శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 24)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఇరువది నాలుగవ సర్గ

ఆ ప్రకారంగా సీత చుట్టు ఉన్న రాక్షస స్త్రీలు సీతకు రావణుని వరించమని, నయానా భయానా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాని సీతలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. అయినా వాళ్లు తమప్రయత్నాలు వదలడంలేదు.

“ఓ సీతా! నువ్వు ఎప్పుడూ రావణుని అంత:పురమును చూడలేదేమో! చాలా బాగుంటుంది. ఆ శయన మందిరములు, హంసతూలికా తల్పములు, మణిమాణిక్యములతో అలంకరింపబడిన దీపములు, ఇంకా ఎన్నో అలంకరణ వస్తువులు ఉన్నాయి. మరి అటువంటి భోగములు ఎందుకు వదులుకుంటావు? అవునులే రావణుడు రాక్షసుడు అని కదా నీ బాధ. నీవు మానవ కాంతవు. నీవు మరొక మానవుడికి మాత్రమే భార్యగా ఉండటానికి ఇష్టపడుతున్నావు. కానీ ఒక్కసారి రాక్షసుని సాంగత్యము పొందితే జన్మలో మరిచిపోవు. ఎందుకంటే నీ రాముడు అయోధ్యకు మాత్రమే రాజు. రావణుడు మూడులోకములకు రాజు. మరి ఎవరు ఎక్కువ చెప్పు. అందుకని రావణుని వరించి సుఖించు. అయినా రాముడు కేవలం మానవుడు. రాజ్యము పోగొట్టుకొని అడవులు పట్టుకొని తిరుగుతున్నాడు. వాడితో నీవు ఏం సుఖాలు అనుభవించగలవు. రాముడితో చేరితే నీకు కష్టాలు తప్ప సుఖాలు ఉండవు. రావణుని వరిస్తే నీకు సుఖాలు తప్ప కష్టాలు అంటే ఏమిటో తెలియవు. కాబట్టి మా మాటలు విని రావణుని వరించు.” అని సీతకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు ఆ రాక్షస స్త్రీలు. వారి మాటలన్నీ ఓపిగ్గా వింది సీత. కన్నీరు కార్చింది. చీర కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ వారితో ఇలా అంది.

“మీరందరూ మీ ప్రభువును కీర్తిస్తూ నాతో అనకూడని మాటలు అంటున్నారు. అలా నాతో పరపురుషుడి గురించి మాట్లాడటం మీకు పాపము అనిపించడం లేదా! నేను మానవ కాంతను.
రావణుడు రాక్షసుడు. ఎక్కడైనా మానవులు రాక్షసులను వరిస్తారా? మీరు నన్ను ఖండ ఖండములుగా ఖండించినా నేను ఒక రాక్షసుని వరించడానికి ఒప్పుకోను. నా రాముడికి రాజ్యము లేకపోవచ్చు. అడవులు పట్టి తిరుగుతుండవచ్చు. భార్యను పోగొట్టుకొని దీనుడి మాదిరి శోకిస్తూ ఉండవచ్చు అయినా రాముడే నా భర్త, నా దైవము. నా ప్రేమ, నా అనురాగము, నా భర్తకే గానీ వేరే వాళ్లకు కాదు. శచీదేవికి ఇంద్రుని మీద వలె, అరుంధతికి వసిష్ఠుని మీద వలె, రోహిణికి చంద్రుని మీద వలె, లోపాముద్రకు అగస్త్యుని మీద వలె, సుకన్యకు చ్యవనుని మీద వలె, సావిత్రికి సత్యవంతుని మీద వలె, శ్రీమతికి కపిలుని మీద వలె, మదయంతికి సౌదాసుని మీద వలె, కేశినికి సగరుని మీద వలె, దమయంతికి నలుని మీద వలె, నాకు రాముని మీద అమితమైన ప్రేమ, అనురాగము. నేను రాముని అనుసరిస్తాను కానీ పరపురుషుని కాదు. కాబట్టి మీ మాటలతో నన్ను ప్రలోభపెట్టడం మానండి." అని పలికింది సీత.

సీత మాటలు విన్న రాక్షస స్త్రీలకు కోపం మిన్నుముట్టింది. కోపంతో ఊగిపోయారు. రావణుడు రావడం, ఏదేదో మాట్లాడటం, సీత దానికి సమాధానం ఇవ్వడం, రాక్షసస్త్రీలు సీతను బెదిరించడం
సీత వారికి తగురీతిగా సమాధానం ఇవ్వడం అంతా చెట్టు పైన కూర్చున్న హనుమంతుడు చూస్తున్నాడు వింటున్నాడు. హనుమంతునికి ఆ రాక్షసులను పట్టుకొని ఒక్కొక్క రాక్షసిని ఉతుకుదామని అనిపించింది. కానీ ఆ సమయంలో తాను బయట పడటం మంచిది
కాదనీ, రామ కార్యం చెడుతుందనీ ఆలోచించి, తన కోపాన్ని అణుచుకున్నాడు. ఆ రాక్షస స్త్రీల మాటలు ఓపిగ్గా వింటున్నాడు.

సీత మాటలు విన్న రాక్షస వనితలు కోపంతో ఊగిపోయారు. వీరంగం తొక్కారు. సీతను చంపుదామని నోళ్ళు పెద్దగా తెరిచి, నాలుకలు బయట పెట్టి సీత మీది మీదికి వచ్చారు. మరి కొందరు తమ ఆయుధములను చేత ధరించి “ఇంక ఈమె జీవించి ఉండటం వ్యర్ధము. ఈమె రావణుని భార్యగా ఉండటం తగదు. కాబట్టి చంపండి. నరకండి" అని అరుస్తున్నారు. వాళ్ల మధ్య ఉండటం ఇష్టం లేక, సీత అక్కడి నుండి దూరంగా వెళ్లి నిలబడింది. ఆ రాక్షస వనితలు ఆమెను వదల లేదు. బిలబిల మంటూ వారంతా ఆమె దగ్గరకు పోయి ఆమె చుట్టు నిలబడ్డారు. పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ సీతను భయపెడుతున్నారు.

వాళ్లలో ఉన్న వినత అనే రాక్షసి సీతను చూచి ఇలా అంది. “చూడు సీతా! ఇప్పటిదాకా నీవు నీ రాముని మీద చూపిన ప్రేమ చాలు. ఇంక రాముని విడిచిపెట్టు. ఏదీ అతి చేయవద్దు. అతి అన్ని
విధాలా అనర్థకము. సమయాన్ని బట్టి పోవాలి కానీ మూర్ఖపు పట్టుదల పనికిరాదు. మూర్ఖంగా ప్రవర్తించి కష్టములను కొనితెచ్చుకోకు. నువ్వు ఇప్పటి దాకా మనుష్య ధర్మముల గురించి చెప్పావు. నేను చెప్పేదికూడా విను. ముల్లోకములలో ఉన్న రాక్షసులకందరికీ ప్రభువు రావణుడు. ఆయనే నీకు తగిన భర్త. రావణుడు అత్యంత పరాక్రమ వంతుడు, సుందరుడు. శూరుడు. దేవేంద్రునితో సమానుడు. త్యాగధనుడు. అందరికీ ఆనందం కలిగించేవాడు. కేవలం ఒక దీనుడైన మానవుని కోసరం త్రిలోకాధిపతి అయిన రావణుని తిరస్కరించకు. నేటి నుండి నువ్వు కూడా త్రిలోకములకు మహారాణివి అవుతావు. రావణుని వరించు. భోగాలు అనుభవించు. అంతే గానీ అడవుల పట్టి తిరిగే రాముని వలన ఏమి ప్రయోజనం ఉంది. పైగా ఆ రాముడు ఉన్నాడో, చచ్చాడో తెలీదు. ఒకవేళ బతికి ఉన్నా అతని ఆయుర్దాయము తీరిపోయింది. రాముడు రావణుని చేతిలో చావడం తప్పదు. నేను ఎంతో మంచి దాన్ని కాబట్టి ఇంతదూరం చెబుతున్నాను. నా మాట వినకపోయావో, మేమందరం కలిసి నిన్ను చంపి, నీ మాంసమును పంచుకొని, నంజుకొని తింటాము." అని చెప్పింది వినత అనే రాక్షసి.

ఇంతలో మరొక రాక్షసి పిడికిలి బిగించి “ఓ సీతా! ఇప్పటి దాకా నువ్వు ఏమేమి మాట్లాడినా, నీ మీద జాలితో నిన్ను ఇంతసేపూ సహించాము. ఇంక మా ఓపిక నశించింది. మేము ఏమి చెప్పినా నీవు వినడం లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా. భయంకరమైన సముద్రము మధ్యలో ఉన్న లంకలో ఉన్నావు. నిన్ను రక్షించడానికి నీ రాముడే కాదు కదా సాక్షాత్తు ఆ దేవేంద్రుడు కూడా రాలేడు. అనవసరంగా ఏడ్చి ఏడ్చి నిన్ను నువ్వు హింసించుకోకు. దు:ఖాన్ని విడిచి పెట్టి సుఖాల్ని అనుభవించు. సుఖసంతోషాలతో గడపవలసిన నీ వయసును దు:ఖభూయిష్టం చేసుకోకు. రావణుని వరించు. సుఖాలు అనుభవించు. ఈ వయసు, ఈ యవ్వనము శాశ్వతం కావు. రోజురోజుకూ తరిగిపోతుంటాయి. ఈరోజు అనుభవించాల్సిన సుఖం రేపు రాదు. కాబట్టి రావణుని వరించి. అతనితో విహరించు. స్వర్గసుఖాలు అనుభవించు. నీ యవ్వనాన్ని సార్ధకం చేసుకో.

ఓ సీతా! ముల్లోకములలోని రాక్షసులకు అధిపతి అయిన రావణుని వరిస్తే, రావణుని వద్ద ఉన్న ఏడువేల మంది సుందరీ మణులు నీకు దాసీలు అవుతారు. నీ వశంలో ఉంటారు. నామాట వినకపోతే ఇప్పుడే నీ గుండెలు చీల్చి నమిలి తింటాను." అని తీవ్రంగా పలికింది.

చండోదరి అనే రాక్షసి తన చేతిలో ఉన్న పెద్ద శూలమును తిప్పుతూ ఇలా అంది. “రావణుడు ఈ సీతను అపహరించి తీసుకొని వచ్చినపుడు నాకు ఒక ఆశ పుట్టింది. బాగాబలిసి అత్యంత సుందరంగా ఉన్న ఈమె గుండె కుడిభాగమును, ఎడమ భాగమును చీల్చి తినవలెననీ, ఈమె తలను పగులగొట్టి లోపల ఉన్న మెత్తటి మెదడును ఆరగించవలెననీ, ఈమె పేగులను జుర్రుకోవలెనని, ఈమె రక్తమును తాగవలెననీ, మహా కోరికగా ఉండింది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతూ ఉంది." అంది.

ప్రఘస అనే రాక్షసి వారందరినీ చూచి "అబ్బా ఇంకా ఏమిటా మాటలు. అనవసరంగా మాటలతో కాలక్షేపం చేస్తున్నారు. ముందు దీని కంఠాన్ని పట్టుకొని నులమండి. క్షణంలో చస్తుంది. మనం పోయి రావణునితో "ప్రభూ! సీత మరణించినది" అని చెబుదాము. అప్పుడు రావణుడు “మీరంతా దానిని తినండి" అంటాడు.అంతే మనం అంతా దీని మాంసం తో విందు చేసుకుందాము." అని పలికింది. 

ఇంతలో అజాముఖి అనే రాక్షసి ఇలా అంది. "అది సరే! ముందు దీనిని చంపి దీని మాంసమును మన అందరికీ సమానంగా ముక్కలు ముక్కలు గా పంచండి. ఒకరికి ఎక్కువా ఒకరికి తక్కువా రాకూడదు. అది నాకు ఇష్టం లేదు. వెంటనే మధ్యము, మంచి మంచి లేహ్యములు తీసుకుని రండి. మనం అందరూ మద్యం తాగుతూ దీని మాంసమును నంచుకుని తింటాము." అంది. 

శూర్పణఖ  అనే మరో రాక్షసి ఇలా అంది. "మరి ఎందుకు ఆలస్యం. మంచి మధ్యములు తీసుకుని రండి. దీనిని ముక్కలు ముక్కలు గా నరకండి. మద్యం తాగుతూ దీని మాంసమును కొరుక్కుంటూ, మన నికుంభిళాదేవికి ప్రీతిగా నృత్యం చేద్దాము." అని పలికింది. ఆ ప్రకారంగా అక్కడ ఉన్న రాక్షస స్త్రీలందరూ తలొక విధంగా సీతను భయపెడుతున్నారు. వారి మాటలు విన్న సీత భయంతో వణికిపోయింది. 

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)