శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 43)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

నలుబది మూడవ సర్గ

రాక్షస సైనికులను చంపిన తరువాత ఇంకా ఎవరు వస్తారా అని తోరణస్తంభము మీద ఎక్కి కూర్చుని ఎదురు చూస్తున్నాడు హనుమంతుడు. ఎదురుగుండా అశోక వనములో ఉన్న చైత్యప్రాసాదము కనపడింది. అప్పుడు హనుమంతునికి ఒక ఆలోచన వచ్చింది. “అశోకవనము అంతా ధ్వంసము చేసాను. ఈ చైత్యప్రాసాదమును మాత్రము ఎందుకు వదిలిపెట్టాలి.. దీనిని కూడా ధ్వంసం చేస్తే ఓ పనైపోతుంది" అనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా పైకి లేచాడు. చైత్యప్రాసాదము మీదికి లంఘించాడు. ఆ చైత్యప్రాసాదము మీద ఎక్కి కూర్చున్నాడు. తరువాత తన శరీరమును పెంచాడు. లంకా పట్టణం అంతా అదిరిపోయేట్టు తన జబ్బలు చరుచుకున్నాడు. సింహనాదం చేసాడు. ఆ శబ్దానికి తట్టుకోలేక చైత్యప్రాసాదమును రక్షించుచున్న రక్షకభటులు మూర్ఛపోయారు. మరి కొంత మంది సైనికులు వివిధములైన ఆయుధములను పట్టుకొని అక్కడకు వచ్చారు. చైత్యప్రాసాదము మీద ఉన్న హనుమంతుని చూచారు.

హనుమంతుడు కిందికి దుమికాడు. వెంటనే ఆ సైనికులు హనుమంతుని చుట్టుముట్టారు. హనుమంతుడు ఆ చైత్యప్రాసాదము స్తంభమును ఒకదానిని పెకలించి, గిరా గిరా తిప్పి ఆ సైనికుల మీదికి విసిరాడు. హనుమంతుడు ఆ స్తంభమును గిరా గిరా తిప్పుతుంటే అగ్ని ప్రజ్వరిల్లింది. ఆ అగ్ని చైత్యప్రాసాదము మొత్తం పాకింది. చైత్యప్రాసాదము అగ్నికి ఆహుతి అయిపోయింది. స్తంభము తమ మీద పడ్డ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు.
వారిని చూచి ఇలా అన్నాడు హనుమంతుడు. 

“నా దెబ్బకే ఇంతమంది చచ్చారు. ఇంకా నా లాంటి వాళ్లు సుగ్రీవుని సేనలో లక్షలు కోట్లు ఉన్నారు. వాళ్లను ఎలా తట్టుకుంటారు మీరు. ఒక్కొక్కరు వెయ్యి ఏనుగుల బలం ఉన్న వానరులు ఉన్నారు. కోట్లకొద్దీ వానర సైన్యముతో, రాముడు సుగ్రీవుడు లంకమీదికి దండెత్తి వస్తున్నారు. మీరందరూ చావడం, మీ లంక నాశనం కావడం తథ్యం.

ఒరేయ్! మీ రావణుడు రామునితో అనవసరంగా పెట్టుకున్నాడు. దాని ఫలితంగా మీ రావణుడు, మీరు, మీ లంకానగరం, సర్వనాశనం అవుతుంది. ఒక్కడు కూడా మిగలడు." అని బిగ్గరగా అరిచి చెప్పాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందరకాండము నలుబది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)