Posts

Showing posts from August, 2024

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునేడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 17)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదునేడవ సర్గ ఇంతలో చీకటి పడింది. చంద్రోదయం అయింది. చంద్రుడు పండువెన్నెల కురిపిస్తున్నాడు. వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ వెన్నెలలో హనుమంతునికి సీత స్పష్టంగా కనపడుతూ ఉంది. సీత కనపడింది అన్న సంతోషంలో హనుమంతుడు చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలను సరిగా చూడలేదు. ఇప్పుడు హనుమంతుడు వారి మీద దృష్టి పెట్టి చూస్తున్నాడు. ఆ రాక్షస స్త్రీల ఆకారాలు ఒకటీ సరిగా లేదు. అన్నీ వికృతాకారులే! ఒక దానికి ఒక కన్ను, దొప్పల్లాంటి చెవులు ఉన్నాయి. మరొక దానికి చెవులే లేవు. మరొక దానికి చెవులు మొనలు దేలి ఉన్నాయి. ఒక దానికి శరీరం సన్నగా తల పెద్దదిగా ఉంది. ఇంక వాళ్ల కేశ సంపద గురించి చెప్ప పనిలేదు. అందరికీ దాదాపు తైల సంస్కారములేని చింపిరి జుట్టు. కొన్నిటికీ పొట్ట, స్తనములు వేలాడుతూ ఉన్నాయి. ఒకతి పొట్టిది. మరొకతి పొడుగు. ఒకదానికి ఎత్తు పళ్లు మరొక దానికి అసలు పళ్లే లేవు. ఇలా ఒకదానిని మించి ఒకటి వికృతాకారంతో ఉన్నాయి. ఆ వికృతాకారులైన రాక్షస స్త్రీలను చూచాడు హనుమంతుడు. వారు తమ చేతిలో శూలములు, ముద్గరలు ధరించి ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు ఆ శింశుపా వృక్షము చుట్టు కూర్చుని ఉన్నారు. వారికి మద్యము, ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునారవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 16)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదునారవ సర్గ అశోక వనములో సీత కనపడగానే హనుమంతుని ఆనందానికి అవదులు లేవు. రాముని మనసారా స్మరించుకున్నాడు. సీత పడుతున్న కష్టాలు చూచి హనుమంతుని హృదయం ద్రవించి పోయింది. హనుమంతుని కనుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. సీత కష్టములను తలచుకొని ఈ విదంగా బాధపడుతున్నాడు హనుమంతుడు. "పరాక్రమమును, వినయ విధేయతలను, సమానంగా పుణికిపుచ్చుకున్న లక్ష్మణునికి వదిన అయి ఉండీ సీతమ్మ ఇన్న బాధలు పడుతూ ఉందంటే, కాల గమనమును ఎవరూ అతిక్రమించలేరు కదా! ఇన్ని కష్టములలో కూడా సీత ఇంత నిబ్బరముగా ఉందంటే ఆమెకు రాముని మీద, లక్ష్మణుని మీద అపారమైన నమ్మకము. వారు వచ్చి తనను రావణుని చెర నుండి విడిపించెదరని ప్రగాఢవిశ్వాసముతో ఉంది. రామునికి తగిన భార్య సీత. సీతకు తగిన భర్త రాముడు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు. సీత ఇంతటి సుగుణవతి, సహనశీలి, సౌందర్యవతి కనుకనే రాముడు సీత గురించి అన్ని కష్టములు పడుతున్నాడు. సీత కోసమే కదా రాముడు, విరాధుడు, ఖరదూషణులు, త్రిశిరుని, ఇంకా పదునాలుగు వేల మంది రాక్షసులను తుదముట్టించాడు. ఈ సీత కారణంగానే కదా, సుగ్రీవుడు రాముని చేత వాలిని చంపించి, తన రాజ్యమును తిరిగి పొందగలిగా...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునైదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 15)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదునైదవ సర్గ హనుమంతునికి ఆ అశోక వన సౌందర్యము ఎంత చూచినా తనివి తీరడం లేదు. ఆ వృక్షములను, లతలను, మృగములను, పక్షులను, సరోవరములను, బావులను, అందులో తిరుగాడే నీటిపక్షులను ఆనందంగా చూస్తున్నాడు. అశోక వనము అనే పేరుకు తగ్గట్టు ఆ వనమంతా అశోక వృక్షములతో నిండి ఉంది. దేవేంద్రుని నందన వనము మాదిరి ప్రకాశిస్తూ ఉంది. ఆ వనంలో ఉన్న చెట్లు లతలు అన్ని ఋతువులలోనూ పుష్పములు, ఫలములు అందిస్తున్నాయి. అలా చూస్తున్న హనుమంతునికి ఆ శింశుపా వృక్షము దగ్గరలో, పద్మసరోవరము వద్ద ఒక చైత్యప్రాసాదము (మండపము లాంటి ఎత్తైన రాతి కట్టడము) ను చూచాడు. ఆ కట్టడము బాగా ఎత్తుగా, తెల్లటి రంగుతో, కైలాస పర్వతము మాదిరి ఉంది. ఆ కట్టడము దగ్గం. రాక్షస స్త్రీల మధ్యలో, మాసి పోయిన వస్త్రములు ధరించిన ఒక ఉత్తమ జాతి స్త్రీ కనపడింది. సరిగా ఆహారము తినక పోవడం వలన ఆమె బాగా చిక్కిపోయి ఉంది. ఆమె శరీరం చిక్కిపోయినను ఆమె దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. మాసిపోయిన వస్త్రమును కట్టుకొన్న ఆమె బురదలో ఉన్న పద్మంలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆమె దిగులుతో తల వంచుకొని కూర్చుని ఉంది. ఏమేమో ఆలోచిస్తూ ఉంది. ఆమె చుట్టు రాక్షస స్త్రీలు ఉన్నారు....

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 14)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదునాలుగవ సర్గ హనుమంతుడు కాపలా వాళ్ల కంటపడకుండా అశోకవనం లోకి ప్రవేశించాడు. ప్రాకారము మీదికి ఎక్కి కిందికి దుమికాడు. చుట్టు చూచాడు. అశోక వనము చాలా పెద్దది. పుష్పించిన పుష్పములతోనూ, లతలతోనూ, సంసెంగ, పొన్న, జాజి, మామిడి చెట్లతో ఇంకా రకరకాల వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉంది. హనుమంతుడు అక్కడే ఉన్న మామిడి చెట్ల సమూహంలోకి ప్రవేశించాడు. అక్కడ లెక్కలేనన్ని మామిడి చెట్లు ఉన్నాయి. ఆ వనములో మృగములు, పక్షులు యధేచ్ఛగా విహరిస్తున్నాయి. మృగముల అరుపులతో, పక్షుల కిలా కిలా రావాలతో ఆ వనం ప్రతిధ్వనిస్తూ ఉంది. హనుమంతుడు సీతను వెదుకుతూ ఇంకా లోపలకు వెళ్లాడు. హనుమంతుడు ఒక చెట్టు మీది నుండి మరొక చెట్టు మీదికి వేగంగా దుముకుతుంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులు భయపడి టపా టపా రెక్కల చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. హనుమంతుడు అలా దుముకుతుంటే పుష్పించిన వృక్షములు పుషవర్షము కురిపించాయి. (పూలన్నీ రాలిపోయాయి). ఆ చెట్లమధ్య వేగంగా తిరుగుతున్న హనుమంతుడు వసంత ఋతువులో తిరుగాడు వసంతుని వలె ప్రకాశించాడు. అశోకవనములో ఉన్న నేల అంతా పుష్పములతో నిండి పోయి పుష్పముల తివాచీ పరచినట్టు శోభించింది. ఒకచెట్టు మీది నుండి ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదమూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 13)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదమూడవ సర్గ హనుమంతుడు ఒక గృహము మీది నుండి మరొక గృహము మీదికి దుముకుతూ, అన్ని గృహములూ వెదికాడు. ఎక్కడా సీత జాడ కనపడలేదు. విసిగిపోయాడు. ఒక చోట ఏకాంతముగా కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. “నేను రామకార్యము నిమిత్తము లంకకు వచ్చాను. లంక అంతా గాలించాను. కానీ సీత ఎక్కడా కనపడలేదు. కాని జటాయువు సోదరుడు, పక్షిరాజు సంపాతి చెప్పిన ప్రకారము సీత రావణాసురుని స్థావరమైన లంకలోనే ఉండాలి. కాని లంక అంతా ఎంత వెతికినా సీత కనపడలేదు. నిస్సహాయురాలైన సీత రావణుని చెరలో ఉండి చేసేది లేక రావణునికి లొంగి పోయిందా! లేక రావణుడు సీతను ఆకాశ మార్గంలో అతి వేగంగా తీసుకొని వస్తుంటే, ఆ వేగానికి తట్టుకోలేక సీత మార్గమధ్యంలో ఎక్కడైనా పడిపోయిందా! రావణుడు సీతను సముద్రము మీదుగా తీసుకొని వచ్చి ఉండాలి. ఆకాశంలో వస్తున్నప్పుడు కింద ఉన్న అపారమైన జలరాసిని చూచి భయపడి, సీత సముద్రంలో పడిపోయిందా! జలచరములకు ఆహారంగా మారిందా!  అయోనిజ అయిన సీత, దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు, తనను తాకి, తనను పట్టుకొని, తన అంగాంగములు తాకుతూ, తీసుకొని వస్తుంటే, ఆ అవమానమును తట్టుకోలేక దారిలోనే ప్రాణములు విడిచిందా! అదీ కాకుండా, రా...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పన్నెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 12)

శ్రీమద్రామాయణము సుందర కాండము పన్నెండవ సర్గ హనుమంతుడు రావణుని అంతఃపురము నుండి బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న ఉద్యానవనములు, పొదరిళ్లు, చిత్రగృహములు, ఏదీ వదల కుండా వెదుకుతున్నాడు. లంక పూర్తిగా గాలించడం అయింది. సీత జాడ కనపడలేదు. ఇంక సీత ఈలోకంలో బతికి లేదు. మరణించి ఉంటుంది. సీత బతికే ఉంటే ఎక్కడో ఒకచోట కనపడాలి కదా! అనే నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు. ఇంక హనుమంతుని ఆలోచనలు ఆ విధంగా సాగాయి. సీత మరణించి ఉంటుంది అన్న వార్త గానీ,, సీత దొరకలేదు అన్న వార్తను గానీ తీసుకొని కిష్కింధకు వెళితే పరిణామాలు ఎలా ఉ౦టాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు చేయసాగాడు హనుమంతుడు. “ఎంతకూ తనకు లొంగకుండా ధర్మమార్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న సీతను, రావణుడు కోపం వచ్చి చంపేసి ఉంటాడేమో! అదీ కాక పోతే ఎప్పుడూ కని విని ఎరుగని ఈ భయంకర రాక్షసులను చూచి, వారి బెదిరింపులకు భయపడి, తట్టుకోలేక సీత మరణించిందేమో! కాబట్టి సీత ఇంక నాకు కనిపించదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ఎప్పుడో దాటి పోయింది. ఇన్నిరోజులూ అక్కడా ఇక్కడా తిరిగి ఇప్పుడు సీత కనపడలేదు అని చెబితే సుగ్రీవుడు ఊరుకుంటాడా! వాడసలే మహా బలవంతుడు. చచ్చేట్టు చావ గొడతాడు. మరణ దండన విధిస్తాడు. నేను ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదకొండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 11)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదకొండవ సర్గ ఎగిరీ ఎగిరీ దుమికి దుమికీ అలసిపోయాడు హనుమంతుడు. ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు. సీత కనపడింది అన్న ఆనందాన్ని పక్కన బెట్టి ఆలోచించసాగాడు. “ఈమె నిజంగా సీతయేనా! ఈమే నిజంగా సీత అయి ఉంటే రాముడు దగ్గర లేకుండా ఇంత సుఖంగా, నిశ్చింతగా, ఆనందంగా నిద్రపోతుందా! రాముడు దగ్గర లేని సీత ఇన్ని ఆభరణములు ధరిస్తుందా! మద్యపానము చేస్తుందా! పరపురుషుడైన దేవేంద్రుని కూడా కన్నెత్తి చూడని సీత, ఇలాగా రావణుని పక్కన నిద్రిస్తుందా! సందేహం లేదు. ఈమె సీత కాదు. మరొక స్త్రీ. ఈమె సీత కాకపోతే మరి సీత ఎక్కడ ఉంది?" ఇలా పరి పరి విధాల ఆలోచించిన హనుమంతుడు, మరలా సీతకోసం వెదకడం మొదలెట్టాడు. మరొక పాన గృహమునకు వెళ్లాడు. అక్కడ కూడా అందమైన యువతులు, మద్యపానంతో, రతికేళితో సొక్కి సోలి ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నారు. ఎక్కడబడితే అక్కడ వాలిపోయి నిద్రపోతున్నారు. అందరి వనితల మధ్య రావణుడు ఆడ ఏనుగుల గుంపుమధ్య ఉన్న మగ ఏనుగుమాదిరి ప్రకాశించాడు. హనుమంతుడు సీతను వెదుకుతూ పక్కనే ఉన్న పానభూమిని చూచాడు. అక్కడ రక రకాల మృగముల మాంసములు అందమైన పాత్రలలో పెట్టబడి ఉన్నాయి. లేళ్లు, దుప్పులు, అడవి దున్నలు, అడవి పంద...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 10)

శ్రీమద్రామాయణము సుందర కాండము పదవ సర్గ హనుమంతుడు సీత కోసరం రావణుని అంతఃపురము అంతటా వెదుకుతున్నాడు. రావణుని పడక గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఎన్నో ఆసనములు శయ్యలు ఉన్నాయి. అవి అన్నీ మణులతో రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. ఒక ఉన్నతమైన శయ్య మీద రావణుడు నిద్రపోతున్నాడు. రావణుడు దీర్ఘమైన బాహువులు, ఎర్రటి కళ్లు, నల్లని రూపముతో ఉన్నాడు. అతని ఒంటికి సువాసనలు వెదజల్లే చందనము పూయబడి ఉంది. రావణుని శయనాగారంలో మణులతో అలంకరింపబడిన తెల్లని గొడుగు ఒకటి, ఒక మూలగా నిలబెట్టబడి ఉంది. దాని పక్కనే బంగారముతో నిర్మించిన ఉన్నతాసనము ఉంది. రావణుడు రాత్రి అంతా రతికేళి జరిపి సొక్కి సోలి గాఢంగా నిద్రపోతున్నాడు. రావణుని చూస్తే హనుమకు కించిత్ భయం కలిగింది. అందుకని కాస్త దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎందు కన్నా మంచిదని పక్కన ఉన్న అరుగు ఎక్కి అక్కడి నుండి రావణుని చూస్తున్నాడు హనుమంతుడు. అక్కడి నుండి రావణుడు బాగా కనపడుతున్నాడు. విశాల మైన అతని బాహువుల మీద ఇంద్రుని ఏనుగు ఐరావతము పొడిస్తే ఏర్పడిన గాయము మచ్చలు కనపడుతున్నాయి. ఆ బుజముల మీద ఇంద్రుని వజ్రాయుధముతోనూ, విష్ణువు తన సుదర్శన చక్రముతోనూ కొడితే ఏర్పడిన గాయముల వలన కలిగిన మచ్చల...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 9)

శ్రీమద్రామాయణము సుందర కాండము తొమ్మిదవ సర్గ హనుమంతుడు రావణుని భవనమును, అందులో ఉన్న పుష్పక విమానమును చూచిన తరువాత, అసలు ఈ భవనము పొడుగు ఎంత, వెడల్పు ఎంత, వైశాల్యము ఎంత, ఇంత పెద్ద భవనమును ఎలా నిర్మించారు అన్న విషయం కనుక్కోడానికి ప్రయత్నం చేసాడు. రావణుని భవనము ఒక యోజనము పొడుగు, (ఎనిమిది మైళ్లు,) అందులో సగం (నాలుగు మైళ్లు) వెడల్పు ఉన్న స్థలంలో నిర్మించబడి ఉంది. అంత పెద్ద స్థలములో నిర్మించబడ్డ ఆ భవనమును సుశిక్షితులైన రాక్షస సైనికులు అనుక్షణం అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. రావణాసురుని భవనం అంతా రావణుని భార్యలతోనూ, రావణుడు వివిధ దేశాధిపతులను, రాజులను, జయించి వారి వద్దనుండి బలాత్కారంగా తీసుకురాబడిన స్త్రీలతోనూ, మునులను చంపి వారి వద్దనుండి బలాత్కారంగా తీసుకురాబడిన కన్యలతోనూ నిండి ఉంది.  అందులో ఉన్న పుష్పక విమానము రావణునిది కాదు. దానిని పూర్వము విశ్వకర్మ బ్రహ్మదేవుని కోసరం స్వర్గంలో నిర్మించాడు. కుబేరుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఆ విమానమును బ్రహ్మ వద్దనుండి పొందాడు. కుబేరుని సోదరుడు రావణుడు. రావణుడు కుబేరుని జయించి లంకా నగరాన్ని, దానితో పాటు పుష్పక విమానాన్ని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు....

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఎనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 8)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఎనిమిదవ సర్గ హనుమంతుడు పట్టిన పట్టు వదలకుండా, ఒక పక్క ఆ పుష్పక విమానములోని వింతలు విశేషాలు చూస్తూనే విమానం అంతా క్షుణ్ణంగా వెదుకుతున్నాడు. ఆ విమానములో అన్ని వస్తువులు, నిర్మాణములు వేటికవే సాటి గా ఉన్నాయి. విశేషం కానిది ఏదీ లేదు. అన్నీ గొప్పగా ఉన్నాయి. ఆ విమానంలో మరొక విశేషం ఏమిటంటే ఆ విమానంలో కూర్చున్న వాళ్లు ఎటు వెళ్లాలని మనసులో అనుకుంటే ఆ విమానం అలా వెళుతుంది. ఆ విమానము యొక్క నిర్మాణము అత్యంత విశిష్టంగా ఉంది. ఆ విమానము ఒక భవనము ఆకారంలో, పెద్ద పెద్ద శిఖరములతో నిర్మింపబడి ఉంది. ఆ విమానమును భయంకరాకారులు అయిన రాక్షసులు రక్షిస్తున్నారు. శ్రీమద్రామాయణము సుందర కాండము ఎనిమిదవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏడవ సర్గ శ్రీమద్రామాయణం - సుందర కాండము - తొమ్మిదవ సర్గ

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఏడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 7)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఏడవ సర్గ రావణుని అంత:పురములోని ప్రాసాదములు అన్నీ ఒకటి వెంబడి ఒకటిగా గాలిస్తున్నాడు హనుమంతుడు. ఆ గృహము లన్నీ ధన, ధాన్యములతో నిండి ఉన్నాయి. ఆ గృహ నిర్మాణంలో ఏ మాత్రం దోషం లేకుండా నిర్మించబడి ఉన్నాయి. సాక్షాత్తు మయుడే ఆ గృహాలు నిర్మించాడా అన్నట్టు ఉన్నాయి ఆ గృహములు. అన్నిటి లోకీ రావణుడు నివసించే గృహము అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. ఆ రావణుని అంత:పురము లోనే ఒక విమానమును చూచాడు హనుమంతుడు. దాని పేరు పుష్పకము. ఈ విమానము ఆకాశం నుండి భూమి మీదికి జారిపడిన స్వర్గధామం లాగా ఉంది. ఆ విమానము భూమి మీద నిలబడ కుండా గాలిలో తేలుతున్నట్టు ఉంది. ఆ పుష్పక విమానంలో భవనాలు నిర్మింపబడి ఉన్నాయి. సరస్సులు ఉన్నాయి. ఉద్యాన వనములు ఉన్నాయి. ఆ పుష్పక విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు హనుమంతుడు. ఆ విమానాన్ని బంగారము తోనూ మణులు, మరకతములు, వైడూర్యములతోనూ అలంకరించారు. ఆ విమానము రెక్కలను కూడా పగడములు, బంగారు పుష్పములతో అలంకరించారు. ఆ విమానములో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు. చేతిలో పద్మములను ధరించి, పద్మములు ఉన్న సరస్సులో పద్మము మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అత్యంత మనోహరంగా ఉంది. పర్వతమ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఆరవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 6)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఆరవ సర్గ సీత కోసరం లంకా నగరంలో వెదికి వెదికి విసిగిపోయి దుఃఖిస్తున్న హనుమంతుడు, ఈ సారి రావణుని అంతఃపురంలో వెదకాలని అనుకున్నాడు. రావణుని గృహం దగ్గరకు వచ్చాడు. రావణుని భవనానికి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉంది. రావణుని భవనమునకు అమర్చిన ముఖద్వారము బంగారముతో చేయబడి ఉంది. ఆ భవనములో ఉన్న సింహాసనములు, వస్తువులు బంగారంతో తయారు చేయబడి, రత్నాలు, మణులు పొదగబడి ఉన్నాయి. బంగారు ఆభరణములతో అలంకరింపబడిన రథములు అక్కడక్కడా నిలిచి ఉన్నాయి. రావణ భవనంలో అనేక రకములైన మృగములు, పక్షులు సంచరిస్తున్నాయి. రావణుని భవనము నిండా ఉత్తమ జాతి స్త్రీలు అక్కడక్కడా అటు ఇటు తిరుగుతున్నారు. రావణుని భవనము నిండా రాజ లాంఛనములు అయిన ఛత్రములు, చామరములు కనపడు తున్నాయి. భవనమంతా అగరు, చందనముల సువాసనలతో గుబాళిస్తూ ఉంది. ఒక పక్క భేరీ మృదంగ నాదములు వినిపిస్తుంటే, మరొక పక్క శివార్చనలు, హోమములు జరుగుతున్నాయి. రావణుని భవనమంతా పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు రావణుని భవనములో ఒక గృహము నుండి మరొక గృహమునకు తిరుగుతూ సీత కోసరం వెతుకుతున్నాడు. తరువాత ప్రముఖుల భవనముల వద్దకు వచ్చాడు హనుమంతుడు. ముందుగా ప్రహస్తు...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఐదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 5)

శ్రీమద్రామాయణము సుందర కాండము ఐదవ సర్గ హనుమంతుడు రావణుని అంతఃపురము ప్రవేశించే సమయానికి చంద్రుడు ఆకాశంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చల్లని వెన్నెలలు వెదజల్లుతున్నాడు. లక్ష్మీకళలతో ఉట్టిపడుతున్నాడు. సూర్య కిరణములు తన మీద పడుతూ ఉంటే వాటిని ప్రతిబింబిస్తున్నాడు చంద్రుడు. చీకట్లను నశింపజేసి వెన్నెలలను నలుమూలలకూ పంచిపెడుతున్నాడు. అటువంటి చంద్రుని చూచాడు హనుమంతుడు. చంద్రుడు క్రమక్రమంగా పైకి వస్తున్నాడు. ఆ వెన్నెల రాత్రిలో రాక్షసులు మాంసమును తింటూ మద్యం తాగుతున్నారు. వనితలు కూడా తమ తమ ప్రియులతో కలిసి క్రీడిస్తున్నారు. ఉత్తములైన స్త్రీలు తమ తమ భర్తలతో నిద్రిస్తున్నారు. కొంత మంది నిశాచరులు ఇంకా పురవీధుల్లో తిరుగుతున్నారు. హనుమంతుడు సీత కోసరం అంతటా వెతుకుతున్నాడు. మద్యపానమత్తులో ఒకరిని ఒకరు దూషించుకోడం చూచాడు హనుమంతుడు. కొంత మంది స్త్రీలు నిద్రిస్తుంటే మరి కొంత మంది స్త్రీలు తమ ప్రియుల మీద కోపించి, అలిగి, నిట్టూర్పులు విడుస్తున్నారు. వీరందరినీ నిశితంగా చూస్తున్నాడు హనుమంతుడు. వీరే కాకుండా రాక్షసులలో బుద్ధిమంతులను, విద్యావంతులను, గానకళా కోవిదులను, వేదవిద్యాపారంగతులను కూడా చూచాడు హనుమంతుడు. రా...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - నాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 4)

శ్రీమద్రామాయణము సుందర కాండము నాలుగవ సర్గ లంక అధిదేవతను ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు. తాను రావణునికి మిత్రుడు కాదు. అందుకని సింహద్వారము గుండా ప్రవేశించడం ఉచితం కాదు. కాబట్టి, శత్రువు మాదిరి నగరము చుట్టుకట్టిన ప్రాకారము పైకి ఎక్కి లోపలకు దూకాడు. ఎడమ కాలు ముందు పెట్టి లంకానగరంలో ప్రవేశించాడు. లంకా పుర రాజమార్గముల గుండా వెళుతున్నాడు హనుమంతుడు. లంకాపురములోని గృహముల నుండి వాద్య ధ్వనులు శ్రావ్యంగా వినపడుతున్నాయి. గృహములన్నీ మంగళకరంగా అలంకరింపబడి ఉన్నాయి. లంకానగరములోని గృహములు అన్నీ వాస్తు ప్రకారము నిర్మింపబడి ఉన్నాయి. ఒక్కొక్క గృహము ఒక్కొక్క విధముగా కట్టబడి ఉన్నాయి. కొన్ని గృహముల నుండి స్త్రీలు నాట్యము చేయు ధ్వనులు వినబడుతున్నాయి. కొన్ని చోట్ల మల్లయోధులు చేయు సింహ నాదములు వినపడుతున్నాయి. కాని కొన్ని గృహముల నుండి సుస్వరంతో మంత్రోచ్ఛారణలు, వేదాధ్యయనములు వినపడుతున్నాయి. హనుమంతుడు ఒక్కొక్క ఇంటినీ చూచుకుంటూ వెళుతున్నాడు. లంకలో ఉన్న సైనిక సమూహములను, ప్రచ్ఛన్న వేషములతో తిరుగుతున్న రావణుని గూఢచారులను కూడా చూచాడు హనుమంతుడు. రాక్షసులు అంటే అందరూ దుష్టులు క్రూరులు అనుకున్నాడ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 3)

శ్రీమద్రామాయణము సుందర కాండము మూడవ సర్గ హనుమంతుడు ధైర్యం చేసి లంకా నగర ముఖద్వారము వద్దకు వచ్చాడు. అక్కడి నుండి లంకా నగరాన్ని చూచాడు. లంకా నగరంలో భవనాలు తెల్లగా అందంగా ఉన్నాయి. లంకా నగరము ముఖద్వారము వద్ద అసంఖ్యాకంగా ఏనుగులు నిలిచి ఉన్నాయి. అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు. లంకా నగరము చుట్టు బంగారముతో కట్టబడిన ప్రాకారమును చూచాడు హనుమంతుడు. మెల్లిగా ఆ ప్రాకారము దగ్గరకు వెళ్లాడు. అక్కడి నుండి లంకానగరమును దూరంనుండి చూచాడు. లంకా నగరంలో ఉన్న ఇండ్లకు అమర్చబడిన ద్వారములు అన్నీ బంగారముతో నిర్మించబడి ఉన్నాయి. ఆ భవనములకు ఉన్న అరుగులు అన్నీ మణులు, మాణిక్యములతో అలంకరింపబడి ఉన్నాయి. లంకా నగరములో భవనములు అన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అంత ఎత్తుగా ఉన్నాయి. దేవేంద్ర నగరమువలె ఉన్న ఆ లంకా నగరమును చూచి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. అంతలోనే హనుమంతునికి ఒక సందేహము కలిగింది. "ఈ లంకా నగరమును రావణుని సైన్యములు అహర్నిశములు కాపలా కాస్తున్నారు. కాబట్టి వీరిని బలప్రయోగంతో ఎదిరించడం చాలా కష్టము. అసలు ఇక్కడి దాకా వానరులు రావాలి కదా! కుముదుడు, అంగదుడు, సుషేణుడు, మైందుడు, ద్వివిదుడు వీరు మాత్రము సముద్రము దాటి ఈ లంకకు...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - రెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 2)

శ్రీమద్రామాయణము సుందర కాండము రెండవ సర్గ హనుమంతుడు ఏ మాత్రమూ అలసట చెందకుండా నూరుయోజనముల దూరము కల దక్షిణ సముద్రమును దాటి లంకా ద్వీపంలో ప్రవేశించాడు. త్రికూట పర్వత శిఖరము మీద నిలబడి లంకా నగరమును చూచాడు. లంకా నగరములో ఉన్న అనేక రకములైన వృక్షజాతులు, పుష్పలతలను చూచాడు హనుమంతుడు. అనేకము లైన సరోవరములూ, ఉద్యానవనములను చూచాడు. లంకా నగరము మరో అమరావతిని తలపిస్తూ ఉంది. ఆ లంకా నగరమును పూర్వము విశ్వకర్మ నిర్మించాడు. ఆ లంకా నగరము మొదట కుబేరునికి చెందినది. లంకా నగరము చుట్టు పెద్ద అగడ్తను చూచాడు. (శత్రువులు నగరంలోకి ప్రవేశించకుండా కోట చుట్టు గొయ్యి తవ్వి దానిని నీటితో నింపి అందులో మొసళ్లను వదులుతారు. దాని పేరు అగడ్త, పరిఖ అంటారు.) ఆ లంకా నగరము పర్వతశిఖరము మీద ఉండటం వలన గాలిలో తేలుతున్న నగరంలా ప్రకాశిస్తూ ఉంది. లంకా నగరంలో తెల్లటి ఎత్తైన భవనములు, విశాలమైన వీధులు, వందలకొలదీ కోట బురుజులు, భవనముల మీద ఎగురు పతాకములు, ధ్వజములతో లంకా నగరము దేవేంద్రుని రాజధాని అమరావతిని తలపిస్తూ ఉంది. లంకా నగరము చుట్టు బంగారు ప్రాకారము ఉంది. లంకా నగరమును అనుక్షణము ఆయుధములు ధరించిన సైనికులు కాపలా కాస్తున్నారు. లంకా నగర కోట గోడల మీ...

