శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునాలుగవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 14)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

పదునాలుగవ సర్గ

హనుమంతుడు కాపలా వాళ్ల కంటపడకుండా అశోకవనం లోకి ప్రవేశించాడు. ప్రాకారము మీదికి ఎక్కి కిందికి దుమికాడు. చుట్టు చూచాడు. అశోక వనము చాలా పెద్దది. పుష్పించిన పుష్పములతోనూ, లతలతోనూ, సంసెంగ, పొన్న, జాజి, మామిడి చెట్లతో ఇంకా రకరకాల వృక్షములతోనూ లతలతోనూ నిండి ఉంది. హనుమంతుడు అక్కడే ఉన్న మామిడి చెట్ల సమూహంలోకి ప్రవేశించాడు. అక్కడ లెక్కలేనన్ని మామిడి చెట్లు ఉన్నాయి. ఆ వనములో మృగములు, పక్షులు యధేచ్ఛగా విహరిస్తున్నాయి. మృగముల అరుపులతో, పక్షుల కిలా కిలా రావాలతో ఆ వనం ప్రతిధ్వనిస్తూ ఉంది. హనుమంతుడు సీతను వెదుకుతూ ఇంకా లోపలకు వెళ్లాడు.

హనుమంతుడు ఒక చెట్టు మీది నుండి మరొక చెట్టు మీదికి వేగంగా దుముకుతుంటే ఆ చెట్ల మీద ఉన్న పక్షులు భయపడి టపా టపా రెక్కల చప్పుడు చేసుకుంటూ ఎగిరిపోయాయి. హనుమంతుడు అలా దుముకుతుంటే పుష్పించిన వృక్షములు పుషవర్షము కురిపించాయి. (పూలన్నీ రాలిపోయాయి). ఆ చెట్లమధ్య వేగంగా తిరుగుతున్న హనుమంతుడు వసంత ఋతువులో తిరుగాడు వసంతుని వలె ప్రకాశించాడు. అశోకవనములో ఉన్న నేల అంతా పుష్పములతో నిండి పోయి పుష్పముల తివాచీ పరచినట్టు శోభించింది.

ఒకచెట్టు మీది నుండి మరొక చెట్టు మీదికి లంఘించే హనుమంతుని వేగానికి ఆ చెట్లకు ఉన్న పండ్లు అన్నీ రాలిపోయాయి. ఆకులు ఎగిరిపోతున్నాయి. హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్ల కొమ్మలను విరుస్తున్నాడు. చిన్న చిన్న చెట్లను పెకలించి అవతల పారేస్తున్నాడు. పెద్ద పెద్ద తీగలు అల్లుకొన్న పొదలను చిందర వందర చేస్తున్నాడు.
ఆ అశోక వనములో పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. వాటిలో పక్షులు కూర్చోడానికి చిన్న చిన్న తిన్నెల మాదిరి ఉన్నాయి. ఆ బావులలో తామరలు, కలువలు వికసించి ఉన్నాయి. ఆ బావులలో ఉన్న నీటిలో చక్రవాక పక్షులు, నీటి పక్షులు, హంసలు, సారస పక్షులు ఈదుతున్నాయి. 

ఆ అశోక వనములో పెద్ద పెద్ద కొండలు, వాటిలో గుహలు కూడా ఉన్నట్టు హనుమంతుడు చూచాడు. ఆ కొండల మీద, గుహలలోనూ సీత కోసం గాలించాడు. ఆ కొండల మీది నుండి చిన్న చిన్న నదులు వేగంగా కిందికి దుముకుతున్నాయి. అవి మొగుడి మీద అలిగి పుట్టింటికి పోయే భార్యల వలె శోభిల్లుతున్నాయి. ఆ నదుల ప్రవాహానికి అడ్డంగా అక్కడక్కడా కొన్ని చెట్టు కొమ్మలు ఉన్నాయి. అవి ఎలా ఉ న్నాయంటే "మొగుడి మీద అలిగి పుట్టింటికి పోవడం మంచిది కాదు" అని ఆ భామలను అడ్డగిస్తున్న బంధువుల మాదిరి ఉన్నాయి. అవి చూచుకుంటూ హనుమంతుడు ముందుకుసాగాడు.

హనుమంతుడు తామరపూలతో, రకరకాల పక్షులతో శోభిల్లుతున్న సరోవరములను చూచాడు. ఈ సరోవరముల దగ్గర హనుమంతుడు ఒక శింశుపా వృక్షమును చూచాడు. దాని చుట్టు బంగారు అరుగులు కట్టబడి ఉన్నాయి. హనుమంతుడు ఆ శింశుపా వృక్షము మీదకు ఎక్కి ఒక కొమ్మ మీద కూర్చున్నాడు.

"సీత ఇక్కడే ఎక్కడో ఉన్నదని నా మనస్సు చెబుతూ ఉంది. సీత ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. సందేహం లేదు. దైవం అనుకూలిస్తే సీత ఇక్కడే నాకు కనపడవచ్చు. ఈ శింశుపావృక్షము, ఈ పద్మము లతో కూడిన సరస్సు చాలా మనోహరంగా ఉన్నాయి. సీతకు ఇటువంటి ప్రదేశము అంటే ఎంతో ఇష్టము. అందుకని సీత ఇక్కడే ఉండాలి. ఇక్కడ లేకపోయిన తప్పకుండా ఈ ప్రదేశానికి రావచ్చు. రాముని మీది విరహముతో బాధపడుతున్న సీత రమ్యమైన హర్యములలో
ఉండదు. ఈ వనములో, ఈ పద్మ సరస్సు చెంత, ఈ అందమైన పక్షులు, మృగముల మధ్యనే ఉంటుంది. సీతకు నియమనిష్టలు ఎక్కువ. ఇప్పుడు సంధ్యాసమయము అయింది. సాయం సంధ్య ఉపాసన కొరకు సీత ఈ పద్మసరోవరము వద్దకు తప్పక వస్తుంది. నిజంగా సీత జీవించి ఉంటే ఈ సుందరమైన సరోవర ప్రాంతమునకు తప్పకుండా వస్తుంది." అని అనుకొన్నాడు హనుమంతుడు.

సీత రాక కోసరం ఎదురు చూస్తూ హనుమంతుడు చుట్టు పక్కలను పరిశీలనగా చూస్తున్నాడు.

శ్రీమద్రామాయణము
సుందర కాండము పదునాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)