శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 10)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

పదవ సర్గ

హనుమంతుడు సీత కోసరం రావణుని అంతఃపురము అంతటా వెదుకుతున్నాడు. రావణుని పడక గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఎన్నో ఆసనములు శయ్యలు ఉన్నాయి. అవి అన్నీ మణులతో రత్నములతో అలంకరింపబడి ఉన్నాయి. ఒక ఉన్నతమైన శయ్య మీద రావణుడు నిద్రపోతున్నాడు.

రావణుడు దీర్ఘమైన బాహువులు, ఎర్రటి కళ్లు, నల్లని రూపముతో ఉన్నాడు. అతని ఒంటికి సువాసనలు వెదజల్లే చందనము పూయబడి ఉంది. రావణుని శయనాగారంలో మణులతో అలంకరింపబడిన తెల్లని గొడుగు ఒకటి, ఒక మూలగా నిలబెట్టబడి ఉంది. దాని పక్కనే బంగారముతో నిర్మించిన ఉన్నతాసనము ఉంది.

రావణుడు రాత్రి అంతా రతికేళి జరిపి సొక్కి సోలి గాఢంగా నిద్రపోతున్నాడు. రావణుని చూస్తే హనుమకు కించిత్ భయం కలిగింది. అందుకని కాస్త దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎందు కన్నా మంచిదని పక్కన ఉన్న అరుగు ఎక్కి అక్కడి నుండి రావణుని చూస్తున్నాడు హనుమంతుడు. అక్కడి నుండి రావణుడు బాగా కనపడుతున్నాడు.

విశాల మైన అతని బాహువుల మీద ఇంద్రుని ఏనుగు ఐరావతము పొడిస్తే ఏర్పడిన గాయము మచ్చలు కనపడుతున్నాయి. ఆ బుజముల మీద ఇంద్రుని వజ్రాయుధముతోనూ, విష్ణువు తన
సుదర్శన చక్రముతోనూ కొడితే ఏర్పడిన గాయముల వలన కలిగిన మచ్చలు కనపడుతున్నాయి.
రావణుడు వెల్లకిలా పడుకొని నిద్రపోతున్నాడు. అతని కిరీటము ముత్యములు, మణులు పొదగబడి చిత్రవిచిత్రంగా ప్రకాశిస్తూ ఉంది. అతని విశాలమైన వక్షస్థలము మీద ముత్యాల హారములు ప్రకాశిస్తున్నాయి. రావణుడు పీతాంబరమును ధరించి ఉ న్నాడు. పైన తెల్లటి పట్టు వస్త్రమును ఉత్తరీయముగానూ ధరించి ఉ న్నాడు. రావణుడు నిద్రపోతూ కూడా కళ్లు సగం తెరిచి ఉన్నాడు.

హనుమంతుడు రావణుని కాళ్ల దగ్గర నిద్రపోతున్న అతని భార్యలను చూచాడు. వారందరూ ఎంతో సౌందర్యవంతులు. వారి ముఖములు పద్మముల వలె ప్రకాశిస్తున్నాయి. వారు ధరించిన పూలమాలలు ఇంకా వాడిపోలేదు. కాని చెల్లాచెదరు అయ్యాయి. ఆ స్త్రీలు కొందరు రావణుని భుజముల దగ్గర కొందరు రావణుని తొడల దగ్గర తలలు పెట్టి నిద్రపోతున్నారు. వారంతా రావణునితో రతికేళి సలిపి అలసి పోయి గాఢంగా నిద్రపోతున్నారు.

