శ్రీమద్రామాయణం - సుందర కాండము - పన్నెండవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 12)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

పన్నెండవ సర్గ

హనుమంతుడు రావణుని అంతఃపురము నుండి బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న ఉద్యానవనములు, పొదరిళ్లు, చిత్రగృహములు, ఏదీ వదల కుండా వెదుకుతున్నాడు. లంక పూర్తిగా గాలించడం అయింది. సీత జాడ కనపడలేదు. ఇంక సీత ఈలోకంలో బతికి లేదు. మరణించి ఉంటుంది. సీత బతికే ఉంటే ఎక్కడో ఒకచోట కనపడాలి కదా! అనే నిర్ధారణకు వచ్చాడు హనుమంతుడు. ఇంక హనుమంతుని ఆలోచనలు ఆ విధంగా సాగాయి. సీత మరణించి ఉంటుంది అన్న వార్త గానీ,, సీత దొరకలేదు అన్న వార్తను గానీ తీసుకొని కిష్కింధకు వెళితే పరిణామాలు ఎలా ఉ౦టాయి అనే దాని మీద రకరకాల ఊహాగానాలు చేయసాగాడు హనుమంతుడు.

“ఎంతకూ తనకు లొంగకుండా ధర్మమార్గాన్ని అంటిపెట్టుకొని ఉన్న సీతను, రావణుడు కోపం వచ్చి చంపేసి ఉంటాడేమో! అదీ కాక పోతే ఎప్పుడూ కని విని ఎరుగని ఈ భయంకర రాక్షసులను చూచి, వారి బెదిరింపులకు భయపడి, తట్టుకోలేక సీత మరణించిందేమో! కాబట్టి సీత ఇంక నాకు కనిపించదు. సుగ్రీవుడు ఇచ్చిన గడువు ఎప్పుడో దాటి పోయింది. ఇన్నిరోజులూ అక్కడా ఇక్కడా తిరిగి ఇప్పుడు సీత కనపడలేదు అని చెబితే సుగ్రీవుడు ఊరుకుంటాడా! వాడసలే మహా బలవంతుడు. చచ్చేట్టు చావ గొడతాడు. మరణ దండన విధిస్తాడు.

నేను మాత్రం ఊరికినే ఉన్నానా! రావణుని అంత:పురం అంతా చూచాను. ఎంతో మంది స్త్రీలను చూచాను. కాని సీత ఎక్కడా కనపడలేదు. ఏం చెయ్యను? నూరుయోజనముల సముద్రం దాటడం, లంకలోకి ప్రవేశించడం, లంక అంతా అణువు అణువునా గాలించడం ఈ శ్రమ అంతా వృధా అయింది. నా కోసరం సముద్రము ఆవల ఎంతో మంది వానరులు వేచి ఉన్నారు. నేను వారి దగ్గరకు పోగానే “నూరుయోజనముల సముద్రము దాటి లంకకు వెళ్లావు కదా! ఏమి సాధించావు? సీత జాడ తెలుసుకున్నావా? ఏమయింది? సీత ఎక్కడుంది?" అని వాళ్లు అడిగితే ఏమని సమాధానము చెప్పాలి? పోనీ వారి దగ్గరకు వెళ్లకుండా ఇక్కడే ఉంటే, నా కోసరం ఎదురు చూచి చూచి వారు ప్రాయోపవేశం చేసి మరణిస్తారేమో!

నేను ఏదో ఘనకార్యం చేసుకొని వస్తానని జాంబవంతుడు, అంగదుడు నా కోసం ఎదురు చూస్తుంటారు. వారికి ఏమని చెప్పాలి?" అని ఆవేదన చెందుతున్నాడు హనుమంతుడు.
ఇంతలో హనుమంతుని లోని వివేకము మేల్కొంది. తనను తాను సంబాళించుకున్నాడు. 

“ఏమిటిది! నేను ఇలా ఆలోచిస్తున్నాను. నాకు ఇంత నిర్వేదము పనికిరాదు! అన్ని అనర్థములకు హేతువు నిర్వేదము. నిర్వేదము లేకపోవడమే కార్యసిద్ధికి మూలము. మానవుడు తాను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేడు. చేయ గలను అనుకుంటే ఏమైనా చేయగలడు. నిర్వేదము లేకపోవడమే కార్యము సఫలం కావడానికి మూలము. కాబట్టి నాలో పుట్టిన ఈ నిర్వేదమును సమూలంగా నాశనం చేసి, రెట్టించిన ఉ త్సాహంతో సీత కోసం వెదుకుతాను.” అని తనకు తానే ఉత్తేజితుడు అయ్యాడు హనుమంతుడు.

వెంటనే తాను అప్పటి వరకూ సీత కోసరం ఎక్కడెక్కడ వెదికిందీ ఒక్కసారి ఆకళింపు చేసుకున్నాడు. తాను ఇప్పటి దాకా పానశాలలు, ఉద్యానవనములు, పూపొదరిళ్లు, క్రీడా మందిరములు, శయ్యాగారాలు, భోజన శాలలు, పుష్పక విమానము లోని అంతర్భాగములు, ఇంకా లంకలోని అన్ని గృహములు, ప్రాంగణములు వెదికాడు. ఇంకా వెదకవలసినవి నేలమాళిగలు, జనులు సాధారణంగా గుమిగూడే మంటపాలు, చిన్న చిన్న గృహాలూ. వీటిని కూడా వెదకాలి అని నిర్ణయించుకున్నాడు.

అంతే హనుమంతుడు చిన్న మర్కటము మాదిరి చెంగు చెంగున ఎగురుతూ, దుముకుతూ అన్ని ఇళ్లలోకి దూరి వెదకడం మొదలెట్టాడు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అన్ని గృహములనూ ఒక్కటీ వదలకుండా, అంగుళము మేరకూడా వదలకుండా వెదికాడు. కాని సీత కనపడలేదు. ఇంక మిగిలినవి బావులూ, సరస్సులూ, వీధులూ. అక్కడ కూడా క్షుణ్ణంగా వెదికాడు హనుమంతుడు. సీత కనపడలేదు. ఎంతోమంది రాక్షస స్త్రీలు, ఇతర జాతుల స్త్రీలు కనపడ్డారు కానీ సీత మాత్రం కనపడలేదు. ఇంక వెదకవలసిన స్థళాలు ఏవీ లేకపోవడంతో హనుమంతునిలో మరలా నిరుత్సాహము ఆవరించింది. తాను సముద్రాన్ని లంఘించడం, సీతను వెదకడం అన్నీ వృధా అయిపోయినాయి కదా! అని ఆలోచిస్తున్నాడు హనుమంతుడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)