శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునేడవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 17)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
పదునేడవ సర్గ
ఇంతలో చీకటి పడింది. చంద్రోదయం అయింది. చంద్రుడు పండువెన్నెల కురిపిస్తున్నాడు. వాతావరణము ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ వెన్నెలలో హనుమంతునికి సీత స్పష్టంగా కనపడుతూ ఉంది. సీత కనపడింది అన్న సంతోషంలో హనుమంతుడు చుట్టుపక్కల ఉన్న రాక్షస స్త్రీలను సరిగా చూడలేదు. ఇప్పుడు హనుమంతుడు వారి మీద దృష్టి పెట్టి చూస్తున్నాడు.ఆ రాక్షస స్త్రీల ఆకారాలు ఒకటీ సరిగా లేదు. అన్నీ వికృతాకారులే! ఒక దానికి ఒక కన్ను, దొప్పల్లాంటి చెవులు ఉన్నాయి. మరొక దానికి చెవులే లేవు. మరొక దానికి చెవులు మొనలు దేలి ఉన్నాయి. ఒక దానికి శరీరం సన్నగా తల పెద్దదిగా ఉంది. ఇంక వాళ్ల కేశ సంపద గురించి చెప్ప పనిలేదు. అందరికీ దాదాపు తైల సంస్కారములేని చింపిరి జుట్టు. కొన్నిటికీ పొట్ట, స్తనములు వేలాడుతూ ఉన్నాయి. ఒకతి పొట్టిది. మరొకతి పొడుగు. ఒకదానికి ఎత్తు పళ్లు మరొక దానికి అసలు పళ్లే లేవు. ఇలా ఒకదానిని మించి ఒకటి వికృతాకారంతో ఉన్నాయి. ఆ వికృతాకారులైన రాక్షస స్త్రీలను చూచాడు హనుమంతుడు.
వారు తమ చేతిలో శూలములు, ముద్గరలు ధరించి ఉన్నారు. ఆ రాక్షస స్త్రీలు ఆ శింశుపా వృక్షము చుట్టు కూర్చుని ఉన్నారు. వారికి మద్యము, మాంసము అంటే ఎంతో ఇష్టము లాగుంది. వారు
నిరంతరమూ మాంసము తింటూ మద్యము సేవిస్తున్నారు. వారి మధ్యలో మూర్తీభవించిన శోకదేవతలా కూర్చుని ఉంది సీత.
సీతకు ఆభరణములు లేక పోయినా పాతివ్రత్యము అనే ఆభరణంతో ప్రకాశిస్తూ ఉంది. సీత ఒంటి మీద ఎన్ని ఆభరణములు ఉ న్నా భర్త అనే ఆభరణం లేకపోవడంతో దరిద్రురాలిగా కనిపిస్తూ ఉంది. ఎల్లప్పుడూ భర్త సన్నిధిలో కాలం గడపవలసిన సీత ఈ ప్రకారంగా రాక్షస స్త్రీల సమూహంతో కాలం గడపవలసి రావడం ఎంతో బాధగా ఉంది. కాని రాముని పరాక్రమము ఎరిగిన సీత, తన కష్టములకు బాదపడటం లేదు. ఆమె పాత్రివ్రత్యమే ఈమెను రక్షిస్తూ ఉంది. ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్న సీత సాక్షాత్తు భూదేవిని తలపిస్తూ ఉంది. తన పాతివ్రత్యమే ఆభరణంగా కలిగిన సీత, మాసిపోయిన చీర ధరించి, భయంకరమైన ఆకృతులు కలిగిన రాక్షస స్త్రీల మధ్య కూర్చుని ఉండటం చూచాడు హనుమంతుడు.
ఎవరైనా తనను చూస్తారేమో అని చెట్ల ఆకుల మధ్యన నక్కి నక్కి కూర్చుని ఉన్నాడు హనుమంతుడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము పదునేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment