శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 26)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఇరువది ఆరవ సర్గ

అతి చిన్నవయసులోనే ఇన్ని కష్టములను పడుతున్న సీత, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. నేల మీద పడి దొర్లుతూ ఏడుస్తూ ఉంది. "ఓ రామా! నీవు ఇంటలేని సమయంలో ఈ రాక్షసుడు నన్ను ఎత్తుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ రాక్షసులు నన్ను దారుణంగా భయపెడుతున్నారు. ఇన్ని బాధలు పడుతూ జీవించడం దుర్భరంగా ఉంది.

ఓ రామా! నీవే లేనపుడు నాకు ఈ ఆభరణములతోనూ, ప్రాణములతోనూ పని ఏముంది. ఇటువంటి కష్టములు మరొకరికి వచ్చి ఉంటే వారి హృదయము ఈ పాటికి బద్దలయి ఉండేది. కానీ నా హృదయము పాషాణము. ఇనుముతో చేయబడింది. అందుకనే ఆగిపో లేదు. ఇంకొ కొట్టుకుంటూ ఉంది. ధర్మశాస్త్రము ప్రకారము భర్త దగ్గర లేకుండా భార్య క్షణకాలం కూడా జీవించ కూడదు. కాని నేను నీవు దగ్గర లేకుండా ఇంతకాలము జీవించి ఉన్నాను. నేను ఎంతటి పాపాత్మురాలనో కదా! ఈ భరత ఖండమునకు ప్రభువు అయిన నా రాముని విడిచి ఉన్న నాకు, ఈ భోగముల మీద కానీ, సుఖముల మీద కానీ, ఆఖరుకు ఈ జీవితము మీద కానీ ఆసక్తి లేదు. నేను ఇంక క్షణకాలం కూడా జీవించి ఉండలేను. వీళ్లు నా శరీరమును చీల్చినా సరే, తిన్నా సరే, నాకు సంబంధము లేదు. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంక ఈ కష్టములను, దుఃఖమును భరించడం నా వల్లకాదు. ఆఖరుకు చావనైనా చస్తాను కానీ, ఆ రావణుని నా ఎడమకాలుతో కూడా తాకను. అయినా ఆ రావణుడు ఎంత మూర్ఖుడు. నువ్వు అంటే నాకు ఇష్టం లేదురా అంటే కూడా వినడు. నన్ను వరించమని నా వెంటపడుతున్నాడు. కనీసం తాను పుట్టిన కులము, వంశము గురించి కూడా ఆలోచించడం లేదు. నా కాళ్ల మీద పడుతున్నాడు.

ఓసీ రాక్షసులారా! మీరు నన్ను కొయ్యండి. నరకండి. అగ్నిలో పడెయ్యండి. మీ ఇష్టం వచ్చినట్టు భయపెట్టండి. నేను మాత్ర ము మీ రావణుని వంక కన్నెత్తికూడా చూడను. నా రాముని గురించి మీకు తెలియదు. అత్యంత పరాక్రమ వంతుడు. మంచి జాలి గుండె కలవాడు. కాని ఎందుకో నా మీద జాలి చూపడం లేదు. లేకపోతే ఈ పాటికి ఈ లంకకు వచ్చి రావణుని చంపి నన్ను తీసుకుపోవాలి కదా! ఎందుకంటే, జన స్థానములో 14,000 మంది రాక్షసులను ఒంటి చేత్తో చంపిన రామునికి అల్పుడైన ఈ రావణుడు ఒక లెక్కా! ఒక్క బాణంతో ఈ రావణుని నేలకూర్చగలడు. మరి ఎందుకు రావడం లేదు. రామునికి నా మీద ప్రేమ తగ్గిందా అని అనుమానంగా ఉంది.
దండకారణ్యంలో విరాధుని చంపిన వీరుడు రాముడు నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు? ఈ లంక సముద్ర మధ్యలో ఉంది అని సందేహిస్తున్నాడా! రామబాణమునకు అడ్డేముంది? ఒక రాక్షసుడు మాయ చేత నన్ను అపహరించాడు అని రామునికి తెలుసు కదా! మరి రాముడు నన్ను రక్షించడానికి రాకపోవడానికి కారణం ఏమైఉంటుంది? అంటే రామునికి నేను ఇక్కడ లంకలో, రావణుని చెరలో ఈ అశోక వనములో ఉన్నాను అని తెలిసి ఉండకపోవచ్చు. తెలిస్తే ఎందుకు రాడు! రావణుడు నన్ను ఇక్కడ దాచాడు అని ఏ మాత్రం తెలిసినా ఈ అవమానమును సహించి ఊరుకోడు. తప్పకుండా వస్తాడు. నన్ను విడిపిస్తాడు.

నన్ను రావణుడు అపహరించి తీసుకొని వస్తుంటే జటాయువు అనే పక్షిరాజు నన్ను రక్షించడానికి ప్రయత్నించి రావణుని చేతిలో మరణించాడు. ఆ పక్షిరాజు వృద్ధుడైనా తన వంతు ప్రయత్నం తాను చేసాడు. వృద్ధుడైన జటాయువు చేసినంత మాత్రం రాముడు చేయలేడా! నేను ఇక్కడ ఉన్నట్టు తెలిస్తే, రాముడు లంకకు వచ్చి రావణుని చంపడా! రాముడు తలుచుకుంటే, అసలు ఈ లోకంలో రాక్షసుడు అనే వాడు లేకుండా చేస్తాడు కదా! కానీ నా రాముడు ఎందుకు రావడం లేదో అర్ధం కావడం లేదు. రాముడు తలచు కుంటే ఈ సముద్రమును ఇంకింపచేసి, లంకకు వచ్చి రావణుని చంపి, నన్ను తీసుకువెళ్లాలి కదా! మరి రాముడు ఎందుకు తలచు కోలేదు?
రాముడు వచ్చి ఈ లంకలో ఉన్న రాక్షసులందరినీ చంపితే, ఆ రాక్షసుల భార్యలు కూడా నా మాదిరి ఏడుస్తారేమో! అప్పుడు ప్రతి ఇంట్లో కూడా రాక్షస స్త్రీల ఏడుపులు వినిపిస్తాయేమో! రాముని కంట పడిన తరువాత ఈ రావణుడు క్షణకాలం కూడా జీవించి ఉండలేడు. కానీ రాముడు ఇక్కడకు రావాలి కదా! ఎప్పుడు వస్తాడో ఏమో! నా రాముడు రావాలే కానీ, ఈ లంక శ్మశానంగా మారడం ఎంతసేపు! లంక అంతా శవాలు కాలుతున్న పొగతో నిండి పోతుంది. లంక మీద శవాల కోసరం గద్దలు ఎగురుతుంటాయి.

ఓ రాక్షసులారా! ఈ లంక దానితో పాటు మీరందరూ సర్వనాశనం అయ్యేరోజు దగ్గరలోనే ఉంది. ఎందుకుంటే లంకలో అశుభ శకునములు చాలా కనపడుతున్నాయి. చాలా తొందరలోనే రావణుడు చావడం, ఈ లంక తన వైభవాన్ని కోల్పోవడం జరుగుతుంది. రావణుడు, రాక్షసులు అందరూ మరణిస్తే, లంకలో రాక్షస స్త్రీలు మాత్రం మిగులుతారు. లంకతో పాటు వారూ అనాధలు అవుతారు. ఇంటింటా రాక్షస స్త్రీల ఏడుపులను నేను త్వరలోనే వింటాను.

ఇదంతా జరగాలంటే నేను ఇక్కడ ఉన్నట్టు రామునికి తెలియాలి కదా! రామునికి నేను రావణుని అధీనములో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? రావణుడు నాకు పెట్టిన రెండు నెలల గడువు కూడా అయిపోవచ్చింది. అలాంటి గడువు మృత్యు దేవత ఆ రావణునికి ఎందుకు పెట్టలేదు. గడువు తీరిపోగానే మృత్యువు వాడినే కబళించవచ్చు కదా.

పచ్చి మాంసము తినే ఈ రాక్షసులకు ధర్మం అంటే ఏమిటో అధర్మం అంటే ఏమిటో అసలు తెలియదు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ఏమీ తెలియదు. తెలిస్తే కోరి కోరి ఇంతటి ఉపద్రవాన్ని కొనితెచ్చుకుంటారా! ఏం చేస్తాం. గడువు తీరి పోగానే ఆ రాక్షసుడు రావణుడు నన్ను తన ప్రాతఃకాల భోజనం లోకి నంజుకుంటాడు. ఈ రెండు నెలల కాలంలో, ఎక్కడో ఉన్న రాముడు ఇక్కడకు ఎలా వస్తాడు? నన్ను ఎలా రక్షిస్తాడు? ఇక్కడ నాకు ఇంత విషం ఇచ్చే దిక్కు కూడా లేదు. లేకపోతే హాయిగా విషం తాగి యమలోకం చేరుకొనే దాన్ని.

ఇంతకూ రాముడికి నేను ఇక్కడ ఉన్నట్టు తెలిసి ఉండదు. లేకపోతే నన్ను వెదకకుండా ఉంటాడా! అసలు రాముడు బతికి ఉన్నాడా లేక నా వియోగాన్ని భరించలేక ఈ లోకాన్ని విడిచిపెట్టాడా! ఈ లోకంలో ఉంటే నన్ను వెదుక్కుంటూ రాకుండా ఉంటాడా! ఈ లోకంలో రాముని చూచే అదృష్టానికి నేను నోచుకోలేదు కానీ స్వర్గంలో ఉన్న దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు రాముని దివ్యదర్శన భాగ్యమునకు నోచుకున్నారు. కాదు. అలా ఎన్నటికీ జరగదు. నా ఊహ అబద్ధము. రాముడు ఎన్నటికీ నన్ను విడిచి స్వర్గానికి ఒంటరిగా వెళ్లడు. కాకపోతే రాముడు రాజర్షి కదా! అందుకని రామునికి నా అవసరము ఏముంటుంది. అందుకని నన్ను మర్చిపోయి ఉండవచ్చు. అందుకనే నా కోసరం రాలేదు. లోకంలో ప్రజలకు భార్య ఎదురుగా ఉన్నప్పుడే ప్రేమలు అనురాగాలు పొంగి పొర్లుతుంటాయి. భార్య కాస్త కనుమరుగు అయితే ఆ ప్రేమానురాగాలు ఆవిరి అయిపోతాయి లేక మరొకరి మీదకు మరలుతాయి.

కాని నా రాముడు అలాంటి వాడు కాడు. నా మీద ఉన్న ప్రేమను అంత సులభంగా మర్చిపోడు. నేను రాముడిని అనవసరంగా శంకిస్తున్నాను. రాముడికి దూరమై కృంగిపోతున్నాను. సద్గుణములు లేని వారే భర్తకు దూరం అవుతారు. అంటే నాలో సద్గుణములు లేవా! నా పుణ్యము క్షీణించి పోయిందా! నా సౌభాగ్యము అంతరించిందా! ఎందుకిలా జరుగుతూ ఉంది? దీనికంతటికీ కారణమేమి! ఎంత ఆలోచించినా ఏమీ అంతు చిక్కడం లేదు.

దీని కంతటికీ ఒకే పరిష్కారము. రాముడు లేకుండా నేను జీవించి ఉండటం వృధా. నాకు మరణమే శరణ్యము. రామలక్ష్మణులు అడవులలో ఆకులలములు తింటూ కృంగి కృశించి పోతుంటే, నేను జీవించి ఉండటం వలన లాభం ఏమిటి! లేదా! ఈ రావణుడు తన మనుషులతో రామలక్ష్మణులను చంపించాడేమో! అప్పుడు కూడా నేను బతికి ఉండటం వృధా! ఏది ఏమైనా నేను మరణించక తప్పదు.

ఎన్ని కష్టాలు వచ్చినా మాలాంటి మామూలు వారికే గానీ, జితేంద్రియులు, తపశ్శాలులు అయిన మహాత్ములకు కష్టములే ఉండవు కదా! వారికి ఇది కావాలి అనికానీ, ఇది వద్దు అని కానీ ఉండదు. వారు దేనికోసరమూ వెంపర్లాడరు. ఏది వచ్చినా వద్దనరు. వారికి సుఖము దు:ఖము సమానములు. వారు ధన్యజీవులు. వారందరికీ నా నమోవాచకములు. నేను ప్రస్తుతము అదే స్థితికి చేరుకున్నాను.
రాముడు లేని ఈ లోకంతోనూ, ఈ జీవితంతోనూ నాకు పనిలేదు. నేను ప్రాణత్యాగము చేస్తాను.” అని ధృఢంగా నిశ్చయించుకుంది సీత.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)