ఒకామె తాను నిద్రపోతున్నప్పుడుకూడా తాను నేర్చిన నృత్యభంగిమలోనే పడుకొని ఉంది. ఒకామె వీణ వాయిస్తూ అలాగే నిద్రవచ్చి వీణ మీద పడిపోయి నిద్రపోతూ ఉంది. మరొక యువతి మడ్డుకము అనే వాద్య విశేషమును వాయిస్తూ, ఇంతలో నిద్రముంచు కొచ్చి, తల్లి కుమారుని కౌగలించుకొని నిద్రిస్తున్నట్టు, ఆ వాద్యమును కౌగలించుకొని నిద్రిస్తూ ఉంది. మరొక స్త్రీ పటహమ అనే వాద్యమును గట్టి గా పట్టుకొని నిద్రలోకి జారుకుంది. మరొక మదవతి వేణువును
ఊదుతూ, ఆ వేణువును తన పెదాలకు అదుముకొని నిద్రపోయింది. మరొక వనిత ఏడు తీగలు కలిగిన వీణను, ప్రియురాలు ప్రియుని కౌగలించుకున్నట్టు కౌగలించుకొని నిద్రిస్తూ ఉంది. మరియొక సుందరాంగి మృదంగము వాయిస్తూ అలాగే దానిమీద పడిపోయి నిద్రపోయింది. మరియొక యువతి పణవము అనే వాద్యమును వాయిస్తూ అలాగే సోలిపోయింది. మరియొక వనిత డిండిమము అనే వాద్యమును ఒడిలో ఉంచుకొని నిద్రపోయింది. మరొక వనిత ఆడంబరము అనే వాద్యమును వాయిస్తూ నిద్ర ఆపుకోలేక అలాగే పడిపోయి నిద్రలోకి జారుకుంది. మరియొక వనిత నిద్రమత్తులో పక్కనేఉన్న నీటి కలశమును తన్నింది. ఆ నీళ్లు ఆమె కిందికి వచ్చి ఆమె పూర్తిగా తడిసిపోయింది. కానీ ఆ నిద్రమత్తులో ఆమెకు మెలుకువ రాలేదు. గాఢనిద్రలో ఉంది. మరియొక పద్మనేత్ర తన పక్కన మరియొక యువతిని తన ప్రియుడు అనుకొని గట్టిగా కౌగలించుకొని నిద్రలోకి జారుకుంది. అదే మాదిరి రకరకాల వాద్య విశేషములను తమ తమ గుండెలకు అదుముకుంటూ అక్కడ ఉన్న వనితలు గాఢనిద్రాపరవశులై ఉన్నారు.

ఇంతమంది యువతులు, మదవతులు నిద్రిస్తూ ఉంటే, చుక్కల్లో చంద్రుడు లాగా వారందరి మధ్యలో ఒక ఉత్తమ జాతి స్త్రీ నిద్రిస్తూ ఉంది. ఆమెయే రావణుని పట్టమహిషి మండోదరి. ఆ అంత:పురమునకు అధిపతి. ఆమె రకరకాల బంగారు ఆభరణములు ధరించి ఉంది. ముత్యములు, రత్నములు పొదిగిన అలంకారములను ఒంటి నిండా అలంకరించుకొని ఉంది. ఆమెను చూడగానే హనుమంతునికి ప్రాణం లేచి వచ్చింది. అమ్మయ్య సీత కనపడింది అనుకున్నాడు. రూపవతి, యౌవనవతి, సౌందర్యవతి అయిన మండోదరిని చూచి సీత అని భ్రమపడ్డాడు హనుమంతుడు. హనుమంతుని ఆనందానికి అవదులు లేవు. గంతులు వేసాడు. పక్కనే ఉన్న స్తంబమును ఎక్కాడు. కిందికి దుమికాడు. బుజాలు చరచుకున్నాడు. తోకను పట్టుకొని ముద్దులు పెట్టుకున్నాడు. వచ్చిన పని అయిందని పరమానందభరితుడు అయ్యాడు. అటు ఇటు గబా గబా తిరిగాడు. స్తంబాలు ఎక్కాడు. దిగాడు. ఆ చోటంతా కలయతిరిగాడు. వానరములకు ఉన్న చాపల్యము అంతా ప్రదర్శించాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము పదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)