శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 42)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

నలుబది రెండవ సర్గ

పక్షులు, జంతువులు భయంతో అరిచే అరుపులు, చెట్లు పెళ పెళా విరిగిన శబ్దాలు, వినిన రాక్షసులు భయంతో వణికిపోయారు. పైగా రాక్షసులకు దుశ్శకునములు విపరీతంగా కనపడసాగాయి. వారంత నలుదిక్కులకు పోయి చూచారు. విరిగిన చెట్లు, పాడైపోయిన వనము, గట్లు తెగిన సరోవరములు, స్తంభము మీద కూర్చున్న హనుమంతుని చూచారు. వారిని చూచిన హనుమంతుడు తన ఆకారమును పెంచి వారిని భయపెట్టాడు. వెంటనే ఆ రాక్షస స్త్రీలు సీత వద్దకు వెళ్లారు.

“వాడు ఎవరు? ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం వచ్చాడా? వాడు నీకు తెలుసా? వాడు నీతో ఏమి మాట్లాడాడు? అసలు వాడు ఇక్కడు ఎందుకు వచ్చాడు? వాడికి నీకు ఏమి సంబంధం? చెప్పు.” అని గద్దించి అడిగారు. మరి కొంత మంది రాక్షసస్త్రీలు సీతను చూచి "సీతా! నువ్వు ఏమీ భయపడవద్దు. వాడు ఎవరో మాకు చెప్పు? వాడు నీతో ఏమేమి మాట్లాడాడు. చెప్పు." అనునయంగా అడిగారు.

అప్పుడు సీత వారితో ఇలా అంది. “ఆ వానరాన్ని చూడండి ఎంత భయంకరంగా ఉందో. అది మాయా రూపము ధరించిన రాక్షసుడు కాబోలు. అటువంటి రాక్షసుల గురించి తెలుసుకొనే పరిజ్ఞానం నాకు ఎక్కడుంది. వాడిని చూస్తేనే భయంగా ఉంది. అయినా అటువంటి రాక్షసుల గురించి మీకే తెలియాలి. నాకు ఎలా తెలుస్తుంది." అని భయం నటించింది సీత.

సీత మాటలు విన్న రాక్షస స్త్రీలు ఆ వానరము మనలను కూడా చంపుతుందేమో అని భయంతో నలుదిక్కులకూ పారిపోయారు. మరి కొందరు ఈ విషయం రావణునికి చెప్పుటకు రావణుని మందిరానికి వెళ్లారు. మరి కొందరు మొండి వాళ్లు, చస్తే చస్తామని అక్కడే సీతకు కాపలాగా ఉన్నారు.

రావణుని దగ్గరకు వెళ్లిన రాక్షస స్త్రీలు, హనుమంతుని గురించి అతని భయంకరాకారము గురించి చిలవలు పలవలుగా కల్పించి చెప్పారు. “ఓ మహారాజా! ఒక భయంకరమైన వానరము అశోకవనములో ప్రవేశించింది. వనమంతా నాశనం చేసింది. సీతతో ఏమేమో మాట్లాడింది. మేము ఎంత అడిగినా సీత ఆ వానరము గురించి చెప్పడం లేదు. ఆ వానరము దేవేంద్రుని వద్ద నుండి కానీ, మీ సోదరుడు కుబేరుని వద్ద నుండి కానీ, లేక రాముని వద్ద నుండి కానీ వచ్చిన దూత కావచ్చును. ఆ వానరుని రూపము అత్యంత ఆశ్చర్యకరంగా ఉంది. ఇప్పుడు ఇంత ఉంటాడు. మరుక్షణం ఆకాశమంత ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ ఉంటాడు. క్షణంలో అక్కడ ఉంటాడు. అశోక వనంలో వాడు విరవని చెట్టు లేదు. నాశనం చెయ్యని ప్రదేశము లేదు.

ప్రభూ! ఆశ్చర్యము ఏమంటే, ఆ వానరము సీత ఉన్న ప్రదేశము తప్ప మిగిలిన వనము అంతా ధ్వంసము చేసింది. కేవలము సీతను రక్షించడానికే అలా చేసాడా లేక వనం అంతా నాశనం చేసి అలసి పోయి సీత ఉన్న ప్రదేశమును మాత్రము నాశనము చేయలేదా! అనే విషయం తెలియడం లేదు ప్రభూ. అదేంకాదు లెండి. కోతికి అలసట ఏముంది. సీతను రక్షించడానికే వాడు ఈ పని చేసాడు. 

ప్రభూ! ప్రత్యేకంగా సీత కూర్చున్న శింశుపా వృక్షమును మాత్రము ఆ వానరము తాకనైనా తాకలేదు.

ప్రభూ! మీరంటే ఏ మాత్రం భయం లేకుండా, అశోక వనంలో ప్రవేశించి, సీతతో మాట్లాడి, అశోకవనమును ధ్వంసము చేసిన ఆ వానరమును పట్టి కఠినంగా శిక్షించండి. వాడు చావడానికి సిద్ధపడినట్టున్నాడు లేకపోతే తమరి అధీనంలో ఉన్న సీతతో మరొకడు వచ్చి మాట్లాడటం సంభవమా!" అని తలొక విధంగా చెప్పారు రాక్షస స్త్రీలు.

వారి మాటలు విన్న రావణునికి కోపం తలకెక్కింది. అగ్ని వలె మండి పడ్డాడు. వెంటనే ఎనభై వేల మంది రాక్షస సైనికులను పిలిచాడు. హనుమంతుని పట్టుకొని చంపమని ఆదేశించాడు. వెంటనే ఆ సైనికులు రకరకాలైన ఆయుధములను పట్టుకొని హనుమంతుని వెతుక్కుంటూ వెళ్లారు. అశోక వనద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుని చూచారు.

ఆ రాక్షసులు తమ తమ ఆయుధములను ఝళిపిస్తూ హనుమంతుని మీదికి ఉరికారు. హనుమంతుని తమ తమ ఆయుధములతో చుట్టుముట్టారు. వారిని చూడగానే హనుమంతుడు తన శరీరమును పెంచాడు. తోకను నేలకేసి బాదాడు. పెద్దగా అరిచాడు. “ఒరేయ్! నేను వాయు పుత్రుడను. నా పేరు హనుమంతుడు. నేను రాముడు పంపగా, సుగ్రీవుడు పంపగా రామదూతగా వచ్చాను. మీరు ఎంత మంది వచ్చినా నేను చంపేస్తాను. వెయ్యిమంది రావణులు కూడా నా ఎదుట నిలువలేరు. నేను సీత కోసరం వచ్చాను. సీతను చూచాను. లంకను నాశనం చేసి, సీతకు నమస్కరించి వెళతాను.” అని పెద్దగా అరిచి చెప్పాడు.

హనుమంతుని అరుపులు విని చాలా మంది రాక్షసులకు పై ప్రాణాలు పైనే పోయాయి. రావణుని ఆజ్ఞ తప్పదని, వారందరూ హనుమంతుని మీదికి తమ తమ ఆయుధములతో దూకారు. అప్పుడు హనుమంతుడు అశోకవనమునకు అమర్చిన పెద్ద ద్వారము వద్దకు వచ్చాడు. దానికి అమర్చిన పెద్ద గడియను ఊడపీకాడు. దానిని పట్టుకొని ఆ రాక్షసులను ఒక్కొక్కడిని చావగొట్టాడు. కొద్ది నిమిషములలో రావణుడు పంపిన రాక్షసులు అందరూ పీనుగులయ్యారు. ఇంకా ఎవరైనా వస్తారా అని చూస్తూ మరలా ఆ తోరణ స్తంభము వద్ద నిలబడ్డాడు హనుమంతుడు.

చచ్చిన వాళ్లు చావగా, హనుమంతుని బారి నుండి తప్పించుకొన్న కొంతమంది రాక్షసులు పరుగు పరుగున పోయి రావణునికి జరిగిందంతా చెప్పారు. తాను పంపిన రాక్షస సేన సమస్తం హనుమంతుని దెబ్బకు ఆహుతి అయ్యారు అన్న వార్త విన్న రావణుడు కోపంతో ఊగిపోయాడు. అదే రావణునికి తగిలిన మొదటి ఎదురు దెబ్బ. వెంటనే తన సేనానాయకుడు ప్రహస్తుని పిలిపించాడు. అశేష సేనలతో ప్రహస్తుని హనుమంతుని మీదికి పంపాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)