శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 25)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది ఐదవ సర్గ
అంత:పుర కాంతల మధ్య, మృదుమధుర వీణావాదలను వింటూ, ఆహ్లాదంగా గడపవలసిన సీతకు, ఈ ప్రకారంగా అతి వికారంగా, క్రూరంగా కనపడుతున్న రాక్షస స్త్రీల మధ్య వారి పరుషమైన మాటలను, బెదిరింపులను వింటూ ఉంటూ దు:ఖము ముంచు కొచ్చింది. శరీరం అంతా భయంతో కంపించిపోయింది. నోట మాట రావడం లేదు. అతి ప్రయత్నం మీద నోరుపెగల్చుకొని ఇలా అంది."చూడండీ. నేను మానవ కాంతను. నేను రాక్షసుని వరించడం కలలోని మాట. మీరు చంపి తిన్నా సరే నా నిశ్చయం ఇదే. ఇప్పటి దాకా రావణుడు భయపెట్టాడు. ఇప్పుడు మీరు భయపెడు తున్నారు. ఎవరెన్ని భయపెట్టినా నా నిశ్చయం మారదు. ఇంక మీ ఇష్టం.” అని పలికింది. తోడేళ్ల మధ్య ఉన్న లేడి పిల్లలాముడుచుకొని కూర్చుంది సీత.
రాముని గురించి విలపించసాగింది. "హా రామా! హా లక్ష్మణా! ఎక్కడున్నారు మీరు. అయ్యో కౌసల్యాదేవీ! చూడండి నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో! హా సుమిత్రా! మాతో పాటు మీ కుమారుడు లక్ష్మణుడు కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాడు. నేను నా రామునికి దూరంగా ఉన్నాను. ఈ రాక్షస స్త్రీల మధ్య ఉన్నాను వీరి బెదిరింపులకు వణికిపోతున్నాను. ఇంక ఒక్క క్షణకాలము కూడా జీవించలేను. ఎవరైనా కానీ, మరణించాలని కోరుకున్నా కూడా, వారికి మరణం ఆసన్నమయ్యే వరకూ జీవించి ఉండటం తప్పదు కదా. అందుకే జీవించి ఉన్నాను. నా రాముడు ఎన్నటికైనా రాకపోతాడా నన్ను ఈ కష్టముల నుండి రక్షించక పోతాడా అనే ఆశతో జీవించి ఉన్నాను. నేను ఏ జన్మలో తక్కువ పుణ్యం చేసుకున్నానో, ఈ జన్మలో నా భర్తకు దూరమై ఈ రాక్షసుల మద్య బతుకుతున్నాను.
అటు నా భర్తకు దగ్గరవలేను. ఇటు ఈ రాక్షసులకు లొంగి పోయి వారు చెప్పినట్టు వినలేను. నడి సముద్రంలో నావలాగా కొట్టుకుంటున్నాను. అయినా జీవితాంతం భర్తతో కలిసి జీవించే సుఖం కూడా అందరికీ లభించదు. కేవలం కొంతమంది అదృష్టవంతులకే సుఖం దక్కుతుంది. అతి భయంకరమైన విషము తిన్న తరువాత జీవించడం ఎంత కష్టమో, నా రాముని విడిచి ఉండటం అంతే కష్టంగా ఉంది నాకు. పూర్వజన్మలో ఏం పాపం చేసానో ఈ జన్మలో నా భర్తకు దూరమై అష్టకష్టములు అనుభవిస్తున్నాను.
ఓ రామా! నిన్ను విడిచి నేను జీవించలేను. నేను చచ్చిపోదామన్నా ఈ రాక్షసులు నన్ను చావనివ్వడం లేదు. ఏంచెయ్యాలి? ఇష్టం వచ్చినప్పుడు చావడానికి కూడా స్వేచ్ఛలేని ఈ మనుష్యజీవితము ఎంతో దుర్భరం కదా!" అని పలువిదములుగా విలపిస్తూ ఉంది సీత.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది ఐదవ సర్ద సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment