శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 20)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఇరువదవ సర్గ

రాక్షస స్త్రీల మధ్య మూర్తీభవించిన శోకదేవతవలె కూర్చుని సీతను చూచాడు రావణుడు. 

రావణుడు సీత దగ్గరగా వచ్చాడు. సీతను చూచి అనునయంగా ఇలా అన్నాడు.

"ఓ సీతా! నన్ను చూచి ఎందుకు భయపడి అలా ముడుచుకొని కూర్చుంటావు. నేనంటే నీకు ఎందుకు భయము? నేను కేవలము నిన్ను కోరుకుంటున్నాను. నువ్వు అంటే నాకు ఎంతో ఇష్టం. నేను నీ నుండి ప్రేమను ఆశిస్తున్నాను. నా మనోహారిణీ! నన్ను కరుణించు. ఇక్కడ ఎవరిని చూచి భయపడుతున్నావు. ఇక్కడ మనుషులు ఎవరూ లేరే! లేక కామరూపులైన రాక్షసులు కూడా ఎవరూ లేరే! అంతా మనవాళ్లే కదా. వాళ్లని చూచి ఎందుకు భయము. ఇంక నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. నువ్వు అంటే పడి చస్తున్నాను. నేనంటే ఎందుకంత భయము?

ఓహెూ! వివాహితవైన నిన్ను నీ భర్తకు తెలియకుండా తీసుకొని వచ్చాననా! అలా తీసుకురావడం మా రాక్షసులలో ఆచారము సీతా! ఇతరుల భార్యలతో సంగమించడం, ఇతర స్త్రీలను బలవంతంగా ఎత్తుకు రావడం, రాక్షసుల ధర్మము. మా ధర్మం మేము చేస్తున్నాము. దీనికి భయపడటం ఎందుకు. రాక్షస ధర్మము ప్రకారము నిన్ను బలవంతంగా నైనా అనుభవించగలను. కానీ, నేను అలా చేయను. నీకు నా మీద ప్రేమ కలగాలి. నీ అంతట నువ్వే నా కౌగిట్లో చేరాలి. అప్పటి దాకా నిన్ను ముట్టను. తెలిసిందా నేనెంత మంచి వాడనో!

ఓ సీతా! నన్ను నమ్ము. నేను అబద్దము ఆడటం లేదు. నిజమే చెబుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించు. ఇద్దరం ప్రేమసాగరంలో ఓలలాడతాము. అంతే కానీ, తిండితినకుండా ఇలా నీ అందమైన శరీరాన్ని కృశింపచేసుకుంటే ఏమి లాభం? అయ్యో! సీతా! ఏమిటీ పనులు. ఒకే జడ వేసుకుంటావు. నేలమీద పడుకుంటావు. సరిగా భోజనం చెయ్యవు. నీ లాంటి రాజకుమారికి, సౌందర్యవతికి ఇలా చేయడం తగునా? అదే నువ్వు నన్ను ప్రేమించావనుకో, క్షణంలో నీ రూపు రేఖలు మారిపోతాయి. రకరకాల చందనములు, లేపనములు, మైపూతలు, ఆభరణములు, మద్యములు, శయనాగారములు, హంసతూలికా తల్పములు, నృత్య గీతా వినోదములు, ఓహ్ నిన్ను మహారాణిగా మార్చేస్తాను.

ఓ సీతా! నువ్వు ముల్లోకములలో ఉన్న స్త్రీలందరిలో రత్నము వంటి దానవు. అటువంటి నీవు అలంకారములు లేకుండా ఆభరణములు లేకుండా ఉండటం ధర్మమా! నా దగ్గరకు రా! నీకు సమస్త భోగములు సమకూరుస్తాను. నీకు ఉన్న నవయవ్వనంలో ఒక్కొక్కరోజు వృధాగా గడిచిపోతుంటే నాకు ఎంతో బాధగా ఉంది. యవ్వనం ఉండేది అనుభవించడానికే కదా! మరి అటువంటి యౌవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటావు? ప్రవహిస్తున్ననీరు తిరిగి రానట్టు, గతించిన యవ్వనం తిరిగి రాదు కదా!

ఓ సీతా! నీకో విషయం తెలుసా! బ్రహ్మ దేవుడు అందమైన సౌందర్యవతులను సృష్టిస్తూ, నిన్ను అతిలోక సౌందర్యవతిగా సృష్టించి, తరువాత, సృష్టిని ఆపివేసినట్టున్నాడు. అందుకనే నీ లాంటి సౌందర్యవతి ముల్లోకములలో లేదు! అంతెందుకు, ఆ బ్రహ్మదేవుడు నిన్ను సృష్టించి భూలోకంలో పడేసాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే, రూపయవ్వనములతో ప్రకాశిస్తున్న నిన్ను చూసి, ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను వదిలిపెట్టడు. ఇంక నేనెంత.

