శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదకొండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 11)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

పదకొండవ సర్గ

ఎగిరీ ఎగిరీ దుమికి దుమికీ అలసిపోయాడు హనుమంతుడు. ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు. సీత కనపడింది అన్న ఆనందాన్ని పక్కన బెట్టి ఆలోచించసాగాడు.

“ఈమె నిజంగా సీతయేనా! ఈమే నిజంగా సీత అయి ఉంటే రాముడు దగ్గర లేకుండా ఇంత సుఖంగా, నిశ్చింతగా, ఆనందంగా నిద్రపోతుందా! రాముడు దగ్గర లేని సీత ఇన్ని ఆభరణములు ధరిస్తుందా! మద్యపానము చేస్తుందా! పరపురుషుడైన దేవేంద్రుని కూడా కన్నెత్తి చూడని సీత, ఇలాగా రావణుని పక్కన నిద్రిస్తుందా! సందేహం లేదు. ఈమె సీత కాదు. మరొక స్త్రీ. ఈమె సీత
కాకపోతే మరి సీత ఎక్కడ ఉంది?" ఇలా పరి పరి విధాల ఆలోచించిన హనుమంతుడు, మరలా సీతకోసం వెదకడం మొదలెట్టాడు.

మరొక పాన గృహమునకు వెళ్లాడు. అక్కడ కూడా అందమైన యువతులు, మద్యపానంతో, రతికేళితో సొక్కి సోలి ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్నారు. ఎక్కడబడితే అక్కడ వాలిపోయి నిద్రపోతున్నారు. అందరి వనితల మధ్య రావణుడు ఆడ ఏనుగుల గుంపుమధ్య ఉన్న మగ ఏనుగుమాదిరి ప్రకాశించాడు. హనుమంతుడు సీతను వెదుకుతూ పక్కనే ఉన్న పానభూమిని
చూచాడు.

అక్కడ రక రకాల మృగముల మాంసములు అందమైన పాత్రలలో పెట్టబడి ఉన్నాయి. లేళ్లు, దుప్పులు, అడవి దున్నలు, అడవి పందుల మాంసములు వేరు వేరుగా అమర్చబడి ఉన్నాయి. బంగారుపాత్రలలో ఉన్న నెమళ్లు, కోళ్ల మాంసములను, తిన్నంత తిని మిగిలింది వదిలేసారు అక్కడ ఉన్న యువతులు. చక్కగా వండబడిన పంది మాంసము, గొర్రె మాంసము, లేడి మాంసము, రకకరాల పక్షుల మాంసములు అందమైన పాత్రలలో అమర్చబడి ఉన్నాయి. అంతే కాదు, అక్కడ ఉన్న బంగారు పాత్రలలో రకరకాల భోజ్యములు, లేహ్యములు, చోష్యములు, భక్ష్యములు, లేళ్లు, దుప్పుల మాంసములు అందంగా అమర్చబడి ఉన్నాయి. ఆ పదార్ధము లన్నీ తినగా తిని మిగిలినవి నేల మీద చెల్లాచెదరుడా చల్లబడి ఉన్నాయి.

ఈ ఆహార పదార్థములతో పాటు రకరకాల మద్యములు, పానీయములు, బంగారు పాత్రలలోనూ, వెండి పాత్రలలోనూ అమర్చబడి ఉన్నాయి. ఆ పాత్రలకు రత్నములు, మణులు పొదగబడి ఉన్నాయి. అలా అమర్చబడిన మద్యమును కొన్ని పాత్రలలో నుండి పూర్తిగా తాగేశారు. కొన్ని పాత్రలను అసలు ముట్టుకోలేదు. కొన్ని పాత్రలలో సగం సగం తాగగా మిగిలి ఉన్న మద్యము దొర్లిపోయి కారిపోతూ ఉంది. ఈ ప్రకారంగా చెల్లాచెదరుగా పడి ఉన్న మద్యపాత్రలను, భోజన పాత్రలను చూస్తూ హనుమంతుడు సీత కోసరం అణువు అణువునా గాలిస్తున్నాడు.

అక్కడి నుండి మరొక చోటికి వెళ్లాడు హనుమంతుడు. అక్కడా అందమైన స్త్రీలు నిద్రిస్తున్నారు. వారికి ఒంటిమీద వస్త్రములు తొలగినట్టుకూడా తెలియడం లేదు. ఒకరి వస్త్రమును మరొకరు లాగుకుంటూ కప్పుకుంటూ నిద్రబోతున్నారు. వారు ఒంటికి పూసుకున్న చందనము వాసన, వారు సేవించిన మద్యము వాసనా, వారు తిన్న మధురమైన పదార్ధముల వాసనా కలగలిపి ఒక రకమైన వింత వాసన వస్తూ ఉంది. ఆ వాసనలన్నీ ఆఘ్రాణిస్తూ హనుమంతుడు వారి మధ్య తిరుగుతూ సీత కోసరం వెదుకుతున్నాడు.

రావణుని అంత:పురములో ఉన్న స్త్రీలు రకరకాలైన రంగులలో ప్రకాశిస్తున్నారు, కొందరు బంగారు వర్ణములోనూ కొందరు చామనచాయలోనూ మరి కొందరు నల్లగానూ, మరి కొందరు పచ్చని పసిమి ఛాయలోనూ ప్రకాశిస్తున్నారు. వారందరి ముఖములు వికసించిన పద్మముల మాదిరి ప్రకాశిస్తున్నాయి. ఇంతమంది సౌందర్యవతుల మధ్య హనుమంతునికి సీత కనపడలేదు. ఇప్పుడు
హనుమంతునికి మరొక సందేహము పట్టుకుంది. తాను ఇప్పటి దాకా ఎంతో మంది యువతులను ఎన్నో చిత్ర విచిత్ర భంగిమలలో చూచాడు. పరస్త్రీలను ఈ విధంగా చూడటం వలన తాను ధర్మం తప్పానా! పాపం చేసానా! అని సందేహం కలిగింది హనుమంతునికి.

“నేను ఇప్పటి దాకా పరస్త్రీలను కన్నెత్తికూడా చూడలేదు. అటువంటిది ఇప్పుడు నిద్రపోతున్న పరాయి స్త్రీలను ఈ విధంగా వివిధ భంగిమలలో చూచాను. అది కాకుండా పట్టి పట్టి పరీక్షగా చూచాను అంగాంగములు చూచాను. మరి ఇది ధర్మద్రోహము కాదా!" అని తనలో తాను తర్కించుకున్నాడు. ఇంతలో హనుమంతునికి మరొక ఆలోచన వచ్చింది. “నా అంతట నేను స్వతాహాగా పరాయి స్త్రీలను చూడలేదు కదా! కేవలం సీతను వెదికే ప్రక్రియలో భాగంగా చూచాను అదీ కాకుండా వారిని చూచినపుడు నా మనసులో ఎలాంటి వికారమూ కలగలేదు. ఇంద్రియములు ఏ పని చేయాలన్నా మనసే కారణము. మనస్సులో సంకల్పించనిది ఇంద్రియములు ఏపనీ చేయలేవు. నేను నా మనసులో ఈ స్త్రీల పట్ల ఎలాంటి వికారము సంకల్పించలేదు. కాబట్టి నాకు ఏ పాపమూ అంటదు. అదీ కాకుండా సీత ఒక స్త్రీ. సీతకోసరం స్త్రీల మధ్యలో వెదకాలి కానీ పురుషుల మధ్యలో వెదకలేను కదా! కాబట్టి నేను స్త్రీలను చూడటం తప్పని సరి. నా మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు, నేను ఎంతమంది స్త్రీలను చూచినా నాకు ఏ ధర్మహానీ కలగదు.” అని తన మనసుసు సమాధాన పరచుకున్నాడు. మరలా సీతను వెదకడం మొదలెట్టాడు.

రావణుని అంతఃపురములో, దేవతా స్త్రీలు, నాగ కన్యలు, గంధర్వకన్యలు కనపడ్డారు కానీ, ఎంత వెదికినా సీత కనపడలేదు. ఇంక అక్కడ ఉండి ప్రయోజనము లేదని కొంచెం దూరంగా వెళ్లి ఒక చోట కూర్చుని ఆలోచించడం మొదలెట్టాడు హనుమంతుడు. సీత అంత:పురములలో ఉండదు. విలాసవంతమైన అంతఃపురములో వెదకడం వృధా. కాబట్టి బయట వెదకాలని అనుకున్నాడు.
హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము పదకొండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)