శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదమూడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 13)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
పదమూడవ సర్గ
హనుమంతుడు ఒక గృహము మీది నుండి మరొక గృహము మీదికి దుముకుతూ, అన్ని గృహములూ వెదికాడు. ఎక్కడా సీత జాడ కనపడలేదు. విసిగిపోయాడు. ఒక చోట ఏకాంతముగాకూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు.
“నేను రామకార్యము నిమిత్తము లంకకు వచ్చాను. లంక అంతా గాలించాను. కానీ సీత ఎక్కడా కనపడలేదు. కాని జటాయువు సోదరుడు, పక్షిరాజు సంపాతి చెప్పిన ప్రకారము సీత రావణాసురుని స్థావరమైన లంకలోనే ఉండాలి. కాని లంక అంతా ఎంత వెతికినా సీత కనపడలేదు. నిస్సహాయురాలైన సీత రావణుని చెరలో ఉండి చేసేది లేక రావణునికి లొంగి పోయిందా! లేక రావణుడు సీతను ఆకాశ మార్గంలో అతి వేగంగా తీసుకొని వస్తుంటే, ఆ వేగానికి తట్టుకోలేక సీత మార్గమధ్యంలో ఎక్కడైనా పడిపోయిందా! రావణుడు సీతను సముద్రము మీదుగా తీసుకొని వచ్చి ఉండాలి. ఆకాశంలో వస్తున్నప్పుడు కింద ఉన్న అపారమైన జలరాసిని చూచి భయపడి, సీత సముద్రంలో పడిపోయిందా! జలచరములకు ఆహారంగా మారిందా!
అయోనిజ అయిన సీత, దుర్మార్గుడు, దుష్టుడు అయిన రావణుడు, తనను తాకి, తనను పట్టుకొని, తన అంగాంగములు తాకుతూ, తీసుకొని వస్తుంటే, ఆ అవమానమును తట్టుకోలేక దారిలోనే ప్రాణములు విడిచిందా! అదీ కాకుండా, రావణుడు సీతను తీసుకొని వస్తుంటే, ఆమె పెనగులాడితే, ఆ పెనగులాటలో జారి సముద్రంలో పడిపోయిందా! సీత ఎంత కాలానికి తనకు లొంగక పోతే, రావణుడు విసుగుచెంది ఆమెను చంపించి, భక్షించాడా! రావణుడు సీతను తీసుకొని వచ్చి అంతఃపురములో ఉంచినపుడు, రావణుని ఇతర భార్యలు అతిలోక సౌందర్యవతి అయిన సీతను చూచి, అసూయ చెంది, రావణుడు తమకు దక్కడేమోఅన్న అనుమానంతో సీతను అంతమొందించారా!
రావణుడు సీతను ఒంటరిగా బంధించి ఉంచినపుడు, సీత రాముని తలచు కొని తలచుకొనీ, కృంగి, కృశించి, చివరకు మరణించినదా! లేక సీత రావణుని అంతఃపురములోనే ఎక్కడైనా ఉందా! నాకు కనపడలేదా! అయినా నా వెర్రిగానీ, మహాపతివ్రత అయిన సీత, రాముని తప్ప మరొకరిని కన్నెత్తి కూడా చూడని మహాసాధ్వి, రావణునికి లొంగిపోతుందా! ఏది ఏమైనా సీత నాకు
కనపడలేదు.
సీత మరణించి ఉన్నా, లేక జీవించి ఉన్నా, లేక ఆత్మాహుతి చేసుకున్నా, ఎవరికీ కనపడకుండా పోయినా, ఈ విషయం రామునికి తెలియచెయ్యడం మంచిది కాదు. అలాగని సీత గురించి రామునికి చెప్పకుండా ఎంత కాలము దాచగలము! సీత గురించి రామునికి తెలిసినా దోషమే! తెలియకపోయినా దోషమే! ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకేది మార్గము? అంతా అగమ్యగోచరంగా ఉంది. సముద్రమును దాటాను, లంకకు వచ్చాను అనుకుంటే, రామ కార్యము అంతా రసాభాస అయింది." అని హనుమంతుడు పరి పరి విధాలా ఆలోచిస్తున్నాడు.
కాని ఆయన ఆలోచనలు ఒక కొలిక్కిరావడం లేదు.
మరలా హనుమంతుని ఆలోచనా ప్రవాహం సాగి పోయింది. "ఇప్పుడు నేను ఏమి సాధించానని కిష్కింధకు తిరిగి వెళ్లాలి. సముద్రము దాటడం, లంకకు రావడం, లంక అంతా వెదకడం అంతా వృధా అయింది కదా! ఒకవేళ నేను కిష్కింధకు వెళితే, సీత జాడ తెలిసిందా అని అడిగితే, రామలక్ష్మణులకు, సుగ్రీవునికి ఏమి సమాధానము చెప్పాలి?
నేను రాముని ముందు నిలబడి సీత కనపడలేదు అని ఒక మాట చెబితే రాముడు కుప్పకూలి పోతాడు, సీతా వియోగబాధతో మరణిస్తాడు. సీత కనపడలేదు అన్న మాట కన్నా రాముని దృష్టిలో మరొక పరుషమైన మాట ఉండదు. రాముడు మరణించడం చూచిన లక్ష్మణుడు కూడా ప్రాణత్యాగము చేస్తాడు. రాముడు, లక్ష్మణుడు మరణించారు అన్న వార్త అయోధ్యకు చేరగానే భరతుడు కూడా మరణిస్తాడు. సోదరుల మరణవార్త విన్న శత్రుఘ్నుడు కూడా మరణించడం తథ్యము. లేక లేక కలిగిన వాళ్లు, పుత్రకామేష్టి యాగఫలంగా జన్మించిన కుమారులు మరణించగానే, కౌసల్యా, కైకేయీ, సుమిత్రల మేనిలో ప్రాణములు నిలువవు. తనకు మిత్రుడు, తనకు సాయం చేసిన వాడు అయిన రాముడు మరణించగానే, సుగ్రీవుడు కూడా మరణిస్తాడు. సుగ్రీవుని మరణం చూచి సుగ్రీవుని భార్య రుమ కూడా భర్తను అనుసరిస్తుంది. అసలే భర్త వాలిని కోల్పోయి, సుగ్రీవుని పంచన చేరిన తార, సుగ్రీవుడు కూడా మరణించగానే, తాను కూడా మరణిస్తుంది. తండ్రి వాలి, తల్లి తార, పిన తండ్రి సుగ్రీవుడు, పినతల్లి రుమ చనిపోగానే, గుండె పగిలి అంగదుడు కూడా మరణిస్తాడు. కిష్కింధ అనాధ అయి పోతుంది. తమ ఆలనా పాలనా చూచే నాధుడు లేక వానరులు అందరూ ప్రాణత్యాగము చేసుకుంటారు. ఇదంతా నేను కిష్కింధకు వెళ్లి సీత కనపడలేదు అన్న ఒక్క మాట చెప్పినందువల్ల సంభవిస్తుంది. అటు రాముని వంశము, ఇటు సుగ్రీవుని వంశము అంతరిస్తుంది. కాబట్టి నేను కిష్కింధకు వెళ్లనే వెళ్లను. సీత జాడ తెలియకుండా నేను సుగ్రీవుని వద్దకు వెళ్లడం వృధా!
నేను తిరిగి కిష్కింధకు వెళ్లకుండా ఉంటే “ఎప్పటికైనా హనుమంతుడు వస్తాడు, సీత గురించి వార్త తెస్తాడు" అనే ఆశతో రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వానరులు జీవించి ఉంటారు. నేను మాత్రము ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్న కాయలు పండ్లు తింటూ వానప్రస్థ జీవనము గడుపుతాను. కాలగతిన మృతి చెందుతాను. లేదా చితి పేర్చుకొని అందులో దూకుతాను. లేక సముద్రము ఒడ్డున ప్రాయోపవేశము చేస్తాను. నా శరీరాన్ని పక్షులు, మృగములు తింటాయి. ఇంతకన్నా నాకు మరొక మార్గము కనిపించడం లేదు. నేను ఇంత కాలము సంపాదించుకున్న పేరు, ప్రతిష్ట రామ కార్యము సాధించలేకపోవడం వలన భగ్నమైపోయాయి.” అని హనుమంతుడు శోకిస్తున్నాడు.
హనుమంతునికి ఏమి చెయ్యాలో తోచడం లేదు. మితిమీరిన దు:ఖంతో హనుమంతుని ఆలోచనా శక్తి నశించింది. కోపం ఎక్కువ అయింది. ఆ కోపంలో ఇలా అనుకున్నాడు.
"దీనికంతటికీ మూల కారణము ఈ దుష్టుడైన రావణుడు. ముందు వీడిని చంపితే గానీ నా కసి తీరదు. లేకపోతే వీడిని పట్టుకొని పశువును కట్టినట్టు కట్టి, రాముని ముందు పడవేస్తాను. వీడి సంగతి రాముడే చూచుకుంటాడు." అని అనుకున్నాడు. హనుమంతుడు.
మరలా హనుమంతుని ఆలోచనలు మొదటికి వచ్చాయి. “లాభం లేదు. సీత కనిపించేవరకూ లంకను మాటి మాటికీ వెదుకుతాను. ఎన్నిసార్లు అయినా వెదుకుతాను. సీత లంకలోనే
ఉందని సంపాతి చెప్పాడు. సంపాతి చెప్పాడు కదా అని రాముని వద్దకు పోయి, రాముని ఇక్కడకు తీసుకొని వస్తే, ఇక్కడ తన భార్య సీత కనపడకపోతే, రాముడు వానరులందరినీ వరస బెట్టి చంపుతాడు. కాబట్టి లంకను వదలకూడదు. వెదకాలి. వెదికి తీరాలి. నేను తగుదునమ్మా అంటూ కిష్కిందకు పోయి అందరి మరణానికి కారణం అయ్యే బదులు ఇక్కడే ఉండి వెదుకుతూ ఉంటే ఎప్పటికైనా సీత జాడ తెలియకపోదు. సీత జాడ తెలిసిన తరువాతనే కిష్కింధకు వెళతాను” అని తనలో తాను అనుకుంటూ తల ఎత్తి చూచాడు హనుమంతుడు.
ఎదురుగా అశోక వనము కనిపించింది. దాని వంక చూచాడు హనుమంతుడు. “ఇదేమిటి. లంక అంతా వెతికాను. ఇక్కడ వెతికినట్టు లేదే! ఇక్కడ కూడా వెదికితే ఒక పని అయిపోతుంది కదా! " అని అనుకున్నాడు.
వెంటనే సమస్త దేవతలకు, ఆదిత్యులకు, రుద్రులకు, అశ్వినీ దేవతలకు, మరుత్తులకు నమస్కారం చేసాడు. “ఈ అశోక వనములో సీత కనపడాలి. నేను సీతను రాముని వద్దకు చేర్చాలి. దానికి మీ సాయం కావాలి." అని అందరినీ ప్రార్థించాడు. జైశ్రీరాం అంటూ పైకి లేచాడు. రాముడికి, సీతకు మనసులోనే నమస్క రించాడు. అశోక వనము వైపు వెళ్లాడు. అశోక వనము ముందు నిలబడ్డాడు.
ఇదివరకు మాదిరి ఎక్కడంటే అక్కడ వెదకకుండా, ఒక పద్దతి ప్రకారం వెదకాలని నిర్ణయించుకున్నాడు. ఎక్కడెక్కడ రక్షక భటులుఉన్నారో తెలుసుకున్నాడు. వారికి కనపడకుండా చిన్ని వానరంగా మారాడు. మరలా మరొక సారి సమస్త దేవతలకు రుద్రునికి, బ్రహ్మకు, దేవేంద్రునికి, సూర్యచంద్రులకు నమస్కరించాడు. సకలభూతములకు అధిపతి అయిన మహేశ్వరునికి కార్యసిద్ధి కలిగించమని మనసారా మొక్కాడు. అశోకవనంలో ప్రవేశించాడు
హనుమంతుడు.
(ఇక్కడ మనకు రెండు విషయాలు కనపడుతున్నాయి. మొదటిది. హనుమంతుడు లంక అంతా వెతికాడు. వెతికే ముందు ఏ దేవునికి మొక్కలేదు. తన స్వశక్తిని నమ్ముకున్నాడు. కాని ఫలితం కనిపించలేదు. ఇప్పుడు అన్ని దేవుళ్లకు మొక్కాడు. అశోక వనంలో సీత కనిపించింది. చాలామంది తమ శక్తిని నమ్ముకుంటారు. దైవాన్ని నమ్మరు. కొంతమంది కేవలం దైవాన్ని నమ్ముతారు. ఏ ప్రయత్నమూ చెయ్యరు. రెండూ పనికిరావు. మానవ ప్రయత్నమూ దైవశక్తీ కలిసినపుడే కార్యసిద్ధి కలుగుతుంది. అదే హనుమంతుడు చేసాడు. దేవతలందరినీ ప్రార్థించాడు. వారి సాయాన్ని అర్థించాడు. తన శక్తిని ఉపయోగించి అశోకవనము అంతా వెతికాడు. సీతను కనుగొన్నాడు. కార్యసిద్ధి పొందాడు.
ఇంక రెండవది. హనుమంతుడు అశోకవనము ముందు కూర్చుని నిర్వేదము పొందాడు. కాని ఆ అశోక వనములోనే సీత ఉందని తెలియదు హనుమంతునికి. సమస్య ఎక్కడ ఉంటుందో దానికి పరిష్కారం అక్కడే ఉంటుంది. కాకపోతే ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించాలి. ప్రయత్నం చెయ్యాలి. దైవసాయం అర్థించాలి. అప్పుడు కార్యం సఫలమవుతుంది. చిన్న సమస్య ఎదురైనా కంగారు పడిపోతాం. ఏమేమోఆలోచిస్తాం. ఏమి చెయ్యాలో అది చెయ్యం. అందరినీ తిడతాం. మనలను మనం తిట్టుకుంటాం. హనుమంతుడూ అదే చేసాడు. కాని హనుమంతుని సమస్యకు పరిష్కారం ఎదురుగానే ఉంది. అది గుర్తించిన హనుమంతుడు కార్యరంగంలోకి దూకాడు. దైవ సాయం కోరాడు. రామ కార్యాన్ని సాధించాడు. కాబట్టి మనకు ఏ సమస్య ఎదురైనా కంగారు పడకుండా, ప్రశాంతంగా ఆలోచించాలి. పరిష్కారం వెంటనే దొరుకుతుంది. మనం సుందర కాండము చదివి తెలుసుకోదగిన మంచి విషయాలలో ఇది ఒకటి.)
శ్రీమద్రామాయణము
సుందర కాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment