శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 47)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
నలుబది ఏడవ సర్గ
పట్టుదల, కోపము, అహంకారమూ మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కానీ, రాక్షసుడు కానీ యుక్తాయుక్త వివేచన కోల్పోతాడు. రావణుని పరిస్థితి అలాగే ఉంది. వచ్చిన వానరుడు ఒక్కడు. చచ్చిన వాళ్లు వేలకు వేలు. కారణం ఏమిటి? ఆలోచించలేదు. జంబుమాలి చచ్చాడు. ఏడుగురు మంత్రి కుమారులు వధింపబడ్డారు. ఐదుగురు సేనాపతులు పరలోక గతులయ్యారు. కానీ రావణునికి బుద్ధిరాలేదు. అసలు విషయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు. ఐదుగురు సేనాపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చుని ఉన్న తన కుమారుడు అక్ష కుమారుని వంక చూచాడు రావణుడు. తండ్రి అభిప్రాయాన్ని అర్ధం చేసుకున్నాడు అక్ష కుమారుడు. పైకి లేచాడు. అపార సేనావాహినితో హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి ఎనిమిది గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆప శక్యం కాదు. ఆ రథము భూమి మీద ఆకాశంలోనూ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షకుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస్త్రములు తన రథంలో పెట్టించాడు. అక్షకుమారుడు హనుమంతుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుని వెంట అశేష సేనావాహిని బయలుదేరింది.అక్షకుమారుడు అశోక వనము ముఖద్వారమును సమీపించాడు. హనుమంతుని వంక చూచాడు. అక్షకుమారునికి ఆశ్చర్యము గౌరవము ఒకేసారి కలిగాయి. అక్షకుమారుడు తన బలమును, హనుమంతుని బలమును అంచనా వేసుకున్నాడు. హనుమంతునితో ఎలా యుద్ధం చెయ్యాలో మనసులో నిర్ణయించుకున్నాడు. ముందుగా అక్షకుమారుడు మూడు బాణములను హనుమంతుని మీద ప్రయోగించి హనుమంతుని యుద్ధానికి ఆహ్వానించాడు.
అక్షకుమారుని ఆర్భాటం అంతా తోరణ స్తంభం మీది నుండి ఆసక్తితో చూస్తున్నాడు హనుమంతుడు. అక్షకుమారుడు వాడి అయిన మూడు బాణములతో హనుమంతుని తలమీద కొట్టాడు. ఆ బాణములు హనుమంతుని శిరస్సును గాయపరిచాయి. వెంటనే అక్షకుమారునితో యుద్ధానికి తలపడ్డాడు. తన శరీరమును పెంచాడు. అది చూచిన అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములను వర్షం మాదిరి కురిపించాడు. అది చూచి హనుమంతుడు పెద్దగా అరిచాడు. బుజాలు చరచుకున్నాడు.
హనుమంతుడు కాళ్లు చేతులు భయంకరంగా ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగురుతున్న హనుమంతుని చూచి అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములు వేస్తూ తాను కూడా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఆకాశంలో గిరా గిరా తిరుగుతూ అక్షకుమారుడు తన మీద ప్రయోగిస్తున్న బాణములను తప్పుకుంటున్నాడు. అలా ఆకాశంలో గిరా గిరా తిరుగుతూనే అక్షకుమారుని పరాక్రమాన్ని చూచి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు.
ఇంతలో అక్షకుమారుడు తన వాడి అయిన బాణములతో హనుమంతుని వక్షస్థలము మీద కొట్టాడు. అక్షకుమారుని యుద్ధనైపుణ్యము చూచి హనుమంతునికి ముచ్చటేసింది. బాలుడు, అపార యుద్ధనైపుణ్యము చూపుతున్న అక్షకుమారుని చంపడానికి హనుమకు మనసొప్పలేదు. అక్షకుమారుని బాణముల ధాటిని తప్పుకుంటూనే హనుమంతుడు అక్షకుమారుని గురించి ఆలోచిస్తున్నాడు.
"ఈ కుమారుడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు. మంచి యుద్ధనైపుణ్యము కలవాడు. ఇతని యుద్ధతంత్రములను దేవతలు, యక్షులు, గంధర్వులు కూడా మెచ్చుకుంటారు. ఇతడిని చంపడానికి మనసురావడం లేదు. కానీ ఇతని పరాక్రమము క్షణక్షణానికీ పెరిగిపోతూ ఉంది. ఇంక లాభం లేదు. ఇతనిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇతని మీద జాలి చూపడం మంచిది కాదు. ఇతనిని చంపక తప్పదు." అని మనసులో నిశ్చయించుకున్నాడు. హనుమంతుడు. ఎలా చంపాలా అని పధకం వేసుకున్నాడు.
హనుమంతుడు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు. మహావేగంతో కిందికి దిగుతూ అక్షకుమారుని రథమునకు కట్టిన గుర్రములను అరిచేతితో బలంగా చరిచాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ గుర్రములు కిందపడి మరణించాయి. తరువాత హనుమంతుడు అక్షకుమారుని దివ్య రథమును ఒక్కవేటుతో విరగ్గొట్టాడు. అక్షకుమారుడు రథము నుండి జారి కింద పడ్డాడు. రథము ఆకాశములో ఉన్నందున, అక్షకుమారుడు ఆకాశంలో నుండి గిరా గిరా తిరుగుతూ కిందకు జారుతున్నాడు. అంతలోనే అక్షకుమారుడు ఒక చేత్తో ఖడ్గము ధరించి పైకి ఎగిరాడు. కానీ, హనుమంతుడు అక్షకుమారుని కాళ్లు పట్టుకొని కిందికి బలంగా లాగాడు.
హనుమంతుడు అక్షకుమారుని రెండు కాళ్లు పట్టుకొని గిరా గిరా తిప్పి నేలకేసి మోదాడు. ఆ దెబ్బకు అక్షకుమారుని చేతులు, కాళ్లు, నడుము విరిగిపోయాయి. అక్షకుమారుడు నెత్తురు కక్కుకొని మరణించాడు.
అక్షకుమారుడు మరణించడం చూచిన అతని సేనలు ఇంక హనుమంతునితో యుద్ధ చేయకుండా పలాయనం చిత్తగించాయి. యుద్ధం చేయడానికి ఎవరూ లేకపోవడంతో, హనుమంతుడు తిరిగి తోరణ స్తంభము ఎక్కి ఇంకా ఎవరన్నా వస్తారా అని ఎదురుచూస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment