, అందమైన పూల చెట్లతో మనోహరంగా ఉన్న ఉద్యానవనములోకి ప్రవేశించాడు హనుమంతుడు. అడ్డం వచ్చిన చెట్లను పెకలించాడు. అందమైన సరోవరముల గట్టు తెగగొట్టి నీటిని విడిచిపెట్టాడు. ఉద్యానవనమంతా జలమయముఅయింది. చిన్న చిన్న కొండలను, గుట్టలను పడగొట్టాడు. ఉద్యానవనమును చిందరవందర చేసాడు.ఈ భీభత్సానికి ప్రశాంతంగా చెట్ల కొమ్మల మీద ఉన్న పక్షులు భయం భయంగా అరుస్తూ ఎగిరిపోయాయి.
హనుమంతుడు పొదరిళ్లను, లతలను నాశనం చేసాడు. అక్కడ ఉన్న పెంపుడు జంతువులను తరిమేసాడు. అక్కడక్కడ ఉన్న విశ్రాంతి భవనములను కూలగొట్టాడు. ఆ ఉద్యానవనము తన పూర్వశోభను కోల్పోయి శ్మశానము మాదిరి అయింది. చెయ్యాల్సింది అంతా చేసి, తన కోసరం ఎవరన్నా వస్తారా అని ఎదురు చూస్తూ ఆ ఉద్యానవనము ముఖద్వారము వద్ద ఉన్న తోరణ స్తంభము మీద ఎక్కి కూర్చుని నలుదిక్కులను చూస్తున్నాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment