శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 46)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది ఆరవ సర్గ
తను పంపిన ఏడుగురు మంత్రి కుమారులు సైన్యంతో సహా హనుమంతుని చేతిలో మరణించారు అన్న వార్త విన్న రావణాసురునిలో మొట్ట మొదటి సారిగా భయం ప్రవేశించింది. “తాను ఓడిపోతున్నాడా! తాను ఓడిపోవడం మొదలయిందా! ఒక్క వానరాన్ని చంపడానికి ఇంతమంది బలికావాలా! ఏమిటీ విపరీత పరిణామం!" అని మనసులోనే మధనపడసాగాడు. కాని తన భయాన్ని బయటకు కనిపిపంచకుండా నిబ్బరంగా ఉన్నాడు.ఈ సారి ఐదుగురు సేనానాయకులను పిలిపించాడు. వారు విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘనుడు, భాసకర్ణుడు. వారిని పిలిపించాడు రావణుడు.
“ఓ సేనానాయకులారా! మీరందరూ మీకు కావలసిన సైన్యమును తీసుకొని వెళ్లండి. ఆ వానరాన్ని చంపండి. కాని మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు, చంపబడిన సైనికులు, వీరులను బట్టి చూస్తే అది సామాన్యమైన వానరము కాదు. ఏదో మహత్తర శక్తి కల భూతము అనిపిస్తూ ఉంది. మనకు బద్ధశత్రువు అయిన ఇంద్రుడు మనలను తుదముట్టించడానికి తన మహత్తర శక్తితో ఆ భూతాన్ని సృష్టించాడా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు మనం అందరం దేవతలను, నాగులను, గంధర్వులను, యక్షులను ఓడించాము. వారిలో ఎవరో ఒకరు మనమీద పగబట్టి ఈ రూపంలో వచ్చి ఉండవచ్చు. కాబట్టి
మీరు అది సామాన్య వానరమే కదా అని తేలిగ్గా తీసుకోకండి. నిర్దాక్షిణ్యంగా సంహరించండి.
అంతే కాదు, ఇది నిజమైన వానరమే అనుకుంటే అది కూడా సంభవమే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే, నేను ఇంతకు పూర్వము వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నీలుడు, ద్వివిదుడు మొదలైన వానరములను చూచి ఉన్నాను. వారు లోకోత్తరమైన శక్తి కలవారు. కాని వారికి ఇంత బుద్ధి, చాకచక్యము లేవు. ఈ వానరము వారి కంటే బుద్ధి, బలము, శౌర్యము, శక్తి కల వానరము అనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇది వానర రూపంలో ఉన్న ఒక మహాభూతము అని అనుకొని దానితో యుద్ధం చేయండి. ఇంతకు ముందు మనము చేసిన యుద్ధములలో ఇంద్రుడు కానీ, అసురులు కానీ, గంధర్వులు కానీ, యక్షులు కానీ మనముందు నిలువ లేదు అని చెప్పి గర్వించకండి. యుద్ధములో జయాపజయములు చంచలంగా ఉంటాయి. ఎల్లప్పుడూ మనమే జయిస్తాము అనుకోవడం పొరపాటు. కాబట్టి జాగరూకతతో వ్యవహరించండి. వానరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి.” అని ఆజ్ఞాపించాడు.

రావణుని మాటలు విన్న ఆ సైన్యాధ్యక్షులు రెట్టించిన ఉత్సాహంతో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరారు. వారి వెంట రధికులు, ఆశ్వికులు, గజారోహకులు, వివిధ అస్త్రశస్త్రములను ధరించిన వారు, బలవంతులు అయిన సైనికులు బయలుదేరారు.
అశోకవనము ముఖద్వారము వద్ద నిలబడి ఉన్న హనుమంతుడు వీరిని చూచాడు. మరో ఐదుగురు చావడానికి వస్తున్నారు అని మనసులో అనుకున్నాడు. రాక్షసులు హనుమంతుని చుట్టుముట్టారు. వివిధ రకములైన ఆయుధములను హనుమంతుని మీద ప్రయోగించారు.
దుర్ధరుడు ఐదు ఇనప ములికలు కలిగిన బాణములను హనుమంతుని తలకు తగిలేట్టు కొట్టాడు. ఆ అయిదు బాణములు తన తలకు తగలగానే హనుమంతుడు సింహనాదము చేస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. దుర్ధరుడు కూడా తన రథముతో సహా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుని మీద రకరకాలైన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు చిత్రవిచిత్రముగా తిరుగుతూ ఆ బాణముల నుండి తప్పించుకుంటున్నాడు. ఇలా కాదని హనుమంతుడు తన శరీరమును విపరీతంగా పెంచాడు. దుర్ధరుని రథము మీదికి ఎగిరాడు. అక్కడినుండి మహావేగముతో దుర్ధరుని రథము మీద అడ్డంగా పడ్డాడు. మహాకాయంతో హనుమంతుడు దుర్ధరుని రథం మీద పడగానే, రథం విరిగిపోయింది. దానికి కట్టిన గుర్రాలు మరణించాయి. దుర్ధరుడు కూడా ఆ రథము మీది నుండి వేగంగా కిందపడి మరణించాడు.
దుర్ధరుని మరణం కళ్లారా చూచిన విరూపాక్షుడు, యూపాక్షుడు కోపంతో ఊగిపోయారు. వారిద్దరూ ఆకాశంలోకి ఎగిరారు. ఇద్దరూ ముద్గరలతో హనుమ వక్షస్థలము మీద కొట్టారు. హనుమంతుడు వారి నుండి తప్పించుకొని వేగంగా నేలమీదికి దిగాడు. వారు కూడా కిందికి దిగేలోపు హనుమంతుడు ఒక
సాలవృక్షమును పెకలించి సిద్ధంగా ఉన్నాడు. విరూపాక్ష, యూపాక్షులు కిందికి దిగగానే ఆ వృక్షముతో వారిని బలంగా మోదాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆ ఇరువురు రాక్షసులు మరణించారు.
వచ్చిన ఐదుగురిలో ముగ్గురు మరణించారు. ఇంక ఇద్దరు మిగిలారు. వారు ప్రఘనుడు, భాసకర్ణుడు. ఇద్దరూ శూలములను తీసుకొని హనుమంతుని మీదికి వెళ్లారు. వారిద్దరూ హనుమంతునికి చెరి ఒక పక్క నిలిచి యుద్ధం చేస్తున్నారు. ఆ ఇరువురు కొట్టిన దెబ్బలకు హనుమంతుని శరీరం అంతా రక్తసిక్తము అయింది. ఇంక లాభం లేదని, హనుమంతుడు ఒక పెద్ద కొండ శిఖరమును పెకలించి వారి మీదికి విసిరాడు. ఆ కొండ శిఖరము కిందపడి ప్రఘనుడు, భాసకర్ణుడు మరణించారు.
ఐదుగురు సేనాపతులు మరణించగానే వారి సేనలు చెల్లాచెదరు అయ్యారు. హనుమంతుడు వారిని తరిమి తరిమి చంపాడు. ఒక ఏనుగును పట్టు కొని మరొక ఏనుగు మీదికి విసిరాడు. రెండు ఏనుగులు చచ్చాయి. అలాగే గుర్రముల మీదికి గుర్రములను, రధముల మీదికి రథములను, రాక్షసుల మీదికి రాక్షసులను విసురుతూ అందరినీ సంహరించాడు హనుమంతుడు.
చచ్చిపడి ఉన్న సైనికులతోనూ, రథములతోనూ అశ్వములతోనూ ఏనుగులతోనూ ఆ ప్రదేశము అంతా నడవడానికి వీలులేకుండా ఉంది. పీనుగుల పెంట అయింది.
హనుమంతుడు తిరిగి తోరణ స్తంభము ఎక్కి కూర్చున్నాడు. ఈ సారి ఎంతమంది వస్తారా అని ఎదురుచూస్తున్నాడు.

సుందర కాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment