శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 22)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది రెండవ సర్గ
సీత పలికిన పలుకులు అన్నీ సావధానంగా విన్నాడు. రావణుడు. అతనికి కోపం తలకెక్కింది. కాని తమాయించుకున్నాడు. స్త్రీలను వశం చేసుకొనేటప్పుడు కోపం పనికిరాదు అని అనుకున్నాడు రావణుడు. అందుకని సౌమ్యంగానే మాట్లాడాడు."ఓ సీతా! స్త్రీలకు మంచి మాటలు చెప్పేకొద్దీ వాళ్లు మగాళ్లను తిరస్కరిస్తుంటారు. కానీ ఆ స్త్రీలే బుజ్జగించిన కొద్దీ పురుషుడు వాళ్లకు స్వాధీనుడవుతాడు. దాసుడవుతాడు. ఇదీ స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఆచరించవలసిన ధర్మము. నీ మాటలు విన్న కొద్దీ నాకు కోపం ఎక్కువ అవుతూ ఉంది. కానీ నీ మీద నాకు ఉన్న కోరిక, కామము ఆ కోపాన్ని అణగదొక్కుతూ ఉంది. కామానికి వ్యతిరేక స్వభావము ఉంది. నువ్వు ఎంత కాదన్నా నీమీదనే నాకు మనసు అవుతూ ఉంది. నీ మీద కోరిక ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది.
సకలైశ్వర్యవంతుడనైన నన్ను విడిచి అడవులలో తిరిగే ఆ రాముని నీవు ఎల్లప్పుడూ తలచుకుంటున్నావో అప్పుడే నిన్ను చంపాలనీ, నరకాలనీ అనుకున్నాను. కానీ నీ మీద నాకు ఉన్న కోరిక నన్ను ఆ పని చెయ్యనివ్వడం లేదు. ఇప్పటి దాకా నువ్వు నన్ను అన్న పరుషమైన మాటలకు ఒక్కొక్క మాటకూ ఒక్కొక్కసారి నిన్ను నరకాలని ఉంది. నీ మీద ఉన్న ప్రేమతో, కామంతో, ఆ పని చేయలేకపోతున్నాను. నీకుగా నీవు నా దగ్గరకు వచ్చేవరకూ నేను నిన్ను తాకను. అందుకే నీకు రెండు మాసములు గడువు ఇస్తున్నాను. ఈ రెండు మాసములు దాటగానే నువ్వు నా పడక మీదికి రావాలి. తప్పదు. ఈ రెండు మాసములలోగా నీవు నన్ను నీ భర్తగా, ప్రియునిగా అంగీకరించాలి. ఈ రెండు మాసములలో నీవు నన్ను వరించకపోతే, రెండు మాసములు గడువు తీరిన మరునాడు నిన్ను మా వంటశాలకు తీసుకొని పోయి వధించి, నీ మాంసమును వండి, నాకు ఆ రోజు ఉదయము తీసుకొనే అల్పాహారముగా నాకు వడ్డిస్తారు. తరువాత నీ ఇష్టం." అని పరుషంగా పలికాడు రావణుడు.
రావణుని మాటలకు రావణుని వెంట వచ్చిన స్త్రీలు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ రావణునికి భయపడి వారు ఎవరూ నోరు మెదపలేదు. ఆ మాటలు విన్న సీత రావణునితో ఇలా అంది.
“నీ మాటలు వింటూ ఉంటే నీ రాజ్యములో నీ క్షేమము కోరేవారు, నీకు హితము చెప్పేవారూ ఎవరూ లేరని అనిపిస్తూ ఉంది. నేను రాముని భార్యను. నీ లాంటి మూర్ఖుడు తప్ప వేరెవరూ పరాయివాడి భార్యను కోరుకోడు. రాముని భార్యను అయిన నాతో ఇటువంటి ప్రేలాపనలు పేలినందుకు రాముని చేతిలో నీకు దండన తప్పదు. రాముడు ఏనుగు లాంటి వాడు. రాముని ముందు నీవు కుందేలు వంటి వాడివి. రాముని పాదాల కిందపడి నలిగిపోతావు.
నీకు నిజంగా వీరత్వము, పరాక్రమము ఉంటే ఇలా పిరికిపందలా లంకలో కూర్చుని ఆడవాళ్లతో, ఆడవాళ్ల ముందు బీరాలు పలుకవు. నీకు ధైర్యం ఉంటే రాముని ముందు నిలిచి మాట్లాడు. రాముని ఎదుట పడటానికి భయపడే నీవు ఒక వీరుడివా! నన్ను కామ దృష్టితో చూచుచున్న నీ కనుగుడ్లు ఎందుకు రాలి కింద పడిపోవడం లేదో అర్ధం కావడం లేదు. ఇక్ష్వాకు వంశపురాజు దశరథుని కోడలిని, రాముని భార్యను అయిన నన్ను ఈ ప్రకారంగా దుర్భాషలాడిన నీ నాలుక ఇంకా ఎందుకు తెగి కిందపడలేదో అర్థం కావడం లేదు.
ఓ రావణా! నా పాతివ్రత్య మహిమతో నిన్ను ఇక్కడే ఈ క్షణమే భస్మం చేయగలను. కానీ పతివ్రతలు భర్త అనుజ్ఞలేనిదే ఏ పనీ చేయరు. అందుకని నీ ప్రేలాపనలు అన్నీ సహించాను. రాముడు ఇంటలేని సమయమున నన్ను అపహరించిననాడే నీకు మృత్యువు ఆసన్నమయింది.
ఓ రావణా! నీ గురించి నీ బల పరాక్రమముల గురించి నీవు గొప్పలు చెప్పుకున్నావు కదా! మరి రామలక్ష్మణులు ఉండగానే వారితో యుద్ధము చేసి ఓడించి నన్ను తీసుకు రావచ్చు కదా! మరి దొంగలాగా వచ్చి ఎందుకు అపహరించావు? రాముడికి భయపడే కదా!..." అని ఇంకా సీత ఏమో అనబోతూ ఉండగానే రావణుడు కళ్లు పెద్దవి చేసి సీత వంక చూచాడు.
"సీతా! ఇంక చాలు. ఆపు నీ వాచాలత్వము. అడవులలో తిరిగే రాముని భార్యవు నీవు కూడా నన్ను అంటావా. నీవు నన్ను భస్మం చేయడం కాదు. నేనే నిన్ను ఇక్కడే ఇప్పుడే సర్వనాశనం చేస్తాను. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను." అని పరుషంగా పలికి సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీలను చూచి ఇలా అన్నాడు.
“ఓ ఏకాక్షీ! ఓ మేకకర్ణి! ఓ గోకర్ణి! ఓ హస్తికర్ణి! ఓ లంబకర్ణి! ఓఅకర్ణి! ఓ గోపాదీ! ఓ హస్తిపాదీ! ఓ మేకపాదీ! ఓ అపాదీ! ఓ దీర్ఘజిహ్వా! ఓ అనాసికా! ఓ సింహముఖీ! ఓ గోముఖీ! ఓ సూకరీముఖీ! మీరంతా నేను చెప్పేది శ్రద్ధగా వినండి. మీ శక్తి యుక్తులు ఉపయోగించి ఈ సీతను నాకు వశురాలను చెయ్యండి. నయానా భయానా చెప్పి చూడండి. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించండి. సీతను లొంగదీసుకోండి." అని ఆజ్ఞాపించాడు.
ఈ మాటలు విన్న ధాన్యమాలిని అనే రాక్షస వనిత రావణుని వద్దకు పోయి ఇలా అంది. "ఓ రాక్షస రాజా! మేము ఇంతమందిమి ఇక్కడ ఉండగా ఈ అనాకారి ఎందుకు నీకు. నాతోరా. నీకు స్వర్గసుఖాలు చూపిస్తాను. అయినా సుఖాలు అనుభవించడానికి కూడా బహ్మరాత ఉండాలి. నీతో పాటు సురలోకభోగాలు అనుభవించే రాత ఈమె మొహాన బ్రహ్మరాయలేదు. నిన్ను కావాలని కోరుకొనే స్త్రీని నువ్వు కోరుకోవాలి గానీ, నిన్ను వద్దు అన్న స్త్రీ వెంట బడితే శ్రమ మాత్రమే మిగులుతుంది కానీ కోరిక తీరదు. కాబట్టి నిన్ను కావాలని కోరుకొనే స్త్రీలతోనే అమరసుఖాలు అనుభవించు.” అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, రావణుడు ఆమెను పట్టుకొని పక్కకునెట్టి, నవ్వుకుంటూ వెనక్కు తిరిగివెళ్లిపోయాడు. రావణుని వెంట వచ్చిన కన్యలుకూడా ఆయనను అనుసరించారు. అందరూ తమ తమ నివాసములకు వెళ్లిపోయారు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment