శ్రీమద్రామాయణం - సుందర కాండము - పదునెనిమిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 18)
శ్రీమద్రామాయణము
సుందర కాండము
పదునెనిమిదవ సర్గ
రాత్రి మెల్లిగా గడిచింది. ఇంక ఒక జాము రాత్రి మాత్రమే మిగిలి ఉంది. తూర్పున తెల తెల వారుతూ ఉంది. లంకా నగరంలో దుర్మార్గులైన రాక్షసులే కాదు. వేదవేదంగపారంగతులు అయిన రాక్షసులు కూడా ఉన్నారు. వారు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి వేదపఠనం చేస్తున్నారు. ఆ వేదఘోషలు హనుమంతుని చెవికి సోకుతున్నాయి. రావణుని అంతఃపురములో వంది మాగధులు రావుణుని నిద్రలేపుతున్నారు. మంగళ వాద్యములు మనోహరంగా వినపడుతున్నాయి.మంగళవాద్యములు మధురంగా చెవి సోకుతుండగా, రావణుడు నిద్రనుండి మేల్కొన్నాడు. లేచీ లేవగానే రావణునికి సీత గుర్తుకు వచ్చింది. వెంటనే సీత మీద మోహము, కామము రావణుని మనసులో పెల్లుబికాయి. సీతను చూడంది నిలువలేకపోతున్నాడు రావణుడు. గబగబా కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఆభరణములు అలంకరించుకున్నాడు. మైపూతలు పూసుకున్నాడు. సీతను ఉంచిన అశోక వనంలోకి ప్రవేశించాడు.
రావణుని అనుసరించి సౌందర్యవతులైన నూరుమంది కన్యలు వెళుతున్నారు. కొంత మంది వింజామరలు వీస్తున్నారు. మరి కొంత మంది ఛత్రములు పడుతున్నారు. మరికొందరు బంగారు కాగడాలు పట్టుకొని దారి చూపిస్తున్నారు. కొంత మంది సుగంధ పానీయములు తీసుకొని వెళుతున్నారు. మరి కొందరు ఆయుధములు ధరించి రావణునికి రక్షణగా వెళుతున్నారు. ఒక వనిత మద్యము నింపిన బంగారు పాత్రను పట్టుకొని రావణుని పక్కనే నడుస్తూ ఉంది. వారి వెనక రావణుడు అపహరించుకు వచ్చిన ఉత్తమజాతి స్త్రీలు నడుస్తున్నారు. వారి వెనక రావణుని భార్యలు కొంత మంది రావణుని మీద గౌరవంతో కానీ, రావణుని మీద కోరికతో కానీ, కామంతో కానీ ఆయన వెంట వెళుతున్నారు. వారందరికీ నిద్రమత్తు, రాత్రి తాగిన మద్యము మత్తు వదల లేదు. తూలుతూ నడుస్తున్నారు. వారి జుట్టు వీడిపోయింది. పూలమాలలు వాడి పోయాయి. ఆభరణములు చెదిరిపోయాయి. అటువంటి స్త్రీలు అనుసరించి రాగా, రావణుడు సీత మీద కోరికతో ఆమెను పొందవలెననే గాఢమైన కాంక్షతో సీత ఉన్న అశోకవనానికి వెళుతున్నాడు.
రావణుడు తన పరివారముతో అశోకవనము ద్వారమును సమీపించాడు. హనుమంతుడు రావణుని ద్వారం దగ్గర ఉండగానే చూచాడు. రావణుని మొహంలో కామము, దర్ఘము, మదము స్పష్టంగా కనపడుతూ ఉంది. హనుమంతుడు ఆకుల సందులలో నుండి రావణుని నిశితంగా పరిశీలిస్తున్నాడు. హనుమంతుడు రావణుని వెంట నడుస్తున్న ఉత్తమ జాతి స్త్రీలను కూడా పరిశీలనగా చూచాడు. రాత్రి తాగిన మత్తు ఇంకా దిగని, ఒంటినిండా ఆభరణములను ధరించిన, ఉత్తమ జాతి స్త్రీలు వెంటరాగా, విశ్రవసు పుత్రుడైన రాక్షస రాజు రావణుని చూచాడు హనుమంతుడు. రావణుని తేజస్సు చూచి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. రావణుడు సరిగా కనిపిపంచడం లేదని ఒక కొమ్మమీది నుండి మరొక కొమ్మ మీదికి దూకుతూ, రావణుని పరిశీలనగా చూస్తున్నాడు హనుమంతుడు.
ఎప్పుడెప్పుడు సీతను చూద్దామా అనే ఆతురతతో రావణుడు గబ గబా సీత ఉన్న చోటికి వస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
సుందర కాండము పదునెనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment