శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 44)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది నాలుగవ సర్గ
ప్రహస్తుని కుమారుని పేరు జంబుమాలి. మహా పరాక్రమ వంతుడు. రావణుడు జంబుమాలిని సైన్యసమేతంగా, హనుమంతుని వధించి రమ్మని, పంపించాడు. జంబుమాలి పెద్ద శరీరంతో అతి వికృతంగా క్రూరంగా ఉంటాడు. అప్పటిదాకా జంబుమాలి అపజయము అనే మాట ఎరుగడు. జంబుమాలి ధనుస్సు, బాణములు ధరించి వచ్చాడు. జంబుమాలి చేసే ధనుష్టంకారానికి దిక్కులు మార్మోగు తున్నాయి. గాడిదలు కట్టిన రథం మీద జంబుమాలి అశోకవనము దగ్గర ఉన్న చైత్యప్రాసాదము వద్దకు వచ్చాడు.జంబు మాలిని చూచి హనుమంతుడు సంతోషంతో కిచా కిచా నవ్వాడు. జంబుమాలి ముఖద్వారము పైన కూర్చుని ఉన్న హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. అర్థచంద్రబాణముతో హనుమంతుని ముఖము మీద, కర్ణిబాణముతో హనుమంతుని శిరస్సును, పది నారాచబాణములతో హనుమంతుని బాహువుల మీద కొట్టాడు.
హనుమంతుని నుదుటి మీద బాణం తగిలి రక్తం బయటకు చిమ్మింది. హనుమంతుడికి కోపం వచ్చింది. పక్కకు చూచాడు. పక్కన ఒక పెద్ద రాతి బండ కనపడింది. హనుమంతుడు కిందికి దుమికి ఆ రాతి బండను ఎత్తి జంబుమాలి మీదికి విసిరాడు. జంబుమాలి పది బాణములతో ఆ రాతి బండను ముక్కలు చేసాడు. ఇంక లాభం లేదు అనుకొని అశోకవనంలో ఉన్న పెద్ద మద్దిచెట్టును కూకటి వేళ్లతో సహా పెకలించాడు. దానిని రెండు చేతులతో గిరా గిరా తిప్పాడు. హనుమంతుడు మద్దిచెట్టును అలా గిరా గిరా తిప్పుతున్నప్పుడు జంబుమాలి హనుమంతుని మీద బాణప్రయోగం చేసాడు. జంబుమాలి ప్రయోగించిన బాణముల ధాటికి ఆ మద్దివృక్షము తునా తునకలు
అయింది.
తరువాత జంబుమాలి హనుమంతుని భుజమును ఐదు బాణములతోనూ, వక్షస్థలమును ఒక బాణంతోనూ కొట్టాడు. ఒక పరిఘను హనుమంతుని మీదికి విసిరాడు. జంబుమాలి ప్రయోగించిన బాణములు తన శరీరం అంతా గుచ్చుకోడంతో హనుమంతుడు కోపంతో ఊగిపోయాడు. జంబుమాలి ప్రయోగించిన పరిఘను పట్టుకొని దానిని తిరిగి వేగంగా జంబుమాలి వక్షస్థలమునకు తగిలేట్టు విసిరాడు. జంబు మాలి ఈ పరిణామాన్ని ఊహించలేదు. ఆ పరిఘను వారించడానికి ప్రయత్నించలేదు. అంతే. ఆ పరిఘ జంబుమాలిని బలంగా తాకింది. ఆ పరిఘ దెబ్బకు జంబు మాలి అతను ఎక్కిన రధము, దానికి కట్టబడిన గాడిదలు, తోలుతున్న సారధి అందరూ ముద్దగా అయిపోయారు. జంబుమాలి ఆకారం కూడా కనపడలేదు.
జంబు మాలి మరణించగానే, చావగా మిగిలిన రాక్షస సైనికులు పారిపోయారు. రావణునితో జంబుమాలి మరణ వార్తను చెప్పారు. ప్రహస్తుని కుమారుడు, మహా బలశాలి అయిన జంబుమాలి మరణ వార్త విని రావణుడు కోపంతో ఊగిపోయాడు. తన వద్ద ఉన్న ఏడుగురు మంత్రుల కుమారులను పిలిపించాడు. వారిని అపార సైన్యంతో హనుమంతుని మీదికి యుద్ధానికి పంపాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment