శ్రీమద్రామాయణం - సుందర కాండము - ముప్పదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 30)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ముప్పదవ సర్గ

శింశుపా వృక్షము మీద ఆకుల మాటున దాగి ఉన్న హనుమంతుడు చెట్టు కింద జరుగుతున్న విషయములను అన్నీ ఓపికగా చూస్తున్నాడు. సీత విలపించడం, రాక్షసస్త్రీలు సీతను భయపెట్టడం, సీత బయపడటం, తిజట తనకు వచ్చిన కల గురించి రాక్షసస్త్రీలకు చెప్పడం, సీత తన దుస్థితిని తలచుకొని దుఃఖించడం అన్నీ చూస్తున్నాడు వింటున్నాడు హనుమంతుడు.
హనుమంతుని దృష్టి అంతా సీత మీదనే ఉంది.

హనుమంతుడు తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడు. “నాలుగు దిక్కులకు వెళ్లిన వానరములకు పట్టని అదృష్టం తనకు పట్టింది. సీతను తాను చూడగలిగాడు. ఎవరికీ కనపడకుండా కూర్చుని అన్నివిషయములను ఆకళింపు చేసుకున్నాను. లంకను గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాను. రావణుని గురించి అతని ప్రవర్తన గురించి బాగుగా అధ్యయనం చేసాను. రాముని భార్య సీత ఎప్పుడెప్పుడు తన భర్త రాముని చూద్దామా అని ఆతురతగా ఉంది. ఆమె దుఃఖసముద్రంలో మునిగి ఉంది. ఇప్పుడు ఆమెను కలుసుకొని ఓదార్చడం తన తక్షణ కర్తవ్యం. సీతను చూస్తుంటే ఆమె ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి కష్టములను అనుభవించినట్టులేదు. ఇప్పుడు ఆమెను కలిసి, ఆమెకు నాలుగు ఓదార్పు వచనములు చెప్పడం అత్యంత ఆవశ్యకము.
ఏదో సముద్రం దాటాను, లంకకు వచ్చాను, సీతను చూచాను అంటూ వెళ్లిపోతే నేను ఇక్కడకు వచ్చిన దానికి ఫలితం ఉండదు. నేను ఆమెకు కనపడకుండా వెళ్లిపోతే, నేను అటు వెళ్లగానే ఆమె దు:ఖము తట్టుకోలేక ఆత్మత్యాగము చేసుకుంటే, నేను పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది. అంతేకాకుండా, ఇప్పుడు నేను సీతను కలవకుండా రాముని వద్దకు వెళితే, “హనుమా! సీతను
చూచావుకదా! సీత నాతో ఏమి చెప్పమని చెప్పింది” అని అడిగితే ఏమని సమాధానము చెప్పాలి. సీత నుండి నేను సందేశము తీసుకొని వెళ్లకపోతే రాముడికి కోపం వస్తుంది కదా!

ఇప్పుడు నేను సీతను కలవకుండా వెళ్లి, సుగ్రీవుని వానరసేనలతో తీసుకొని వచ్చి రావణునితో యుద్ధము చేసి, రావణుని సంహరించి సీత కోసం వెదికితే, అప్పటికే సీత ప్రాణత్యాగము చేసుకుని ఉంటే, ఈ ప్రయత్నములన్నీ వృధా అవుతాయి కదా! అందుకని తక్షణమే సీతను కలవడం అత్యావశ్యకము. సీతను కలిసి ఆమెను ఓదార్చాలి. రామునికి సీత గురించి చెప్పి రామునీ ఓదార్చాలి. కానీ సీతను ఒంటరిగా ఎలా కలవాలి. ఈ రాక్షసస్త్రీలు ఆమెను చుట్టుముట్టి ఉన్నారు. వీళ్లు చూడ కుండా సీతను కలవడం ఎలాగ! ఇప్పుడు నేను ఈమెను కలవక పోతే ఈమె ప్రాణత్యాగము చేసుకుంటుంది. కాబట్టి ఈ రాక్షస స్త్రీలు ఏమరుపాటుగా ఉన్నప్పుడు సీతను కలవాలి. ఆమెను ఓదార్చాలి." అని అనుకున్నాడు హనుమంతుడు. 

తన శరీరం వంక చూచుకున్నాడు. చాలా చిన్న శరీరంతో ఉన్నాడు. మరలా ఇలా ఆలోచిస్తున్నాడు. “తాను వానర రూపంలో ఉన్నా సంస్కృతములో మాట్లాడగలుగుతున్నాడు. కాని తాను సంస్కృతములో మాట్లాడితే తనను రాక్షసుడు అని సీత భ్రమించగలదు. పైగా తాను వానరుడు. తాను మానుష భాషలో మాట్లాడటం అసంభవం కదా! కాని తాను మానుష భాషలో మాట్లాడితే గానీ, సీతకు అర్థం కాదు. కాబట్టి సీతకు అర్ధము అయ్యేభాషలో మాట్లాడి ఆమెను ఓదార్చాలి. అంతవరకూ బాగానే ఉంది. కానీ సీత ముందుకు ఏ రూపంలో వెళ్లాలి. వానర రూపంలో వెళితే, అసలే రాక్షసుల వలన భయపడుతున్న సీత ఇంకా భయపడుతుంది. తనను
మాయారూపములు ధరించు రావణునిగా భయపడుతుంది. అరుస్తుంది. అప్పుడు ఈ రాక్షసులు లేస్తారు. వాళ్లంతా ఆయుధములు పట్టుకొని వస్తారు. నన్ను పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తారు. నేను వాళ్లకు దొరకకుండా పారిపోగలను. కానీ వారికి అనుమానం వస్తుంది. పోనీ నా భయంకరాకారముతో కనపడితే, ఈ రాక్షస స్త్రీలు పెద్దగా అరిచి గోల చేస్తారు. అప్పుడు రాక్షస సేనలు వస్తాయి. వారితో యుద్ధం చేయాల్సివస్తుంది. వాళ్లందరినీ చంపి నేను సముద్రము ఒడ్డుకు చేరుకోవడం అసంభవమవుతుంది. నేను తిరిగి కిష్కింధకు వెళ్లకపోతే, పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. అదీ కాకుండా, నేను సీతను కలుసుకోకముందే రాక్షసులు నన్ను పట్టుకుంటే, వచ్చిన పని నెరవేరదు. నా మీద కోపంతో వారు సీతను చంపినా చంపుతారు. అప్పుడు రామకార్యము మొత్తము చెడిపోతుంది.” ఈ విధంగా అన్ని విషయములనూ కూలంకషంగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.

"ఈ ప్రదేశము లంకకు ఒక మూలగా ఉంది. ఇక్కడ కట్టుదిట్టమైన కాపలా ఉంది. ఏ మాత్రం తప్పటడుగు వేసినా తాను చావడం ఖాయం. అప్పుడు మరొకడు వచ్చి రామ కార్యమును పూర్తిచేస్తాడు అని అనుకోడానికి వీలు లేదు. వానరులలో అంత సామర్థ్యము కలవారు లేరు. సీతతో మాట్లాడితే రాక్షసులు నన్ను పట్టుకుంటారు. సీతతో మాట్లాడకుండా వెళ్లిపోతే తనకు ఏ దిక్కూలేదని సీత ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడే జడతో ఉరి పోసుకోబోయింది. కాబట్టి ఈ కార్యమును నేర్పుతో చక్కదిద్దాలి. నా వలన రామ కార్యము చెడింది అన్న అపవాదు నాకు
రాకూడదు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో నిర్ణయించుకున్న తరువాత కూడా, అవివేకుడైన దూత వలన కార్యము మొత్తము చెడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దూతకు తనకు అంతా తెలుసు అన్న అహం పనికిరాదు. అహంకారులు, దురభిమానులు అయిన దూతలవలన కార్యము సర్వనాశనము అవుతుంది. కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం వలన కార్యం సానుకూలం కావాలి గానీ, చేసిందంతా చెడిపోకూడదు. అందుకని, ఎవరూ చూడకుండా సీతను కలవాలి. తనను తాను తెలియ పరచుకోవాలి. సీత తనను చూచి భయపడకుండా చూచుకోవాలి. సీతకు తన మీద నమ్మకం కలిగించుకోవాలి. ఇవన్నీ నేర్పుగా సాధించాలి. ఇప్పుడు నేను ఈమెకు కనపడకుండా రాముని గురించి కీర్తిస్తే సీతకు నా మీద నమ్మకం కుదిరే అవకాశం ఉంది. పైగా సీత తనను చూచి భయపడదు. కాబట్టి రాముని గురించి కీర్తించడం ఒక్కటే ప్రస్తుత కర్తవ్యము." అని మనసులో నిశ్చయించుకున్నాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ముప్పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)