సీతా! నీ ప్రతి అయవయములో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. నీలో ఏ అవయానికి ఆ అవయవమే అందంగా కనిపిస్తుంది. నీ శరీరంలో ఏ అవయవాన్ని చూచినా నా చూపు అక్కడే నిలిచి పోతుంది. అంత అందంగా ఉంటావు నువ్వు. కాబట్టి ఈ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. జీవితాన్ని సుఖమయం చేసుకో. నన్ను వరించు. నాకు భార్యవు కా! నేను ఎన్నో దేశాల నుండి ఎందరో రాకుమార్తెలను తీసుకొని వచ్చి నా అంత:పురంలో ఉంచాను. నీకు వారందరూ సేవలు చేస్తారు. వారందరికీ నిన్ను యజమానురాలిని చేస్తాను. నిన్ను నా పట్టమహిషిగా చేసుకుంటాను. నేనూ, నా లంకా రాజ్యము, నా సంపదలు అన్నీ నీ అధీనములు. అంతెందుకు. ఈ భూమి సమస్తమును జయించి నీకు కానీ, నీ తండ్రి జనకునకు గానీ ఇస్తాను.

ఓ సీతా! ఈలోకంలో నన్ను ఎదిరించి నిలబడగలిగిన వీరుడు ఎవడూ లేడు. నేను అజేయుడను. నేను ఎన్నోసార్లు దేవతల మీద, దానవులమీద దండెత్తి వారిని జయించాను. వారి రాజ్యములను స్వాధీనపరచు కున్నాను. ఇప్పటికీ వారెవరూ నన్ను కన్నెత్తి కూడా చూడలేరు. ఇంతటి పరాక్రమవంతుడనైన నేను నీ కోసం ప్రాధేయపడుతున్నాను. నా మీద దయచూపు. నన్ను కరుణించు. వరించు. బాగా అలంకరించుకో. ఆభరణాలు ధరించు. నీకు ఇష్టంవచ్చిన పదార్థాలు తిను. తాగు. ఆనందాన్ని అనుభవించు. నీకు ఇష్టం వచ్చినట్టు దానములు, ధర్మములు చెయ్యి. నేను నీకు దాసుడను. నన్ను ఆజ్ఞాపించు. నేను నీ కనుసన్నలలో మెలగుతాను.

నీ కీర్తిని ఐశ్యర్యమును చూచి నీ బంధువులు,మిత్రులు ఎంతో సంతోషిస్తారు. రావణుని పట్టమహిషి అంటే నీకు ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అంతేకానీ, రాజ్యము పోగొట్టుకొని నార చీరలు కట్టుకొని అడవులను పట్టి తిరిగే ఆ రాముడి దగ్గర ఏముంది? అసలు ఇంత కాలము రాముడు జీవించి ఉన్నాడో లేదో అని నా అనుమానము. మా రాక్షసులు ఆ రాముని ఎప్పుడో చంపి తినేసి
ఉంటారు! ఒక వేళ రాముడు జీవించి ఉన్నా, తన జీవిత కాలంలో నిన్నుచూడలేడు, కలుసుకోలేడు. హిరణ్యకశిపుడైనా ఇంద్రుడు అపహరించిన తన భార్యను తిరిగి పొందగలిగాడేమో గాని, రాముడు మాత్రం నా చేతిలో చిక్కిన నిన్ను పొందలేడు. 

అదేమిటో గాని సీతా! నా మనసును నువ్వు గరుడుడు నేల మీద ఉన్న సర్పాన్ని హరించినట్టు హరించావు. నువ్వు నా మనోహారిణివి. చూడు, మాసిపోయిన చీర కట్టుకున్నావు. నగలు పెట్టుకోలేదు. అలంకరించుకోలేదు. అయినా నిన్ను చూస్తుంటే, నాకు నీ మీద మోహం పుడుతుంది. నిన్ను చుసిన తరువాత నా భార్యలతో ఆనందంగా గడపలేకపోతున్నాను. మరలా చెబుతున్నాను. ఓ సీతా! నా అంతఃపురములో నీ వంటి గుణవంతులు, శీలావతులు, సౌందర్యవతులు అయిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. వారందరూ దేవతలు లక్ష్మీదేవిని కొలిచినట్టు నిన్ను సేవిస్తారు.
 
నీకు తెలుసుకదా! కుబేరుడు ముల్లోకములు ధనాధిపతి. ఆ కుబేరుని సంపద అంతా నా వద్ద ఉంది. ఆ సంపద అంతా నీది. నీవే దానికి అధిపతివి. ఆ సంపదలను, నన్ను, నీ ఇష్టం వాచినట్టు అనుభవించు. ఐశ్వర్యములో గానీ, పరాక్రములో గానీ, తపశ్శక్తి లో గానీ, ధనములో గానీ, కీర్తిలో గాని, ఆ రాముడు నా కాలి గోటికి కూడా సాటి రాడు. 

కాబట్టి ఓ సీతా! నా సంపదలను అనుభవించు. నన్ను నీ వాడిని చేసుకో. ఇష్టం వాచినట్టు తిను, తాగు, క్రీడించు. భోగములు అనుభవించు. నాతో కలిసి ఉద్యానవనములలో, సముద్ర తీరాలలో, 
పూల పొదరిళ్లలో విహరించు. నీ బంధువులనందరినీ పిలిపించు. వారందరితో ఆనందంగా గడుపు. నీ ఇష్టం." అని సీతను సకల విధాలుగా ప్రలోభపెట్టాడు రావణుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)