శ్రీమద్రామాయణం - సుందర కాండము - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 48)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

నలుబది ఎనిమిదవ సర్గ

తన కుమారుడు కూడా హనుమంతుని చేతిలో హతమైనాడు అన్న వార్త విన్న రావణునికి దిక్కుతోచలేదు. దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు. అయినా గుండె నిబ్బరం చేసుకున్నాడు. తన కుమారుడు ఇంద్రజిత్తును హనుమంతుని మీదికి యుద్ధానికి వెళ్లమని ఆదేశించాడు. ఇంద్రుని జయించిన వాడు ఇంద్రజిత్తు. మహా బలవంతుడు. పరాక్రమవంతుడు. వీర్యవంతుడు. ధైర్యవంతుడు. అప్పటి దాకా ఓటమి ఎరుగని వాడు. అటువంటి ఇంద్రజిత్తును హనుమంతుని మీదికి యుద్ధానికి పంపుతూ ఇంద్రజిత్తుతో ఇలా అన్నాడు రావణుడు.

"కుమారా! నీవు సకల అస్త్ర శస్త్ర కోవిదుడవు. నీకు తెలియని అస్త్రము లేదు. నీవు దేవతలను, అసురులను జయించిన వాడవు. నీవు బ్రహ్మదేవుని ఆరాధించి బ్రహ్మవలన బ్రహ్మాస్త్రమును పొందిన వాడవు. దేవేంద్రుడు, దేవతలు, మరుత్తులు, ఎవరు కూడా యుద్ధములో నీ ముందు నిలువలేరు. ముల్లోకములలో నిన్ను ఎదిరించి గెలిచిన వాడు లేడు. నీకు దేశ, కాల మాన పరిస్థితులను బట్టి యుద్ధము చేయడం తెలుసు. వీర్యములో కానీ, పరాక్రమములో కానీ, బుద్ధిలోకానీ, బలములోకానీ, అస్త్ర శస్త్ర నైపుణ్యములో కానీ నీకు సాటిరాగల వాడు ముల్లోకములలో లేడు. నీకు తప్పక విజయము లభిస్తుంది.

నీకు తెలిసే ఉంటుంది. ఆ వింత వానరము చేతిలో జంబుమాలి, మంత్రుల పుత్రులు ఏడుగురు, ఐదుగురు సైన్యాధ్యక్షులు మరణించారు. మన అక్షకుమారుడు కూడా మృతి చెందాడు. ప్రస్తుతము నాతో సమానమైన వాడివి నీవు మిగిలి ఉన్నావు. నీవు తొందర పడకుండా ఆ వానరుని బలమును, పరాక్రమమును తెలుసుకొని, నీ బలాన్ని శక్తిని ఉపయోగించి అతనితో యుద్ధము చెయ్యి. నా ఆశలన్నీ నీ మీదనే పెట్టుకొని ఉన్నాను. ఆ వానరుని చంపి విజయుడవై తిరిగిరా!
మరొక్క మాట. ఎంత మంది సైనికులు ఉన్నను ఆ వానరుని ముందు నిలువలేకపోతున్నారు. కాబట్టి ఎంతమంది సైనికులు ఉన్నారు అన్నది ముఖ్యంకాదు. బుద్ధిబలంతో, పరాక్రమంతో, నీ వద్ద ఉన్న అస్త్రములను, శస్త్రములను సమయానుకూలంగా ప్రయోగించి ఆ వానరుని జయించు. నేను నిన్ను నా కుమారునిగా పంపడం లేదు. యుద్ధము చేయడం రాజధర్మము. ఆ రాజధర్మము నిర్వర్తించడానికి నిన్ను పంపుతున్నాను. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు." అని పలికాడు రావణుడు.

తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు ఇంద్రజిత్తు. తండ్రికి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించాడు. సమరోత్సాహంతో తన రథాన్ని ఎక్కి యుద్ధభూమికి వెళ్లాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు ఇంద్రజిత్తు రాకను దూరంనుండే చూచాడు. ఇంద్రజిత్తు చేయుచున్న ధనుష్టంకారమును విన్నాడు. హనుమంతుడు ఇంద్రజిత్తును చూచి తన శరీరమును పెంచాడు. పెద్దగా హుంకారము చేసాడు. ఇంద్రజిత్తు ధనుష్టంకారము చేస్తుంటే హనుమంతుడు పెద్దగా అరుస్తున్నాడు.

హనుమంతుడు, ఇంద్రజిత్తు రణరంగంలోకి దిగాడు. ఇంద్రజిత్తు హనుమంతుని మీద రకరకాలైన శరములను పయోగించాడు. ఆ శరాఘాతములను తప్పించుకోడానికి హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ బాణములను ప్రయోగిస్తున్నాడు ఇంద్రజిత్తు. హనుమంతుడు చిత్ర విచిత్ర రీతులలో ఎగురుతూ ఆ బాణముల బారి నుండి
తప్పించుకుంటున్నాడు. ఇంద్రజిత్తు అటు కొడితే ఇటు, ఇటు కొడితే అటు ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రములు, శస్త్రములు అన్నీ వృధా అవుతున్నాయి.
ఒక్కోసారి హనుమంతుడు ఇంద్రజిత్తు ఎదురుగా నిలబడుతున్నాడు. చిక్కాడు కదా అని హనుమంతుని మీద బాణములు వేస్తే అంతలోనే రెండు చేతులు పైకెత్తి ఆకాశంలోకి ఎగురుతున్నాడు. ఇంద్రజిత్తు వేసిన బాణములు గురితప్పుతున్నాయి. హనుమంతుతని ఎలా జయించాలా అని ఇంద్రజిత్తు నానా రకాలుగా ఆలోచిస్తున్నాడు. హనుమంతుని లోని బలహీనత అంతుచిక్కడం లేదు ఇంద్రజిత్తుకు. అలాగే ఇంద్రజిత్తును ఎలా ఓడించాలా అని హనుమంతుడు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. కాని అతని వల్ల కావడం లేదు.

ఇద్దరూ సమఉజ్జీల మాదిరి యుద్ధం చేస్తున్నారు. గురితప్పదు అనుకున్న బాణం కూడా వ్యర్థం కావడం చూచి ఇంద్రజిత్తు ఆలోచనలో పడ్డాడు. హనుమంతుని ఎలా కొట్టాలా అని
ఆలోచిస్తున్నాడు. హనుమంతుని చంపడం తన వల్లకాదు అని అనుకున్నాడు ఇంద్రజిత్తు. కనీసము హనుమంతుని పట్టుకొని బంధించడానికి ప్రయత్నం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. బ్రహ్మాస్త్రమును మనసులో స్మరించాడు. విల్లు ఎక్కుపెట్టి అస్త్రమును సంధించాడు. బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. ఆ బ్రహ్మఅస్త్రము ధాటికి హనుమంతుని శక్తి తగ్గిపోయింది. తాను బంధింపబడుతున్నాను అని తెలుసుకున్నాడు హనుమంతుడు. తనకు ఇంతకు ముందు బ్రహ్మ ఇచ్చిన వరమును స్మరించుకున్నాడు. హనుమంతునికి తాను బ్రహ్మాస్త్రము చేత బంధింపబడుతున్నాను అని తెలిసింది.

"నేను బ్రహ్మాస్త్రమును గౌరవించాలి. బ్రహ్మాస్త్రము బారి నుండి తప్పించుకొనే శక్తి నాకు లేదు. నేను దీనికి కట్టుబడాలి. తప్పదు. అయినా నన్ను బ్రహ్మ దేవుడు, నా తండ్రి వాయుదేవుడు నిరంతరమూ రక్షిస్తూ ఉండగా నాకు భయం ఎందుకు. ఈ బ్రహ్మాస్త్రము నన్ను ఏమీ చేయలేదు. ఇలా కట్టుబడి ఉండటం వలన నాకు మరొక లాభం కూడా ఉంది. నేను రాక్షస రాజు రావణుని చూడవచ్చును. అతనితో మాట్లాడవచ్చును. రాముని సందేశము వినిపించవచ్చును. రావణుని మనోభావములు తెలుసుకొనవచ్చును." అని మనసులో అనుకున్నాడు హనుమంతుడు. అందుకని కదలక మెదలక ఊరుకున్నాడు.

రాక్షస సైన్యము హనుమంతుని చుట్టుముట్టింది. హనుమంతుని తాళ్లతో బంధించింది. తనను రాక్షసులు బంధిస్తుంటే తనకు ఇష్టం లేనట్టు నటిస్తూ పెద్దగా అరుస్తున్నాడు హనుమంతుడు. అప్పుడు రాక్షసులు హనుమంతుని పెద్ద పెద్ద తాళ్లతోనూ, నారలతో చేసిన వస్త్రములతోనూ గట్టిగా కట్టారు. హనుమంతుడు తాళ్లతో చక్కగా కట్టించుకున్నాడు.

రాక్షసులు ఎప్పుడైతే హనుమంతుని తాళ్లతో కట్టారో, బ్రహ్మాస్త్రము ప్రభావము అంతరించింది. బ్రహ్మాస్త్రము హనుమంతుని తన బంధనముల నుండి విడిచిపెట్టింది. ఎందుకంటే మరొక బంధనముతో బంధిస్తే అస్త్రబంధము విడిపోతుంది. ఈ విషయం ఇంద్రజిత్తుకు తెలుసు.

 "ఇప్పుడు ఈ వానరము బ్రహ్మాస్త్ర బంధనములో లేడు. ఈ తాళ్లు ఈ వానరమును ఏమీ చేయలేవు. ఈ బుద్ధిలేని రాక్షసులు ఈ పనిచేసారు. నేను చేసిన శ్రమ అంతా వృధా అయింది. ఈ విషయం హనుమంతునికి తెలిస్తే క్షణంలో తప్పించుకుంటాడు. ఏం చెయ్యడం" అని ఆలోచనలోపడ్డాడు ఇంద్రజిత్తు. కాని ఈ విషయం హనుమంతునికి తెలియదు అన్న విషయం గ్రహించి కాస్త ఊరట
చెందాడు.

ఇదేమీ తెలియని రాక్షసులు హనుమంతుని ఈడ్చుకొనుచూ, గుద్దుతూ, కర్రలతో, కాళ్లతో, చేతులతో తన్నుతూ రావణుని వద్దకు తీసుకొని వెళ్లారు. రావణుని ముందు నిలబెట్టారు. "మహారాజా! ఇప్పటిదాకా లంకలో అల్లకల్లోలము సృష్టించిన వానరము ఇదే" అని చెప్పారు.

ఆ సభలో ఉన్న వారికి అందరికీ ఆశ్చర్యము కలిగింది. ఈ చిన్న వానరము ఇంత పని చేసిందా? ఇంతకూ ఈ వానరము ఎవ్వరు? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు పంపారు? ఎందుకు పంపారు? లంకలో ఈ వానరమునకు ఏమి పని? ఈ వానరమునకు లంకలో ఆశ్రయము ఇచ్చినవారు ఎవరు?" అని వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకుంటున్నారు. మరి కొంత మంది పెద్దగా "వీడిని కొట్టండి. చంపండి. తినెయ్యండి. కాల్చెయ్యండి." అని పెద్దగా అరుస్తున్నారు. ఆ రాక్షసులు హనుమంతుని రావణుని ముందు నిలబెట్టారు.

రావణుడు వృద్ధులైన మంత్రుల మధ్య కూర్చుని ఉన్నాడు. రావణుడు హనుమంతుని వంక చూచాడు. హనుమంతుడు కూడా మహాతేజముతో వెలిగిపోతున్న రావణుని చూచాడు. రావణుడు తన మంత్రులను చూచి విచారణ మొదలు పెట్టమన్నాడు. అప్పుడు మంత్రులు హనుమంతుని చూచి "నీవు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు పంపారు?" అని అడిగారు.

"నేను సుగ్రీవుడు పంపగా వచ్చాను" అని హనుమంతుడు బదులు చెప్పాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)