శ్రీమద్రామాయణం - సుందర కాండము - మొదటి సర్గ (Ramayanam - SundaraKanda - Part 1)

శ్రీమద్రామాయణము సుందర కాండము మొదటి సర్గ జాంబవంతుని ప్రేరణతో, వానర వీరులు ఇచ్చిన ప్రోత్సాహంతో, అమితమైన ఉత్సాహంతో, హనుమంతుడు ఆకాశవీధిన లంకకు పోవడానికి నిశ్చయించుకున్నాడు. తన మెడను ముందుకు చాచాడు. తల పైకి ఎత్తాడు. ఆకుపచ్చని రంగులో ఉన్న హనుమంతుడు వైడూర్యము వలె ప్రకాశిస్తున్నాడు. హనుమంతుడు ఎగరడానికి ఆయత్తమైన మహేంద్ర పర్వతము మీద ఎంతో మంది యక్షులు, కిన్నరులు, గంధర్వులు, నాగులు నివసిస్తున్నారు. వారే కాకుండా సింహములు, ఏనుగులు, పెద్దపులులు కూడా ఆ పర్వతము మీద స్థిరనివాసము ఏర్పరచు కున్నాయి. ఆకాశంలోకి ఎగరడానికి ముందు హనుమంతుడు తూర్పు దిక్కుగా తిరిగి, బ్రహ్మదేవునికి, దేవేంద్రునికి, తన తండ్రి వాయు దేవునకు, ప్రత్యక్ష దైవము సూర్యభగవానుడికి, సమస్త దేవతలకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దక్షిణ దిక్కుగా తిరిగి లంకాద్వీపమునకు పోవుటకు తన శరీరమును పెంచాడు. అక్కడ ఉన్న వానర వీరులు, వానరులు అందరూ హనుమంతుని వంక కళ్లప్పగించి చూస్తున్నారు. వీలైనంత పెద్దదిగా తన శరీరాన్ని పెంచాడు హనుమంతుడు. తన చేతులను, కాళ్లను పర్వత శిఖరము మీద తొక్కిపట్టాడు. హనుమంతుడు తన బలమంతా ఉపయోగించి మహేంద్ర పర్వత శిఖరమును తొక్కిపట్టడంతో ఆ ...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఏడవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 67)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము అరువది ఏడవ సర్గ హనుమంతునికి తాను నూరు యోజనముల దూరము ఎగరాలని తెలుసు. అందుకు తగ్గట్టు తన శరీరాన్ని పెంచాడు. వేగాన్ని అందుకోడానికి ముందుకు దూకబోతున్నాడు. త్రివిక్రముని వలె ప్రకాశిస్తున్న హనుమంతుని చూచి వానరులు హర్షధ్వానాలు చేసారు. ఆనందంతో పెద్దగా అరుస్తున్నారు. హనుమంతుడు కూడా సంతోషంతో తన తోకను విదిలించాడు. ఒక్కసారి ఆవులించాడు. తన కన్నా పెద్దవారికి నమస్కరించాడు. “నా తండ్రి వాయుదేవుడు తన బలముతో పర్వతశిఖరములను కూడా ఎగురగొట్టగలడు. నేను వాయుదేవుని ఔరస పుత్రుడను. ఎగరడంలో ఆయనకు సమానుడను. మేరు పర్వతము చుట్టు లెక్కలేనన్ని సార్టు చుట్టిరాగలను. ఈ సముద్రమును అవలీలగా దాటగలను. నేను ఎగిరే వేగానికి సముద్రములో ఉన్న జలచరములు అన్నీ పైకి లేస్తాయి. నేను కూడా గరుడుని కన్నా అత్యంత వేగంగా ఎగురగలను. సూర్యోదయము అయిన తరువాత నేను సూర్యుని వద్దకు వెళ్లి, భూమి మీదకు వచ్చి మరలా సూర్యాస్తమయము లోపు ఆయనకు ఎదురు వెళ్లగలను. ఆకాశంలో ఎగిరే అన్ని పక్షులను అధిగమించగలను. భూమిని బద్దలు కొట్టగలను. సర్వతములను పడగొట్టగలను. మహాసముద్రములనే దాటగలను. నేను ఎగిరే వేగానికి వృక్షములు లతలు కిందపడిపోతాయి. ఓ వా...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఆరవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 66)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము అరువది ఆరవ సర్గ జాంబవంతుడు దూరంగా కూర్చుని ఉన్న హనుమంతుని వద్దకు వెళ్లాడు. హనుమ పక్కనే కూర్చుని ఇలా అన్నాడు. “హనుమా! ఇక్కడ ఉన్న వానరులలో కెల్లా వీరుడవు నీవే కదా. పైగా సమస్త శాస్త్రములు చదివినవాడవు. అందరూ వారి బలాబలాలు గురించి చెబుతూ ఉంటే నీవు ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నావు. ఓ హనుమా! నీ గురించి నీకు సరిగా తెలియదు. నీవు తేజస్సులోనూ, బలంలోనూ, పరాక్రమం లోనూ రామలక్ష్మణులతోనూ, రాజైన సుగ్రీవునితోనూ సమానుడవు. పక్షులలో కెల్లా గరుడుడు ఉత్తముడు. ఆ గరుత్మంతుడు సముద్రము మీద ఎగురుతూ సముద్రగర్భములో ఉన్న పెద్ద పెద్ద పాములను పైకి లాగడం నేను ప్రత్యక్షంగా చూచాను. గరుత్మంతుని రెక్కలకు ఎంత బలమూ, శక్తి ఉన్నాయో నీ భుజాలకు కూడా అంతే శక్తి, బలం ఉన్నాయి. బలంలో కానీ ఎగిరే శక్తిలో కానీ నీవు గరుడునికి ఏ మాత్రం తీసిపోవు.  నీ తల్లి సామాన్యురాలు కాదు. నీ తల్లి పుంజికస్థల అనే అప్సరస. పుంజికస్థలకు అంజన అనే పేరు కూడా ఉంది. ఆమె శాప వశమున కుంజరుడు అనే వానర ప్రభువుకు కుమార్తెగా వానర స్త్రీగా జన్మించింది. ఆమె వానర స్త్రీగా జన్మ ఎత్తినా, మనుష్య రూపముతోనే లోకోత్తర సుందరిగా ప్ర...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది ఐదవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 65)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము అరువది ఐదవ సర్గ తరువాత ఒక్కొక్కరూ లేచారు. తమ తమ బలాబలాల గురించి చెప్పసాగారు. గజుడు అనే వానరుడు లేచి నేను పది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు. గవాక్షుడు నేను ఇరువది యోజనముల దూరము ఎగురగలను అని అన్నాడు. శరభుడు ముప్పది యోజనములు, ఋషభుడు నలుబది యోజనములు, గంధమాధనుడు యాభైయోజనములు, మైందుడు అరువది యోజనములు, ద్వివిదుడు డెబ్బది యోజనములు, సుషేణుడు ఎనుబది యోజనములు ఎగురగలము అని వరుసగా లేచి చెప్పారు. వారు చెప్పినది అంతా విన్న జాంబవంతుడు లేచి ఇలా అన్నాడు. "ఇదివరకు నేను కూడా ఎంతో కొంత ఎగురగలను. కానీ ఇప్పుడు వార్ధక్యములో ఉన్నాను. అందుకని ఎగురలేను. కాని ఇది రామ కార్యము. సుగ్రీవుని ఆజ్ఞ. కాబట్టి ఏదో ఓపిక చేసుకొని నేను తొంబది యోజనములు ఎగురగలను. పూర్వము నాకు ఇంకా ఎగిరే శక్తి ఉండేది. పూర్వము బలి చక్రవర్తి చేసిన యజ్ఞములో, బలి చక్రవర్తి త్రివిక్రమునికి మూడు అడుగులు దానం ఇచ్చాడు. ఆ త్రివిక్రముని చుట్టు నేను ప్రదక్షిణం చేసాను. అప్పుడు అంత శక్తి ఉండేది. వార్ధక్యము వలన నా శక్తి అంతా తగ్గిపోయింది. కాని కేవలము తొంబది యోజనములు ఎగరడం వలన రామ కార్యము సిద్ధించదు కదా! " అని అన...

శ్రీమద్రామాయణం - కిష్కింధా కాండము - అరువది నాలుగవ సర్గ (Ramayanam - KishkindhaKanda - Part 64)

శ్రీమద్రామాయణము కిష్కింధా కాండము అరువది నాలుగవ సర్గ ఇప్పుడు వానరులకు సీత ఎక్కడ ఉందో తెలిసింది. సీత రావణుని రాజ్యమైన లంకలో ఉంది. ఆ లంక దక్షిణ సముద్ర మధ్యలో ఉన్న దీవిలో ఉంది. ఆ దీవి సముద్ర తీరము నుండి నూరు యోజనముల దూరములో ఉంది. ఆ దీవికి ఎలా చేరాలి? అదే ఇప్పుడు వారి ముందు ఉన్న ప్రశ్న. అందరూ సముద్ర తీరంలో నిలబడి సముద్రం వంక చూస్తున్నారు. ఆకాశము భూమి కలిసినట్టు ఉన్న ఆ సముద్రమును చూస్తుంటే ఆ వానరులకు దిగులు పుట్టింది. ఈ సముద్రాన్ని ఎలా దాటాలి! ఇదే వారి అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న. వారికి నాయకుడు అయిన అంగదుడు వారిని చూచి ఇలా అన్నాడు. “మనము ఇలా సముద్రాన్ని చూస్తూ దిగులుపడితే ప్రయోజనము లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. మన మనసులో దిగులు, భయం ప్రవేశిస్తే మనము ఏమీ చెయ్యలేము. ఆ దిగులు భయం మనలను మింగేస్తుంది. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏమి చెయ్యాలో ఆలోచించండి. " అని పలికాడు అంగదుడు. కాసేపు అటు ఇటు చూచాడు. మరలా ఇలా అన్నాడు. “మనలో ఈ సముద్రమును దాటగల సమర్థుడు ఎవరు? ఎవరు నూరుయోజనముల దూరము కల ఈ సముద్రమును దాటగలరు? రాముని కార్యము నెరవేర్చగల సమర్ధుడు ఎవరు? అతడే మనలను అందరనూ సుగ్రీవుని బారినుండి కాపాడగలడు. మర...