శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది ఒకటవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 21)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
ఇరువది ఒకటవ సర్గ
రావణుడు పలికిన పలుకులు అన్నీ సావధానంగా వింది సీత. పక్కనే ఉన్న ఒక గడ్డి పరకను తీసింది. రావణుడికి తనకూ అడ్డుగా పెట్టింది. ఆ గడ్డి పరకనే రావణుని గా భావించిబదులు చెప్పింది.
" ఓ రావణా! నీకు ఎంతో మంది భార్యలు ఉన్నారు. నన్ను ఇంతగా బతిమాలే బదులు నీ ప్రేమను నీ భార్యలకు పంచి ఇవ్వు. వారిని ప్రేమించు. అంతే కానీ, పరుల భార్యను అయిన నా వెంట ఎందుకు పడతావు. నీవు రాక్షసుడవు. నీకు ఇతరుల భార్యలను అపహరించి అనుభవించడం ధర్మమే కావచ్చు కానీ నేను మానవ కాంతను. ఉత్తమమైన వంశంలో పుట్టాను. మరొక ఉత్తమమైన ఉత్తమ వంశంలోకి కోడలిగా వెళ్లాను. నా భర్తనే దైవంగా భావించిన పతివ్రతను. నీ రాజ్యమును, ఐశ్వర్యమును, భోగములను ఆశించి నేను ఇటువంటి నీచమైన కార్యమును చేయలేను." అని సౌమ్యంగా చెప్పింది.
తరువాత రావణుని వంక కాకుండా, శూన్యంలోకి చూస్తూ ఇలా అంది.
“నీవు ధర్మములు తెలిసినవాడవు. నీ పూర్వీకులు పాటించిన ధర్మమును పాటించు. పరస్త్రీని కోరుకోకు. నేను నీకు తగిన దానిని కాను. నీవు నీ భార్యలను ఎలా రక్షించుకుంటావో, ఇతరుల భార్యలు కూడా అలా రక్షింపబడవలసిన వారే కదా! నీ భార్యలను ఇతరులు అపహరిస్తే నీకు ఎంత బాధ కలుగుతుందో, నీవు ఇతరుల భార్యలను అపహరిస్తే వారికి కూడా అంతే బాధకలుగుతుంది కదా! ఆ విషయాన్ని గ్రహించుకో! అందుకని నీ భార్యలతో సుఖించు. ఇంట్లో ఉన్న భార్యలతో సుఖములు అనుభవించకుండా పరుల భార్యలతో సుఖాలు కోరుకునే వాళ్లను, ఆ పరుల భార్యలు పరాభవిస్తారు, శపిస్తారు.
ప్రస్తుతము నీ బుద్ది ఇతరుల భార్యల మీద ఉంది. ఇంత విపరీత బుద్ధికల రాజుకు హితబోధ చేసే మంత్రులు, గురువులు, హితులు నీ రాజ్యంలో లేరా! నీ రాజ్యంలో అంతా నీ లాంటి విపరీత బుద్ధులు కలవారేనా! లేక, నీకు హితులైన వారు నీకు హితబోధ చేసినా, నీకు వినాశ కాలము దాపురించి, వారి హితోక్తులను నీవుపెడచెవిని పెడుతున్నావా! ఇంద్రియ నిగ్రహము లేని రాజు పాలనలో నగరములు, రాష్ట్రములు నాశనం అవుతారు. ప్రజలు కష్టాల పాలవుతారు. పరదారాసంగమం కోరుకునే నీ లాంటి రాజు దొరకడం వలన ఈ లంకారాజ్యము తొందరలో నాశనం కాబోతోంది. దుర్మార్గుడు, పాపాత్ముడు అయిన నీ పతనం చూచి సకల జనులు సంతోషిస్తారు. నిన్ను అయ్యోపాపం అనే వాడు ఉండడు. నీచేత బాధలు పడిన వారంతా నీ పీడ విరగడ అయిందని ఆనందంతో పండుగలు చేసుకుంటారు.
నువ్వు నీ ఐశ్యర్యమును, ధనమును చూపి నన్ను ప్రలోభపెట్టావు. నేను నీ ఐశ్యర్యమునకు ధనమునకు, భోగములకు లొంగను. సూర్యుని నుండి కాంతిని ఎలా వేరు చెయ్యలేరో, రాముని నుండి నన్ను ఎవరూ వేరు చెయ్యలేరు. నేను రాముని పాణిగ్రహణము చేసినది మొదలు, ప్రతిరోజూ రాముని చేతిని నా తలగడగా పెట్టుకొని నిద్రిస్తున్నాను. అటువంటిది ఇప్పుడు మరొక పురుషుని చేతిని తలగడగా ఎలా పెట్టుకొని నిద్రించగలను. నేను రాముని భార్యను, నా జీవితాంతము నేను రామునికే భార్యను. మరొకరికి కాదు. కాబట్టి ఇప్పటి కన్నా తెలివి తెచ్చుకొని నన్ను రాముని వద్దకు చేర్చు. నీ ప్రాణాలు కాపాడుకో. నీవు నాలుగు కాలాల పాటు నీ భార్యలతో సుఖంగా ఉండాలన్నా, ఆనందంగా రాజ్యము చేయాలన్నా, వెంటనే రామునితో స్నేహం చెయ్యి. చేసిన తప్పు ఒప్పుకొని రాముని శరణు వేడు. రామునికి నన్ను అప్పగించు. రాముడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. కాబట్టి రామునితో స్నేహంచేసుకోవడమే యుక్తము.
రావణా! నన్ను రాముని వద్దకు చేరిస్తేనే నువ్వు బతుకుతావు. లేకపోతే చస్తావు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వేటును నువ్వు తప్పించుకోవచ్చు. యమధర్మరాజు పాశము బారి నుండి నువ్వు బయట పడవచ్చు కాని రాముని వింటి నుండి వెలువడ్డ బాణము మాత్రము నిన్ను వదిలిపెట్టదు. రాముడు కూడా నిన్ను విడిచి పెట్టడు. వెతికి వెతికి చంపుతాడు. నీవు ఇంద్రుని వజ్రాయుధము యొక్క ప్రచండ ధ్వని వినిఉంటావు. కానీ రాముని ధనుష్టంకారమును విని ఉండవు. వింటే నీ గుండెలు బద్దలవుతాయి. తొందరలోనే రాముని పేరు లక్ష్మణుని పేరు చెక్కబడిన బాణములు నీ లంకారాజ్యంలో పడతాయి. రాక్షసులను హతమారుస్తాయి. లంకా నగరమంతా రామ బాణములతో కప్పబడిపోతుంది. గరుత్మంతుడు పాములను చంపినట్టు రామ బాణములు రాక్షసులను హతమారుస్తాయి. రాముడు జనస్థానములో ఉన్న 14,000 మంది రాక్షసులను చంపి దానిని శ్మశానంగా మార్చాడు. అప్పుడు రాముని ఏమీ చేయలేక రాముడు ఇంటలేని సమయంలో నన్ను అపహరించావు. పెద్దపులుల ఎదుట కుక్క ఎలా నిలువలేదో, రామలక్ష్మణుల ముందు నువ్వు కూడా నిలువలేవు.
రావణా! మరలా చెబుతున్నాను విను. రాముడు తొందరలోనే వచ్చి నిన్ను చంపి నన్ను తీసుకొని వెళతాడు. నీకు వినాశకాలము దాపురించింది. నీవు ముల్లోకములలో దాగినను, రామ బాణము నిన్ను విడిచి పెట్టదు. వెతికి వెతికి హతమారుస్తుంది. జాగ్రత్త!" అని పలికి మౌనం వహించింది సీత.
శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment