శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 27)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది ఏడవ సర్గ
సీతకు ఎంత చెప్పినా లాభం లేదు అనుకున్నారు రాక్షస స్త్రీలు. వారిలో కొంతమంది సీత గురించి, సీత మూర్ఖత్వాన్ని గురించీ రావణునికి తెలియజెయ్యాలని వెళ్లారు. మిగిలిన రాక్షస వనితలు మరలా పరుష వాక్యములతో సీతను నిందించడం మొదలెట్టారు.
"సీతా! ఇంక నీకు ఏమి చెప్పీ ప్రయోజనము లేదు. నిన్ను తినడం తప్ప మారు మరోమార్గము లేదు." అని సీత మీద పడి చంపుదామని అనుకుంటూ ఉండగానే వారిలో ఒక వృద్దరాక్షసి త్రిజట అనే పేరుకలది అప్పటి దాకా నిద్రపోతూ ఉంది. రాక్షస వనితల ఆర్భాటము చూచి నిద్రలేచింది. తన తోటి రాక్షస స్త్రీలను చూచి ఇలా అంది.
“ఏమిటే! ఏమి చేస్తున్నారు? మూర్ఖుల్లారా! మీరు ఎవరిని చంపి తింటున్నారో తెలుసా! దశరధుని కోడలిని. రాముని భార్యను. మీరు సీతను తినడం లేదు. మిమ్మల్ని మీరే చంపుకొని తింటున్నారు. అసలు సంగతి చెబుతాను వినండి. నేను ఇప్పటిదాకా నిద్రపోతున్నానా! ఆ నిద్రలో నాకు ఒళ్లు గగుర్పొడిచే ఒక కల వచ్చింది. అదీ ఈ తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు కదా! ఆ కలలో రాక్షసులు అంతా నాశనమైనట్టు, రాముడు సీతను తీసుకువెల్లినట్టు కల వచ్చింది. తెలుసా!" అని కాసేపు ఆగింది.
ఆ మాటలకు ఆ రాక్షస వనితల శరీరంలో వణుకు పుట్టింది. “త్రిజటా! నిజంగానా! నీకు అలాంటి కల వచ్చిందా. అబ్బా వివరంగా చెప్పవే. ఇక్కడ మేము భయంతో వణికి చస్తున్నాము. తొందరగా చెప్పు." అని తిజటను తొందర చేసారు.
వారితో త్రిజట ఇలా చెప్పసాగింది. "సీత మొగుడు రాముడు, రాముని తమ్ముడు లక్ష్మణుడు తెల్లని వస్త్రములు ధరించి ఒక పల్లకీ ఎక్కి వస్తున్నారు. ఆ పల్లకీని వెయ్యి హంసలు మోసుకొని ఎగురుకుంటూ వస్తున్నాయి. మన సీత కూడా తెల్లని వస్త్రములు ధరించి దేదీప్యమానంగా వెలుగుతూ కనపడింది. రాముడు సీతను తన వెంట తీసుకొని వెళ్లాడు. అంతలో నాకు నాలుగు దంతములు కలిగిన ఒక ఏనుగు కనపడింది. సీత, రాముడు, లక్ష్మణుడు ఆ ఏనుగు ఎక్కి వెళుతున్నారు. రాముడు, లక్ష్మణుడు తెల్లని వస్త్రములు ధరించి సీత దగ్గరకు రావడం నేను చూచాను. రాముడు ఎక్కిన ఏనుగు సీత ముందుకు వచ్చి ఒంగింది. సీతకు రాముడు చెయ్యి అందిచ్చాడు. రాముని చెయ్యి పట్టుకొని సీత ఆ ఏనుగు మీదికి ఎక్కింది. తరువాత ఏం జరిగిందో తెలుసా!" అని ఆగింది త్రిజట.
అప్పటికే భయంతో వణుకుతున్న రాక్షసులు “ఏం జరిగిందే!” అని అడిగారు.
“అప్పుడు ఆ ఏనుగు రాముని, సీతను ఎక్కించుకొని లంకమీద నిలబడింది. ఇంతలో ఆ దృశ్యం మారి పోయింది. తెల్లటి ఎనిమిది ఎద్దులు కట్టిన ఒక రథం కనిపించింది. అందులో రాముడు సీత కూర్చుని ఉన్నారు. అంతలో దృశ్యము మారి పోయింది. రాముడు, లక్ష్మణుడు, సీత కలిసి పుష్పక విమానము ఎక్కి ఉత్తర దిక్కుగా వెళ్లిపోయారు. నా స్వప్నంలో రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తిలా ప్రకాశిస్తున్నాడు. ఇంక మన రావణుడు ఆ రాముని ఎలా జయిస్తాడు?
మీకు ఇంకో సంగతి తెలుసా! మన రావణుడు ఎర్రని వస్త్రములు ధరించి, ఎర్రని పూల మాలలు వేసుకొని, ఒంటి నిండా నూనె పూసుకొని, నూనె తాగుతూ, కిందపడి దొర్లుతూ ఉండటం నేను నా స్వపంలో చూచాను. అంతలోనే రావణుడు నున్నగా గుండు కొట్టించుకొని కనపడ్డాడు. అప్పుడు రావణుడు నల్లని వస్త్రములు ధరించి ఉన్నాడు. రావణుడు పుష్పక విమానం నుండి అమాంతం కింద పడ్డాడు. అప్పుడు ఒక ఆడది పుష్పకము నుండి కింద పడ్డ రావణుని నేలమీద ఈడ్చుకుంటూ వెళుతూ ఉంది." అని ఆగింది.
రాక్షస స్త్రీలు భయంతో వణికిపోతున్నారు. త్రిజట చెప్పింది నోళ్లు వెళ్లబెట్టి వింటున్నారు. మరలా త్రిజట చెప్పడం మొదలెట్టింది.
"ఇంతలో మరొక దృశ్యం. ఇందాక చెప్పానే, రావణుడు ఎర్రటి వస్త్రములు కట్టుకున్నాడని, అలాగే రావణుడు నూనె తాగుతూ గాడిదలు కట్టిన రథం ఎక్కి, రథం మీద పిచ్చివాడిలా నృత్యం చేస్తూ దక్షిణ దిక్కుగా పోతున్నాడు. పోతూ పోతూ జారి రథంనుండి తలకిందులుగా కిందపడ్డాడు. కింద పడ్డ రావణుడు పైకి లేచాడు. పిచ్చి పిచ్చి గా మాట్లాడుతున్నాడు. ఒంటిమీద బట్టలు చించుకున్నాడు. విప్పుకున్నాడు. దిగంబరంగా నృత్యం చేస్తున్నాడు. అక్కడే ఉన్న ఒక చెడువాసన వేస్తున్న బురద గుంటలో పడిపోయాడు. మునిగిపోయాడు. అంతే. మళ్లీ పైకి లేవలేదు.
అంతలోనే దృశ్యం మారింది. నల్లని వస్త్రములు కట్టుకున్న ఒకత్తి రావణుని మెడకు ఉరి తాడు బిగించి లాగుకుంటూ దక్షిణ దిక్కుగా ఈడ్చుకుంటూ వెళ్లింది. మీకు తెలుసో లేదో! రావణుని తమ్ముడు కుంభకర్ణుడు, రావణుని కుమారులు కూడా ఇలాగే నూనె తాగుతూ బురదగుంటలో పడిపోతున్నారు. వాళ్లను కూడా నేలమీద పడేసి ఈడ్చుకుంటూ వెళుతున్నారు. రావణుడు పందినీ, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటెను, ఎక్కి దక్షిణ దిశగా వెళ్లడం నాకు కలలో కనపడింది. కానీ విభీషణుడు మాతం తెల్లని వస్త్రములు ధరించి తెల్లని గొడుగు ధరించి నాలుగు దంతాలు కల ఏనుగు ఎక్కి ఆకాశంలో తిరుగుతున్నాడు.
వీళ్ల సంగతి ఇలా ఉంటే, రావణుని అనుచరులు అయిన రాక్షసులు కూడా నూనె తాగుతూ ఎర్రని వస్త్రములు కట్టుకొని మద్యము తాగుతూ పిచ్చిపిచ్చిగా ఆడుతున్నారు. ఇంక ఈ లంకా నగరం లోని ఇళ్లు, గోపురములు తోరణములు, అన్నీ కూలిపోయాయి. సముద్రము పొంగి లంకను మొత్తం ముంచేసింది. " అని త్రిజట భయంకరంగా చెబుతుంటే రాక్షసస్త్రీలు వణికిపోతున్నారు.
ఇప్పటి దాకా రావణునికి ప్రియం చేకూర్చడానికి సీతను భయపెట్టారు కానీ, ఆ రావణునికే దిక్కులేకుండా లంక మొత్తం మునిగిపోతుంటే వాళ్లు బెంబేలు ఎత్తిపోయారు. ఇంకా త్రిజట ఏం చెబుతుందో అని భయపడి చస్తున్నారు. త్రిజట మరలా చెప్పడం మొదలెట్టింది.
“మీకు మరో సంగతి చెప్పడం మరిచిపోయాను. మన లంకలోకి ఒక కోతి వచ్చింది. ఆ కోతి రాముడు పంపగా వచ్చిందట. ఆ కోతి లంకను మొత్తం తగలపెట్టింది. ఇదంతా నాకు కలలో కనపడింది. లంక అంతా తగలబడి పోతుంటే రాక్షస స్త్రీలు అందరూ నూనెలు తాగుతూ పిచ్చిపిచ్చిగా గంతులువేస్తున్నారు. కుంభకర్ణుడు మొదలగు రాక్షసులు అందరూ బురద గుంటలలో కూరుకుపోయారు. ఇదీ నాకు వచ్చిన కల.
దీనిని బట్టి చూస్తే రావణుడు చావడం ఖాయం. కాబట్టి మనమన్నా బతుకుదాము. సీతను వదిలి పెట్టి వెళ్లిపోండి. లేకపోతే తన భార్యను భయపెట్టిన మీ అందరినీ కూడా రాముడు చంపుతాడు. ఎందుకుంటే రాముడికి తన భార్య సీత అంటే ప్రాణం. సీతను ఎవరు ఏమన్నా రాముడు సహించడు. వాళ్లను చంపేదాకా వదలడు. మనకెందుకు చెప్పండి. సీతకు మంచిగా చెప్పిచూద్దాము. రావణుని మాటలు విని సీతను భయపెట్టి మన ప్రాణాల మీదికి తెచ్చుకోడం ఎందుకు. పైగా నాకు ఈ కల తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారు జామున వచ్చిన కల జరుగుతుంది అంటారు.
ఇదంతా ఎందుకు చెప్పండి! సీత కోసరం రాముడు వస్తాడు. ఆమెను రావణుని వద్దనుండి తీసుకొని వెళతాడు. మధ్యలో మనం చస్తాము. ఇప్పటిదాకా సీతను భయపెట్టినా ఏమీ ప్రయోజనం లేదు కదా! అందుకని ఇంక సీతను భయపెట్టడం మానేద్దాము. మంచిమాటలు చెబుదాము. ప్రార్ధిద్దాము. మనం సీతను మంచి చేసుకున్నాము అనుకో సీత రామునికి చెప్పి మనలను ఏమీ చెయ్యకుండా రక్షిస్తుంది. ఎందుకంటే నాకు వచ్చిన కలను బట్టి చూస్తే రాముడు రావడం రావణుడు చావడం తథ్యం అనిపిస్తూ ఉంది.
అటు చూడండి. సీతకు ఎడమ కన్ను ఎడమ భుజము అదురుతూ ఉంది. ఇవి శుభ సూచకములు. కాబట్టి రాముడు తొందరలోనే లంకకు వస్తాడు. సీతను చెర నుంచి విడిపిస్తాడు." అని త్రిజట తనకు వచ్చిన స్వప్నమును గురించి రాక్షస స్త్రీలకు వివరించింది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment