శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 45)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది ఐదవ సర్గ
రావణుని చేత ఆజ్ఞాపింపబడిన ఏడుగురు మంత్రుల కుమారులు అశ్వములు కట్టిన రథములను ఎక్కి హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారు కూడా సామాన్యులు కారు. మహా బలశాలురు. వారంతా ధనుర్బాణములను ధరించి ఉన్నారు. వారి వెంట పెద్ద సైన్యము బయలుదేరింది. ఏడుగురు మంత్రుల కుమారులు ఉత్సాహంతో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలు దేరారు. వారి తల్లి తండ్రులు, బంధువులు మాత్రము "జంబుమాలి వంటి మహావీరుడే హనుమంతుని ధాటికి తట్టుకోలేక మరణించాడు. వీళ్ల గతి ఏమవుతుందో" అని ఆందోళన చెందారు. కాని ఆ మంత్రి పుత్రులు మాత్రము హనుమంతుని నేను చంపుతాను అంటే నేను చంపుతాను అంటూ ఉరకలు వేస్తూ దూసుకు వెళుతున్నారు.ఏడుగురు మంత్రుల కుమారులు తమ తమ బాణపరంపరలతో హనుమంతుని కప్పివేసారు. ఆ బాణవర్షంలో తడిసిపోయాడు హనుమంతుడు. కాని ఒక్క బాణము కూడా తనకు తగల కుండా వేగంగా గిరా గిరా తిరుగుతూ తప్పించుకుంటున్నాడు. హనుమంతుడు. మంత్రి కుమారులు ప్రయోగించిన బాణములు అన్నీ వృధా అయ్యాయి. హనుమంతుడు అర్భకులైన మంత్రి కుమారులతో ఆడుకుంటున్నాడా అన్నట్టు ఉంది.
తరువాత గట్టిగా అరిచాడు హనుమంతుడు. ఆ అరుపుకు రాక్షససేన కకావికలైంది. హనుమంతుడు ఒక్కొక్క మంత్రి కుమారుని పట్టుకొని తలమీద, వీపు మీద చేతులతో బలంగా చరుస్తున్నాడు. కాళ్లతో తొక్కాడు. అక్కడా ఇక్కడా అనకుండా ఒళ్లంతా పిడిగుద్దులు గుద్దాడు. ఆ దెబ్బలకు తట్టకోలేక మంత్రి కుమారులు అందరూ పరలోకం చేరుకున్నారు. వారు చావగానే హనుమంతుడు మిగిలిన సైనికులను గోళ్లతో రక్కాడు. చీల్చాడు. పెద్దగా అరుస్తూ భయపెట్టాడు. హనుమంతుని చేతిలో చావగా మిగిలిన సైనికులు పారిపోయారు. సైనికులు చేస్తున్న ఆర్తనాదాలతో, ఏనుగుల ఘీంకారాలతో, అశ్వముల సకిలింపులతో లంకానగరము మార్మోగిపోయింది. రాక్షసుల రక్తం కాలువలు కట్టి ప్రవహించింది. ఇప్పటికి వీళ్లు అయ్యారు. ఇంకా ఎవరు వస్తారో అని హనుమంతుడు తోరణ స్తంభము ఎక్కి ఎదురు చూస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment