శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునైదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 15)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

పదునైదవ సర్గ

హనుమంతునికి ఆ అశోక వన సౌందర్యము ఎంత చూచినా తనివి తీరడం లేదు. ఆ వృక్షములను, లతలను, మృగములను, పక్షులను, సరోవరములను, బావులను, అందులో తిరుగాడే నీటిపక్షులను ఆనందంగా చూస్తున్నాడు. అశోక వనము అనే పేరుకు తగ్గట్టు ఆ వనమంతా అశోక వృక్షములతో నిండి ఉంది. దేవేంద్రుని నందన వనము మాదిరి ప్రకాశిస్తూ ఉంది. ఆ వనంలో ఉన్న చెట్లు లతలు అన్ని ఋతువులలోనూ పుష్పములు, ఫలములు అందిస్తున్నాయి.
అలా చూస్తున్న హనుమంతునికి ఆ శింశుపా వృక్షము దగ్గరలో, పద్మసరోవరము వద్ద ఒక చైత్యప్రాసాదము (మండపము లాంటి ఎత్తైన రాతి కట్టడము) ను చూచాడు. ఆ కట్టడము బాగా ఎత్తుగా, తెల్లటి రంగుతో, కైలాస పర్వతము మాదిరి ఉంది. ఆ కట్టడము దగ్గం. రాక్షస స్త్రీల మధ్యలో, మాసి పోయిన వస్త్రములు ధరించిన ఒక ఉత్తమ జాతి స్త్రీ కనపడింది. సరిగా ఆహారము తినక పోవడం వలన ఆమె బాగా చిక్కిపోయి ఉంది. ఆమె శరీరం చిక్కిపోయినను ఆమె దివ్యమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. మాసిపోయిన వస్త్రమును కట్టుకొన్న ఆమె బురదలో ఉన్న పద్మంలాగా ప్రకాశిస్తూ ఉంది. ఆమె దిగులుతో తల వంచుకొని కూర్చుని ఉంది. ఏమేమో ఆలోచిస్తూ ఉంది. ఆమె చుట్టు రాక్షస స్త్రీలు ఉన్నారు. తన వాళ్ల నుండి తప్పిపోయిన లేడి పిల్ల, తోడేళ్ల గుంపుమధ్య ఉంటే ఎలా ఉంటుందో, ఆ రాక్షస స్త్రీల మధ్య ఆమె తలవంచుకొని కూర్చుని ఉంది.
హనుమంతుడు ఆమెను చూచాడు. ఆమె సీత కావచ్చు అని అనుకున్నాడు. ఆమె అందము, కూర్చున్న తీరు, ఆమె ముఖంలో గూడుకట్టుకున్న విషాదము, ఒక తాపసి వలె ఆమె కూర్చొనడం చూస్తుంటే, ఆమె సీతయే అని హనుమంతుని మనస్సు చెబుతూ ఉంది. పొగతో కప్పబడిన అగ్నిజ్వాల మాదిరి ఆమె ప్రకాశిస్తూ ఉంది. ప్రతిరోజూ స్నానాదికములు చేయక పోవడం వల్ల ఆమె శరీరం మలినంగా ఉంది. నిరంతరమూ కన్నీళ్లు కార్చడం వలన ఆమె చెక్కిళ్ల మీద కన్నీటి చారికలు కనపడు తున్నాయి. మేఘములతో కప్పబడిన సూర్యుని వలె ఆమె ప్రకాశిస్తూ ఉంది.
హనుమంతుడు ఆమెను తదేక దృష్టి తో చూస్తున్నాడు.

ఈమె సీత అవునా కాదా అనే మీమాంసలో పడ్డాడు. పైకి కనిపించే లక్షణాలు చూస్తుంటే ఈమె సీత అని నమ్మకం కలుగుతూ ఉంది. కాని మరలా సందేహము. హనుమంతునికి మరొక విషయం గుర్తుకు వచ్చింది. రాముడు తమను కలిసినపుడు, ఆకాశం నుండి తమ మధ్య పడిన ఆభరణముల మూటను రామునికి చూపినపుడు, రాముడు, సీత అపహరింపబడిన రోజున ధరించిన ఆభరణముల గురించి వివరంగా చెప్పాడు. ఆ మాటలు హనుమంతునికి బాగా జ్ఞాపకం ఉన్నాయి. రాముడు ఏయే ఆభరణములు సీత ఒంటిమీద ఉన్నాయని చెప్పాడో అవే ఆభరణములు ఇప్పుడు కూడా సీత ఒంటిమీద ఉన్నాయి కానీ సంస్కారము లేక పోవడం వలన మట్టికొట్టుకొని పోయి ఉన్నాయి. ఆ ఆభరణములను గుర్తించాడు హనుమంతుడు.

రావణుడు అపహరించుకుపోతున్నప్పుడు కొన్ని ఆభరణములను మూటగట్టి కిందికి జారవిడిచింది. ఆ ఆభరణములు ఇప్పుడు ఆమె ఒంటి మీద లేవు. మిగిలిన ఆభరణములు ఆమె ఒంటి మీద ఉన్నాయి. అంతే కాకుండా సీత తన ఉత్తరీయమును చించి ఆభరణములను కట్టి తమ మధ్య జార విడిచింది. ఆమె ఆభరణము లను కట్టిన ఉత్తరీయపు రంగు, ఇప్పుడు ఆమె ధరించిన వస్త్రము రంగు ఒకటే. ఆభరణములు కట్టిన వస్త్రము ఎలా మెరిసిపోతూ ఉందో ఈమె కట్టుకున్న వస్త్రము కూడా అదే మాదిరి మెరిసిపోతూ ఉంది. కాకపోతే చాలారోజుల నుండి కట్టుకోవడం వలన కొంచెం మాసినట్టు కనపడుతూ ఉంది.ఈమె శరీర చ్ఛాయ, ముఖవర్చస్సు ఈమె కట్టుకున్న వస్త్రములు అన్నీ ఈమె సీత అని చెప్పకనే చెబుతున్నాయి. అదీ ఈమె నిరంతరము తన భర్త రాముని తలుచుకోవడం వలన, ఈమె ముఖంలో విషాదం గూడు కట్టుకుని ఉంది. ఈమె సీత కాకపోతే ఇలా విషాదంతో ఉండాల్సిన పని లేదు. పైగా ఈమె ముఖ వర్చస్సు, అందము, అవయముల పొందిక, సరిగ్గా సరిపోయాయి. రాముడు అనుదినమూ సీత కోసరం విషాదంతో దుఃఖిస్తుంటే ఈమె కూడా రాముని కోసరం దుఃఖిస్తూ ఉంది. ఎవరి కోసరం రాముడు అనుదినమూ పరితపిస్తూ అలమటిస్తున్నాడో ఆ సీత ఈమెయే, సందేహము లేదు." అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. 

హనుమంతుని ఆనందానికి అవధులు లేవు. సంతోషంతో పొంగిపోయాడు. ఒక్కసారి మనసులో రాముని స్మరించుకున్నాడు. మనసులోనే రామునికి నమస్కరించాడు. 

శ్రీమద్రామాయణము
సుందర కాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)