శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 23)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది మూడవ సర్గ
రావణుడు వెళ్లిపోగానే రాక్షస స్త్రీలు సీత చుట్టు చేరారు. కొంత మంది ఆమెతో పరుషంగా మాట్లాడారు. “ఒసేయ్ సీతా! రావణుడు అంటే ఎవరనుకున్నావు. పులస్త్య వంశంలో పుట్టాడు. మహాత్ముడు. వరిష్ఠుడు. పదితలలు కలవాడు. అటువంటి రావణుడు కోరి వస్తే అతడికి భార్యకావడానికి ఎందుకు నిరాకరిస్తున్నావు.” అంటూ సీత మీద విరుచుకుపడ్డారు.అంతలో ఏకజట అనే రాక్షసస్త్రీ సీతతో ఇలా అంది. “ఓ సీతా! ప్రజాపతులు ఆరుగురు. వారు బ్రహ్మమానస పుత్రులు. వారిలో నాలుగవ వాడు పులస్త్య ప్రజాపతి. ఆ పులస్త్యుని మానస పుత్రుడు విశ్రవసుడు. ఈ విశ్రవసుని కుమారుడే రావణుడు. అటువంటి రావణుడు నిన్ను తన భార్యగా కోరుకుంటున్నాడు. ఇంకా ఎందుకు సందేహిస్తావు. నా మాట విను. రావణునికి భార్యగా ఉండు." అని పలికింది.
ఇంతలో హరిజట అనే రాక్షసి ముందుకు వచ్చి ఇలా అంది. “మా రావణుడు దేవేంద్రుని, సకల దేవతలను జయించాడు. అటువంటి రావణునికి భార్య కావడం మంచిది. నా మాట విను.”
అంది.
అంది.
ఇంతలో మరొక రాక్షసి ప్రఘస అనేపేరు కలది సీతను ఇలా భయపెట్టింది. “రావణుడు మహా బలవంతుడు, వీర్యవంతుడు, శూరుడు, యుద్ధములో రావణునికి సాటి ఎవరూ లేరు. అటువంటి పరాక్రమ వంతుడికి భార్య కావడం కన్నా అదృష్టం ఏముంటుంది? పైగా మండోదరి రావణునికి పట్ట మహిషి. ఆమెను కూడా కాదని రావణుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఇంకా సందేహిస్తావెందుకు. రావణుని అంత:పురమునకు నీవే మహారాణివి. కాబట్టి ఒప్పుకో.” అని
పలకింది.
పలకింది.
వికట అనే రాక్షసి సీతతో ఇలా అంది. "దేవ, దానవ, గంధర్వులను ఓడించిన రావణుడు నిన్ను వేడుకుంటున్నాడు. అట్టి మహాత్ముడు కోరి వచ్చి నిన్ను తన భార్యగా చేసుకుంటాను అంటే, కాదంటావెందుకే మూర్ఖురాలా! " అని పలికింది.
దుర్ముఖి అనే రాక్షస స్త్రీ ఇలా అంది. "ఏ రావణుని పేరు చెబితే సూర్యుడు తన తేజస్సును పరిమితం చేసుకుంటాడో, ఏ రావణునికి భయపడి వాయుదేవుడు మంద్రంగా వీస్తాడో, ఎవరి ఆజ్ఞలకు భయపడి అన్ని ఋతువులలోనూ పుష్పములు వర్షంగా కురుస్తాయో, ఏ రావణుడు కోరినప్పుడలా మేఘాలు వర్షాలు కురుస్తాయో, అట్టి రావణుడు నిన్ను కోరి వచ్చాడు. మారుమాటాడక ఒప్పుకో! ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసుగా! మేమందరమూ నిన్ను నంజుకొని తింటాము.” అంది.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment