శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునారవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 16)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
పదునారవ సర్గ
అశోక వనములో సీత కనపడగానే హనుమంతుని ఆనందానికి అవదులు లేవు. రాముని మనసారా స్మరించుకున్నాడు. సీత పడుతున్న కష్టాలు చూచి హనుమంతుని హృదయం ద్రవించి పోయింది. హనుమంతుని కనుల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. సీత కష్టములను తలచుకొని ఈ విదంగా బాధపడుతున్నాడు హనుమంతుడు."పరాక్రమమును, వినయ విధేయతలను, సమానంగా పుణికిపుచ్చుకున్న లక్ష్మణునికి వదిన అయి ఉండీ సీతమ్మ ఇన్న బాధలు పడుతూ ఉందంటే, కాల గమనమును ఎవరూ అతిక్రమించలేరు కదా! ఇన్ని కష్టములలో కూడా సీత ఇంత నిబ్బరముగా ఉందంటే ఆమెకు రాముని మీద, లక్ష్మణుని మీద అపారమైన నమ్మకము. వారు వచ్చి తనను రావణుని చెర నుండి విడిపించెదరని ప్రగాఢవిశ్వాసముతో ఉంది. రామునికి తగిన భార్య సీత. సీతకు తగిన భర్త రాముడు. ఇందులో సందేహము ఏ మాత్రము లేదు.
సీత ఇంతటి సుగుణవతి, సహనశీలి, సౌందర్యవతి కనుకనే రాముడు సీత గురించి అన్ని కష్టములు పడుతున్నాడు. సీత కోసమే కదా రాముడు, విరాధుడు, ఖరదూషణులు, త్రిశిరుని, ఇంకా పదునాలుగు వేల మంది రాక్షసులను తుదముట్టించాడు. ఈ సీత కారణంగానే కదా, సుగ్రీవుడు రాముని చేత వాలిని చంపించి, తన రాజ్యమును తిరిగి పొందగలిగాడు. నేను కూడా ఈ సీత కోసమే కదా నూరు యోజనముల దూరము కల సముద్రమును లంఘించి ఈ లంకలో ప్రవేశించింది. ఇటువంటి గుణవతి, రూపవతి, పతివ్రత కోసరం రాముడు ఒక్క లంకనే కాదు ఈ భూమండలమును అంతా జయించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ముల్లోకములమీద ఆధిపత్యము ఒక వైపు, సీతను ఒకవైపు ఉంచితే, ముల్లోకాధిపత్యము సీతకు పదహారవ వంతుకు కూడా సరిపోదు. అంతటి మహిమాన్విత సాధ్వి సీత.
ఈ సీత అయోనిజ. సీత తండ్రి జనకుడు యజ్ఞము చేయగోరి, యజ్ఞభూమిని చదును చేయడానికి నాగలి పట్టి దున్నుతుంటే ఆ నాగేటి చాలులో దొరికిన సాధ్వి ఈ సీత. పాతివ్రత్యములో ఈమెకు ఈమెయే సాటి. జనకుని కూతురేకాదు, ఈమె దశరథుని కోడలుకూడా. దశరథుని పెద్దకుమారుడు రామునికి భార్య. అటువంటి సాధ్వి ఈనాడు ఈ ప్రకారంగా రాక్షసస్త్రీల మధ్య కష్టాలు పడుతూ ఉంది. అడవులకు వెళ్లాల్సింది రాముడే అయినా, భర్త మీద అనురాగము, గౌరవం చేత, సమస్త రాజభోగములను వదిలి, నారచీరలు ధరించి, కేవలము కందమూలములు తింటూ, నేల మీద శయనిస్తూ రామునితోపాటు అరణ్యవాసము చేస్తూ ఉంది ఈ సీత. అటువంటి సీతకు రావలసిన కష్టాలా ఇవి!
రావణుడు ఎంత భయపెట్టినా, ప్రలోభ పెట్టినా, చలించని మహాసాధ్వి ఈ సీత. ఇటువంటి సీతను ఇప్పుడు రాముడు చూస్తే ఎంత సంతోషిస్తాడో కదా! సీతను చూచిన రామునికి తిరిగి అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయినంత ఆనందం కలుగుతుంది. ఈ సీత రావణుని చెరలో ఇన్ని కష్టములు అనుభవిస్తూ, రాముని గురించి తలచుకుంటూ, ఎప్పటి కైనా రాముడు రాక పోతాడా, తనను ఈ
రాక్షసుని చెరనుండి విడిపించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఈమెను చూస్తుంటే ఈమెకు తన ఎదురుగా ఉన్న భయంకరా కారులైన రాక్షస స్త్రీలు కానీ, చుట్టు పక్కల ఉన్న లతలు కానీ, పుష్పములు కానీ, అందమైన పూపొదరిళ్లు కానీ, కనిపించడం లేదు. కేవలం ఆమె కనులకు రాముడే కనపడుతున్నాడా అని అనిపిస్తూ ఉంది. స్త్రీకి ఎన్ని ఆభరణుములు, అలంకారములు ఉన్నా, భర్తను మించిన అలంకారము వేరొకటి లేదు. అటువంటి సీతకు భర్త దగ్గర లేకపోవడం వల్ల, అలంకార విహీనంగా కనపడుతూ ఉంది. సీత వంటి భార్య అపహరింపబడినా, ఈమెనే తలచుకుంటూ రాముడు కాలం గడుపుతున్నాడు అంటే రాముని మించిన భర్త మరియొకడు
ఉండబోడు.
ఎటువంటి సంబంధము లేని నాకే ఈమెను చూస్తే మనసు ద్రవించి పోతూ ఉంటే, ఇంక ఈమెను భార్యగా పొంది, అకారణంగా ఈమెను పోగొట్టుకున్న రాముని సంగతి వేరే చెప్పాలా! అరణ్యవాస సమయంలో ఈ సీతను రామలక్ష్మణులు కంటికి రెప్పలా కాపాడేవారు. ఇప్పుడు ఈమె ఈ రాక్షస స్త్రీల కాపలాలో ఉంది. ఎంత విచిత్రము. అరణ్యవాసంతోనే సతమతమవుతున్న సీతకు ఈ అపహరణము, రాక్షస స్త్రీల సహచర్యము ఎంత బాధకలిగిస్తూ ఉందో కదా! ఈమె సీతయే. సందేహము లేదు." అని సీత పడుతున్న కష్టములను చూచి హనుమంతుడు బాధపడుతున్నాడు. ఆమెనే చూస్తూ ఆ చెట్టు మీద కూర్చొని ఉన్నాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము పదునారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment